Thursday, August 21, 2025

వృద్ధాప్య దశ

అంశం: చిత్ర కవిత (వృద్ధాప్య దశ)


శీర్షిక: *ఎండిన మ్రానులా*

*సముద్రాన్నైనా ఈదవచ్చు నేమో గానీ
సంసారాన్ని ఈదడం కష్టం*  అన్నట్లు

ఈ జీవన సాగరంలో
ఎన్నో ఆటుపోట్లను మరెన్నో ఇక్కట్లు 
సముద్రంలోని సుడిగుండాల వలెను
ఎన్నెన్నో అవమానాలు మరెన్నో అనుభవాలు 

బాధలు సంతోషాలు దుఃఖాలు ఆనందాలు
కష్టాలు సుఖాలు అచ్చట్లు ముచ్చట్లు ఎన్నెన్నో

గెలుపులు ఓటమిలు నిందలు అపనిందలు 
దెబ్బలు ఎదురు దెబ్బలు
ఆరోగ్యాలు అనారోగ్యాలు  అన్నీ గుండెలోనే 

సంపద పోగు చేస్తే నిరుపయోగమని
పైసా పైసా కూడబెట్టి పిల్లల చదివిస్తే
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలై
మనసుకు నచ్చిన వారిని మనువాడి
రెక్కలొచ్చిన పక్షుల్లా తెగిన గాలిపటాల్లా
దారిన వదిలేసి దూరం వెడలి పోయిరి

అంతిమ దశలో అర్ధమాయే
పిల్లలకు కష్ట సుఖాలు తెలుపాలని
ఆర్ధిక వ్యవహారాలు వివరించాలని
పిల్లలను డబ్బు డాబుసరితో కాదు
మంచి మనసుతో ప్రేమతో పెంచాలని

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు 
ఇప్పుడు విచారిస్తే ఏమి ప్రయోజనం
గడిచిన కాలం తిరిగి రాదు
సాధించాలని కోరిక  మనసున్నా
వయసుడిగిన శరీరం సహకరించదు

జీవిత కాలం తోడుంటానని బాస చేసిన
భాగస్వామి  స్వార్డంతో  వెడలి పోగా
*ఎండిన మ్రాను* వోలే మొండి బ్రతుకాయే
ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి?
ఎక్కడికి వెళ్ళాలి? ఈ చేతి కర్ర సాయంతో
ఇంకెంత కాలం ఈదాలి? ఈ జీవన సాగరంలో
ఆ పడమటి సంధ్యాతీరం కోసం వేచి చూస్తూ!

No comments: