Monday, March 9, 2026

ఉగాది - వచన కవిత

google.com, pub-7353230396147314, DIRECT, f08c47fec0942fa0

అంశం :- *ఉగాది*
శీర్షిక :- *పరాభవ నామ సంవత్సరం*

మామిడి వేప కొమ్మలకు పూతలు పూయగా 
లేలేత చిగురులు కొరుకుతూ కోకిలలు కూయగా 
మంచు తెరలు చీల్చుకుంటూ భానుడు ప్రకాశించగా 
తరలి వస్తుంది ఉగాది అదిగదిగో యుగానికి ఆదిగా!

జీవిత అనుభవాలను తెలియజేసే వేడుక 
భారతీయ సంస్కృతిసాంప్రదాయాలకు ప్రతీక 
ఆనందాలకు ఐకమత్యానికి ఔన్నత్యానికి సూచిక
పచ్చని తోరణాలతో వసంత లక్ష్మికి స్వాగతమిక!

చేదు తీపి వగరు పులుపు కారం ఉప్పు 
సమ్మేళనంతో తయారైన ఆరోగ్యసూత్రాల పచ్చడి 
బోధించు జనులకు కష్ట సుఖాలు బాధలు 
లాభనష్టాలు అన్నీ జీవితంలో సహజమేనని!

భవిష్యత్తును తెలియజేసే పంచాగ శ్రవణ అలవాట్లు 
గ్రహస్థితులను వింటూ సంతోషంతో చప్పట్లు 
అయ్యవారలతో ప్రజలు జాతకరీత్యా ముచ్చట్లు 
పరిహారాలతో తీర్చుకునేరు రాబోయే గ్రహపాట్లు!

పప్పు బెల్లాలు నేతితో పసందైన వంటకం 
పిల్లలలో పెద్దలలో "పరాభవ నామ" ఉగాది సంబరం 
కొత్తబట్టలు పిండివంటలతో ఇంటిల్లిపాదికి ఆనందం 
కులమతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పర్వం!

No comments: