Monday, March 9, 2026

ఉగాది - వచన కవిత

google.com, pub-7353230396147314, DIRECT, f08c47fec0942fa0

అంశం :- *ఉగాది*
శీర్షిక :- *పరాభవ నామ సంవత్సరం*

మామిడి వేప కొమ్మలకు పూతలు పూయగా 
లేలేత చిగురులు కొరుకుతూ కోకిలలు కూయగా 
మంచు తెరలు చీల్చుకుంటూ భానుడు ప్రకాశించగా 
తరలి వస్తుంది ఉగాది అదిగదిగో యుగానికి ఆదిగా!

జీవిత అనుభవాలను తెలియజేసే వేడుక 
భారతీయ సంస్కృతిసాంప్రదాయాలకు ప్రతీక 
ఆనందాలకు ఐకమత్యానికి ఔన్నత్యానికి సూచిక
పచ్చని తోరణాలతో వసంత లక్ష్మికి స్వాగతమిక!

చేదు తీపి వగరు పులుపు కారం ఉప్పు 
సమ్మేళనంతో తయారైన ఆరోగ్యసూత్రాల పచ్చడి 
బోధించు జనులకు కష్ట సుఖాలు బాధలు 
లాభనష్టాలు అన్నీ జీవితంలో సహజమేనని!

భవిష్యత్తును తెలియజేసే పంచాగ శ్రవణ అలవాట్లు 
గ్రహస్థితులను వింటూ సంతోషంతో చప్పట్లు 
అయ్యవారలతో ప్రజలు జాతకరీత్యా ముచ్చట్లు 
పరిహారాలతో తీర్చుకునేరు రాబోయే గ్రహపాట్లు!

పప్పు బెల్లాలు నేతితో పసందైన వంటకం 
పిల్లలలో పెద్దలలో "పరాభవ నామ" ఉగాది సంబరం 
కొత్తబట్టలు పిండివంటలతో ఇంటిల్లిపాదికి ఆనందం 
కులమతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పర్వం!

Monday, January 26, 2026

మాట్లాడటం ఒక కళ

google.com, pub-7353230396147314, DIRECT, f08c47fec0942fa0

అంశం: గమ్యం చెదరని కడలి అలలా


శీర్షిక: *మాట్లాడటం ఒక కళ*


*నోరు మంచిదైతే ఊరంతా మంచిదే*

"మాట" రెండక్షరాల పదమే
కానీ అది శక్తి వంతమైన "తూట"
అవసరమైతే కూల్చుతుంది బొబ్బిలి "కోట"
మంచనిపిస్తే వేస్తుంది జనులకు రాచ "బాట!

మాట్లాడటం ఒక కళ
కురుస్తుంది పున్నమి నాటి వెన్నెల 
మనసులో నుండి వచ్చేది మాట
మధురంగా ఉండాలి ప్రతి చోట
లేదంటే అవుతుంది జీవితంలో వేట
గమ్యం చెదిరిన కడలి అలలా!

మాట అర్ధ వంతంగా ఉండాలి
మాటలో పరి పక్వత ఉండాలి
సుగంధ పరిమళాలు వెదజల్లాలి
జన బాహుళ్యాన్ని ఆకట్టుకోవాలి
లేదంటే అవుతుంది లక్ష్యం
గమ్యం చెదిరిన కడలి అలలా!

ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారో
దానికి పరిష్కారం కనబడాలి
సమస్య మరింత జటిలం కాకూడదు
క్రొత్త సమస్యలు సృష్టించ కూడదు
లేదంటే అవుతుంది సమస్య
గమ్యం చెదిరిన కడలి అలలా!

మాటలకు హద్దులు ఉండాలి
మంచి మాటలు పంచు కోవాలి
చెడు మాటలు దాచి పెట్టాలి
కఠిన మాటలను ఎవరితో చెప్పకూడదు
లేదంటే అవుతుంది మనుగడ ప్రశ్నార్థకం
గమ్యం చెదిరిన కడలి అలలా!

అందుకే అంటారు పెద్దలు 
పెదవి దాటితే మాట పెన్న దాటి నట్లని

మాట్లాడటం రాక పోయినా
విషయం అర్ధం కాక పోయినా
సమాధానం లేకపోయినా
మౌనంగా ఉండటం సముచితం
లేదంటే బంధువులలో
స్నేహితులలో సమాజంలో
మనఃస్పర్ధలు పెరిగి విభేదాలు తలెత్తి
ఇక మాటలే ఆగిపోవచ్చు
స్నేహబంధాలు దూరం కావచ్చు
గమ్యం చెదిరిన కడలి అలలా!