Wednesday, July 16, 2025

నీతి నిజాయితీ నమ్మకం వెలకట్టలేని సంపదలు

అంశం: నైతిక పతనం

శీర్శిక: *నీతి నిజాయితీ నమ్మకాలు వెలకట్టలేని సంపదలు*

ఇంటికి గుట్టు మడికి గట్టు
కంటికి చూపు పంటకు కాపు
కత్తికి పదును మాటకు విలువ ఉండాలి!

సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల
జీవరాశులలో
మానవ జన్మ ఉత్కృష్టమైనది
ఉన్నతమైనది మహోన్నతమైనది!

"కాకిలా వేయేండ్లు బ్రతికే కన్నా
హంసలా ఐదేండ్లు బ్రతికినా చాలు" అన్నట్లు

సమాజంలో జీవించునప్పుడు
నీతి నిజాయితీ నమ్మకం సత్యం ధర్మం
అను సుగుణాలతో జీవించాలి!

మంచి పనులు చేస్తే మంచి పేరు
కీర్తి ప్రతిష్టలు గౌరవమర్యాదలు పెరుగును
చెడు పనులు చేస్తే చెడ్డ పేరు
అపకీర్తి అగౌరవాలు మిగులును!

నా జీవితం నా ఇష్టం అంటే
సమాజంలో జీవించడం కష్టతరం
ఎప్పుడైతే మనిషి
ఆర్ధిక ఇతర వ్యవహారాలలో
నీతి నిజాయితీ నమ్మకం కోల్పోతారో
అప్పుడు వారు నైతికంగా
ఓటమి చెందినట్లే భావించాలి!

నీతి నిజాయితీ నమ్మకాలు
వెలకట్టలేని సంపదలు
వాటి మీదనే లక్షల కోట్ల వ్యాపారాలు
నమ్మకం కోల్పోతే దిగజారు ప్రతిష్టలు!

మాట ఇస్తే కట్టుబడి ఉండాలి
సత్యం ధర్మాన్ని పాటించాలి
నిబద్ధతతో క్రమశిక్షణతో ఉండాలి
నీతి నీజాయితీ గా మెదులుకోవాలి
నమ్మిన వారిని మోసం చేయకుండా
నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

మనిషి నైతికంగా పతనమై
సమాజంలో చులకనై పోకూడదు
విలువలకు తిలోదకాలిచ్చి
జీవచ్ఛవంలా గడుపకూడదు!
 

No comments: