Monday, December 18, 2023

తలసరి అప్పు అప్పు అంటే ఏమిటి? What is mean by per capita Debt?

ఈ మధ్య కాలంలో అతిగా రాష్ట్రాల అప్పుల మీద, ఆదాయాల మీద మరియు తలసరి అప్పుల మీద చర్చ జరుగుతుంది. అలానే ప్రతి రాజకీయ, ప్రభుత్వాల విషయాలు ఈ మధ్యనే బహిరంగంగానే ప్రజలకు తెలుస్తున్నాయి. ఇది మంచి శుభ పరిణామం . కొందరు రాష్ట్రంలో అప్పులు పెరిగితే , ఒక్కొక్కరి పైన ఇంత భారం పడుతుందని, దానికి మరి కొందరు, ఒక్కొక్కరిపై అంత భారం పడితే ఏంది, మంత్రులు ఏమైనా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని మిత్తి అడుగు తున్నారా, అసలడుగుతున్నారా అని అమాయకంగా మాట్లాడుతుంటారు . నిజమే అలా ఎవరూ ఇంటికొచ్చి ఏమి అడుగరు. డిమాండ్ చేయరు. ముందుగా "తలసరి అప్పు" అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఒక రాష్ట్రానికి 5లక్షల కోట్ల అప్పు ఉంది అని అనుకుందాం. ఇక ఆ రాష్ట్రంలో సుమారుగా 3కోట్ల50లక్షల జనాభా ఉందనుకుందాం. అప్పుడు ఆ 5 లక్షల కోట్ల అప్పును, 3 కోట్ల 50 లక్షల జనాభాతో భాగిస్తే, ఒక్కొక్కరిపై అప్పు 1,42.857 అని తెలుస్తుంది. దీనినే "తలసరి అప్పు" అని , ఒక్కొక్కరి పై పడే భారం అని అంటారు. వ్యక్తుల లాగానే ప్రభుత్వాలు అప్పు చేయడం అనేది సహజం. అయితే ఆ అప్పు రాష్ట్ర అభివృద్ధికి చేస్తే సమస్య ఏమిలేదు. అప్పు ఎంత చేయాలి , దానిని ఎలా తీర్చగలం, దాని వలన ఎంత కాలానికి ప్రయోజనం చేకూరుతుంది, అప్పులు భరించే స్తోమత రాష్ట్రానికి , దేశానికి ఉందా అనేది పరిశీలించి అప్పులు చేస్తే తప్పు లేదు. ఇప్పుడు అప్పుగా కనబడినా, భవిష్యత్తులో దాని ఫలాలు, మనం , మన రేపటి తరాల వారు అనుభవిస్తారు. కానీ అదే అప్పును, స్వార్థంతో కొందరి కుటుంబాల తరాలకో, రేపటి అధికారం కొరకో, దోచుకుంటూ పోతే, నేడు ప్రజలు, రేపటి వారి తరాలు మరింత పేదరికం లోకి దిగజారి పోతారు, సోమరులుగా, బానిసలుగా మారిపోతారు. ఇక ఏ ప్రభుత్వమైనా ఆ అప్పును, దానిపై వడ్డీని ఎలా రికవర్ చేస్తారంటే; 01. ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతారు 02. ట్రాఫిక్ చలాన్ల రేట్లు పెంచుతారు 03. ప్రజలకు చెల్లించాల్సిన సంక్షేమ పథకాలను ఆపేస్తారు. 04. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపేస్తారు 05. ప్రజలకు సంబంధించిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలు ఆపేస్తారు 06. కార్య కర్తలకు మినహా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు నిలిపేస్తారు 07. ప్రభుత్వ ఖాలీలను/ఉద్యోగాలను భర్తీ చేయరు 08. ప్రభుత్వ బడి పిల్లలకు భోజన సదుపాయాలు, పుస్తకాలు, బట్టలు సప్లై చేయరు. 09. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను నిలిపేస్తారు. 10. రోడ్లను, మోరీలను, పారిశుధ్యాన్ని పట్టించుకోవడం శుద్ధ దండుగ అని అనుకుంటారు. 11. నిజాయితీగా పన్నులు కట్టే వారు అసహనానికి గురవుతారు 12. ప్రభుత్వ భూములను అనుంగులైన వారికి, తక్కువ ధరలకు అమ్ముతారు. 13. అప్పటికీ అప్పు, వడ్డీలు తీరక పోతే, రాబోయే ప్రభుత్వం నెత్తిన వేస్తారు. గత చరిత్రను చూస్తే ఇది ప్రస్తుతం జరిగేది. అంతేకానీ ఏ మంత్రి ఇంటికి వచ్చి అసలు గానీ మిత్తి గానీ అడుగరు.

No comments: