Wednesday, March 29, 2017

రైతులు ఆత్మ హత్యలు చేసుకోడానికి ముఖ్య కారణాలు ఏమిటి ? WHAT ARE REASONS FOR THE SUICIDE OF FARMERS?

Q: WHAT ARE  THE  REASONS  FOR  SUICIDE OF FARMERS?

WHAT ARE THE PERMANENT SOLUTIONS TO STOP FARMERS DEATHS ?(రైతులు ఆత్మ హత్యలు చేసుకోకుండా ఉండ డానికి శాశ్విత పరిష్కార మార్గాలు ఏమిటి ?):

A:" పల్లె సీమలే దేశానికి పట్టు గొమ్మలు" , "వ్యవసాయానికి వెన్నెముక రైతు" అన్నాడు మన మహాత్ముడు గాంధీజీ గారు . 'జై జవాన్ ! జై కిసాన్ !' అనే నినాదమిచ్చారు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు .'జై జవాన్ ! జై కిసాన్ ! అని నినాదమిస్తే , జై విజ్ఞ్యాన్ ' అనే నినాదమిచ్చారు మన మాజీ రాష్ట్ర పతి డా . అబ్దుల్ కలాం గారు . ఇక్కడ మనం ముఖ్యంగా గమనిచాల్సింది ఏమంటే , కిసాన్ ( రైతు ) కు మొదటి నుండి మన నాయకులు ఎంతటి గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇస్తున్నారు  అని . అందుకనే , సుమారుగా 70% ప్రజలు ఆధారపడిన మన వ్యవసాయ రంగానికి , దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత , మొదటి పంచవర్ష ప్రణాళికలలో , వ్యవసాయ రంగానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది .వ్యవసాయ రంగాన్ని , అన్న ధాతలైన రైతులను రక్షించు కోవాలనీ , ఆనాడే గుర్తించారు. వ్యవసాయం అభివృద్ధి వలననే కొన్ని కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు మెరుగుగుపడుతాయని ఆ నాటి నాయకులు  గుర్తించారు.   

అలాంటిది రాను రాను , అవకాశాలు  పుష్కలంగా  అందుబాటులో ఉండటం వలన , అవకాశ  వాదులలో  స్వార్ధం పెరిగి , అవినీతి పెరిగి , కుంభకోణాలు పెరిగి , నల్లదనం పెరిగి , నేడు రోజుకు 5 నుండి 10 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకునే స్థాయికి వ్యవసాయ పరిస్తితి , రైతుల పరిస్థితి దిగ జారింది . నిరుద్యోగ సమస్య పెరిగి పోయింది . స్వాతంత్య్రం  వచ్చి 68 సం. రాలు దాటినా , రైతు వర్గం కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే మిగిలి పోయింది .

ప్రభుత్వాలు మారినా , పార్టీలు మారినా , నాయకులు వారే కాబట్టి , (కొత్త సీసాలలో పాత  బీరే  కాబట్టి ) , అమాయక ప్రజల మెప్పుకోసమో  లేదా రాజకీయ పార్టీల ఉనికి కోసమో , ఒక ప్రభుత్వాన్ని మరో ప్రభుత్వం నిందించుకోవడం వలన, పాలక పక్షం ,  ప్రతి పక్షం ఒకరినొకరు  నిందించు కోవడం  వలన,   రైతులకు లభించే ప్రయోజనం శూన్యం . సమయం వృధా , మరిన్ని రైతుల ఆత్మ హత్యలు పెరుగుతాయి తప్పా మరేమీ జరుగదు .

రైతులు  ఆత్మ హత్యలు చేసుకోడానికి ముఖ్య  కారణాలు ఏమిటి ?

రైతులు  ఆత్మ హత్యలు చేసుకోడానికి అనేక కారణాలు ఉన్నాయి . ఇతర దేశాల నుండి  ఆహార ధాన్యాలను దిగుమతి చేసు కోవడం , ఆ కారణంగా రైతులకు గిట్టు బాటు ధరలు లేక పోవడం , వీటికి తోడు  దళారుల బెడద , ధాన్యాలను నిల్వ చేసుకునే  స్టోరేజ్ గిడ్డంగులు లేక పోవడం , సామాజిక  సమస్యలు , ఆర్ధిక సమస్యలు (పేద తనం ), ఆరోగ్య సమస్యలు , కుటుంభ సమస్యలు , మానసిక సమస్యలు , నిరుద్యోగ సమస్యలు , సున్నిత మనఃస్తత్వాలు , నక్కను చూసి వాత పెట్టుకున్నట్లు , ఇతరులను చూసి , డబ్బు లేకున్నా అప్పులు తెచ్చి  చిన్న పిల్లలను ప్రయివేటు స్కూళ్లల్లో  చదివించడం , ఇతర శుభ కార్యక్రమాలు జరిపించడం ,  ప్రభుత్వ విధానాలు , అతి వృష్టి అనా  వృష్టి  కారణాలు , వ్యవసాయ అప్పులు   దాని పైన వడ్డీలు , ఆపైన  వత్తిడులు  ఇలా అనేకంగా ఉన్నాయి .  

రుణ మాఫీ అనేది ఎన్నికల హామీ కాబట్టి , దానిని ఈ ఒక్క సారికి  నెరవేర్చాలి కాని , కంటిన్యూ చేయ కూడదు . అయితే , ఇది నిజమైన  రైతులకు  రుణ మాఫీ  చేయాలి గాని , భూములు కొని  కౌలు  కిచ్చి , పట్టణాలలో  ఏ . సి  రూములలో  కూర్చునే  వారికి  రుణ మాఫీ చేయ కూడదు . రైతులకు చెల్లించే నష్ట పరిహారం రూ . లు . 1.5 లక్షల నుండి రూ . లు . 6 లక్షలకు పెంచిన తరువాత , రోజు కు 10 నుండి 13 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారంటే , కారణాలు విశ్లేషించాలి . పూర్తి పరిహారం సొమ్ము  సకాలంలో  రైతు కుటుంబీకులకు అందక  పోవడం వలననా , లేక  నిజమైన రైతులకు అంద కుండా , భూములు కౌలుకు  ఇచ్చిన వారికి  అందుతుందా , లేక  డబ్బు కొరకే ఆత్మ హత్యలు  చేసుకుంటున్నారా , మొదలైన  విషయాలను  లోతుగా  పరిశోధించాలి .  వాటికనుగునంగా మార్పులు చేయాలి . 

వాస్తవాలు ఏమంటే , రుణ మాఫీ అనేది నిజమైన రైతులకు అందడం లేదు . నల్ల ధన కుబేరులకే అందుతుందనేది స్పష్టమవుతుంది . నల్ల కుబేరులు , పెట్టుబడి దారులు పట్టణాలలో ఉంటూ , లేదా ఇతర వ్యాపకాలలో నిమగ్నమై , నల్ల ధన డబ్బుతో  గ్రామాలలో  మరియు  పట్టణాలకు  15 కిలో మీటర్ల ఆవల  వ్యవసాయ భూములు కొని  కౌలు  కిస్తున్నారు . రిజిస్ట్రేషన్  వారి పేరు మీదనే ఉంటుంది కాబట్టి , పలుకు బడి ఉంటుంది కాబట్టి  రుణాలు  మంజూరు  చేయించుకుంటున్నారు . రుణ మాఫీ అయినప్పుడు  ఆ  బెనిఫిట్  ఈ నల్ల ధన  కుబేరులు , పెట్టుబడి దారులే పొందుతున్నారు తప్పా , నిజమైన  కౌలు  రైతులు  పొందడం లేదు . మనకు  ప్రతి   రోజూ , ప్రతి పేపరులో, కౌలు దారులే ఆత్మ హత్యలు చేసుకుంటున్నట్లు చూస్తాం . కానీ భూస్వాములు  ఆత్మ హత్యలు చేసుకున్నట్లుగా  చూడ లేదు , విన లేదు .  అందుకు కారణం ఇదే . నల్ల ధన కుబేరులు నిజమైన  వ్యవసాయ దారులు (రైతులు) కాదు . నల్ల ధన కుబేరులకు మరెన్నో లాభాలు ఉన్నాయి . వ్యవసాయ భూములను  అమ్మినా కొన్నా  ఆదాయపన్ను పూర్తిగా  మినహాయింపు ఉంది . వ్యవసాయ  ఆదాయంపై  పూర్తి ఆదాయ పన్ను మినహాయింపు ఉంది . ఇది సరియయిన విధానం కాదు .  వీరికి తక్కువ వడ్డీకే  రుణాలు లభిస్తాయి . వాటిలో కొంత మొత్తాన్ని  కౌలు దారులకు  ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తుంటారు . కౌలు దారులకు  బ్యాంకులలో  అప్పు దొరుకదు . ఆ కారణంగానే  నిజమైన చిన్న ,సన్న కారు రైతులు , కౌలు  దారులు , అతివృష్టి , అనా వృష్టి కారణంగా  పంటలు నష్టపోయి , అప్పులు తీర్చలేక , నీవు తీర్చ గలవు అనే ధైర్యం చెప్పే వారులేక , అప్పు భవిష్యత్తులో తీర్చగలననే  నమ్మకం వారికి లేక ఆత్మ హత్యలకు  పాల్పడుతున్నారు . నిజమైన చిన్న ,సన్న కారు రైతులు , కౌలు  దారులకు  అప్పులు పెరుగ డానికి  మరో  కారణం , అధిక వడ్డీలు , వారు ఫంక్షన్లకు  ఇంత ఖర్చు పెట్టారు , నేను పెట్టక పోతే ఇన్సల్ట్  అవుతానేమో  అని వాటికీ అప్పులు చేసి ఖర్చులు పెట్టడం , అలానే పక్క వాండ్లు  పిల్లలను  నెల నెలా వేలు ఖర్చు పెట్టి, బస్సులలో పంపిస్తూ , ప్రయివేటు  స్కూళ్లల్లో చదివిస్తున్నారు , నేనెందుకు  చదివించ కూడదు  అని అప్పులు చేయడం , వీటికి తోడు అతి వృష్టి , అనా వృష్టి , గిట్టు బాటు ధరలు లేక పోవడం , కూలీలా ధరలు పెరగడం  మరియు  మాములుగా  దినసరి ఖర్చులు , వైద్య ఖర్చులు , ప్రయాణ ఖర్చులు  మొదలైనవన్నీ  తడిసి మోపెడై  వీరి ఆత్మ హత్యలకు పురికొలుపుతున్నాయి .      

కేవలం వ్యవసాయ దారులకే  నష్టాలు , కష్టాలు ఉంటాయా ?

కష్టాలు , నష్టాలు  ప్రతి పనుల వారికి , వృత్తుల వారికీ ఉంటాయి . రుణ మాఫీ  చేస్తే అందరికీ చేయాలి . కంపెనీలు పెట్టి నష్ట పోయేవారున్నారు . షేర్ మార్కెట్లో నష్ట పోయి ఆత్మ హత్యలు  చేసుకునే వారున్నారు . రోజూ  కూలీ దొరక్క నష్ట పోయే వారున్నారు . దొంగ బాబాల వలన , బ్యాంకులు మూసి వేయడం వలన , ఫైనాన్స్ కంపెనీల వలన , చిట్ ఫండ్ కంపెనీల వలన, సైబర్ నేరాల వలన   అనేక మంది నష్ట పోతున్నారు . ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు . కేవలం బడా బాబులకు  లబ్ది చేకూర్చ డానికే  రైతులకు రుణ మాఫీ తీసుక రావడం సరియైనది కాదు . కేవలం ఓటు బ్యాంక్ ' కోసం  రుణ మాఫీ అని ఉపన్యాసాలు చేయడం , రుణ మాఫీ చేయడం సరైన విధానం కాదు . ఇలా  చేసే బదులు , అదే వేల  కోట్ల రుణ మాఫీ డబ్బును అందరికి ఉపయోగ పడే విధంగా , శాశ్విత పరిష్కారాలకు ఉపయోగించాలి . ఉదా : చెరువులలో పూడికలు తీయించడం , నదులను, కాలువలను అనుసంధానం చేసి , సాగు నీరు , త్రాగు నీరు అందించడం , నిరంతర విద్యుత్తు అందించడం , గిడ్డంగులు కట్టించడం , నాణ్యమైన ఎరువులు , విత్తనాలు లభింప చేయడం , రోడ్ల విస్తరణ , ఆరోగ్య సదుపాయాలు మెరుగు పరచడం , మార్కెటింగ్ , గిట్టుబాటు ధర కల్పించడం , వ్యవసాయ పనిముట్లకు , ట్రాక్టర్లకు  తక్కువ వడ్ఢేకి లేదా సబ్సిడీ రుణాలు ఇవ్వడం మొ.నవి  చేయాలి . కేంద్రం ''ఉపాధి హామీ పధకానికి " వేల కోట్లు వృధాగా  ఖర్చు పెడుతున్నారు . కేవలం గడ్డపార పట్టుకున్నా , తట్టను  ముత్తు కున్నా ఆ రోజు  కూలీ వచ్చేస్తుంది . ఒకో సారి పనికి రాక పోయినా  మస్టర్  పడుతుంది . తిలా పాపం తలా  పిడికెడు అన్నట్లు , ఇందులో అన్ని పదవులలో వారికి  ఆదాయం ఉంటుంది .   అదే " కేంద్ర ఉపాధి హామీ పధకాన్ని "  ,  " వ్యవసాయ ఉపాధి హామీ పథకంగా " మార్చాలి . అప్పుడు రైతులకు  కూలీలా ఖర్చులైన  మిగులుతాయి . దేశ సంపద వృధా కాదు . దేశ అభివృద్హి  జరుగుతుంది .  తెలంగాణలో మన ముఖ్య మంత్రి 'కె . సి . ఆర్' గారు ప్రారంభించిన పధకాలు ' జల హారం ', ' హరిత హారం ', 'మిషన్ కాక తీయ ', ' గ్రామా జ్యోతి ' , ' పవర్ గ్రిడ్ ' మొ . నవి , వ్యవ సాయ రంగానికి (రైతులకు ) శాశ్వితమైన అద్భుతమైన పధకాలు. అయితే వీటిని సకాలంలో పూర్తి  చేయాలి . రాష్ట్ర  రైతులందరికీ  వీటి ఫలాలు  అండ్ విధంగా నియంత్రణ  చర్యలు చేపట్టాలి .  "పుండు ఒక కాడ  ఉంటె,  మందు మరో చోట" అనే సామెతలా  లేదా  పుండు ఒకరికైతే  మందు మరొకరికి లా ప్రభుత్వాల విధానాలు   ఉండకూడదు . 


రైతులు ఆత్మ హత్యలు చేసుకోకుండా ఉండ డానికి శాశ్విత పరిష్కార మార్గాలు :
---------------------------------------------------------------------------------
01. మొదట ఏయే గ్రామాలలో రైతుల ఆత్మ హత్యలు జరుగుతున్నాయో గుర్తించాలి .
02. ఆ పరిధి లోని ఎం .ఎల్. ఎ . లు , ఎం . పి . లు సర్పంచులు , సామాజిక వేత్తలు , విద్యా వంతులు , రైతు సంఘ నాయకులు , అధికారులతో కమిటీలు వేసి , రైతుల ఆత్మ హత్యలకు ఖచ్చితమైన కారణాలు గుర్తించాలి .
03. ఖచ్చితమైన కారణాల ఆధారంగా సంభందిత వ్యక్తులపై చర్యలు తీసు కోవాలి . అలానే మరో రైతు ఆత్మ హత్య చేసుకోకుండా నివారణ చర్యలు తీసుకోవాలి .
04. రుణ మాఫీ , నష్ట పరిహారాలు , సబ్సిడీలు మొ నవి . శాశ్విత పరిష్కార మార్గాలు కావు . అందుకని శాశ్విత పరిష్కార మార్గాల కొరకు అన్వేషించాలి .

05. ఎక్కువమంది రైతులు బోరు బావుల వలననే , అప్పులు ఎక్కువై ఆత్మ హత్యలు చేసుకున్నారని అంటున్నారు . దీనికి పరిష్కార మార్గం రైతులచే బోరులు త్రవ్వించ కుండా , ప్రభుత్వాలే శాస్త్ర పరిజ్ఞ్యానంతో నీరు పడే చోట సబ్సిడీతో దీర్ఘ కాలిక , శాశ్విత బోరులు త్రావ్వించాలి . లేదా చెరువుల పూడిక తీయడం ద్వారా , కాలువల అనుసంధానం ద్వారా , సాగు నీరు అందించ గలగాలి

డ్యాములు , ప్రాజెక్టులు కట్టి నీటిని నిలువచేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయాలి , సాగు నీరుగా వాడు కోవాలి .
06. దీర్ఘ కాలిక, శాశ్విత రోడ్లను వేయాలి .
07. నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి .
08. వడ్డీ వ్యాపారస్తులను పూర్తిగా నిషేదించి , తక్కువ వడ్డీ తో రైతులకు రుణాలు అందించాలి . పంటలు పండ నప్పుడు , రుణాలను వడ్డీని , ఆ తరువాయి కాలంలో చెల్లించే వెసులు బాటు చేయాలి .
09. ప్రస్తుత రుణ మాఫీ , నష్ట పరిహారం నేరుగా , రైతుల , కౌలు దారుల బ్యాంక్ అకౌంట్ లోకే జమ కావాలి . అది కూడా ఇన్ టైం లోనే జరుగాలి .
10. సక్రమంగా నష్ట పరిహారం చెల్లించే పంటల భీమా పథకాలను ఏర్పాటు చేయాలి .
11. పండించిన పంటలను , ధర వచ్చి నప్పుడు అమ్ముకునే వీలుగా దీర్ఘ కాలిక , శాశ్విత గిడ్డంగులను ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి .
12. ఆహార ధాన్యాల దిగుమతులను  కట్టడి చేయాలి .  మధ్య దళారులను నిషేదించాలి .
13. గ్రామాలలో ఆరోగ్య సదుపాయాలను , సాంకేతిక సదుపాయాలను , ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకుని రావాలి .
14. వ్యవసాయ శాస్త్ర వేత్తలు , రైతులకు ప్రతి రోజు 10 గంటలు అందుబాటులో ఉండాలి .
15. నాన్య మైన ఎరువులు , విత్తనాలు సమయానికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి .
16. లాభ సాటి పంటలకు మరియు తక్కువ కాలంలో పండే పంటలకే ప్రాధాన్యత ఇప్పించాలి .
17. వ్యవ సాయపు పనులు లేని సమయాలలో , ఉపాధి సదుపాయాలూ కల్పించాలి .
18. కల్తీ మద్యాన్ని , కల్తీ కల్లును గ్రామాలలో పూర్తిగా నిషేదించాలి .
19. ఇప్పుడు రైతులకున్న అప్పులు ఏమిటో తెలుసుకుని , దానికి పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి
20. వ్యవ సాయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే మార్గాలను కనుగొనాలి .
21. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను గ్రామాలలో ఏర్పాటు చేసి యువతకు ఉపాది కల్పించాలి . రైతులకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి .
22. రాష్ట్రం లోని నిజమైన రైతులకు , కౌలు దారులకు , గీత , నేత కార్మికులందరికీ ఉచితంగా సమూహ భీమా ను కల్పించాలి . ఆరోగ్య కార్డులను జారీ చేయాలి . ఆర్ధిక భద్రతను కల్పించాలి .
23. భూ స్వాములను , ధన వంతులను గ్యాస్ సబ్సిడీ వదులు కున్నట్లుగా నే , రుణ మాఫీ , నష్ట పరిహారం , సబ్సీడీలను వదులు కునే విధంగా ఒప్పించాలి .
24. ధన వంతులను , పేదలను గుర్తించే సాఫ్టవేర్ ను అభి వృద్ధి చేసి భూ స్వాములకు , ధన వంతులకు రుణ మాఫీ , నష్ట పరిహారం , సబ్సీడీలను పూర్తిగా రద్దు చేయాలి .
25. గ్రామాలలో రైతులు ( పేద ప్రజలు ) మరే విధంగా నష్ట పోతున్నారో క్షున్నంగా పరిశోధించాలి . గ్రామాలలో ప్రయివేటు చిట్టీలను , లాటరీలను , స్కీములను , మద్యాన్ని , ధూమ పానాన్ని , ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ప్రభుత్వమే నిషేదించాలి .
26. పోరాడి సాదించు కోగలమనే మనో బలాన్ని రైతుకు కల్పించాలి .
27. రైతులకు ఆర్ధిక బరోసాను కల్పించే వ్యక్తిగత భీమాను , పంటల భీమాలను , పెంపుడు జంతువుల , పక్షుల భీమాలను కల్పించాలి .
28. ప్రధాన మంత్రి మోడీ గారు ప్రతి పాదించిన ' జన ధన్ యోజన స్కీం ' ద్వారా ప్రతి రైతుకు బ్యాంక్ అకౌంట్ ను కల్పించాలి . అలానే ప్రధాన మంత్రి మోడీ గారు ప్రతి పాదించిన ఇన్స్యురెన్స్ మరియు పెన్షన్ స్కీం లయిన ' సురక్షా బీమా యోజన ' స్కీం క్రింద రూ . లు 12/- ను మరియు ' జీవన జ్యోతి యోజన ' స్కీం క్రింద రూ . లు 330/- లను ,( మొత్తం కలిపి కేవలం రూ లు . 342/-) రాష్ట్ర ప్రభుత్వాలే నిజాయితీ గా చెల్లించి , రైతులకు ఆర్ధిక బరోసాను కల్పించాలి .
29. ఓటుబ్యాంక్ రాజ కీయ విధానాలను శాశ్వితంగా ప్రక్కన పెట్టాలి .
30. ఇన్ని చేసినను రైతులు అప్పుల పాలై , ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారంటే , ప్రభుత్వమే నిపుణులైన , కష్ట పడే తత్వం గల రైతులచే , ప్రతి గ్రామానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి , రైతులందరినీ ఒప్పించి అన్ని భూములను ఈ సంఘ రైతులచేత సాగు చేయించాలి . ఆ భూముల్లో అందరి రైతులకు 365 రోజులు పని కల్పించాలి . అలానే భూమికి తగ్గా ఆదాయం దామాషా పద్ధతిలో ప్రతి రైతుకు చెల్లించాలి . బ్యాంకు అప్పులతో , కరెంట్ . సాగు నీరు , నకిలీ విత్తనాలు , ఎరువులతో , మార్కెటింగ్ తో మరియు ఏ పంట వేయాలి అనే విషయంలో కూడా రైతు లకు సంబంధం ఉండ కూడదు . ఈ విధంగా చేయడం వలన ఉత్పత్తి పెరుగుతుంది . ఖర్చు ఆదా అవుతుంది . ప్రకృతి వైపరీత్యాలనుండి తట్టుకునే శక్తి కలుగు తుంది . రైతులకు ఆర్ధిక బరోసా కలుగుతుంది . భూములన్నీ రైతుల పేరుమీదనే ఉంటాయి . రైతులు అప్పుల పాలయ్యే అవకాశం లేదు కాబట్టి , ఆత్మ హత్యలు చేసుకోరు .
31. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఉండాలి . క్రొత్త క్రొత్త ఆలోచనలతో , కాలానుగునంగా మార్పులు చేస్తూ ఉండాలి .
32. " కేంద్ర ఉపాధి హామీ పధకాన్ని "  ,  " వ్యవసాయ ఉపాధి హామీ పథకంగా " మార్చాలి . అప్పుడు రైతులకు  కూలీలా ఖర్చులైన  మిగులుతాయి . దేశ సంపద వృధా కాదు . దేశ అభివృద్హి  జరుగుతుంది .

No comments: