Wednesday, February 19, 2025

ప్రకృతి మానవ విజ్ఞాన సంపదలు


కవితార్చన : ప్రకృతి -మానవ జీవనము

శీర్శిక: *ప్రకృతి మానవ విజ్ఞాన సంపదలు*

ప్రకృతి విజ్ఞాన ఖని
ప్రకృతి వికాస తరంగాల గని
అది ఎంత తీసినా తరగని నిధి
సృష్టిలో ఉచితంగా లభించే గొప్ప సంపద!

మనసును వికసింప చేసుకోడానికి
మనో ఉల్లాసం పొందడానికి
జ్ఞానాన్ని సముపార్జించుకోడానికి
విజ్ఞాన వికాసాన్ని పెంపుందించుకోడానికి
మనుగడ సాగించడానికి మూలాధారం ప్రకృతి!

విత్తు పుడమి గర్భాన్ని చీల్చుకుని
మొక్కగా ఎలా మొలకెత్తుతుందో
అలానే అమ్మ గర్భాన్ని చీల్చుకుని
బిడ్డ జన్నించి ఎదుగటం నేర్చుకుంటాడు!

గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే
దశలను అవస్థలను చూసి
కష్ట పడందే సుఖం లేదని తెలుసుకున్నాడు!

గ్రామ సింహాలను చూసి
అన్నం పెట్టిన యజమానికి ఎంతటి
విశ్వాసంతో ఉండాలనేది తెలుసుకున్నాడు!

చీమలను చూసి జ్ఞానాన్ని పొందాడు
అవి ఎంతటి శ్రమైక జీవులనీ
చీమలు ఎంత క్రమశిక్షణ గలవని
అవి భవిష్యత్తు గురించి
ఎంతటి ప్లానింగ్ తో ఉంటాయనేది!

వరదలు వచ్చినప్పుడు
వాగుల్లోని తుంగలను చూసి
తల ఎప్పుడు వంచాలో
తల ఎప్పుడు ఎత్తాలో తెలుసుకున్నాడు!

తరువుల నుండి రాలే
ఎండుటాకులను చూసి
భూమాత మానవులను ఎంతో కాలం
మోయదని తెలుసుకున్నాడు!

ఇలా ప్రకృతిలో ఎన్నింటినో చూసి
జ్ఞానాన్ని  అనుభవాన్ని పొందుతున్నాడు
జీవితానికి అనువదించుకుంటున్నాడు
అందుకే ప్రకృతి మానవ జీవన సంపదలు!
 

No comments: