Wednesday, August 27, 2025

నిశీధిలో జాబిలి P

అంశం: చిత్ర కవిత 

శీర్షిక: *నిశీధిలో జాబిలి* 


నింగి లోన చందమామ నిగనిగ లాడుతూ 

తొంగి చూస్తూ కొలను లోకి 

నిదుర లేపి కలువ భామను వెన్నెల వెలుగులో 

లేలేత బుగ్గలను ముద్దాడే!


ప్రతి మాసం శుక్ల పక్షం రోజులలో చకోరపక్షిలా 

నిత్యం ఎదురు చూస్తున్న కలువ భామ 

అరవిరిసిన ముద్దు గుమ్మలా 

సిగ్గులొలక బోస్తూ చేయి చాపే!


సిగ్గు పైటను తొలగించి చందమామ 

కలువను కనులారా తిలకించ

జనులకు కనబడకుండా చెలిని 

మాయజేసే పడవను అడ్డంగాపెట్టి!


ఆహా! ఎంతటి మనోహర దృశ్యం నిశీధిలో 

నిశ్చలమైన నదిలో జాబిలి వెన్నెలకు 

చేపలు ఎగిరి పడుతుండే చంద్రవంకలా

పడవ నిట్టూర్పుతో బానిసై కదలకుండే!

Tuesday, August 26, 2025

లౌక్యం

 శీర్షిక: *లౌక్యం!*


*పెట్టని తల్లి పెట్టకనే పాయే*
*రోజూ పెట్టే ముదునష్టపుదన్న పెట్టకపాయే*
అనేది వాడుకలో ఉన్న నానుడి
దీనిని అనేక సందర్భాలలోనూ
అన్వయించుకోవచ్చు !

ఎన్ని సార్లు సహాయం చేసినా
ఎన్ని మార్లు ఆహారాలు అందించినా
ఎన్ని సార్లు దానధర్మాలు చేసినా
ఎన్ని మార్లు మంచి సలహాలు ఇచ్చినా
ఎన్ని సార్లు శుభ కార్యాలకు వెళ్ళినా
ఎన్ని మార్లు అశుభ కార్యాలకు పోయినా!

చివరలో ఒక్కసారి చేయక పోతే
గతంలో  చేసినన్నీ వ్యర్ధమైపోతాయి
నీవు నీచంగా హీనంగా చూడబడుతావు
అంతేనా  కోపం పెరుగవచ్చు
కారాలు మీరాలు రువ్వ వచ్చు
కలతలు పెరుగవచ్చు
బంధుత్వం స్నేహం దూరం కావచ్చు!

అలా కాకుండా!
నీకు ఎప్పుడు వారితో అవసరమో
అప్పుడే సహాయం చేయడమో
ఆ సమయంలో మాంచి సలహాలు ఇవ్వడమో
అప్పుడే వారి కార్యాలకు వెళ్ళడమో చేస్తే
నీకు వేయి సహాయాలు చేసిన గౌరవం
గొప్ప తనం  ఆ ఒక్క సారికే దక్కుతాయి
కీర్తిస్తారు కూడా!
ఇది నేటి సమాజ తీరు

స్వార్ధమే కావచ్చు
కానీ *లౌక్యం* అంటే ఇదే!
నీకు సౌఖ్యం లభించేది కూడా ఇక్కడే!
 

భూ కైలాస్ దేవాలయం

అంశం: మై సెల్ఫీ


శీర్షిక: *భూ కైలాస్ దేవాలయం*

అదిగదిగో భూ కైలాస్ దేవాలయం
తాండూరు పట్టణం నడిబొడ్డున వెలసిన
అవనిలో అద్భుత కట్టడం సుందర జల మార్గం
జల మార్గం ఉంటుంది రెండు వందల మీటర్లు
అందులో గలగలా పారుతుంది స్వచ్ఛమైన నీరు

చల్ల చల్లని నీటిలో మెల్లమెల్లగా అడుగులెస్తుంటే
ఆహా! ఏదో తీయని ఆనందం మదిలో మెదులు
ఇక భక్తుల నోటిని ఆపడం ఎవరి తరం 
ఓం నమః శివాయ అంటూ కేరింతలతో
మారుమ్రోగు భూకైలాస జలమార్గం!

వెళ్ళడానికి రావడానికి వెడల్పాటి ఒకే మార్గం
పొడుగూనా మధ్యలో బిగించిరి స్టీల్ పైపులు
ఒకరికొకరు తగలరు ఎవరి దారి వారిదేనోయ్
జల మార్గాంతం వరకూ జ్యోతిర్లింగాలే!

నీటి లోతు ఉండు మోకాళ్ళ నుండి గొంతు వరకు
ఎవరి భక్తి వారిదే కొడుతారు కొబ్బరి కాయలు
ఆనందంతో కొడుతుంటారు పిల్లలు కేరింతలు 
అబ్బో! పెద్దలు మునుగుతారు తేలుతారు!

ఓహో! అది ఒక భూతల స్వర్గమే
చివరలో ఉంటుంది శివుని ఆలయం
శివుని సేవించు కొని తీర్థం పుచ్చుకొని
తిరిగి జల మార్గం గుండా రావచ్చూ
లేదా అక్కడి నుండే బయటకు వెళ్ళ వచ్చు!

వారేవా!ఎత్తెన తరువులు ఆహ్లాదకర ప్రకృతి 
చుట్టూరా అందమైన మనోహర శివపార్వతుల
సప్త ఋషుల త్రిమూర్తుల గణపతి విగ్రహాలు
ఎన్నో మరెన్నో అనుభవిస్తే గానీ తనివి తీరదు
అన్నీ వసతులు ఉచిత భోజనమూ!

Saturday, August 23, 2025

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

అంశం: విప్లవ జ్వాల

శీర్షిక: *ఎక్కడ వేసిన గొంగళి అక్కడే* 

*ప్రభువెక్కిన పల్లకి కాదు* 
*దానిని మోసిన బోయలెవ్వరు?*
అంటూ మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ                గారు అన్నట్లు


నేతలు పదవులు అధికారం
చేపట్టడంతోనే హీరోలు కారు
అందులో నాయలకు ఓటు వేసి గెలిపించిన
ఓటర్ల శ్రమ ఎంతో ఉంది!

అలాంటి ఓటర్లను ప్రజలను
లెక్క చేయకుండా అధికార దాహంతో
దోచుకుంటూ మోసం చేస్తూ
భూ కబ్జాలు చేస్తూ అవినీతి పాలనతో
ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ!

ఉచితాల మాయలో దింపినా
త్రాగుడుకు బానిసలును చేసినా
చిత్రసీమలో లాగా వారసులను
పోటీలో దింపుతూ దోచకుంటున్నా
దేశ రాష్ట్రాల సంపద ఏవో కొన్ని కుటుంబాల
కబంధ హస్తాలలో బంధించబడినా!

ఏదో ఒక రోజు విప్లవ జ్వాలలా
స్వార్ధ అవినీతి ప్రభుత్వాలను 
ప్రజలు గద్దెలు దింపుతారు!

*పిల్లి యే కదా అని దానిని* 
*నాలుగు గోడల మధ్య బంధిస్తే*
*అది పులిగా మారి రక్కుతుంది*!
 
ఎన్నో దశాబ్దాలు గడిచినా 
నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నా
ప్రజల సమస్యలు పరిష్కారం
కాక పోవడమే కాదు పై పెచ్చు పెరుగు తుండే! 

ప్రజలు కలిసి కట్టుగా ఉండి 
విప్లవ జ్వాలలు రగిలిస్తే
అది అగ్ని పర్వతమైనా బద్దలవక తప్పదు
అగ్ని జ్వాలలు ఎగిసి పడక తప్పవు!

హృదయాలను విశాలం చేసుకుంటేP

*నేటి అంశం -చిత్ర కవిత*


శీర్షిక: *హృదయాలను విశాలం చేసుకుంటే*

పెళ్ళంటే నూరేళ్ళ పంట
మనుసులు కలువకపోతే 
ఇక జీవితాంతం పెంట!

వివాహం చేసుకునే ముందే
అర్ధం చేసుకోవాలి ఒకరినొకరు
మోహాన్ని ప్రేమని తలువక 
అందం చందం ఆహార్యం 
భాష సంస్కృతి సంప్రదాయాలు 
సరే అనుకుంటేనే ఒక నిర్ణయం తీసుకోవాలి! 

జాతకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా
మనస్థత్వాలు భావాలు ఆలోచనలు
కలిసాకనే వివాహ వేడుకలు జరిపించాలి
ఇక ఆ తరువాత కష్టమో నష్టమో
కలిసి నూరేళ్ళు అన్యోన్యంగా జీవించాలి!

ఒక చేతికి ఉన్న ఐదు వ్రేళ్ళే
సమానంగా ఉండవనేది నగ్న సత్యం!

ఒకే కడుపులో జన్మించిన ముగ్గురు పిల్లల
అందాలకు ఆలోచనలకు పోలికే ఉండదు 
అలాంటిది కొత్త వ్యక్తులు అనుకూలంగా
ఉంటారనుకోవడం అత్యాశే అవుతుంది!
పెళ్ళిబంధం అన్నాక సమస్యలు సహజం
అవి తల్లిదండ్రులతోనే సమస్యలు అధికం!

హృదయాలను విశాలం చేసుకుంటే
ఎలాంటి సమస్యలైనా చిన్నవైపోతాయి
ఒకరినొకరు విశ్వసిస్తూ అర్ధం చేసుకుంటూ
వారికివారే సర్దుబాటు చేసుకుంటూ
సంయమనం పాటిస్తే ఆ జీవితం స్వర్గ ధామం
అది వేలాది కుటుంబాలకు ఆదర్శం!

లేదంటే పెళ్ళైన ఆరు నెలలకే
విలువైన జీవితాన్ని కాలన్ని ధనాన్ని 
వృధా చేసుకుంటూ 
పరువు ప్రతిష్టలను మంటగలుపుతూ
ఇరు కుటుంబాల నట్టేట ముంచుతూ 
రాజ్యాంగ వయవస్థలకు భారమవుతూ 
విడాకుల కొరకు కోర్టుల చుట్టూ తిరగడం 
అనివార్యం కావచ్చు!

పంతాలు పట్టింపులతో విడాకులు వచ్చినా 
ఆ తరువాత ఇరువురూ చెడిపోయిన 
భాగస్వాములతోనే సంసారాలు చేయాలన్న 
పచ్చి నిజాన్ని విజ్ఞులు మరిచి పోవద్దు!
 

మెగాస్టార్

అంశం: చిరంజీవి 


శీర్శిక: *మెగాస్టార్*

మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు
నాటి మేటి నటులలో గొప్ప నటుడు
చలనచిత్ర రంగంలో ప్రవేశించి నటనలో
నవనవోన్మేషంతో విభిన్న వేషధారణలతో
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రేక్ డాన్స్ లతో
కొత్త ఒరవడి సృష్టించిన మహానటుడు!

పాత్ర ఏదైనా అందులో లీనమయ్యే స్వభావం
అతడికి దేవుడిచ్చిన వరం
డాక్టర్ గానూ లాయర్ గానూ
రాజకీయ నాయకుడుగానూ నృత్యం లోనూ
మరెన్నో పాత్రలలోనటించి సత్తాచూపిన
బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి

మెగాస్టార్ నటుడే కాదు
గొప్ప మహోన్నత మానవతావాది
బ్లడ్ బ్యాంక్ ను స్థాపించి ఎంతోమందికి
ఉచితంగా రుధిరాన్ని అందిస్తున్న ప్రాణదాత

చిరంజీవి నటుడు మానవతా వాదే కాదు
నిజ జీవితంలో రాజకీయ నాయకుడు
దానకర్ణుడు సంఘసంస్కర్త సామాజిక వేత్త
వారసత్వ నటుల సృష్టి కర్త ఆదర్శమూర్తి

వినూత్నమైన గొప్ప నటనలకు గాను
అనేక నంది అవార్డులు రివార్డులు
పద్మభూషణ్ పద్మ విభూషణ్  వంటి
ఎన్నో పురస్కారాలు అందుకున్న
వినూత్నమైన హీరో మెగాస్టార్ చిరంజీవి
 

Thursday, August 21, 2025

వృద్ధాప్య దశ

అంశం: చిత్ర కవిత (వృద్ధాప్య దశ)


శీర్షిక: *ఎండిన మ్రానులా*

*సముద్రాన్నైనా ఈదవచ్చు నేమో గానీ
సంసారాన్ని ఈదడం కష్టం*  అన్నట్లు

ఈ జీవన సాగరంలో
ఎన్నో ఆటుపోట్లను మరెన్నో ఇక్కట్లు 
సముద్రంలోని సుడిగుండాల వలెను
ఎన్నెన్నో అవమానాలు మరెన్నో అనుభవాలు 

బాధలు సంతోషాలు దుఃఖాలు ఆనందాలు
కష్టాలు సుఖాలు అచ్చట్లు ముచ్చట్లు ఎన్నెన్నో

గెలుపులు ఓటమిలు నిందలు అపనిందలు 
దెబ్బలు ఎదురు దెబ్బలు
ఆరోగ్యాలు అనారోగ్యాలు  అన్నీ గుండెలోనే 

సంపద పోగు చేస్తే నిరుపయోగమని
పైసా పైసా కూడబెట్టి పిల్లల చదివిస్తే
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలై
మనసుకు నచ్చిన వారిని మనువాడి
రెక్కలొచ్చిన పక్షుల్లా తెగిన గాలిపటాల్లా
దారిన వదిలేసి దూరం వెడలి పోయిరి

అంతిమ దశలో అర్ధమాయే
పిల్లలకు కష్ట సుఖాలు తెలుపాలని
ఆర్ధిక వ్యవహారాలు వివరించాలని
పిల్లలను డబ్బు డాబుసరితో కాదు
మంచి మనసుతో ప్రేమతో పెంచాలని

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు 
ఇప్పుడు విచారిస్తే ఏమి ప్రయోజనం
గడిచిన కాలం తిరిగి రాదు
సాధించాలని కోరిక  మనసున్నా
వయసుడిగిన శరీరం సహకరించదు

జీవిత కాలం తోడుంటానని బాస చేసిన
భాగస్వామి  స్వార్డంతో  వెడలి పోగా
*ఎండిన మ్రాను* వోలే మొండి బ్రతుకాయే
ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి?
ఎక్కడికి వెళ్ళాలి? ఈ చేతి కర్ర సాయంతో
ఇంకెంత కాలం ఈదాలి? ఈ జీవన సాగరంలో
ఆ పడమటి సంధ్యాతీరం కోసం వేచి చూస్తూ!

మహా పతివ్రత మండోదరి

శీర్షిక: మహా పతివ్రత మండోదరి


అందాల రాశి
అతిలోక సుందరి
అపురూప సౌందర్యవతి
మమతానురాగాలకు మారు పేరు
మృదుభాషిణి రావణ సతి *మండోదరి*!

విశ్వకర్మ కుమారుడు రాక్షసరాజు మయుడు
దేవకన్య హేమల గారాల పుత్రిక
సకల వేద పండితుడైన రావణుడి భార్య
పంచకన్యలలో మండోదరి ఒకరు!

మహా సాత్వికీ సద్గుణాల వాణి
పరమపవిత్ర పతివ్రతా శిరోమణి
లంకా రాజ్యానికి పట్టపు రాణి
మహిళా లోకానికి ఆదర్శ వనిత!

రావణుడు సామవేద దాన
దండోపాయాలతో మోహించి పెళ్ళి చేసుకోగా
తల్లి దండ్రుల క్షేమ కాంక్షతో
రావణుడిని వివాహమాడిన గుణవతి!

భర్త క్షేమం కోరి ఇంద్రలోకం వెళ్ళి
విభీషణుడి సహాయంతో అమృతభాండం
రావణుడి పొత్తికడుపులో పెట్టి
ఆయుష్షును పెంచిన ప్రతివ్రత మండోదరి!
 

Tuesday, August 19, 2025

దేవుడే వరమిస్తే

అంశం: *దేవుడే వరమిస్తె ఏం కోరుకుంటారు*


శీర్షిక: విశ్వ శాంతిని కోరుకుంటాను

ఈ సృష్టియే విచిత్రం
అందులో మానవ జీవితం నిమిత్త మాత్రం
దేవుడు వరమిస్తాననడం మరో విచిత్రం
మానవుడికి ఇంకేమి కావాలి సంతోషం!

ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో
మానవ జీవితం ఉత్కృష్టమైనది
మనిషి జీవితమే దేవుడిచ్చిన ఒక వరం
అందుకు చెప్పాలి నిత్యం ప్రణామం!

దేవుడే వచ్చి వరమిస్తానంటే
ఊరుకుంటానా ఏమి?
విశ్వ శాంతిని కోరుకుంటాను
ప్రకృతి  పంచభూతాలు సమన్వయంతో
ప్రశాంతంగా ఉండాలనీ కోరుకుంటాను
ప్రజలందరికీ సద్బుద్ధిని ప్రసాదించమని
అందరూ ఆనందంగా సంతోషంగా
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
జీవించాలని కోరుకుంటాను
అందరిలో నేను ఒకరిని కావాలని
కోరుకుంటాను!
 

Monday, August 18, 2025

ప్రతిస్పందన

అంశం: ప్రతిస్పందన


శీర్శిక: *పుండొక చోట ఉంటే మందొకచోట*

మత్తు పానీయాలు సారా బ్రాండీ బీరు విస్కీ
వంటివి శీతల పానీయాలు మత్తు పదార్ధాలు గంజాయి జర్దా కొకిన్ సిగరెట్ల వంటివి
రాష్ట్రంలో చాక్లెట్లు బిస్కెట్లు లాగా!

మొదట ఆశలు రేకెత్తిస్తాయి ధ్యాసలు పెంచుతాయి
కోరికలు పుట్టిస్తాయి తియ్యగా ఆకర్షిస్తాయి
జోలపాటలు పాడుతాయి జోకొడుతాయి
మత్తు లోకి దించుతాయి మాయజేస్తాయి!

సరదాగా ప్రారంభమైన మత్తు పానీయాలు
మనిషికి అలవాటుగా మారి పోతాయి
ఆ అలవాటే మరికొన్నాళ్ళకు మెల్లమెల్లగా
గమ్మత్తు గా తనను బానిసను చేస్తాయి!

అవి పోకిరిగాను సంఘ విద్రోహ శక్తిగాను
సమాజానికి గుదిబండగా మార్చుతాయి
మత్తు పానీయాలు మత్తు పదార్థాలు
స్వయం కృపారాధంతో  సర్వం నాశనం చేసి
మనిషిని *చిత్తు* చిత్తు చేస్తాయి!

*పుండొక చోట ఉంటే మందొక చోట* పెడుతే
ప్రయోజనం శూన్యం
అన్నింటికీ మూలం అవినీతి స్వార్ధ నేతలే
నేతలకు మడుగులొత్తే బ్యూరో క్రాట్స్
పోలీసు వ్యవస్థలు
చట్టాలు ధనికుల చుట్టాలు
తోటలో తులసి మొక్కలను పెంచుతే
తులసి మొక్కలు
గంజాయి మొక్కలను పెంచితే
గంజాయి మొక్కలే పెరుగుతాయి
 

Saturday, August 16, 2025

గజల్

గజల్ 

విదేశీ వస్తువుల వాడొద్దు /భారత ప్రగతినీ

మరువద్దు
స్వదేశీ వస్తువుల వీడొద్దు /భారత ఉన్నతినీ మరువద్దు
***
మనజాతీమతాలు వేరైన  / భారతీయులంతా ఒకటేను
మన దేశ ఉత్పత్తి మనదోయి /నాయకుల వినతినీ మరువద్దు
***
పరదేశ వస్తువుల వాడకము/ నిశ్చయము జనులు ఆపాలోయి
స్వదేశీ సరుకుల నెప్పుడునూ /జాతి ఉత్పత్తినీ మరువద్దు
***
టారిఫ్ లు పెంచినా /భీతిల్ల జేసినా/ బెదురకూడదోయీ
ఎగుమతులు తగ్గినా /దిగుమతులు పెరిగినా/ నీతినీ  మరువొద్దు
***
కల్తియే లేనట్టి చౌకైన వస్తువులు /మనవేను కృష్ణా!
స్వయం సమృద్ధిని  సాధించు /భారత జాతినీ మరువొద్దు 

Tuesday, August 12, 2025

గరుడ పంచమి

 సాహితీ వీణా కుసుమాలు:

తేది: 20.08.2023

అంశం: ఐచ్ఛికం 

శీర్షిక: *నాగుల పంచమి*

ప్రక్రియ: వచన కవిత 


పవిత్ర 'శ్రావణ మాస' శుక్ల పంచమిని

జనులు కొలిచెదరు గరుడపంచమని

భవిష్యత్ పురాణంలో నుండెనొక గాథయే

అది చదివినను , విన్నను గొప్ప పుణ్యమే!


కశ్యప రాజుకు నుండిరి నిరువురు భార్యలు

ఆ ఇరువురు మహారాణులే కద్రువ వినతలు

సంతానం లేక గడిచే నెన్నో కాలములు

కశ్యపుడు పుత్రకామేష్ఠి యాగములు

చేయ, కలిగిరి సంతానం కద్రువకు నాగులు

మహారాణి వినతకు కలిగే గరుడులు!


కద్రువ, ధవళ అశ్వ మోసపూరిత పందెమున

చేసే  వినితను , కుద్రువకు దాసి గాను

గరుడు నదియు భరించ లేక విముక్తి కోరే

అంతట పెద్దతల్లి , నాగుళ్ళు షరతు విధించే

దేవలోకం నుండి అమృతమును కొనిరమ్మనే!


గరుడు సమ్మతించి , స్వర్గం పయణించే

దేవలోకము నుండి అమృతం తెచ్చే

తల్లికి గరుడు దాస్య విముక్తిని గావించే

అట్టి శ్రావణ శుక్లపంచమిరోజే ,గరుడపంచమి!


గరుడ పంచమి రోజుయే , నాగుల పంచమి

ఈ రోజు వనితలు స్నాన మాచరించి

పాలు గ్రుడ్డు నైవేధ్యాలు , ధూప దీపాలతో

పుట్టలకు , నైవేధ్యాలు జరిపించి మ్రొక్కేరు

నాగ దోషాలు బాపమని,సంతానం కల్గాలని

ముత్తైదవుగా నిలుపమని, శుభాలు కల్గాలని!


ఓం తాక్ష్యాయ నమః! 

ఓం గరుడాయ నమః

ఓం వైన తేజాయ నమః! 

ఓం ఖగాయ నమః

ఓం ఖగేశ్వరాయ నమః!


అని పఠించిన చాలు తొలుగు నాగ దోషాలు

ప్రజలకు కలుగు నెన్నో శుభాలు

జనులెల్లరు పొందేరు సుఖాలు!

Monday, August 11, 2025

రామప్ప శిల్ప కళా నైపుణ్యం

అంశం: పదాల కవిత

శీర్షిక: రామప్ప శిల్ప కళా నైపుణ్యం 

*అరుణ కాంతులు* సోక రామప్ప గుడిలో
దేదీప్యమానం వెలుగులు గర్భగుడిలో
తళతళా మెరుపులు దేవతా మూర్తులలో
అది కాకతీయుల శిల్ప కళానైపుణ్యానికి ప్రతీక!

గుడి ఏ స్తంభం మీటినా  ఏ రాయి తాకినా
వినిపించు సప్తస్వరాలు *హృదయగానం* లా
రుద్రుడు నిర్మించే మహేశ్వర దేవాలయం
కీర్తి పొందే దేశ దేశాల నందున!

చుట్టూరా పూల మొక్కలు ఎత్తెన తరువులు
పచ్చిక బయళ్ళు ఆ ప్రక్ననే రామప్ప చెరువు
అచటి *హరిత శోభ* చూడవలనే గానీ
వర్ణించ నెవరి తరం!

ఇసుకలో కట్టడం నీటిలో తేలే ఇటుకలు
నేటికీ వెలిసి పోనీ రంగులు ఆశ్చర్యకరం
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి
*నయన మనోహరం* అందరూ చూడదగిన ప్రదేశం!
 


అంశం: చిత్ర కవిత

శీర్షిక: కొత్త ఒక వింత పాత ఒక రోత

ఒక రోజు ఎర్ర డబ్బ మెరిసేది తళతళ
దాని నిండ మెండుగా ఉత్తరాలు గలగల
రోజంతా ఎండలకు మాడేది మలమల
నేడు పోతుంది ఎర్ర డబ్బా వెల వెల

బంధు మిత్రుల బాగోగులు తెలుసుకొనను
కొడుకులు బిడ్డల మంచిచెడుల తెలుసుకొనను
నిరుద్యోగులు ఉద్యోగాల వేట కొరకు
రాఖీలు పంపించను శుభాకాంక్షలు తెలుపను
ఆలస్యమైనా శుభాశుభాలు తెలుసుకొనను
అవి ఎంతో చక్కగా ఉపయోగ పడేవి

ఎవరు ఉత్తరాలు డబ్బలో వేసినా
ఎవరు లిపాపాలు పోస్ట్ బాక్స్ లో వేసినా
ఎండలకు ఎండిపోనీయ కుండా
వానలకు తడువనీయకుండా
చలికి వణకనీయకుండా
అమ్మ వలె పొత్తి కడుపులో పెట్టుకొని
రోజంతా  భద్రంగా కాపాడుతుంది

చరవాణిలు ఈ మేయిల్స్ రావడంతో
ఎర్ర పెట్టెల అవసరాలు తగ్గిపోయాయి
పోస్ట్ బాక్స్ ల రంగులు వెలిసిపోతున్నాయి
కొన్ని చోట్ల తుప్పు బడుతున్నాయి

నేడు సాంకేతిక విజ్ఞానం పెరగడంతో
దిక్కు మొక్కు లేక కొక్కు పట్టిన కోడిలా ఉంది
సృష్టిలో ఏదైనా కొత్త ఒక వింత పాత ఒక రోత 

చిత్త శుద్ధి

అంశం:చిత్త శుద్ది


శీర్శిక: *చిత్త శుద్ధి లేని శివపూజ లేల*

*చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద*
అన్నట్లు
శరీరాన్ని శివుడి వద్ద నిలిపి
నా కష్టాలను బాపమని కోరుతూ
మనసును బయట చెప్పులు ఎవరైనా
జాతీయం చేస్తున్నారేమోనని ఆలోచిస్తే
అది భక్తి అని పించుకోదు

ఎన్ని కలలు కంటే నేమి
ఎన్ని ఆశలు ఉంటే నేమి
ఎన్ని ప్లానులు వేస్తే నేమి
చిత్త శుద్ధి అనేది లేకుంటే!

అంతా వ్యర్ధమే కదా వెచ్చించిన డబ్బు 
విలువైన సమయం వృధా
వెలకట్టలేని ఆసక్తి మరల ఎప్పుడో
రావచ్చు రాక పోవచ్చు!

*చిత్త శుద్ధి లేని శివ పూజ లేల* అన్నట్లు
ఏదైనా సాధించాలంటే
మనసు నిర్మలంగా పరిశుద్ధంగా ఉండాలి
ఎలాంటి వ్యతిరేక భావనలు ఆలోచనలు
దరిదాపుల్లోకి రాకూడదు
ద్వంధ వైఖరి ఉండ కూడదు!

మనసు బుద్ధి ఏకాగ్రతతో ఉండాలి
అప్పుడే కోరుకున్న కోరికలు ఫలిస్తాయి
కనిన కలలు సాకారం అవుతాయి
జీవితంలో విజయం సాధిస్తారు!

మనసు బుద్ధి ఏకాగ్రత సాధించాలన్నా
మనసు లోని వ్యతిరేక ఆలోచనలు పోవాలన్నా
సానుకూల ఆలోచనలు కలుగాలన్నా
యోగా మెడిటేషన్ చేయడం ముఖ్యం!