Monday, July 14, 2025

నా హృదయంలో P

అంశం: తరంగ హృదయం

శీర్షిక:  *నా హృదయంలో..*

నిండు పున్నమి రోజున చందమామ
వెదజల్లే చల్లని కాంతుల వలే నీ మనసు
గులాబీ తోటలో పరిమళాలతో
గుభాలించే పువ్వుల వలే నీ సొగసు
గలగలా పారే నిండు గౌదావరిలా
వినిపించే నీ నవ్వులు
నేడు నీ పలుకే బంగార మాయెనా!

ఊసులెన్నో చెప్పావు ఆశలెన్నో పెంచావు
గిలిగింతలు పెట్టావు చెక్కిలి గింతలు చేశావు
సుడిగుండంలో ఉన్న నా  హృదయాన్ని
అలల తరంగాలతో  ఓ దరికి చేర్చావు
నా మనసు పలికే వేళ  కనుమరుగైనావు!

ప్రియా! మహా సముద్రంలోని
తరంగాలను లెక్కించవచ్చునేమో కానీ
తరుణి మనసు అంతరంగాలను పసిగట్టడం
ఆ బ్రహ్మకే సాధ్యమేమో
ఇంత కాలం నేను నీతో గడిపినది
ఆశల ఊసులలో నే నా !

వర్షం కురిసే వేళ ఆకాశంలో
ఉరుములు మెరుపుల వలె
వర్షం తరువాత ఏర్పడే ఇంద్రధనుస్సు వలె
ఒక మెరుపులా మెరిసావు నా మనసులో
సప్తవర్ణ శోభితమై నిలిచి పోయావు
నా హృదయంలో!
 
_ మార్గం కృష్ణ మూర్తి 

No comments: