Sunday, August 3, 2025

పొగడ్త

అంశం: మరో చరిత్ర


శీర్షిక: పొగడ్త 

(నాకు మా ఊరు పటువారికి మధ్య జరిగిన సంభాషణ. ఈ కవితను వద్ది చెన్నయ్య పటేల్ గారికి అంకితం ఇస్తున్నాను)

అది చలి కాలం,
అందులో చల్లని ఈదురు గాలులు వీస్తున్నాయి
అప్పుడు నేను బి.కామ్ మొదటి సంవత్సరం
హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ లో
చదువుచున్నాను.

మా ఊరు సూరి పెల్లి , వరంగల్ జిల్లా
సెలవులు కావడం వలన ఇంటికి వచ్చాను
నాన్న వ్యవసాయం, నూనె గానుగ పని
అమ్మ ఇంటి పని, వ్యవసాయ పని
మాది నిరుపేద కుటుంబం అనే చెప్పాలి
పెంకు టిల్లు. ఆ కాలంలో టాయిలెట్స్
మా ఊరిలో పటేళ్లకు మాత్రమే ఉండేవి
మాకూ టాయిలెట్స్ లేవు

మాకు దగ్గరలోనే ఒక చెరువు ఉంది
అది నిజంగా కల్పతరువు
చెరువు మత్తడి బడితే వందల ఎకరాల
పొలాలకుసాగునీటిని అందిస్తుంది.
అందులోనే చాకలి వారు బట్టలు ఉతుకుతారు
చెరువు లోపలికి వెళ్ళి శుద్ధమైన మంచి నీళ్ళు
తెచ్చుకుంటారు
బహిర్భూమికి ఆ చెరువు వైపే వెలుతారు
ఊరి చుట్టూర ఇలాంటి చెరువులు, కుంటలు
చాలా ఉంటాయి
గ్రామాల ప్రజలు కల్మషం లేని వారు
కరుణ మమత దయ సానుభూతి, దానగుణం
మంచిని మంచి అని మెచ్చుకోవడం
చెడుని చెడు అని మాటలతో చేతులతో
శిక్షించడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య
ఏ చిన్న విషయం అయినా, జరిగిన
క్షణాలలో ఊరు మొత్తం తెలిసి పోతుంది
ఎవరికీ ఏ ఆపద వచ్చినా, వెంటనే ఆదుకునే
మనస్థత్వం గల వారు పల్లె ప్రజలు
పట్టణాలలో ప్రక్క ఇంటిలో ఏమి జరుగుతుందో
భూతద్దం పట్టి వెదికినా తెలియని దుస్థితి

ఒక రోజు నేను ఉదయం ఈదురు చెరువుకు
వెళ్ళి  గజగజ వణుకుతూ వస్తున్నాను
చెరువుకు ఎందుకు వెళ్ళానో మీకు తెలుసు
ఎదురుగా పటువారి వద్ది చెన్నయ్య పటేల్
ఊళ్ళో నుండి చెరువు వైపు వస్తున్నాడు
అప్పుడు పటేల్ పటువారి ఉండే వారు.
భూముల లెక్కలు శిస్తు వసూలు చేసేవారు
ఆదాయం సర్టిఫికెట్స్ కొరకు
వీరే తహశీల్దార్ కు రెకమెండ్ చేస్తారు
*నమస్కారం సర్* అని అన్నాను
*ఆ.. నమస్కారం నమస్కారం,
అంత దూరాన ఉండే  *ఏంటి నీవు
చస్తావా బ్రతుకుతావా?*
అని నవ్వుకుంటూ అన్నాడు.
*ఎందుకు సర్, అలా అంటున్నారు*
అని నేను అడిగాను
"ఆ.. ఏమి లేదయ్యా ! ఊళ్ళో ఎక్కడ చూసినా
నీ గురించే మాట్లాడుకుంటున్నారు, మంచి పిల్లవాడు, లెక్కలు బాగా చేస్తాడు
మంచిగా చదువుతాడు, బుద్ది మంతుడు అని అనుకుంటున్నారు"

నాకు ఆశ్చర్యం వేసింది. నాలో ఇంత మంచి తనం
ఉందా , ఇంకా నేను బాగా చదివి ఊరికి మంచి పేరు తేవాలని అని అప్పుడే అనుకున్నాను.
అప్పటి నుండి ఇప్పటివరకూ ఊరికి మంచి పేరుతోనే నడుచుకుంటున్నాను.

No comments: