Tuesday, July 29, 2025

ఓటమి కాదు

అంశం: స్వేచ్చా కవిత


శీర్షిక: *ఓటమి కాదు*

సూర్యుడు ఒక నక్షత్రం
అది మండుతున్న గోళం
మబ్బులు అడ్డుగా వచ్చినప్పుడు
నేల పైన కాంతి శూన్యం
చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు
భూమిపైన చీకటి
అంత మాత్రాన సూర్యుడు ప్రకాశం కోల్పోయినట్లా
సూర్య భగవానుడు ఓటమి చెందినట్లా?

మొక్క జొన్న మొక్కపైన
పిట్ట వాలి నప్పుడు
పిట్ట బరువుకు సమానంగా
ఆ మొక్క వంగిపోవడం సహజం 
అంత మాత్రాన ఆ మొక్క ఓటమి చెందినట్లా?

భారీ తుఫానులు వర్షాల కారణంగా
వరదలు వచ్చినప్పుడు వాగులలో నదులలో
గడ్డి తుంగలు వంగి పోవు
వరద ఆగిపోగానే నిటారుగా నిలుచు
అంత మాత్రాన తుంగలు ఓటమి చెందినట్లా?

సమాజంలో కుటుంబ గౌరవాన్ని
కుటుంబ బంధాలను పరువు ప్రతిష్టలను
కాపాడు కోడానికి కొన్ని అవమానాలు
నిందలు భరించాల్సి రావచ్చు
అంత మాత్రాన మగాడు ఓటమి పాలయినట్లా?

కాదు కాదు అది ఓటమి కాదు 
అది కేవలం వాగులో తుంగ వలెనే 
వంగిన మొక్కజొన్న మొక్కవలెనే 
గెలిచి నిలుస్తుంది మగాడి మగతనం 
ఆచంద్రతారార్కం!
 

No comments: