వచన కవిత
శీర్షిక: చట్టాలెవరికి చుట్టాలు?
పదవి కోసం వెంటబడే
కాదు కూడదని కామా పెట్టే
రుధిరం మసిలిపోయే,మాట మూగబోయే
తట్టింది ఒక చక్కని ఉపాయం
రెచ్చగొట్టారు జనుల త్యాగాలకు
ప్రాణ త్యాగాల సమాధులపై
నిలిచారు ఒక హీరోగా!
నా రాజ్యం నా యిష్టం
వ్యవస్థలను అష్టదిగ్బంధం
అధికారులంతా భయభ్రాంతం
ప్రజలు సోమరులాయే
రాజ్యాన్ని అప్పుల పాలాయే !
అంబారీ పై స్వారీ చేస్తూ
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనో
పట్టపగలే దోచిరి సర్వ సంపదలు
పెరిగి పోయిరి సమాజంలో బినామీలు
ఉచితాలకు బానిసలయిరి పేదలు
పడుతుండిరి జనులు అరిగోసలు
అప్పుల పాలయ్యేరు రేపటి తరాలు!
వీరేమైనా,
బ్రిటీష్ పాలకుల దత్త పుత్రులా
నిజాం నవాబుల వారసులా
ప్రజా కంఠకుడు హిట్లర్ తోబుట్టువులా
రక్త పిశాచి ముస్సోళినీ ఆదర్శప్రాయులా
చార్లెస్ శోభరాజు ఆప్త మిత్రులా!
చట్టాలెవరికి చుట్టాలు ?
ఈడీ అంటే అంత చులకనా ?
సిబిఐ అంటే ఇంత హేళనా ?
కోర్టులంటే యింత అలక్షమా?
ఎందుకంత నిర్లక్ష్యం వ్యవస్థలపై?
దోపిడి సంపద చూసుకునా?
మా కంటే తెలివైన మోసగాళ్ళు లేరనా?
దోచింది కనబడుతుంది అద్దంలా
దాచింది కనబడుతుంది దేశ విదేశాల్లో
అనుభవించేది కనబడుతుంది ఆహార్యంలో
దభాయిస్తారెందుకో ముదురుల్లా!
కోర్టుల విలువైన సమయం వృధా
అమాయకులు యేళ్ళ కొలది జైళ్ళ పాలు
అభివృద్ధి పనులు ఆగిపోయే
న్యాయం ధర్మం కోసం ప్రజల ఉత్కంఠ
అయినా, నేరస్థుల వితండవాదం మహా జోరు !
నేరాలను ఒప్పుకోని నేరస్థులు
మోసాలను కప్పిపుచ్చే అవినీతిపరులు
పశ్చాత్తాపం తెలియని గ్రహవాసులు
దేశానికి, ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం!
జానెడు పొట్ట కోసం
ఆరడుగుల పాడె కోసం
కోట్ల జనాల పొట్ట గొట్టి
లక్షల కోట్లు కూడబెట్టి
చివరకు ఏమి సాధిస్తారు కలియుగంలో!
చిప్ప కూడు తింటూ
తిహార్ జైల్లో ఉంటూ
కరకు నేలపై పంటూ
జైలర్ చెప్పిన పనులు చేస్తూ
జీరోగా నిలిచి పోతారు చరిత్రలో!