Friday, January 12, 2024

30 Days Congress Govt.ment /30 రోజుల కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో: CONGRESS RULLING FIRST 30 DAYS IN TELANGANA

 30 రోజుల కాంగ్రెస్ పాలన:


నూతనంగా తెలంగాణా ఏర్పడ్డాక, మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 న  ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గా శ్రీ బట్టి విక్రమార్క గారుప్రమాణ స్వీకారాలు చేసారు.

పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుంది అన్నట్లు,
ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి చేసిన కార్యక్రమాలు:
01. ప్రమాణ స్వీకారం చేశాక మేము ప్రజా పాలకులం కాదు, ప్రజా సేవకులమని స్లోగన్ ఇచ్చారు. ప్రజలలో ఒక ఆత్మీయ భావనను, ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు.
02. ప్రగతి భవన్ ఇనుప కంచెలను, నామ రూపాలు లేకుండా చేసి, తెలంగాణా లోని నాలుగు కోట్ల ప్రజలు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేట్లు చేసారు.
ప్రగతి భవన్ పేరును, "మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్" గా మార్చారు. ప్రజల సమస్యలను చెప్పుకునే విధంగా, వారంలో రెండు రోజులు మంగళ, శుక్రవారాలలో, నేరుగా అధికారులను కలిసి, సమస్యలను వ్రాత పూర్వకంగా అందించేందుకు అవకాశం కల్పించారు. వాటిని సమయానుకూలంగా పరిష్కారించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజలు సెక్రటేరియట్ కు నేరుగా వెళ్ళే విధంగా స్వేచ్ఛ ను కలిగించారు.

03. వెంటనే క్యాబినెట్ నెట్ ను ఫామ్ చేసారు.
04. ఆదర్శనీయంగా స్పీకర్ ను నియమింప జేసారు.
05.మ్యానిఫెస్టోలో చెప్పిన  6 గ్యారంటీలలోని , మహాలక్ష్మి పథకంలోని ఒకటైన , "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం"  అనే పథకాన్ని, సోనియా గాంధీ గారి జన్మదినం పురష్కరించుకుని డిసెంబర్ 9, 2023 న, ప్రారంభించారు.
అదే రోజు చేయూత పథకంలోని తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ, 10 లక్షల ఉచిత భీమాను ప్రారంభించారు.
06. డైరెక్ట్ రిలేతో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇంట్లోనే కూర్చుని, ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకునే విధంగా , పారదర్శకతను పాటించారు.
రేపటి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేశారు.
07. ఐఏస్, ఐపిఎస్, ఇతర అధికారుల ట్రాన్స్ఫర్ లు చేపట్టారు. సమీక్షలు చేశారు.
08. ఆర్ధిక రంగంపై , విద్యుత్ రంగంపై ఒక స్వేత పత్రాన్ని విడుదల చేశారు. అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు 6 లక్షల 71 కోట్లని తేల్చారు.
09. అందు బాటులో ఉన్న నిధుల ప్రకారం ఆర్టీసికి , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొంత డబ్బు చెల్లించారు. భీమా ప్రీమియం చెల్లించారు.
10. అందు బాటులో ఉన్న నిధుల ప్రకారం రైతు బంధును వేశారు. గత ప్రభుత్వంలో లాగానే , ఆసరా పెన్షన్లను వేశారు.
11. UPSC లాగా పరీక్షలు జరిపించాలని, స్వయంగా  డిల్లీ వెళ్లి UPSC చైర్మన్ కలిసి సలహాలను తీసుకున్నారు.
12. ఫార్మా సిటీని , ఫార్మా విలేజ్ గా మార్చాలని, ఫార్మా పారిశ్రామిక వేత్తలతో సంప్రదించి, నిర్ణయం తీసుకున్నారు.
13. డిసెంబర్ 28 నుండి - జనవరి 06 ,2024 వరకు "ప్రజా పాలన" స్పెషల్ డ్రైవ్ పెట్టి, ఆరు గ్యారింటీలకు సంబంధించి అప్లికేషన్ లను స్వీకరించారు. వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్ర మొత్తంలో
1,25 ,00,000 అప్లికేషన్లు వచ్చాయి.
14. జనవరి 7 న , ప్రజాపాలన వెబ్ సైట్  www.prajapalana.telangana.gov.in ను ప్రారంభించారు. అప్లికేషన్లను ఎంట్రీ చేయడం ప్రారంభించారు. ఇది జనవరి 17, వరకు పూర్తి అవుతుందని చెప్పారు. జనవరి 18 నుండి, ప్రజలు వెబ్సైట్ లో , వారి అప్లికేషన్ ఆక్సెప్ట్ అయ్యిదా లేదా సులువుగా తెలుసు కోవచ్చంటున్నారు. ప్రతిదీ పారదర్శకం.
15. అవినీతి నాయకుల , అధికారుల , బినామీల లెక్కలను ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు.
16. ఇద్దరు ఎమ్ ఎల్ సి పదవులకు, క్యాబినెట్ మంత్రుల సూచనల మేరకు, తెలంగాణా పోరాట యోధులకు, మేధావులకు అవకాశం కల్పించారు.



పారదర్శక పరిపాలన కొరకు, ఐఏఎస్ లతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు.
గవర్నర్ గారితో, ప్రధాన మంత్రితో, రాష్ట్ర పతితో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
తమ పార్టీ సభ్యులతో, ఇతర పార్టీల సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
తమ కార్యాచరణ ఏమిటో ఒక పత్రికా సంపాదకుల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
తమ సమస్యలను తెలుపుకునే విధంగా, ధర్నాలు రాస్తారోకోలు చేసుకునే విధంగా, ప్రజలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. గత ప్రభుత్వం లో ఏ రోజు ఏమి జరుగుతుందో, పదేండ్లైనా , పార్టీ ఓడి పోయే వరకు ఎవరికీ తెలిసేది కాదు. ఏ జి.వొ. వెబ్సైట్ లో కనబడలేదు. ఇప్పటి వరకైతే వీళ్ళ కొడుకులు, బిడ్డలు, అల్లుండ్లు దోచిన దాఖలాలు లేవు. అంతా
పారదర్శక పాలన ప్రస్తుతానికైతే ప్రజలకు కనబడుతుంది, అవినీతికి పాల్పడిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలిగాయి. మహిళలు , విద్యార్ధినులు తెలంగాణా అంతటా ఉచితంగా తిరిగే స్వేచ్ఛ లభించింది. స్వేచ్ఛ అంటే ఇది. ఆత్మ గౌరవం అంటే ఇది.
అంతకంటే ఇంకేమి కావాలి ప్రజలకు?

గత ప్రభుత్వంలో బాధలు, నిర్భంందాలను  అనుభవించిన ప్రజలు, భూదోపిడికి గురైన ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి , రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే నిజాయితీ ప్రజలు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి గల నిధుల లేమిని అర్ధం చేసుకున్న ప్రజలు, ఉచిత పథకాల కొరకు ఎదిరి చూడటం లేదు. డిమాండ్ చేయడం లేదు. ఉచిత పథకాలు వద్దనే వారే చాలా మంది కనబడుతున్నారు. వారు,  ప్రశ్నించే స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ, ఉచిత విద్య, ఉచిత వైద్యం ,ఉచిత న్యాయం మరియు నీతి వంతమైన పాలన కోరుకుంటున్నారు. కానీ ఉచిత పథకాలు కాదు. నిధుల అవకాశాన్ని బట్టి, ప్రభుత్వమే అందిస్తుంది. అది భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ భాద్యత కూడా.  ప్రజలు చెల్లించిన పన్నులను, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమ పథకాలకు ఎలాగో ఖర్చు చేస్తారని, ప్రజలు భావిస్తున్నారు.

Monday, January 8, 2024

మహిళల ఉచిత బస్సు ప్రయాణం 💯% విజయ వంతం

మనసుంటే మార్గముంటుందంటారు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది తప్పక ఉంటుంది.

"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం"  డిసెంబర్ 9, 2023 న, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఇది పేద మధ్యతరగతి మహిళలకు వరం లాంటిది.
ఎందుకంటే నేడు మెజారిటీ కుటుంబాలలో మహిళలే అధికంగా ఉన్నారు.
సమయం లేక పోవడం వలన, తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే అని అన్నారే గానీ మరి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.
మహిళలలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారు. రోజులు గుడుస్తుంటే, మహిళలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అలానే ఆటో వాండ్లు, వారికి జీవనోపాధి కరువైందని, ధర్నాలు , రాస్తారోకోలు ప్రారంభించారు. ప్రతి రోజూ ఏదో ఒక మూలన చర్చ జరుగుతుంది. సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ఏదైనా కొత్తగా ఉచిత పథకం ప్రారంభించినప్పుడు లేదా  మార్పు చేసి నప్పుడు కొందరికి మేలు జరుగుతే, మరికొందరికి బాధ, నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇది సహజం.
వీరిని ఎంత సమన్వయం  చేయాలనుకున్నా, కొంత అసంతృప్తి మిగిలే ఉంటుంది.
ప్రభుత్వం వేరు, ఆర్టీసి వేరు. మొదట ఆర్టీసి వారు,
మేము ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే, ఆర్టీసి మరింత నష్టాల్లో కూరుకు పోతుందని తేల్చి చెప్పేశారు.
నెల రోజులు గడిచాక ఇప్పుడు కొందరు మహిళలు ఉచిత ప్రయాణాన్ని వద్దని చెబుతున్నారు. రద్దు చేయాలంటున్నారు . మరికొందరు టిక్కెట్లు రేట్లు తగ్గిస్తే బాగుండేది అంటున్నారు. మరికొందరు సీనియర్ సిటిజన్స్ మహిళలకు ఇస్తే సరిపోతుంది అంటున్నారు. ఇంకొందరు, దగ్గరి రూట్ల వారికి ఉచిత ప్రయాణం అంటే బాగుంటుందని, పేదల వరకు పెడితే బాగుంటుందని, బస్సులు పెంచాలని, కండక్టర్లు, డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారని , బస్సులలో రద్దీ పెరుగడం వలన ఇబ్బంది అవుతుందని , దొంగతనాలు , కొట్లాటలు జరుగుతున్నాయని , అలానే మగవారు, అన్ని సీట్లలో మహిళలలే కూర్చోవడం వలన, మేము డబ్బులు చెల్లించి, నిలబడి వెళ్ళాల్సి వస్తుందని, ఇంకా ఎన్నో రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. అనుభవం లోకి వస్తున్నాయి.
ఇక ఆటో డ్రైవర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన, మా ఆటోలలో ఎవరూ ఎక్కడం లేదని, దీని వలన, మేము ఆటోల ఇ.ఎమ్.ఐ లు , పిల్లల స్కూలు ఫీజులు, కరెంట్ బిల్లులు, హాస్పిటల్ ఖర్చులు, జీవనోపాధి భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆటో డ్రైవర్ల అధ్యక్షుడు స్వామి గారంటారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మంచిదే. కానీ లక్షల జీతాలు తీసుకునే టీచర్లు, ఇతర ఉద్యోగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది అని అంటున్నారు. వీరి మాటలలో న్యాయం ఉంది.

విద్యార్ధినులకు, పేద, మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయనవసరం లేదు. ఇది ఒక మంచి పథకం. ఇది మహిళలకు సాధికారత నిస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది . స్వేచ్ఛ నిస్తుంది. ఆర్ధిక స్వావలంబన కలిగిస్తుంది. చైతన్య పరుస్తుంది. సమాజం గురించి అవగాహన కలిగిస్తుంది. విద్యను, ఉపాధిని ప్రోత్స హిస్తుంది.
మహిళా బిల్లు కంటే గొప్పగా ఎంపవర్ మెంట్ ను ఇస్తుంది. దీనని దుర్వినియోగం కాకుండా చూడాలి.
"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" పథకం విజయవంతం కావాలంటే, ఈ సూచనలను , సలహాలను అమలు చేస్తే, ఆర్టీసీని ,అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచినట్లవుతుంది.

01. ఆర్టీసికి  మహిళా టికెట్ల డబ్బును, ప్రభుత్వం నెల వారిగా చెల్లించాలి. ఆర్టీసికి మరో మేలు ఏమంటే, బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగి ఆదాయం పెరుగగలదు.
02. విద్యార్ధినులకు, నిరుద్యోగ మహిళలకు, చిన్న చిన్న ఉద్యోగులకు మరియు పేద మధ్యతరగతి మహిళలకు వారి తెల్ల రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను బేస్ చేసుకుని స్మార్ట్ కార్డులు జారీ చేయాలి.
03. ప్రభుత్వ ఉద్యోగులకు, లక్షల్లో జీతాలు పొందే వారికి, ధనవంతులకు, కార్లు, ఆపై వాహనాలు ఉన్న వారికి, ఆదాయ పన్నులు చెల్లించే వారికి, స్వచ్చందంగా ఉచితాలు  వద్దు అనే మహిళలకు ఉచిత స్మార్ట్ కార్డులు జారీ చేయకూడదు.
04. తక్షణమే స్మార్ట్ కార్డులు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో  ఇష్యూ చేయాలి. స్మార్ట్ కార్డులు ఇష్యూ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. బస్సు పాసులు రెన్యువల్ చేసినట్లుగానే చేసి, ఉచిత స్మార్ట్ కార్డులనూ లామినేషన్ చేసి ఇవ్వాలి. సంవత్సరం తర్వాత,  ఆధారాలను చూపించి రెన్యువల్ ఉచితంగా చేయించు కోవాలి.
లేకుంటే స్మార్ట్ కార్డులు దుర్వినియోగం అవుతాయి.
05. బస్సు ప్రయాణం చేసేటప్పుడు వారి వద్ద స్మార్ట్ కార్డు లేనట్లయితే టికెట్ కొట్టాలి. జిరాక్స్, వాట్సాప్ స్మార్ట్ కార్డులను పరిగణనలోకి తీసుకోకూడదు.
06. బస్సుల సంఖ్య ను పెంచాలి. ఉన్న బస్సులను కండీషన్ లో పెట్టాలి.
07. మహిళలు, మహిళల సీట్లలోనే కూర్చోవాలి. సీనియర్ సిటిజన్స్ సీట్లను, వికలాంగుల సీట్లను వారికే కేటాయించాలి. వారు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు.
08. కండక్టర్లు, డ్రైవర్లు మహిళలను , ఉచిత బస్సు ప్రయాణమని, చిన్న చూపు చూడ కుండా ఆర్టీసి చర్యలు తీసుకోవాలి.
09. పండుగలకు, తీర్థాలకు, విహారాలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి.
10. ఆటో డ్రైవర్లు గమనించాల్సింది, వారి కుటుంబాల మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం మేలు చేకూరుస్తుందన్న విషయం. ఇతర ప్రజలకు లాగానే , ఆటో డ్రైవర్లకు, కరెంట్ బిల్లులు, గ్యాస్ భారం తగ్గుతుంది.  ఆటో డ్రైవర్లు గమనించాల్సిన మరో విషయం కార్లలో వెళ్ళే వారు , క్యాబులలో వెళ్ళే వారు, బస్సులలో వెళ్ళరు. బస్సులు కాలనీలలో తిరుగవు. ఒక ఇంటినుండి మరో ఇంటికి లేదా మరో చోటికి వెళ్ళాలన్నా , అత్యవసరంగా వెళ్ళాలన్నా ఆటోలను, క్యాబ్ లనే ఆశ్రయిస్తారు కానీ బస్సులను కాదు.ధనికులకు, లక్షల జీతాలు పొందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయడం వలన , ఇక విద్యార్థినిలు, చిన్న చిన్న ఉద్యోగ మహిళలు, గతంలో పాసులు తీసుకుని బస్సులలోనే వెళ్ళే వారే కాబట్టి,  డ్రైవర్ల ఉపాధికి ఎలాంటి సమస్యా ఉండదు.
11. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇప్పటికే  5 లక్షల ఉచిత భీమాను కొనసాగిస్తున్నారు.
12. అర్హులైన డ్రైవర్లకు ఉచిత రేషన్ కార్డులు ఇవ్వాలి.
13. అర్హులైన డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12,000 రూ.లు చెల్లించాలి.
ఇలా చేయడం వలన అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచినట్లవుతుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నూరు శాతం విజయవంతం అవుతుంది.

Monday, January 1, 2024

ప్రజాపాలన అప్లికేషన్ పై అనుమానాలు - వివరణలు

 నూతనంగా, డిసెంబర్,7-2023 న  ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై , ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలపై

అనేకమైన అనుమానాలు , 6 గ్యారంటీల అప్లికేషన్లపై అనేక అభ్యంతరాలు, అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదు.  ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే అనగా డిసెంబర్ 9 న రెండు గ్యారెంటీలలోని , రెండు సబ్ గ్యారంటీలైన "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" , రెండవది "10 లక్షల ఆరోగ్యశ్రీ భీమా " ను అమలు చేసారు.
ఆర్టీసికి, ఇన్స్యూరెన్స్ కు ప్రీమియం కు డబ్బు చెల్లింపు చేసే ఉంటారు కదా. ఒక వైపు నిధుల లేమి మరో వైపు అనర్హులను కట్టడి చేయాలి. ఆ కారణంగా  , వెరీఫై చేసుకుంటూ, "రైతు భరోసా" పథకానికి సంబంధించి రైతులకు 5 వేల చొప్పున వేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా, ప్రాధాన్యత ప్రకారంగా 100 రోజులలోపల హామీలను ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలి.
"ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బలు అన్నట్లు " , నిబద్ధతతో ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసే ప్రభుత్వాలపై బురద చల్లడం తగదు.
ఇక డిసెంబర్ 28,2023 నుండి జనవరి 6, 2024 వరకు ,  స్పెషల్ డ్రైవ్ అని ప్రారంభించిన 6 గ్యారంటీల అప్లికేషన్లపై అపోహలను సృష్టించడం,
దుష్ప్రచారాలు చేయడం శ్రేయస్కరం కాదు. పాలకులు ఎవరైనా సరే  నిబద్దతగా , నిస్వార్ధంగా పని చేస్తున్నారా లేక ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారా అనేది చూడాలి. గవర్నర్ ను , ప్రధాన మంత్రిని, రాష్ట్ర పతిని, ఇతర నేతలను, మేధావులను కలుపుకు పోతున్నారా లేదా చూడాలి. కొంత కాలం సమయం ఇవ్వాలి. అవినీతి నిరూపితమైన పాలకులను 60 యేండ్లు దూరం పెట్టాలి. ప్రజలకు మంచి పాలన అందిద్దామని ముందుకు వచ్చిన, ప్రభుత్వాలను ప్రొత్సహించాలి తప్పా , బలహీనం చేయకూడదు.
ఆరు గ్యారెంటీల అప్లికేషన్ నింపడంలో ఎలాంటి సమస్యలు లేవు. చాలా సులభంగా ఉంది. తక్కువ సమయంలో కొత్తగా అప్లికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంత క్లారిటీ లేక పోవచ్చు. అవి అనుభవం మీద తెలుస్తాయి. వాటిని సరిచేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. "పెట్టని మహాతల్లి పెట్టకనే పాయే, పెట్టేది కూడా పెట్టక పాయే అన్నట్లుగా" మాట్లాడటం సబబు కాదు. ప్రజాపాలన దరఖాస్తును ఎవరైనా సులువుగా నింపవచ్చు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. అప్లికేషన్ నింపడంలో దరఖాస్తు దారులకు ఉండే కొన్ని అపోహలను ,సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను.
01. యజమాని పూర్తి పేరు : ఆధార్ లో ఉన్నట్లుగా  పురుషుడి పేరు గానీ, మహిళ పేరు గానీ ఆంగ్లంలో లేదా తెలుగులో వ్రాయండి. సాధారణంగా రేషన్ కార్డు మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి, మహిళల పేరు వ్రాయడం ఉచితం. లేదా మీ ఇష్టం.
02. లింగం: స్త్రీ నా, పురుషుడా, ఇతరులు (న్యూట్రల్ జెండరా)
అక్కడి బాక్స్ లో టిక్ చేయండి.
03. ఎస్సీ, ఎస్టీ,బి.సి, మైనారిటీ, ఇతరులా టిక్ చేయండి.
04.పుట్టిన తేది, ఆధార్ కార్డు ప్రకారం తేది,నెల సంవత్సరం నింపండి.
05.ఆధార్ కార్డు నెంబరు వ్రాయండి
06. రేషన్ కార్డు నెంబరు ఉంటే వ్రాసి దాని జిరాక్స్ కాపీని అటాచ్ చేయండి. లేకుంటే ఒక తెల్ల కాగితంపై , MRO కు రిక్వెస్ట్ చేస్తూ మీ కుటుంబ సభ్యుల పేర్లు, సంబంధం, పుట్టిన తేది, ఆధార్ నెంబర్, అడ్రస్, సెల్ నెంబర్ వ్రాసి వ్రాసి క్రింద సంతకం చేసి , అప్లికేషన్ కు అటాచ్ చేయండి. లేదా పూర్తిగా ఆ కాలం వదిలేయండి.
రేషన్ కార్డు అడ్రస్ వేరే ఉన్నా, అదే కార్డు నెంబరు వేయండి. తరువాత రేషన్ షాపు అడ్రస్ మార్చు కోండి.
07.మీ సెల్ నెంబర్ వేయండి
08. వృత్తి: మీరు చేసే పని ఏమిటో వ్రాయండి. సాధారణంగా ఈ ఆరు గ్యారెంటీలు పేదవారికి మాత్రమే కాబట్టి, కూలి అని వ్రాయండి. లేదా మీ ఇష్టం.
09. కుటుంబ సభ్యుల వివరాలు: క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తు దారులతో సంబంధం (బార్యా, భర్తా, పెళ్లి కాని కొడుకా, బిడ్డా, తల్లా, తండ్రా, అత్తా, మామా), పురుషులా, స్త్రీలా, వారి పుట్టిన తేదీలు, ఆధార్ కార్డు నెంబరు వ్రాయండి.
దరఖాస్తు దారుని ఫోటో ను ఆ పై డబ్బాలో అతికించండి. దరఖాస్తు సంఖ్యను అధికారులు వేస్తారు.
10. చిరునామా: ఆధార్ కార్డు మీద లేదా ఓటర్ కార్డు మీద ఏ అడ్రస్ ఉంటే అదే వ్రాయండి . ఏమైనా తేడా ఉంటే తరువాత ఆధార్ ను అప్డేట్ చేసుకోండి.

మహాలక్ష్మి పథకం: ఇక్కడ అర్హులైన వారు 2,500 టిక్ చేయండి. కుటుంబంలో ఒకరికే వస్తుంది.
18 నుండి 55 సం.రాల వయసు గల వారికే ఇది వర్తిస్తుంది. పెన్షన్ వచ్చే వారికి ఇది రాదు.
రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కొరకు టిక్ చేయండి.
గ్యాస్ కనెక్షన్ నెంబరు వేయండి. గ్యాస్ సప్లయ్ చేస్తున్న వారి పేరు, గ్యాస్ పేరు వ్రాయండి.
సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో వ్రాయండి.
ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కుటుంబ సభ్యుల ఎవరి పేరుమీద ఉన్నా పర్వాలేదు.
ఇ.కె.వై.సీ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినది.
రైతు భరోసా పథకం: (రైతులు, కౌలుదారులు,కూలీల కొరకు మాత్రమే. ఇతరులు వదిలేయండి)
ఆల్రెడీ రైతు బంధు వచ్చే వారు దీనిని నింప నవసరం లేదు. ఒక వేళ నింపినా నష్టమేమి లేదు.
రైతా లేదా కౌలు దారా అనేది టిక్ చేయండి.
రైతు  పట్టాదారు నెంబరు వేయండి. సాగు చేస్తున్న భూమి ఎన్ని ఎకరాలు, సర్వే నెంబర్ వేయండి.
కౌలు దారైతే సాగుచేస్తున్న భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్ వేయండి.
వ్యవసాయ కూలీలకు సం.రానికి 12,000 లకు సంబంధించి
ఉపాధి పథకం కార్డు నెంబరు వేయండి.
ఇందిరమ్మ ఇండ్ల పథకం: ఇండ్లు లేని అర్హులైన వారు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం కొరకు టిక్ చేయండి.
అమరవీరులు, ఉధ్యమ కారులకు 250 గజాల స్థలం కొరకు, వివరాలను ఫిల్ చేయండి. కాని వారు వదిలేయండి.
గృహ జ్యోతి పథకం: కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితం ఉంటుంది. దీనికి సంబంధించి, మీరు ఎన్ని  యూనిట్ల మధ్యలో వాడుతున్నారో  టిక్ చేయండి. కరెంట్ మీటర్ కనెక్షన్ నెంబరు వ్రాయండి.
ఇక్కడ కిరాయికి ఉండే వారు, వారు చెల్లించే బిల్లు నెంబర్ వ్రాయండి.
చేయూత పథకం: వృద్ధులకు నెలకు 4,000 అలానే వికలాంగులకు 6,000:
ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇదివరకే పెన్షన్ పొందే వారు దీనిలో టిక్ పెట్ట నవసరం లేదు. పొరపాటున టిక్ చేసినా నష్టం ఏమీ లేదు.
రాని వారు మాత్రం తప్పక టిక్ చేయాలి. దివ్యాంగులైతే సదరన్ సర్టిఫికెట్ నెంబర్ వేయాలి.
చివరగా జతపరుచవల్సిన దరఖాస్తు దారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు అటాచ్ చేయాలి. రేషన్ కార్డు లేని వారు తెల్లకాగితం పై కుటుంబ వివరాలు వ్రాసి ఇవ్వ వచ్చు. లేదా వదిలేయండి.
క్రింది భాగంలో  సంతకం లేదా వ్రేలు ముద్ర వేసి పేరు వ్రాయండి. తేది వేయండి.
అక్కడే అధికారులకు ఇవ్వండి, మీకు ఒక రశీదు ఇస్తారు. దానిని భద్రపరుచుకోండి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 28 ,2023 నుండి, జనవరి 6, 2024 అనేది ఒక స్పెషల్ డ్రైవ్ మాత్రమే. వివిధ కారణాల వలన అప్లై చేసుకోని వారు ఉంటే, వారు జనవరి 6 తర్వాత కూడా MRO ఆఫీస్ లలో గానీ, మున్సిపల్ ఆఫీస్ లలో గానీ, మరేదైనా ప్రభుత్వం సూచించిన ఆఫీస్ లలో గానీ అప్లై చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అర్హులైన చివరి లబ్ధిదారులకు అందే వరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ.