Sunday, August 4, 2024

నదుల అనుసంధానం

అంశం: వర్షం


శీర్షిక: " నదుల అనుసంధానం "

వర్షానికే
మాటలు వస్తే
పరవసించి పోతుంది
భూదేవి
కడుపు నింపమనీ
మనసారా
వేడుకుంటుంది
నేల తల్లి!



"మడి" కట్టకుండా
నారు
మొలకెత్తునా?
"తడి" లేకుండా
పుడమి
పంట నిచ్చునా?
"మేఘాల" మనసు
కరుగ కుండా
వర్షం
కురుయునా?

నింగి , నేల, నీరు
వాయువు, అగ్ని
వీటిలో
ఏది అలిగినా
రైతు కంట కారేది
కన్నీటి ధారలే !

పంచభూతాల
చిత్ర విచిత్రాలను
అందులో
వర్షపు రాణిని
దర్శించ గలమేమో
కానీ
వర్ణించడం సాధ్యమా ?

స్వాతి చినుకులు
వర్షపు జల్లులు
గాలి వానలు
వడగండ్ల వానలు
చేపల వర్షాలు
కుంభ వర్షాలు
తుఫానులు , సైక్లోన్లు
ఒకటా రెండా ?

వర్షమంటే
ఎవరికుండదు హర్షం!

కానీ
అది సకాలంలో
సరియైన ప్రాంతాలలో
పడితేనేకదా!

"వాన రాకడ
ప్రాణం పోకడ
ఎవరికీ తెలియదన్నట్లు"
వాన
ఎప్పుడు పడుతుందో
ఎక్కడ పడుతుందో
ఎవరికీ తెలియదు !

సమయానుకూల
వర్షాలు
పంట పొలాల్లో
కురిపించు రైతులకు
వరాల మూటలు !

పట్టన రోడ్లల్లో
పెట్టు జనులను
ముప్పుతిప్పలు
తెప్పించు ఉద్యోగులకు
ట్రాఫిక్ ఇక్కట్లు!

ఎడారులలో
జలాలు శూన్యం
అదే
హిమాలయాలు
మంచు మయం
సముద్ర తీరాలు
జలమయం !

ఎండాకాలంలో
వర్షాలు మొండికేస్తాయి
చలికాలంలో
ముడుచుకుంటాయి
వర్షాకాలంలో
చెలరేగిపోతాయి !

ఏమిటీ
ఈ సృష్టి విచిత్రం
శాస్త్ర వేత్తలకు
విజ్ఞానానికి
అందని యదార్ధం!

"అతివృష్టి- అనావృష్టి"
రెండూనూ
జీవకోటికి హాని కరమే"!

దేశం చుట్టూరా
సప్త సముద్రాలు
శతకోటి జీవ నదులు
వాగులు, వంకలు
చెరువులు, కుంటలు,
చేద బావులు,!

కొన్ని ప్రాంతాల్లో
కుంభ వర్షాలతో
జల ఉత్పాతాలు
మరికొన్ని ప్రాంతాల్లో
గుక్కెడు
త్రాగునీరు దొరుకక
దప్పిక తీరక
గొంతెండి చావటాలు!

కొట్లాటలు
పగలు, పంచాయితీలు
సాగునీరు కొరకు
పచ్చని పైరుల కొరకు
పోరాటాలు
కోట్లల్లో
కోర్టుల్లో కేసులు!

నీరేకదా
జీవకోటికి
మూలాధారం
అదే లేకుంటే
లోకమంతా
హాహాకారం !

మానవుడు
వర్షాలను
కురుపించక పోవచ్చు
వర్షాలను
అదుపు చేయలేక పోవచ్చు
వర్షాలను
మరో ప్రాంతానికి
తరలించ లేక పోవచ్చు!

కానీ
మనిషి తలుచుకుంటే
సాధ్యం కానిదేమిటి ?

త్రాగు నీటిని
సాగు నీటిని
ఎడారు ప్రాంతాలకు
ఎత్తెన కొండల ప్రాంతాలకు
మారు మూల గ్రామాలకు
పీఠభూమి నగరాలకు
చేరవేయ గలడు
సమస్త జీవులకు
ప్రాణ దాత కాగలడు
భూ మండలాన్ని
సస్యశ్యామలం
చేయగలడు!

కులాల, మతాల,
ప్రాంతాల
భేదాభిప్రాయాలను
ప్రక్కన పెట్టి
దేశాభివృద్ధిని
దృష్టిలో పెట్టుకొని

"నదుల
అనుసంధానం" చేసే
సాహాసం చేయాలి

డ్యాములను
నిర్మించాలి
కాలువలను
త్రవ్వించాలి
పైపులైన్లను
వేయించాలి!


ప్రతి వర్షపు
చుక్కను
ఒడిసి పట్టుకోవాలి
పొదుపుగా ఒడుపుగా
వాడుకోవాలి !

పారే వాగులతో
కాలువలతో
భూగర్భ జలాలను
పెంచాలి
బీడు భూములను సహితం
పంట భూములుగా
మార్చాలి!

లేదంటే
జగతిలో
మున్ముందు
త్రాగునీరు కొరకు
సాగునీరు కొరకు
ఆకలి దప్పులకు
జలయుద్దాలు
తప్పవు!

No comments: