Sunday, June 29, 2025

కవిత్వం ఓ జీవ నది


*కుసుమ ధర్మన్న కళాపీఠం*
*19/09/25*: *శుక్రవారం*
*నేటి అంశం*కవితార్చన*
*కవిత్వం - స్వేచ్చా గీతం*
పేరు: మార్గం కృష్ణ మూర్తి 
ఊరు: హైదరాబాద్ 
కవిత సంఖ్య:182
హామీ: ఇది నా స్వీయ రచన 

శీర్షిక:  కవిత్వం ఓ జీవనది 

కప్పి పుచ్చుతే కవిత్వం విప్పి చెబుతే విమర్శ 
- అంటారు డా. సినారె 
బాధ దుఃఖానికి పర్యాయ పదం కవిత్వం - శ్రీ శ్రీ
మానవత్వపు మాతృభాష కవిత్వం - కారల్ మార్క్స్

భాష అనే వృక్షం నుండి 
సుందర పరిమళాల కుసుమాలను కోసి 
భావాలను రాశులుగా పోసి 
పసందైన రూపంలో హృదయానికి 
ఆకట్టుకునే విధంగా చక్కని చిక్కని 
పదబంధాలతో ఉపమానాలతో 
ఆశయాలనే పుష్పాలను అల్లడమే కవిత్వం! 

కవిత్వమంటే ఓ అనుభూతి  ఓ ఆవేదన 
కవిత్వమంటే ఓ భావోద్వేగం ఓ సంఘర్షణ 
కవిత్వమంటే ఓ చైతన్యం  ఓ స్పందన 
కవిత్వమంటే పారే ఓ జీవ నది!

*రవి కాంచని చోటు కవి గాంచు నన్నట్లు* 
విత్తనాలనే అక్షరాలను వెతికి పట్టుకొని 
నాగటి సాలులో పోసి పచ్చని మొలకల వలే
జనుల మనసుల్లో నాటుతూ 
జనుల చైతన్య పరిచేదే కవిత్వం
ఉన్నతీకరించిన భావోద్వేగమే కవిత్వం!

ప్రకృతి సోయగాలు రతీ మన్మధుల 
లీలలు రాజకీయ నాయకుల అవినీతి 
రాజ భోగాలు రాస క్రీడలు సామాజిక 
సాంఘిక రుగ్మతలు సంస్కృతి సంప్రదాయాలు
ప్రజల పక్షాన నిలిచే మరేదైనా కావచ్చు!

కవి చేతిలో కలం ఒక పదునైన ఆయుధం 
చెడు దుమ్ము దులిపే చర్నాకోలు 
పీడిత తాడిత జనుల పాలిట కల్పవృక్షం 
సమాజ హితాన్ని కోరే తోడుగా నిలిచే
సమాజాన్ని చైతన్యపరిచే సింహ స్వప్నం 
తప్పుడు స్వభావులకదో సుదర్శన చక్రం! 

కవితంటే సజీవముగా నిలిచే భాండాగారం 
జ్ఞాన పాదులకు చైతన్యాన్ని నింపే జీవం
అజ్ఞానానికి జ్ఞాన కాంతిని అలమే దీపం
విజ్ఞానానికి దారి చూపే జ్యోతియే  కవిత్వం!

_ మార్గం కృష్ణ మూర్తి 


No comments: