Monday, January 1, 2024

ప్రజాపాలన అప్లికేషన్ పై అనుమానాలు - వివరణలు

 నూతనంగా, డిసెంబర్,7-2023 న  ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై , ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలపై

అనేకమైన అనుమానాలు , 6 గ్యారంటీల అప్లికేషన్లపై అనేక అభ్యంతరాలు, అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదు.  ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే అనగా డిసెంబర్ 9 న రెండు గ్యారెంటీలలోని , రెండు సబ్ గ్యారంటీలైన "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" , రెండవది "10 లక్షల ఆరోగ్యశ్రీ భీమా " ను అమలు చేసారు.
ఆర్టీసికి, ఇన్స్యూరెన్స్ కు ప్రీమియం కు డబ్బు చెల్లింపు చేసే ఉంటారు కదా. ఒక వైపు నిధుల లేమి మరో వైపు అనర్హులను కట్టడి చేయాలి. ఆ కారణంగా  , వెరీఫై చేసుకుంటూ, "రైతు భరోసా" పథకానికి సంబంధించి రైతులకు 5 వేల చొప్పున వేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా, ప్రాధాన్యత ప్రకారంగా 100 రోజులలోపల హామీలను ప్రారంభించడానికి అవకాశం ఇవ్వాలి.
"ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బలు అన్నట్లు " , నిబద్ధతతో ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసే ప్రభుత్వాలపై బురద చల్లడం తగదు.
ఇక డిసెంబర్ 28,2023 నుండి జనవరి 6, 2024 వరకు ,  స్పెషల్ డ్రైవ్ అని ప్రారంభించిన 6 గ్యారంటీల అప్లికేషన్లపై అపోహలను సృష్టించడం,
దుష్ప్రచారాలు చేయడం శ్రేయస్కరం కాదు. పాలకులు ఎవరైనా సరే  నిబద్దతగా , నిస్వార్ధంగా పని చేస్తున్నారా లేక ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారా అనేది చూడాలి. గవర్నర్ ను , ప్రధాన మంత్రిని, రాష్ట్ర పతిని, ఇతర నేతలను, మేధావులను కలుపుకు పోతున్నారా లేదా చూడాలి. కొంత కాలం సమయం ఇవ్వాలి. అవినీతి నిరూపితమైన పాలకులను 60 యేండ్లు దూరం పెట్టాలి. ప్రజలకు మంచి పాలన అందిద్దామని ముందుకు వచ్చిన, ప్రభుత్వాలను ప్రొత్సహించాలి తప్పా , బలహీనం చేయకూడదు.
ఆరు గ్యారెంటీల అప్లికేషన్ నింపడంలో ఎలాంటి సమస్యలు లేవు. చాలా సులభంగా ఉంది. తక్కువ సమయంలో కొత్తగా అప్లికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంత క్లారిటీ లేక పోవచ్చు. అవి అనుభవం మీద తెలుస్తాయి. వాటిని సరిచేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. "పెట్టని మహాతల్లి పెట్టకనే పాయే, పెట్టేది కూడా పెట్టక పాయే అన్నట్లుగా" మాట్లాడటం సబబు కాదు. ప్రజాపాలన దరఖాస్తును ఎవరైనా సులువుగా నింపవచ్చు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. అప్లికేషన్ నింపడంలో దరఖాస్తు దారులకు ఉండే కొన్ని అపోహలను ,సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను.
01. యజమాని పూర్తి పేరు : ఆధార్ లో ఉన్నట్లుగా  పురుషుడి పేరు గానీ, మహిళ పేరు గానీ ఆంగ్లంలో లేదా తెలుగులో వ్రాయండి. సాధారణంగా రేషన్ కార్డు మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి, మహిళల పేరు వ్రాయడం ఉచితం. లేదా మీ ఇష్టం.
02. లింగం: స్త్రీ నా, పురుషుడా, ఇతరులు (న్యూట్రల్ జెండరా)
అక్కడి బాక్స్ లో టిక్ చేయండి.
03. ఎస్సీ, ఎస్టీ,బి.సి, మైనారిటీ, ఇతరులా టిక్ చేయండి.
04.పుట్టిన తేది, ఆధార్ కార్డు ప్రకారం తేది,నెల సంవత్సరం నింపండి.
05.ఆధార్ కార్డు నెంబరు వ్రాయండి
06. రేషన్ కార్డు నెంబరు ఉంటే వ్రాసి దాని జిరాక్స్ కాపీని అటాచ్ చేయండి. లేకుంటే ఒక తెల్ల కాగితంపై , MRO కు రిక్వెస్ట్ చేస్తూ మీ కుటుంబ సభ్యుల పేర్లు, సంబంధం, పుట్టిన తేది, ఆధార్ నెంబర్, అడ్రస్, సెల్ నెంబర్ వ్రాసి వ్రాసి క్రింద సంతకం చేసి , అప్లికేషన్ కు అటాచ్ చేయండి. లేదా పూర్తిగా ఆ కాలం వదిలేయండి.
రేషన్ కార్డు అడ్రస్ వేరే ఉన్నా, అదే కార్డు నెంబరు వేయండి. తరువాత రేషన్ షాపు అడ్రస్ మార్చు కోండి.
07.మీ సెల్ నెంబర్ వేయండి
08. వృత్తి: మీరు చేసే పని ఏమిటో వ్రాయండి. సాధారణంగా ఈ ఆరు గ్యారెంటీలు పేదవారికి మాత్రమే కాబట్టి, కూలి అని వ్రాయండి. లేదా మీ ఇష్టం.
09. కుటుంబ సభ్యుల వివరాలు: క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తు దారులతో సంబంధం (బార్యా, భర్తా, పెళ్లి కాని కొడుకా, బిడ్డా, తల్లా, తండ్రా, అత్తా, మామా), పురుషులా, స్త్రీలా, వారి పుట్టిన తేదీలు, ఆధార్ కార్డు నెంబరు వ్రాయండి.
దరఖాస్తు దారుని ఫోటో ను ఆ పై డబ్బాలో అతికించండి. దరఖాస్తు సంఖ్యను అధికారులు వేస్తారు.
10. చిరునామా: ఆధార్ కార్డు మీద లేదా ఓటర్ కార్డు మీద ఏ అడ్రస్ ఉంటే అదే వ్రాయండి . ఏమైనా తేడా ఉంటే తరువాత ఆధార్ ను అప్డేట్ చేసుకోండి.

మహాలక్ష్మి పథకం: ఇక్కడ అర్హులైన వారు 2,500 టిక్ చేయండి. కుటుంబంలో ఒకరికే వస్తుంది.
18 నుండి 55 సం.రాల వయసు గల వారికే ఇది వర్తిస్తుంది. పెన్షన్ వచ్చే వారికి ఇది రాదు.
రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కొరకు టిక్ చేయండి.
గ్యాస్ కనెక్షన్ నెంబరు వేయండి. గ్యాస్ సప్లయ్ చేస్తున్న వారి పేరు, గ్యాస్ పేరు వ్రాయండి.
సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో వ్రాయండి.
ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కుటుంబ సభ్యుల ఎవరి పేరుమీద ఉన్నా పర్వాలేదు.
ఇ.కె.వై.సీ కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినది.
రైతు భరోసా పథకం: (రైతులు, కౌలుదారులు,కూలీల కొరకు మాత్రమే. ఇతరులు వదిలేయండి)
ఆల్రెడీ రైతు బంధు వచ్చే వారు దీనిని నింప నవసరం లేదు. ఒక వేళ నింపినా నష్టమేమి లేదు.
రైతా లేదా కౌలు దారా అనేది టిక్ చేయండి.
రైతు  పట్టాదారు నెంబరు వేయండి. సాగు చేస్తున్న భూమి ఎన్ని ఎకరాలు, సర్వే నెంబర్ వేయండి.
కౌలు దారైతే సాగుచేస్తున్న భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్ వేయండి.
వ్యవసాయ కూలీలకు సం.రానికి 12,000 లకు సంబంధించి
ఉపాధి పథకం కార్డు నెంబరు వేయండి.
ఇందిరమ్మ ఇండ్ల పథకం: ఇండ్లు లేని అర్హులైన వారు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహాయం కొరకు టిక్ చేయండి.
అమరవీరులు, ఉధ్యమ కారులకు 250 గజాల స్థలం కొరకు, వివరాలను ఫిల్ చేయండి. కాని వారు వదిలేయండి.
గృహ జ్యోతి పథకం: కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితం ఉంటుంది. దీనికి సంబంధించి, మీరు ఎన్ని  యూనిట్ల మధ్యలో వాడుతున్నారో  టిక్ చేయండి. కరెంట్ మీటర్ కనెక్షన్ నెంబరు వ్రాయండి.
ఇక్కడ కిరాయికి ఉండే వారు, వారు చెల్లించే బిల్లు నెంబర్ వ్రాయండి.
చేయూత పథకం: వృద్ధులకు నెలకు 4,000 అలానే వికలాంగులకు 6,000:
ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇదివరకే పెన్షన్ పొందే వారు దీనిలో టిక్ పెట్ట నవసరం లేదు. పొరపాటున టిక్ చేసినా నష్టం ఏమీ లేదు.
రాని వారు మాత్రం తప్పక టిక్ చేయాలి. దివ్యాంగులైతే సదరన్ సర్టిఫికెట్ నెంబర్ వేయాలి.
చివరగా జతపరుచవల్సిన దరఖాస్తు దారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు అటాచ్ చేయాలి. రేషన్ కార్డు లేని వారు తెల్లకాగితం పై కుటుంబ వివరాలు వ్రాసి ఇవ్వ వచ్చు. లేదా వదిలేయండి.
క్రింది భాగంలో  సంతకం లేదా వ్రేలు ముద్ర వేసి పేరు వ్రాయండి. తేది వేయండి.
అక్కడే అధికారులకు ఇవ్వండి, మీకు ఒక రశీదు ఇస్తారు. దానిని భద్రపరుచుకోండి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ 28 ,2023 నుండి, జనవరి 6, 2024 అనేది ఒక స్పెషల్ డ్రైవ్ మాత్రమే. వివిధ కారణాల వలన అప్లై చేసుకోని వారు ఉంటే, వారు జనవరి 6 తర్వాత కూడా MRO ఆఫీస్ లలో గానీ, మున్సిపల్ ఆఫీస్ లలో గానీ, మరేదైనా ప్రభుత్వం సూచించిన ఆఫీస్ లలో గానీ అప్లై చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అర్హులైన చివరి లబ్ధిదారులకు అందే వరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ.

No comments: