Tuesday, December 19, 2023

రాజకీయ మార్పుల ఆవశ్యకత/ ప్రభుత్వాల మార్పు ఆవశ్యకత

రాజకీయాలలో , ప్రభుత్వ పాలనలలో మార్పు జరుగుతూ ఉండాలి. రాజకీయాల్లో మార్పు జరుగాలని కోరుకోవడం మంచిది కూడా. ఫలాల నిచ్చే ఒక వృక్షానికి చెదలు పట్టినప్పుడు, ఫర్టిలైజర్స్ చల్లి, దానిని రక్షించక పోతే, అవి ఆ వృక్షాన్నే తినేస్తాయి. అలానే , భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలలో మార్పు అనేది లేక పోతే , ఒకే పార్టీ / పాలకులు కంటిన్యూ గా పరిపాలిస్తే, ఆ నాయకులు ఏకచత్రాధిపతులుగా, నియంతలుగా మారిపోతారు. అనేక కుంభకోనాలకు పాల్పడుతారు. అవి ప్రజలకు తెలియకుండా పోతాయి. కోట్లాదిమందికి చెందాల్సిన సంపదను, కేవలం ఒకరిద్దరు నాయకులు తినేస్తారు. ప్రజలకు మాస్క్ లాగా ఉచిత పథకాలనే ఎంగిలి మెతుకులను చల్లి, దోచుకోవడం ప్రారంభిస్తారు. నియంతృత్వ పోకడలతో పాలనను కొనసాగిస్తారు. ఒక సారి ఎన్నికై ఆ పార్టీ అధికారం చేపడితే, ఐదేండ్లు, ఆ నాయకులే పరిపాలిస్తారు. ఒక వేళ నేతలు నిజాయితీగా , సమర్ధవంతంగా పరిపాలిస్తే ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవనం కొనసాగిస్తారు. లేదంటే, ప్రజలు స్వేచ్ఛ లేకుండా, అభివృద్ధి లేకుండా ఐదేండ్లు నరకం అనుభవించాల్సిందే. నాయకులు పోటీ చేసేటప్పుడు బి.ఫామ్ తో పాటు , ఒక అఫిడవిట్ ను సబ్మిట్ చేస్తారు. దానిలో వారి పూర్తి వివరాలు, ఆస్తులు అప్పులు, కేసులు ఎన్నో అన్నీ పొందు పరిచి సంతకం చేస్తారు. ఇది ఒక ప్రమాణ పత్రం లాంటిది. ఇక గెలిచాక, ప్రతి ఒక నేత రెండు ప్రమాణాలు చేస్తారు. ఎలాగంటే, "నేను ఏ తప్పు చేయను, ఏ మోసం చేయను, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేయను, నష్టపరుచను , పారదర్శక పాలన అందిస్తాను, ఆశ్రిత పక్షపాతం లేకుండా పాలన అందిస్తాను, ప్రజలను నిష్పక్షపాతంగా, కన్నబిడ్డలుగా చూసుకుంటాను " అని , వారి వారి దైవ శాక్షిగా ప్రమాణం చేస్తారు. తీరా ఐదేండ్ల తరువాత చూస్తే అన్నీ మోసాలే, అన్నీ దోపిడీలే, వారి ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతున్నాయి. కానీ ఏ స్పీకర్ గానీ, ఏచట్టాలు గానీ, మరొకటి గానీ చర్యలు చేపట్టిన దాఖలాలు ఈ 77 యేండ్ల చరిత్రలో ఇప్పటి వరకు లేవు. కొందరు ధైర్యం చేసి కేసులు పెట్టినా, విచారణలు జరిపించినా, నిరూపించబడినవి, శిక్షలు పడినవి వ్రేళ్ళ మీద లెక్క బెట్టదగినవి మాత్రమే. మరి కొందరు నేతలు, వారి ఆస్తులను కాపాడుకోవడానికి, నేరాలను, మోసాలను కప్పిపుచ్చుకోడానికి, ఒక పార్టీ ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి, మరోరకమైన పార్టీ లోకి చేరుతున్నారు. మరల ఎన్నికలప్పుడు, ఏ కేసు లేకుండా, పరిశుద్ధ నాయకులుగా పోటీ చేస్తున్నారు. గెలుస్తున్నారు. ఎక్కడా దేనికీ ఒక నియంత్రణ అంటూ లేదు. ఎన్నికల కమీషన్ , చట్టాలు ఏమి చేయలేనప్పుడు , ప్రజలే ఓటు ద్వారా మార్పు కోరుకోవాలి. ముంచేవారెవరో , అభివృద్ధి చేసేవారెవరో తెలుసుకుని, మార్పు రావాలని కోరుకునే చదువుకున్న యువతీ యువకులు, సామాజిక బాధ్యతగల మేధావులు , ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడంలో తప్పు లేదు. అవినీతి నేతలను, ఎన్నిక కాకుండా చూడడానికి, ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి, కాళ్ళు వేళ్ళు పట్టుకుని మార్పు వచ్చే విధంగా వారిని మోటివేట్ చేయడంలో తప్పు లేదు. నష్టం లేదు. నేటికీ, మెజారిటీ ప్రజలకు, ప్రజాస్వామ్యంపై ,రాజ్యాంగ హక్కులపై, చట్టాలపై, కోర్టులపై పూర్తి అవగాహన లేక , వారికి ఆ సమయానికి ఉచితంగా ఏది లభిస్తే అదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. అందువలననే, రేపు ఆ పార్టీ పోతే, ఉచితాలు, సంక్షేమ పథకాలు లభించవేమో అని భావిస్తున్నారు. అలాంటి వారికి వివరంగా చెప్పి, మార్పు చెందే విధంగా, ప్రజలు అభివృద్ధి చెందే విధంగా, ఎవరికి చేతనైన విధంగా వారు , ఓటర్లను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో విషయం ఏమిటంటే, బావిలో నీరు ఎండినపుడే, గాజు పెంకులు బయట పడుతాయన్నట్లు, ఒక నాయకుడు ప్రజలకు మోసం చేసాడా లేదా, రాజ్యాన్ని దోచాడా లేదా అనేది, ఆ నాయకుడు లేదా ఆ పార్టీ ఓడి పోయినపుడే బయట పడుతుంది. అప్పటి వరకు పరిశుద్ధమైన నాయకులు గానే చలామని అవుతారు. చివరగా ప్రజలు గుర్తుంచు కోవల్సింది ఏమంటే, పుట్టుకతో వచ్చే బుద్ధి పుడకల్లోనే పోతుందన్నట్లు, మోసపూరితమైన నాయకులు, మరల మోసమే చేస్తారు, మరల దోచుకుంటూనే ఉంటారు. కాబట్టి అలాంటి నాయకులకు, అలాంటి పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వకూడదు. మరోసారి మరో పార్టీని ఎన్నుకోవాలి. మార్పు కోరుకోవాలి. ప్రతి ఐదేండ్ల కొకసారి రాష్ట్ర పతి పాలన విధించాలని, సేవకులైన నాయకులు దోచుకోవడం ఆగిపోవాలని, నేతలలో భయం కలుగాలని. వారిలో సత్ప్రవర్తన రావాలని, ప్రజలకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలని, అభివృద్ధి జరుగాలని కోరుకుందాం.

No comments: