Sunday, February 16, 2025

ఎంతైనా మన పిల్లలే కదా

అంశం: ఐచ్చికం

శీర్షిక: *ఎంతైనా మన పిల్లలే కదా*

"సృష్టిలో ఉత్కృష్టమైనది మానవ జన్మ
ఆ జన్మకు మూలకారణం అమ్మానాన్న"

కనిపెంచే తల్లికే తెలుస్తుంది
కడలిలో వలే కడుపులోని బడబాగ్ని ఎంతో

బిడ్డ కడుపులో పడ్డప్పుడు
తలతిరుగుతుంటే వాంతులు వస్తుంటే
ఇంజిక్షన్స్ తో తనువకు రంద్రాలు పడుతుంటే
కడుపులో బిడ్డ కాళ్ళతో తన్నుతుంటే
తీగకు కాయ బరువా అన్నట్లు
తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంటే
కష్టమనిపించదు బరువనిపించదు

ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ లు చేస్తుంటే
డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే
రుధిర ధారలు పారుతుంటే బాధనిపించదు

కెవ్వున కేక వినిపించగానే
ఒక్క నిమిషం సొమ్మసిల్లినట్లయి
అప్పటివరకు భరించిన నొప్పులు బాధలన్నీ
పటాపంచలమవుతాయి!

ముప్పది యేండ్లు పెంచి పెద్ద చేసి
విద్యా బుద్దులు నేర్పి వివాహాలు పంపించాక
వారి ఇంటి ముందు శునకానికి పెట్టినట్లు
పాచిన కూడు పెట్టకున్నా పర్వాలేదు!

కానీ ,
మీ సుఖం కోసం కన్నావనీ పిల్లలు అన్నప్పుడు
అగ్ని పర్వతం బద్దలైనట్లనిపించుతుంది
పలాన వాండ్ల కడుపులో పుడుతే
బాగుండన్నప్పుడు
కాళ్ళ క్రింద భూమి కంపించినట్లై
కుమిలి కుమిలి ఏడ్వాలనిపిస్తుంది!

అయినా కాలమే సమాధానం చెబుతుందని
మనసుకు సర్దిచెప్పుకుంటూ గడుపాలి
ఎంతైనా మన పిల్లలే కదా మన బొడ్డు పేగే కదా!

No comments: