Monday, January 8, 2024

మహిళల ఉచిత బస్సు ప్రయాణం 💯% విజయ వంతం

మనసుంటే మార్గముంటుందంటారు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది తప్పక ఉంటుంది.

"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం"  డిసెంబర్ 9, 2023 న, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఇది పేద మధ్యతరగతి మహిళలకు వరం లాంటిది.
ఎందుకంటే నేడు మెజారిటీ కుటుంబాలలో మహిళలే అధికంగా ఉన్నారు.
సమయం లేక పోవడం వలన, తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే అని అన్నారే గానీ మరి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.
మహిళలలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారు. రోజులు గుడుస్తుంటే, మహిళలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అలానే ఆటో వాండ్లు, వారికి జీవనోపాధి కరువైందని, ధర్నాలు , రాస్తారోకోలు ప్రారంభించారు. ప్రతి రోజూ ఏదో ఒక మూలన చర్చ జరుగుతుంది. సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ఏదైనా కొత్తగా ఉచిత పథకం ప్రారంభించినప్పుడు లేదా  మార్పు చేసి నప్పుడు కొందరికి మేలు జరుగుతే, మరికొందరికి బాధ, నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇది సహజం.
వీరిని ఎంత సమన్వయం  చేయాలనుకున్నా, కొంత అసంతృప్తి మిగిలే ఉంటుంది.
ప్రభుత్వం వేరు, ఆర్టీసి వేరు. మొదట ఆర్టీసి వారు,
మేము ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే, ఆర్టీసి మరింత నష్టాల్లో కూరుకు పోతుందని తేల్చి చెప్పేశారు.
నెల రోజులు గడిచాక ఇప్పుడు కొందరు మహిళలు ఉచిత ప్రయాణాన్ని వద్దని చెబుతున్నారు. రద్దు చేయాలంటున్నారు . మరికొందరు టిక్కెట్లు రేట్లు తగ్గిస్తే బాగుండేది అంటున్నారు. మరికొందరు సీనియర్ సిటిజన్స్ మహిళలకు ఇస్తే సరిపోతుంది అంటున్నారు. ఇంకొందరు, దగ్గరి రూట్ల వారికి ఉచిత ప్రయాణం అంటే బాగుంటుందని, పేదల వరకు పెడితే బాగుంటుందని, బస్సులు పెంచాలని, కండక్టర్లు, డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారని , బస్సులలో రద్దీ పెరుగడం వలన ఇబ్బంది అవుతుందని , దొంగతనాలు , కొట్లాటలు జరుగుతున్నాయని , అలానే మగవారు, అన్ని సీట్లలో మహిళలలే కూర్చోవడం వలన, మేము డబ్బులు చెల్లించి, నిలబడి వెళ్ళాల్సి వస్తుందని, ఇంకా ఎన్నో రకరకాల అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. అనుభవం లోకి వస్తున్నాయి.
ఇక ఆటో డ్రైవర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన, మా ఆటోలలో ఎవరూ ఎక్కడం లేదని, దీని వలన, మేము ఆటోల ఇ.ఎమ్.ఐ లు , పిల్లల స్కూలు ఫీజులు, కరెంట్ బిల్లులు, హాస్పిటల్ ఖర్చులు, జీవనోపాధి భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆటో డ్రైవర్ల అధ్యక్షుడు స్వామి గారంటారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మంచిదే. కానీ లక్షల జీతాలు తీసుకునే టీచర్లు, ఇతర ఉద్యోగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది అని అంటున్నారు. వీరి మాటలలో న్యాయం ఉంది.

విద్యార్ధినులకు, పేద, మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయనవసరం లేదు. ఇది ఒక మంచి పథకం. ఇది మహిళలకు సాధికారత నిస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది . స్వేచ్ఛ నిస్తుంది. ఆర్ధిక స్వావలంబన కలిగిస్తుంది. చైతన్య పరుస్తుంది. సమాజం గురించి అవగాహన కలిగిస్తుంది. విద్యను, ఉపాధిని ప్రోత్స హిస్తుంది.
మహిళా బిల్లు కంటే గొప్పగా ఎంపవర్ మెంట్ ను ఇస్తుంది. దీనని దుర్వినియోగం కాకుండా చూడాలి.
"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" పథకం విజయవంతం కావాలంటే, ఈ సూచనలను , సలహాలను అమలు చేస్తే, ఆర్టీసీని ,అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచినట్లవుతుంది.

01. ఆర్టీసికి  మహిళా టికెట్ల డబ్బును, ప్రభుత్వం నెల వారిగా చెల్లించాలి. ఆర్టీసికి మరో మేలు ఏమంటే, బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగి ఆదాయం పెరుగగలదు.
02. విద్యార్ధినులకు, నిరుద్యోగ మహిళలకు, చిన్న చిన్న ఉద్యోగులకు మరియు పేద మధ్యతరగతి మహిళలకు వారి తెల్ల రేషన్ కార్డులను, ఆధార్ కార్డులను బేస్ చేసుకుని స్మార్ట్ కార్డులు జారీ చేయాలి.
03. ప్రభుత్వ ఉద్యోగులకు, లక్షల్లో జీతాలు పొందే వారికి, ధనవంతులకు, కార్లు, ఆపై వాహనాలు ఉన్న వారికి, ఆదాయ పన్నులు చెల్లించే వారికి, స్వచ్చందంగా ఉచితాలు  వద్దు అనే మహిళలకు ఉచిత స్మార్ట్ కార్డులు జారీ చేయకూడదు.
04. తక్షణమే స్మార్ట్ కార్డులు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో  ఇష్యూ చేయాలి. స్మార్ట్ కార్డులు ఇష్యూ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. బస్సు పాసులు రెన్యువల్ చేసినట్లుగానే చేసి, ఉచిత స్మార్ట్ కార్డులనూ లామినేషన్ చేసి ఇవ్వాలి. సంవత్సరం తర్వాత,  ఆధారాలను చూపించి రెన్యువల్ ఉచితంగా చేయించు కోవాలి.
లేకుంటే స్మార్ట్ కార్డులు దుర్వినియోగం అవుతాయి.
05. బస్సు ప్రయాణం చేసేటప్పుడు వారి వద్ద స్మార్ట్ కార్డు లేనట్లయితే టికెట్ కొట్టాలి. జిరాక్స్, వాట్సాప్ స్మార్ట్ కార్డులను పరిగణనలోకి తీసుకోకూడదు.
06. బస్సుల సంఖ్య ను పెంచాలి. ఉన్న బస్సులను కండీషన్ లో పెట్టాలి.
07. మహిళలు, మహిళల సీట్లలోనే కూర్చోవాలి. సీనియర్ సిటిజన్స్ సీట్లను, వికలాంగుల సీట్లను వారికే కేటాయించాలి. వారు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు.
08. కండక్టర్లు, డ్రైవర్లు మహిళలను , ఉచిత బస్సు ప్రయాణమని, చిన్న చూపు చూడ కుండా ఆర్టీసి చర్యలు తీసుకోవాలి.
09. పండుగలకు, తీర్థాలకు, విహారాలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి.
10. ఆటో డ్రైవర్లు గమనించాల్సింది, వారి కుటుంబాల మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం మేలు చేకూరుస్తుందన్న విషయం. ఇతర ప్రజలకు లాగానే , ఆటో డ్రైవర్లకు, కరెంట్ బిల్లులు, గ్యాస్ భారం తగ్గుతుంది.  ఆటో డ్రైవర్లు గమనించాల్సిన మరో విషయం కార్లలో వెళ్ళే వారు , క్యాబులలో వెళ్ళే వారు, బస్సులలో వెళ్ళరు. బస్సులు కాలనీలలో తిరుగవు. ఒక ఇంటినుండి మరో ఇంటికి లేదా మరో చోటికి వెళ్ళాలన్నా , అత్యవసరంగా వెళ్ళాలన్నా ఆటోలను, క్యాబ్ లనే ఆశ్రయిస్తారు కానీ బస్సులను కాదు.ధనికులకు, లక్షల జీతాలు పొందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయడం వలన , ఇక విద్యార్థినిలు, చిన్న చిన్న ఉద్యోగ మహిళలు, గతంలో పాసులు తీసుకుని బస్సులలోనే వెళ్ళే వారే కాబట్టి,  డ్రైవర్ల ఉపాధికి ఎలాంటి సమస్యా ఉండదు.
11. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇప్పటికే  5 లక్షల ఉచిత భీమాను కొనసాగిస్తున్నారు.
12. అర్హులైన డ్రైవర్లకు ఉచిత రేషన్ కార్డులు ఇవ్వాలి.
13. అర్హులైన డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12,000 రూ.లు చెల్లించాలి.
ఇలా చేయడం వలన అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచినట్లవుతుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నూరు శాతం విజయవంతం అవుతుంది.

No comments: