Monday, July 22, 2024

రాజకీయులిపుడు రాటుదేలె

 75 యేండ్ల ప్రజాస్వామ్యం


ఆ.వె:


86.

యువత దేశమునకు భవితయే యెపుడును 

జనత తలుచుకుంటె జగతి మారు 

వేచి చూస్తు నుండె వేయనికను వేటు

రాజ కీయు లిపుడు రాటుదేలె!


87.

నోట్ల కెపుడు నీవు వోట్లను వేయొద్దు 

ఓట్ల కిచ్చు నోట్లు చేటు గనుక 

ఐదు వేలు చేయు నైదేండ్లు బానిస 

రాజ కీయు లిపుడు రాటుదేలె!


88.

సార పోసి మిమ్ము సాగదీయును నేత 

చుక్క కెపుడు మీరు చిక్క వద్దు 

పిట్ట కథల కెపుడు బెనక రాదు జనము

రాజ కీయు లిపుడు రాటుదేలె!


89.

కోడినిస్త మనియు కొలువు లిస్తామని

భూమి నిస్త మనుచు ధీమ నిచ్చు

బుజ్జ గించ వచ్చు మజ్జిగ పోసియు

రాజ కీయు లిపుడు రాటుదేలె!


80.

ఓటు విలువ తెలిసి నోటమి చూడకు

భావి తరము వారి భవిత నెరిగి 

మంచి నాయకుడిని యెంచియు గెలిపించు

రాజ కీయు లిపుడు రాటుదేలె!

తెలంగాణా బతుకమ్మ పాట

 "తెలంగాణా బతుకమ్మ పాట"

**************************

బతుకూ బతుకూల బొమ్మ , బంగారు  ముద్దుల గుమ్మ 

మా  భూములన్నీ దోచే నమ్మో , ఈ పేట లోన                                        "బతుకూ "

మొండీ ధైర్యంతో మోహిని, కారులో పోతుంటే

నేతలూ  చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                    "బతుకూ " 

పరుగో పరుగున పారణి , సమ్మెలకూ పోతుంటే

పోలీసులు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                "బతుకూ " 

జోరుగా రాగిణి , హరిణీ  క్షేత్రం పొతుంటే

మీడియా చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                "బతుకూ " 

కట్టూ కథలతో కాలిని , కోర్టూ కు పోతుంటే 

లాయర్లు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                 


బతుకూ బతుకూల బొమ్మ , బంగారు  ముద్దుల గుమ్మ

మా భూములన్ని దోచెనమ్మో, ఈ పేటలోన "2"


మా ఊరు /MY VILLAGE

శీర్షిక: మా ఊరు 

సీ.ప:1

పచ్చని పొలాలు పారేటి వాగులు

ఎత్తైన వృక్షాలు యెటను జూడ

మట్టి గోడలయిండ్లు మానవీయ జనులు

కష్టించు కార్మిక కర్షకులును

కలివిడి మనుషులు కమనీయ మమతలు

పంటలు పండించు గుంట భూమి 

పండుగ లొచ్చిన పరవసమొందేరు

కష్టాలు వచ్చిన కలిసి యుంద్రు!!


ఆ.వె:

సూరిపెల్లి మాది చురుకైన యువకులు 

ఊరు చిన్న దైన జోరు కల్లు 

చుట్టు చెరువులుండు చెట్టుపుట్టలు నుండు

ఓరుగల్లు జిల్ల పోరునెల్ల!!


సీ.ప:2

పల్లెల భూముల్లొ పండించు రైతులు

పాడిపంటలు చాల పల్లెలందు

కాయగూరలుతాజ కందాయ ఫలములు 

పుష్టిగ పండును పురముబంప 

శ్రమకోర్చు యువకులు శక్తినింపుకొనియు

సిద్ధము నుందురు సేద్యమునకు 

పల్లెసీమలుదేశ పట్టుగొమ్మలు నేడు 

సాధించ వలయును జగతి నంత!!


ఆ.వె:

ప్రకృతి తాండ వించు పల్లెసీమల నందు

స్వచ్ఛ గాలి యుండు జలము నిండు 

అలసట మరిచేరు హాయిగా నుండేరు 

పేద రికములైన పెద్ద మనసు!!

రోజులు మారుతున్నట్లే - రాజులు మారాలి

 శీర్షిక: రోజులు మారుతున్నట్లే - రాజులు మారాలి


సూర్యుడు ఉదయిస్తే

జగతి ప్రకాశిస్తుంది

జగతి ప్రకాశిస్తే

ప్రకృతి ప్రవేశిస్తుంది

భానుడిలో 

స్వార్థం కనబడదు 

అవినీతి వినబడదు

ఆశ్రిత పక్షపాతం చూడలేదు 

సూర్యుడు

అలసి సొలసి అస్తమిస్తే

జగతి అంధకారం 

రాజు పాలిస్తే

జగతి అభివృద్ధి చెందుతుంది

జగతి అభివృద్ధి చెందుతే

మానవాళి పురోగతి చెందుతుంది

మూర్ఖ రాజు పాలిస్తే

రాజ్యం అవినీతి మయం

ప్రజల జీవితాలు అంధకారం 

రోజులు మారినట్లే

రాజులు మారాలి

ఋతువులు మారినట్లే 

బతుకులు మారాలి 

కాలాలు మారినట్లే 

పాలకులు మారాలి 

మూర్ఖ నేతలలో

స్వార్థం ఉంటుంది

అవినీతి ఉంటుంది

ఆశ్రిత పక్షపాతం ఉంటుంది 

అందుకే 

ఐదేళ్ల కొకసారి 

అవినీతి నేతలు మారాలి

స్వార్ధపు నేతలు మారాలి

దోపిడి నేతలు మారాలి 

అప్పుడే కదా తెలిసేది

ఎవరు నీతి పరులో

ఎవరు అవినీతి పరులో

ఎవరు మోసగాళ్ళో

ఎవరు నిజాయితీ పరులో

ఎవరు భూకబ్జా దారులో

ఎవరు భూపంపక దారులో 

ఎవరు లోటు బడ్జెట్ పెంచుతారో

ఎవరు మిగులు బడ్జెట్ పెంచుతారో 


ఎవరు అసమర్ధులను చేస్తారో

ఎవరు సమర్ధులను చేస్తారో

చుట్టాలు ధనికులకే చుట్టాలు

వ్యవస్థలు చట్టాలకే చుట్టాలు

అధికారులు ఏమీ చేయలేరు 

నేతల మార్పుకు ఓటు వేద్దాం

అవినీతి నేతల సాగనంపుదాం!

కత్తి కంటే గొప్పది కలం

 శీర్శిక: *కత్తి కంటే  గొప్పది కలం*

                      *****

అవినీతి అంతమొందించ

కరుడు గట్టిన నేతల 

దుమ్ముదులిపేయ

విషనాగుల్లాంటి 

మూడనమ్మకాల 

పార ద్రోలా

కత్తులే కావాలా?

ఉద్యమాలే చేయాలా?

యుద్ధాలే రావాలా?


భారతం వ్రాసిన  వ్యాసుడు 

ఏ కత్తి పట్టాడు ,

ఎక్కడ చేసాడు యుద్ధం?


రామాయణం వ్రాసిన వాళ్మీకి 

ఏ ఆయుధం పట్టాడు, 

ఎక్కడ చేసాడు యుద్ధం?


భగవద్గీత వ్రాసిన కృష్ణుడు

ఏ కత్తి పట్టాడు,

ఎప్పుడు చేసాడు యుద్ధం ?


నన్నయ ,తిక్కన ,ఎర్రన , 

కాలిదాసు , విశ్వనాధుడు 

శ్రీ శ్రీ ,ఇలా ఎందరో

ఏ యుద్ధం చేయకుండానే

సాధించారు ఘన విజయాలు!


అహముతో సాధించలేనివెన్నియో

అభిమానంతో సాధించవచ్చు!

అజ్ఞానంతో సాధించలేని వెన్నియో

జ్ఞనంతో సాధించవచ్చు!

కత్తితో సాధించలేనివెన్నియో

కలముతో సాధించ వచ్చు!


ఆందుకే ,

*కత్తి కంటే కలం గొప్పది*

*దళం కంటే గళం గొప్పది*

*అహం కంటే అభిమానం గొప్పది*

*అజ్ఞానం కంటే జ్ఞానం గొప్పది*

బర్రెలక్క

 శీర్షిక: బర్రెలక్క 


బర్రెలక్క బర్రెలక్క బర్రెలక్క

బర్రెలక్క పేరు మారుమ్రోగుతుంది రాష్ట్రాన 

బర్రెలక్క ఎమ్మెల్యే గా నామినేషన్ వేసింది 

ఊరూ వాడా కదులుతుంది

నేతల గుండెల్లో దడ పుడుతోంది !


శిరీష ఒక నిరు పేదరాలు

తడకల ఇల్లు , తలబోసుకును తావులేదు 

వర్షం కురిస్తే రోజంతా జాగారాలు 

విద్యాధిక యువతి, నిరుద్యోగ పడతి

ఆమెనే బర్రెల కాపరి, బర్రెలక్క!


చేతిలో రూపాయి లేదు

అంగ బలం ఆర్ధిక బలం లేదు 

రాజకీయ అనుభవం లేదు

ఓడి పోతాన్న భయం లేదు!


ఉద్యోగం ఇక రాదని తెలిసింది

బర్రెలను కొనుక్కొని కాస్తుంది

దానిపై ఒక వీడియో చేసింది 

బర్రెలక్క పై కేసు పడింది 

దానితో వస్థలపై అసహనం పెరిగింది

ఎమ్ ఎల్ ఎ గా పోటీ చేస్తుంది!


రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది

నిరుద్యోగ యువత బాసటగా నిలిచింది

ఒంటరి యువతి అని మీడియా కదిలింది 

సహాయ సహకారాలు అందిస్తుంది

గెలుపు కొరకు రాత్రి పగలు కృషి చేస్తుంది!


బర్రెలక్క ధైర్య సాహసాలు

యువతి యువకుల్లో పెరుగుతున్నాయి ఆశలు

గెలిపించుకోవాలనే ధీమాలు

కనబరుస్తున్నారు కొల్లాపూర్ ఓటర్లు!


దక్షిణాది రాష్ట్రాలలో 

అభిమానులు పెరుగుతున్నారు 

సొంత డబ్బుతో ప్రచారాలు చేస్తున్నారు 

దాతలు పెరుగుతున్నారు

సరిపడా డబ్బు సర్ధుతున్నారు

మరేమి కావాలి  గట్టి సాక్ష్యం 

బర్రెలక్క గెలవడం తధ్యం

ఇది సత్యం!

బాలలు - భావి తరాలకు వారధులు


అంశము: బాలలు - భావితరానికి వారధులు

శీర్షిక: బాలలు మేటి పౌరులు 


ఆ.వె:1

నేటి బాల లేను మేటి పౌరులు రేపు

ప్రేమ కరుణ తోడ పెంచ వలెను 

సత్య ధర్మములను భోదించిన యెడల

గొప్ప వారు నగును మెప్పు పొందు!


ఆ.వె:2

చింత గింజ లమ్మి జీవితం సాగించి 

ఇష్టముగను చదివె కష్టపడుతు

విద్య నేర్చి గొప్ప విజయుడాయెను కలామ్ 

శాస్త్ర వేత్త యాయె దేశమేలె!


ఆ.వె:3

బాల్య మందు శాస్ర్తీ బాధలెన్నొ పడిరి

కష్టపడుతు చదివె కష్ట జీవి

దేశ మంత్రి యాయె ధైర్యంగ పాలించె 

ఎవరు యేమి యగునొ యెవరు నెరుగు ! 

 

ఆ.వె:4

పేద తనము పుట్టి బాధలెన్నొ భరిస్తు

పెద్ద దాయె తాను విద్య నేర్చె

ఊరికుండలేక నుద్యోగములులేక 

బర్రెలెంచు కునెను భాద్యతెరిగి!


ఆ.వె:5

బర్ల కాచు కుంటు పాలను నమ్ముతు

బ్రతుకు చుండె యువతి బర్రెలక్క 

కష్ట ములను పెట్టి నష్ట పరుచ 

నామినేషనేసి నడిగె ఓటు !

ఓ మనిషిగా బ్రతుకు


శీర్శిక: ఓ మనిషిగా బ్రతుకు 


ఓ మనిషీ

నేను  నేననే

నేనే ఘనమనే

అహము వీడు

ఒక మనిషిగా బ్రతుకు!


సమరస భావమే నీకు నీడ

లేదంటే నీకు ఉంటుంది తేడ

విడిపోయావో అయ్యేవు మోడు

అహంకారం అహంభావం  వీడు

ఉంటారు సమస్త జనులే నీకు ఎప్పటికీ తోడు!


నాకే అంతా తెలుసని

నేనే లేకపోతే ఏమీ జరుగదని

తోటి వారిని తొక్కేస్తానని

నిందించకు వ్యవస్థదే, అంతా తప్పని

గుర్తుంచుకో నీవూ ఈ సమాజంలో ఒకడి వేనని!


నీకన్న మిన్న జగతిలో ప్రకృతి

మార్చ బోకు దాని ఆకృతి

సకల జీవకోటికది  సుకృతి

స్వార్ధభావముండిన చూపు వికృతి!


నాడు మనిషి చేసిన చిన్న తప్పిదం

కరోనా చేసే కరాళ నృత్యం

అల్ల కల్లోలమాయే ప్రపంచం

పేదా ధనికులని లేదు భేదం

చూప లేదు అది కులం మతం

కబలించే జనుల ప్రతి నిత్యం!


తండ్రిని కొడుకు చూడకుండా

కొడుకును తండ్రి చూడకుండా

శవాలను సహితం తాకకుండా

కన్నీరు ఘనీభవించే, రాల్చకుండా!


మట్టిలో పుట్టామని తెలుసు

మట్టిలో జీవిస్తామని తెలుసు

మట్టిలోనే గతిస్తామని తెలుసు

గిట్టిన ఏమీ తీసుకెళ్ళమని తెలుసు!


అయినా , మనిషి కెందుకింత స్వార్ధం

మనిషికెందుకింత అసూయ,అహంభావం

ఓ మనిషీ ... ఇక నైనా మేలుకో

ఓటమి నుండైనా గుణపాఠం నేర్చుకో!

రైతు - త్యాగధనుడు

 శీర్షిక : రైతూ - త్యాగధనుడు 

(ప్రక్రియ: ఆ.వె. పద్యాలు)

01.

కోడి కూతతోనె కునుకును దులిపేసి

హలము నెత్తి రైతు పొలము దున్న

బాట పట్టు నింట భార్య పిల్లలిడిచి

పురుగు బూషి యనక పుడమి నమ్మి!

02.

సాగు చేయు భూమి చక్కగ దున్నియు

నారు పోసి మడిలొ నాట్లు వేసి

కలుపు తీయు రైతు కష్టము నెంచక

పంటలు కొన మనుచు పరువుదీసె!

03.

అప్పు పెరిగి పోయె నసలు మిత్తి కలిసి

ఆలి బిడ్డ సొమ్ము నమ్మి యైన

కడుద మన్న బాంకు మడతపేచిని పెట్టె

నేల నిడ్ద మన్న  నేర మనిరి!

04.

పంట తీయ రైతు బహు కష్టములుపడిన

అమ్మ బోతె ధరలు దిమ్మ దిరుగె 

తాలు యంటు తుదకు తగవులాడిరి సేట్లు

అప్పు దీర్చ నమ్మ తప్ప దాయె!

05.

కష్టములకు నోర్చి నష్టముల భరించి

అన్న దాత గాను నవని నిలిచె

అమృతములను పంచి నాయుష్షు పెంచుతు

తృప్తి చెందు రైతు త్యాగ ధనుడు!

కోదండ రాముడు

అంశం: అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ట:

శీర్షిక: కోదండ రాముడు 

(ప్రక్రియ: ఆట వెలది పద్యాలు)

ఆ.వె:1

ధశరత తనయుండు దయగల రాముండు

విద్య లెన్నొ నేర్చె వినయముగను

తల్లిదండ్రులవలె ధర్మము పాటించె

కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!


ఆ.వె:2

ఎంత వాడు నైన యెంత కీర్తిగడించ

కాంత మాటనేల కాన కుండు

అడవి నంపె తండ్రి నభిరాముడినికను

కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!


ఆ.వె:3

రామ రామ యంటు రామున్ని వేడ్కొన

సకల ఫలములిచ్చు శాంత రామ

కోరు కోర్కె దీర్చు కోదండ రాముండు

కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!


ఆ.వె:4

నలుగురి మదిలోన పలుచనైనంకను

ఎంత వేద మెరిగి నేమి ఫలము

రావణుండు చచ్చె రాముడి చేతిలో

కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!


ఆ.వె: 5

ఎన్నొ బాధ లెరిగి యెంతొ పేరును గాంచి

అయిదు వందలేండ్లలిగెనయోధ్య

మోడి వలన నేడు వీడె రామ చరలన్

కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!

యువత మేల్కొనవలె

అంశం: యువత - భవిత

శీర్షిక: యువత మేల్కొన వలె


ఆ.వె:01

స్వార్ధ రాజ కీయ మార్జాల మందలు

యేలు తుండె నేడు నేల నందు 

పాడగునిక చూడు పడుసువారి భవిత

ప్రజలు మిన్న కుండె పగలు రాత్రి!


ఆ.వె:02

డ్రగ్గు బీరు దంద డాన్సు డాబాల్లోన 

అందు బాటు నుండె నదుపులేక

ఆగమవుతు యువత మూగబోవుచునుండె 

కాలమేలనాపు కరుణ తోటి!


ఆ.వె:03

ఉచిత పథక మనుచు నుత్త హామీలిస్తు

నేత జెప్పు నెన్నొ నేర్పు గాను

బానిసలను జేయు బతుకవీలవకుండ

సీట్ల గెలుపు కొరకు నోట్లు పంచు!


ఆ.వె:04

సార దంద జేయు చక్కగా నేతలు

దొరక కుండ నిలన దొర్లు తుండు

భూమి కభ్జ జేసి బురిడి గొట్టిస్తుండు

యువత నోరు మూసి భవిత మార్చు!


ఆ‌వె:05

యువత మేల్కొనవలె భవిత మార్చుకొనను 

మాట మార్చు నట్టి మాయ దొరల 

తరిమి కొట్ట వలెను నెరవక నికనైన 

భవిత యుండు రేపు యువత కొరకు!

జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత శ్రీ సినారె

 జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ సినారె


01. సీ.ప:

రైతు కుటుంబాన పుత్రుడై జన్మించి

సాదసీదగనేమి చదువు సాగె

వీధి బడిలొ చేరి విద్యను నేర్చియు 

హరి బుర్ర కథలను ననుకరించె

పాఠశాల చదువు పల్లెలందు చదివి

ఇంటరు డిగ్రీలు యింపుగాను

హుర్దుభాషలనందు నుత్తీర్ణు లాయిరి

పరభాష హుర్దులో పట్టు పెంచె !


తే.గీ:

తెలుగు సాహిత్యమందున తెలివి గాను

పైచదువులను చదివి పేరు గాంచె

పద్య గద్య రచనలతో ప్రాజ్ఞుడాయె

జయజయ కవిరేణ్య సినారె! జయము నీకు!


01. సీ.ప:

అతనొక కెరటము యవనికే మకుటము

చిరుధర హాసుడు సిరుల మోము

సాహితీ సృష్టిలో సహనశీలుడతడు

ఎన్నియో కావ్యాలు యెన్నొ కళలు

గద్యాలు పద్యాలు ఖండాలు దాటగా

భారతీయులకది భాగ్య మాయె 

బిరుదులు యెన్నియో పిలిచి వరించగ

హనుమాజి పేటకే హారమాయె!


తే.గీ:

తల్లి బుచ్చమ్మ లాలన తరుగకుండె

ఘనము విశ్వంభర రచన గగన మంటె

'జ్ఞాన పీఠ' లభ్యుడతడే జ్ఞాని యతడె

జయజయ కవిరేణ్య సినారె! జయము నీకు !

Tuesday, July 16, 2024

పురుషులపై వివక్ష


అంశం: *పురుషులపై వివక్ష*


శీర్షిక: *ఏడ్వడానికీ హక్కులేదు*


సృష్ఠిలోన నుండు

ప్రకృతిలోన నుండు

సమాజంలోన మెండు

అన్ని  కాలాల యందుండు

పురుషులపై వివక్ష దండిగానుండు!


చెట్టుకు పుట్టకూ స్త్రీ లింగమే

చెరువుకు చేనుకూ స్త్రీ లింగమే

గ్రహాలకు తారలకు స్త్రీ లింగమే

పంచ భూతాలకు స్త్రీ లింగమే!


పాపైనా బాబైనా 

జన్మించు నొకే తల్లి గర్భాన

పుట్టినపుడు శిశువులకు

యిచ్చు నొకే చనుబాలు అమ్మ!


పెరిగి పెద్దవారవుతుంటే చాలు

వివక్ష స్పష్టంగా గోచరించు

పాపలపై సానుభూతి

బాబులపై కరుకు తనం!


మగ పిల్లలే బడులకు వెళ్ళాలి

ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించాలి

ఆడ పిల్లలు నీడకు సుఖపడాలి

ఎవరో కొందరు తప్పనిసరై చదవాలి!


కొడుకులు సంపాదించిన డబ్బు

జీవితాంతం తల్లి దండ్రులకే

కూతుర్లు సంపాదించిన డబ్బు

భర్తా ,అత్తా మామలకే!


అప్పు చేసి కూతుర్లకు ఘనంగా

వివాహాలు జరిపించాలి

డబ్బు సంపాదించుకున్నాకనే

కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకోవాలి!


కూతుళ్ళ చదువు ,పెళ్ళిళ్ళ అప్పులు

తల్లి దండ్రులు కొడుకులు తీర్చాలి

ఆస్తులలో కూతుళ్ళకు వాటా ఇవ్వాలి

లేదంటే కోర్టులలో కేసులు పెడుతారు!


ఇంట్లో తాత నాణమ్మలున్నా

అవిటి అక్కా తమ్ముళ్ళు ఉన్నా

కూతుళ్ళకు భాద్యత ఉండదు

కానీ ఆస్తులపై సర్వ హక్కు లుంటాయి!


పెళ్ళి కావాలంటే మగవారే

ఉద్యోగస్తులై ఉండాలంటారు

ఉద్యోగం, అదియును సాఫ్టవేర్

కాకుంటే పిల్లనివ్వ నంటారు!


ఆడపిల్ల కంటే మగవారే ఎత్తు ఉండాలి

ఎత్తు లేకుంటే పెళ్ళి చేసుకోరు

మీసాలు రాకుంటే పెళ్ళికి పనికి రారు

ఆడవారికి లేకుంటే అందమైన వారు!


పురుషులకు ఏడ్వడానికి హక్కు లేదు

ఏడుస్తే నవ్వుతుంది సమాజం

స్త్రీలకు ఏడ్వడానికి హక్కు ఉంది

ఏడుస్తే, అది సానుభూతి చూపు తుంది!


పుట్టినింటి నుండి మెట్టినింటికి పోతే

వనితల భాద్యతలు మాయ మవుతాయి

తల్లి దండ్రుల పోషించు భాద్యతలు

పురుషులపైననే పడు తుంటాయి!


పండుగలకు పబ్బాలకు కూతుళ్ళకు

పుట్టింటి వారు కట్నకానుకలు పెట్టాలి

ఆ అప్పులు కొడుకులే తీర్చాలి

కూతుళ్ళకు  ఉండవు భాద్యతలేవీ!


తల్లి దండ్రులకు కర్మకాండలు చేయాలి

మీసాలు గుండ్లు కొట్టించు కోవాలి

యేడాది వరకు సూతకం పాటించాలి

నెల మాషికాలు,యాడాది మాషికాలు ,

బ్రతికున్నంతకాలం పెట్టాలి తద్దినాలు!


ఆస్తి హక్కులని గొంతెత్తుతారు

చట్టాలను చూపెట్టి భయ పెట్టుతుంటారు

తల్లిదండ్రుల ,అంగ వికలుల,

పోషించుట మా భాద్యత కాందంటారు!


అత్తా మామలు బ్రతికి ఉంటే

ఇక ఆడిస్తారు చూడూ భర్తలను 

బ్లాక్మేల్  చేస్తూ భయ పెడుతుంటారు

భాద్యత గల భర్తలు సర్దుకు పోతుంటారు!


అడ్వర్టైజ్ మెంట్లలో కూడా

వనితలకే అధిక పారితోషకం

ప్రభుత్వ స్కీములలోనూ

పడతులకే అధిక సదుపాయం!


ఇంట్లోనూ , ఆఫీసుల్లోనూ

సమాజం లోనూ , కోర్టులలోనూ 

రాజకీయాల్లోనూ ,రాచరికల్లోనూ

మగువల పైననే సాను భూతీ

స్త్రీల పైననే జాలీ దయ కరుణ!


ఏమిటీ సంస్కృతి , సాంప్రదాయాలు

ఎందుకీ పురుషులపై వివక్ష

ఇంకెంత కాలం ఈ దుర్వ్యివస్థ!

రక్షా బంధన్

శీర్షిక: రక్షాబంధన్


(అమ్మలోని మొదటి అక్షరం "అ" , నాన్న లోని చివరి అక్షరం "న్న" ని కలుపుతే వచ్చే వచ్చే పదం  "అన్న". ఈ బంధాన్ని కలకాలం నిలుపుకోడానికి సోదరులకు కట్టే రాఖీనే రక్షా బంధన్)


ప్రక్రియ: మణిపూసలు

(రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం)


పూర్వకాలమందునుండె

దేవత రాక్షసులకుండె

పుష్కరకాలము యుద్దము

ఇది అనాదిగ వస్తుండె!


యుద్దాల నడ్డుకొనను

తమను రక్షించుకొనను

దేవతలు రాఖి కట్టిరి 

ఇంద్రుడి కుడి చేతికిను!


ఇంద్రుడికి శక్తి వచ్చెను

దేవతలను రక్షించెను

అదియేశ్రావణపూర్ణిమ

మూడు లోకాలు మెచ్చెను!


అదే ఆనవాయితిగను

నేడు కొనసాగుతుండెను

సోదరి తన సోదరులకు

రాఖీని కట్టు చుండెను!


ఆపదల్లో ఉన్నపుడు

రాఖి కడుతే సోదరుడు

తమను రక్షించుతాడని

అనే విశ్వాసముమెండు!


సోదరులు బహుమానమును

సోదరిమణులకిచ్చియును

ప్రేమతోటి సాగనంపు

నదియె రాఖి పౌర్ణమియును!

            ....***....

యధా రాజా ,తధా ప్రజా!

 తేది: 13.08.2022


అంశం: స్వార్

శీర్శిక: యధారాజా తధాప్రజా


భగ భగ మండే వెలుగులతో

నవగ్రహాల రాజు  భాస్కరుడు

నవగ్రహాల రాణి చంద్రమతి

కోట్లాది తారలు, పంచ భూతాలు

నిత్యం డేగ కళ్ళతో  వీక్షిస్తున్నా!


చావడులు ఎన్ని ఉన్నా

చట్టాలు ఎన్ని ఉన్నా 

సి.సి. కెమరాలు ఎన్ని ఉన్నా

సి.బి.ఐ.లు ఎన్ని ఉన్నా

జీతాలను పెంచుకుంటూ

ఐదేళ్ళ సేవకే పెన్సన్లను తీసుకుంటూ

నటన చేస్తుండే స్వార్ధ నేతలు

విశ్వమంతా వ్యాపించే అవినీతిపరులు!


దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకున్నచందాన

అధికారం చేపట్టి అందలమెక్కను

దేశ సంపదలను దోచుకునను

అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నా

రిజర్వేషన్లను కదిలించరైరి!


ఓటుబ్యాంక్ ను పదిలపరచుకుంటూ

ఏలు తుండిరి దేశాన్ని యధేచ్ఛగా

యధా రాజా తధా ప్రజ అన్నట్లు

సాగుతుండే లోకం

చావకుండ బ్రతుక కుండ 

గడుస్తుండే పేదల జీవితం!

జాతీయ జెండా

 పిల్లలు పాడే విధంగా కాస్త సవరణ

దేశ భక్తి గీతం:

రచన గానం : మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: జాతీయ జెండా!


ఎగరవే.... ఎగరవే....జాతీయ జెండా

ఎగరవే ....ఎగరవే... మువ్వొన్నెల జెండా

ఎగరవే ...ఎగరవే ... వజ్రోత్సవ జెండా!


ఝాన్సీ ,  అల్లూరి నేతాజీ

గాంధీ నెహ్రూ అంబేత్కర్

 భగత్ సర్ధార్ మరెందరో 

త్యాగ మూర్తుల త్యాగఫలం

ఎగరవే ... ఎగరవే .. జాతీయ జెండా

ఎగరవే ...ఎగరవే... మువ్వొన్నెల జెండా

ఎగరవే... ఎగరవే ... వజ్రోత్సవ జెండా!


ఇంటింటా ప్రతి యింటా

వాడ వాడన , ప్రతి బడినా

వీది వీదినా ప్రతి మదినా

దేశం రాష్ట్రాల నలుమూలలా

ఎగరవే ... ఎగరవే ..జాతీయ జెండా

ఎగరవే... ఎగరవే.. మువ్వొన్నెల జెండా

ఎగరవే ..ఎగరవే... వజ్రోత్సవ జెండా!


ప్రజలకు ధైర్యాన్నిచ్చు జెండా

జనులకు శక్తి నిచ్చు జెండా

యువతకు ఊపిరి నిచ్చు జెండా

నరులలో ఐఖ్యత పెంచు జెండా

ఎగరవే ....ఎగరవే ..జాతీయజెండా

ఎగరవే.. ఎగరవే.. మువ్వొన్నెల జెండా

ఎగరవే.. ఎగరవే... వజ్రోత్సవ జెండా!


కుల మతాలు నీకు లేవు

పేద ధనికకు తావు లేదు

ప్రాంతీయతలు  లేవు

పార్టీల సంకెళ్ళు నీకు  లేవు

ఎగరవే... ఎగరవే... జాతీయ జెండా

ఎగురవే...ఎగరవే...వజ్రోత్సవ జెండా!


ఏ దేశాన ఎగిరినా

ఎనలేని గౌరవం

ఏ కాలాన ఎగిరినా

ఎనలేని ఆనందం

ఎక్కడ ఎగిరేసినా ..

ఉన్నతం నీ భావం

ఎప్పుడు ఎగరేసినా.. 

ఉన్నతం నీ స్వరూపం

ఎగరవే....ఎగరవే..జాతీయజెండా

ఎగరవే...ఎగరవే...మువ్వొన్నెల జెండా

ఎగరవే ... ఎగరవే..వజ్రోత్సవ జెండా..!


దేశ గౌరవం పెంచను

దేశ భక్తిని పెంచను

దేశ కీర్తిని పంచను

దేశ ఐఖ్యతను నిలుపను

జనుల శక్తిని పెంచను

ఎగరవే... ఎగరవే...జాతీయ జెండా

ఎగరవే...ఎగరవే...మువ్వొన్నెల జెండా

ఎగరవే ...ఎగరవే.. వజ్రోత్సవ జెండా!


పింగళి వెంకయ్య రూపుదిద్దిన

మూడు రంగుల జెండా

ముచ్చటైన జెండా

కాశాయం ,తెలుపు ,ఆకుపచ్చ

ఐఖ్యతకు ,శాంతికి చిహ్నాలు

అశోక ధర్మ చక్రం చైతన్యానికి చిహ్నాలు

ఎగరవే... ఎగరవే...జాతీయ జెండా

ఎగరవే...ఎగురవే...మువ్వొన్నెల జెండా

ఎగరవే ...ఎగరవే...వజ్రోత్సవజెండా!


త్యాగమూర్తులను గుర్తుచేస్తూ

నవతారాలను మేల్కొల్పుతూ

వజ్రోత్సవాలు జరుపుకుంటూ

ఎగరవే... ఎగరవే...జాతీయ జెండా

ఎగరవే.. ఎగరవే..మువ్వొన్నెల జెండా

ఎగరవే... ఎగరవే...వజ్రోత్సవ జెండా!

ప్రజలకో న్యాయం - పాలకులకో న్యాయమా ?

 శీర్శిక: ప్రజలకో న్యాయం - పాలకులకో న్యాయమా?


ఇంటిపై  పన్ను

పెట్రోల్ పై పన్ను

డిజిల్ పై పన్ను

ఏదీ అవినీతి నేతలపై పన్ను?


త్రాగే నీటిపై పన్ను

తినే తిండిపై పన్ను

సిగరెట్లపై పన్ను

ఏదీ అవినీతి సర్కారుపై పన్ను?


ఆల్కాహాల్ పై పన్ను

ఉద్యోగులపై వృత్తి పన్ను

ఉద్యోగులపై ఆదాయ పన్ను

ఏదీ నేతల జీతాపై పన్ను?


ఉద్యోగుల బోనస్ పై పన్ను

ఉద్యోగుల బత్తాలపై పన్ను

ఇతర ఆదాయాలపై పన్ను

ఏదీ నేతల ఇతర ఆదాయాలపై పన్ను?


వ్యాపారస్తుల ఆదాయాలపై పన్ను

ఆదాయపన్నులపై సర్ చార్జ్

ఆదాయపన్నులపై సెస్సు

ఏదీ ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై పన్ను?


టానిక్, మందుబిల్లలపై పన్ను

హాస్పిటల్ బిల్లులపై పన్ను

హాస్పిటల్ రూములపై పన్ను

ఏదీ సర్కారు అలసత్వంపై పన్ను?


ఆల్కాహాల్ పై టాక్స్

రహదారులపై టోల్ టాక్స్

వెహికిల్స్ పై టాక్స్

ఏదీ అక్రమ దోపిడిపై టాక్స్?


రాంగ్ రూట్ లో వస్తే చలాన్

త్రాగి డ్రైవ్ చేస్తే చలాన్

ఆక్సిడెంట్ జరుగుతే ఫైన్

ఏదీ ఉద్యోగుల లంచాలపై ఫైన్? 


వేహికిల్ రోడ్డుపై ఆగిపోతే ఫైన్

ఇన్స్యూరెన్స్ లేకపోతే ఫైన్

పొల్యూషన్ రషీదు లేకపోతే ఫైన్

ఏదీ ప్రజలను త్రాగుబోతులను చేస్తే ఫైన్?


నీటి బిల్లులపై పన్ను

కరెంట్ బిల్లులపై పన్ను

సినిమా టికెట్లపై పన్ను

ఏదీ చట్టాలను అమలు చేయకపోతే పన్ను?


కిరాణా షాపులపైనా పన్ను

ప్యాకింగ్ తో కూడిన ప్రతి వస్తువుపై పన్ను

ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై పన్ను

ఏదీ నేతల పెన్సన్లపై పన్ను?


పెట్టుబడులపై పన్ను

స్కూలు ఫీజులపై పన్ను

కూడబెట్టుకున్న పొదుపుపై పన్ను

ఏదీ నల్లధనంపై,భూకబ్జాలపై పన్ను?

కాళన్నా /kalaña

 శీర్షిక: కాళన్నా! 

   ************* 

అన్యాయాలను  అక్రమాలను  ఏకి పారేసిన కాళన్నా!

ఫిరంగి లాంటి మాటలు ,నిప్పుకణికల్లాంటి కవితలతో కాళన్నా!

కవిత్వాన్ని కాలాతీతం చేసిన అక్షర నిధివి కాళన్నా!

"పుట్టుక నీది , చావు నీది  బ్రతుకంతా దేశానిదని"

అని ఆవేశాన్ని వెళ్ళగక్కావు కాళన్నా!

"అన్యాయాన్ని ఎదిరిస్తే  *నా గొడవ* కు  సంతృప్తని,

అన్యాయం అంతరిస్తే *నా గొడవ* కు ముక్తని ,

అన్యాయాన్ని ఎదిరించువాడే  నాకారాధ్యుడని"

అని కుండ బద్దలు కొట్టావు  కాళన్నా!

నాడూ తప్ప లేదు నీకు కవుల అంతరాలన్నా!

శ్రీవిశ్వనాధ , దేవులపల్లి , రాయప్రోలులకు

దక్కిన గౌరవాలు  నీకెక్కడివన్నా!

అయినా ,

కలం , కాగితం చేత పట్టకుండానే , భారత ప్రభుత్వ

*పద్మ విభూషణ్*  బిరుదాంకితుడివైనావు  కాళన్నా!

తెలంగాణా ప్రభుత్వమూ  ప్రకటించే నీ జయంతిని

*తెలుగు భాషా దినోత్సవం* గా కాళన్నా!


ఓ మనిషీ / Oh Man

 *మేడే సందర్భంగా*

అంశం: ఓ మనిషి


ఓ మనిషీ!

ముసి ముసి నవ్వులతో

మురిసి పోతున్నావు


కూసమిడిచిన పాము వోలె

బుస కొడుతున్నావు


ఎందుకో ఈ ఎగిసి పాటు

ఎందుకో ఈ మిడిసి పాటు


నిరు పేదలపై , అమాయకులపై

ఎందుకంత ఏవగింపు

సాటి మనిషిని మేటిగా చూడలేవు 


నీవు

అమ్మ కడుపు

నుండీ గాక ఆకాశం

నుండి ఊడి పడ్డావా?


చదువుల సరస్వతిని గణపతి వోలె 

పుక్కెట పట్టి పుట్టావా?


బంగారు గనిని ధన లక్ష్మి వోలె

బుజాన పెట్టుకుని వచ్చావా?


అంతా నాకే తెలుసనే

అహంకారమెందుకు?


అందరూ నాకంటే తక్కువనే

అహంభావ మెందుకు?


ఒక్క సారి ఆత్మ విమర్శ

చేసుకో

నేనూ ఒక మనిషినేనని

గుర్తు పెట్టుకో


కుల మత విభేదాలు సృష్టించి

రాష్ట్రాలలో , దేశంలో

అల జడులు సృష్టిస్తావు


బ్యాంకులను కొల్లగొట్టి

విదేశాల్లో దాక్కుంటావు


నోట్లను ఎరవేసి ఓట్లు

దండుకుంటావు

అవినీతి ఓట్లతో అధికారం

చేపడుతావు


పేదలను దోచుకుని

విదేశీ బ్యాంకుల్లో ,

వ్యాపార సంస్థలలో

పెట్టు బడులు పెడుతావు


అమాయకపు అబలలపై

అఘాయిత్యాలు చేసి

ఏమీ ఎరుగ నట్లు నటిస్తావు


ప్రశ్నించే గొంతుకలపై ఉక్కు పాదం

మోపుతున్నావు


నమ్మిన నరులను మోసం చేసి

కోట్లు పోగేస్తావు


ఈ శరీరం ఈ సంపద

నీ భార్యా పిల్లలు,

బంధువులు, మిత్రులు

శాశ్వతమనుకుంటున్నావా?


నీ నడ్డిని విరిచే రోజు

దగ్గరలోనే ఉంది

నీకు గుణపాఠం చెప్పే రోజు

అతి చేరువలోనే ఉంది


నీ పాపాలను చిత్రగుప్తుడు

లిఖిస్తూనే ఉన్నాడు


నీ పాపాల చిట్టా

నిండు కుంటున్నది


నీకు పడే శిక్షలు

ఎక్కడో కాదు, 

మరెప్పుడో కాదు

నీవున్న లోకాననే, నీవు బ్రతికుండగానే!


Sunday, July 7, 2024

భార్యను కోల్పోయిన భర్త ( HUSBAND WHO LOST WIFE)

 వచన కవిత

శీర్షిక: భార్యను కోల్పోయిన భర్త

అందమైన తారలు
ఆకాశంలో మెరుస్తున్న
చూడ గలమే గానీ
తాకలేము

ఇష్టమైన భార్య
విశ్వంలో విహరిస్తున్నా
ఊహించ గలమే గానీ
మాట్లాడ లేము

వస్తువు విలువ
అది ఉన్నప్పుడు
తెలియదు
కానీ అది లేనప్పుడు
తెలుస్తుంది

భార్య విలువ
ఆమె ఉన్నప్పుడు
తెలియదు
కానీ ఆమె లేనప్పుడు
స్పష్టంగా
తెలుస్తుంది

భర్త లేకుండా
భార్య జీవించ గలదు
కానీ భార్య లేకుండా
భర్త జీవించడం
చాలా కష్టం

ఒంటరి
ఆడ వారంటే
సమాజంలో
ఒక సానుభూతి
ఉంటుంది

ఒంటరి
మగ వారంటే
సమాజంలో
సానుభూతి
ఉండదు

ఏదేని
ఒక ప్రదేశానికి
వెళ్ళినా
ఒక ఫంక్షన్ కు
వెళ్ళినా
వెంట భార్య ఉంటేనే
భర్తకు గౌరవం
భార్య, భర్తకు
కొండంత ధైర్యం

ఒక సమస్య
వచ్చిందంటే
ఒంటరి స్త్రీ
ఎదుటి వారితో
చెప్పుకో గలదు
జాలి కలిగే టట్లు
ఏడ్వగలదు
సానుభూతి
పొందగలదు

భర్తను కోల్పోయిన
మహిళకు
తన తల్లి దండ్రుల
అన్న దమ్ముల
అక్కా చెల్లెండ్ల
సమాజం సానుభూతి
ప్రభుత్వ సహాకారం
ఉంటుంది
తన పిల్లలను
పోషించు కోగలదు
తానూ జీవించ గలదు

భార్య లేని భర్త
తన సమస్యను
ఎవరికీ చెప్పుకోలేడు
ఏడ్వ లేడు
లోలోనే
మధన పడుతాడు


భార్యను
కోల్పోయిన భర్తకు
ఎవరు సహకారం
అందించరు
సమాజంలో
గౌరవం
దొరకదు
తీసుకుందా మనుకున్నా
అహం అడ్డు వస్తుంది

భర్త లేని స్త్రీలు
మగవారితో
నవ్వుతూ
మాట్లాడారంటే
ఆనందంలో
ఏదో ఒక సహాయం
తక్షణమే లభిస్తుంది

భార్య లేని పురుషులు
ఆడవారితో
నవ్వుతూ
మాట్లాడారంటే
అనుమానిస్తారు
ఆవేశంతో
ఊగిపోతారు
ఆమడ దూరంలో
ఉంచుతారు

ఒంటరి స్త్రీలు
తమ ఇంటి పనులను
వంట పనులను
చక్కగా చేసుకోగలరు
ఒక్క ఐదవ తనం
పోతుందే తప్పా
స్వేచ్ఛగా
హాయిగా
జీవించ గలరు

నాలుగు రోజులు
ఊరికి పోతేనే
ఇల్లు పెంట కుప్ప
అవుతుంది
ఒంటరి పురుషులు
ఇంటి పనులు
చేసుకోవడం
వంట పనులు
చేసుకోవడం
కష్ట తరంగా
మారుతుంది

ఎన్ని ఆస్తులున్నా
ఎంత డబ్బున్నా
ఎంత గొప్ప
ఉద్యోగం చేస్తున్నా
ఎంత పెద్ద
వ్యాపారం చేస్తున్నా
ఎంత పెన్షన్ వచ్చినా
ఇంటికి వచ్చేసరికి
మాట్లాడేందుకు
గ్లాసెడు మంచినీరు
ఇచ్చేందుకు
కప్పెడు కాఫీ
ఇచ్చేందుకు
బాధలు
పంచుకునేందుకు
భార్య లేకుంటే
ఆ జీవితం నరకం
అనుభవిస్తే గానీ
బాధేమిటో
తెలుస్తుంది

డబ్బుంటే
పని మనిషిని
పెట్టు కోవచ్చను కుంటారు
పనులు
చేయించుకోవచ్చనుకుంటారు
స్విగ్గీతో
జుమాటాతో
కాళ్ళ వద్దకు ఆహారం
తెప్పించుకోవచ్చనుకుంటారు

ఏ పని మనిషైనా
ఏ ఆన్లైన్ వారైనా
ఎంత డబ్బు చెల్లించినా
పని చేసి
వెళ్లి పోతారు తప్పా
ప్రక్కన కూర్చుని
సేవలు చేయరు

ముసలి తనంలో
ఓ టాబ్ లెట్
అందివ్వాలన్నా
ఓ హాస్పిటల్ కు
వెళ్ళాలన్నా
అర్ధ రాత్రి వేల
మంచి నీళ్ళు
కావాలన్నా
భార్య లేని జీవితం
నరకం
అది అనుభవిస్తేనే
అర్ధమవుతుంది


పిల్లలు ఉన్నా
వారి ఉద్యోగాలు
ఎక్కడెక్కడో
కలిసి ఉన్నా ...
సేవలందించే
కొడుకులు కోడళ్ళు
కూతుర్లు అల్లుండ్లు
చాలా అరుదు

ఆరు పదులు
దాటిన పెద్దలకు
కొడుకులు కోడళ్ళు
కూతుర్లు అల్లుండ్లు
బాధ్యతతో
మానవత్వంతో
సేవలందించాలి
కంటికి రెప్పలా
కాపాడాలి

లేదా
పెద్ద మనసుతో
కోరుకునే
ఒంటరి మహిళలతో
వివాహం జరిపించాలి

ఈ సమాజంలో
ఎలాగైనా జీవించగలను
అనే మానసిక ధైర్యం వలన
భర్తలు లేని స్త్రీల ఆయుష్షు
పెరుగుతుంది

ఈ సమాజంలో
ఆస్తులు, సంపదలున్నా
డబ్బు, పెన్సన్లున్నా
పేరు, ప్రతిష్ఠలున్నా
అనారోగ్యం
జీవించే మానసిక ధైర్యం
లేక పోవడంతో
భార్యలు లేని
పురుషుల ఆయుష్షు
తగ్గుతుంది

ఒక అర్ధాంగిగా
ఒక తల్లిగా
ఒక చెల్లిగా
ఒక అక్కగా
ఒక వదినగా
ఒక డాక్టర్ గా
ఒక ఆర్ధిక వేత్తగా
ఒక ఉద్యోగిగా
ఒక సలహాదారుగా
ఒక సేవకు రాలిగా
బహుముఖ ప్రజ్ఞాశాలి
భార్య

అందుకే
భార్య భర్తలు
బ్రతికున్నంత కాలమైనా
ప్రేమగా , సంతోషంగా
ఆనందంగా
కాలం గడపాలి
కష్ట సుఖాలు
పంచుకోవాలి
భాద్యతలను
నెరవేర్చుకోవాలి
రేపటి తరానికి
ఆదర్శంగా నిలువాలి

పురుషులు
మొదటి నుండే
మనసును సిద్ధం
చేసుకోవాలి
ఇలాంటి ఒక రోజు
వస్తుందని గుర్తించాలి
పాజిటివ్ ఆలోచనలు
పెంచుకోవాలి


ఒక వయసు దాటాక
ఒంటరి జీవితం
ప్రాక్టీస్ చేయాలి
ఆర్ధిక స్థోమత
పెంచుకోవాలి
అనారోగ్యం లేకుండా
చూసుకోవాలి
అందరితో కలుపుగోలుగా
ఉండాలి
స్థోమతకు తగ్గ
దాన గుణం
అలవర్చుకోవాలి
అప్పుడప్పుడు
చిన్న చిన్న బహుమతులు
పిల్లలకు ఇవ్వాలి

నా డబ్బు
నా ఆస్తులు
నా ఇష్టమని
చెడు అలవాట్లకు
బానిసలు
కాకూడదు
సరియైన ఆహారం
తీసుకోవాలి
సేవాకార్యక్రమాలలో
ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో
యోగాసనాలలో
ఇష్టమైన వృత్తులలో
నిమగ్నమై పోవాలి
ప్రకృతిపై
దృష్టి మరల్చాలి

దేని పైననూ
ఆశలు,
కోరికలు
పెంచుకో కూడదు
ఎవరిపైననూ
కోపం, తాపం
ఈర్ష్య, అసూయ
మోహం,
మాత్సర్యాలను
చూపకూడదు

ఈ లోకంలో
ఏ వస్తువు
ఏ మనిషీ
ఏ జీవి
శాశ్వతం కాదనీ
గుర్తుంచు కోవాలి
విధి రాతను
ఎవరు తప్పించ లేరు

జీవించినంత కాలం
భార్య లేని భర్తలు
ప్రశాంతంగా
సంతోషంగా
జీవించడం
అలవర్చుకోవాలి

Monday, July 1, 2024

మానవ విలువలు (HUMAN VALUES)

వచన కవిత 
శీర్షిక: మానవ విలువలు 

 స్వేచ్ఛంటే 
 ఇదేనా 
 లిబరలైజేషనంటే 
 ఇదేనా 
 ప్రవైటేజషనంటే 
 ఇదేనా 
 గ్లోబలైజేషనంటే 
 ఇదేనా 
 మేధావులు సాధించిన 
ఘనత ఇదేనా 

 కాలువలకు 
 అడ్డుకట్టలు 
 వేయవచ్చు గానీ 
 సముద్రాలకు 
నదులకు 
 అడ్డు కట్టలు 
వేయడం 
సాధ్యం కాదనో ఏమో 

 ఏమిటో 
 ఈ చట్టాలు 
 కేసులను 
 తగ్గించాలని 
 కాబోలు 

 సహజీవనం 
 చేయవచ్చని 
 బలవంతాలు 
 రేప్ లు చేయకూడదని 
మేజర్లై ఉంటే చాలనే 
ఉభయులకు 
 ఇష్టాలుంటే చాలనే 

 పాశ్చాత్య పోకడలు 
 పెరుగు తుండే 
వోయోలు 
 నిండిపోతుండే 
 రేవ్ పార్టీలు 
 జరుగుతుండే 
 లివింగ్ రిలేషన్ షిప్ 
 సంస్కృతి 
 విజృంభిస్తుండే 

 ఎవరు 
ఎవరితోనో 
 తిరుగుతుండే 
 వావి వరసలు 
 లేకుండే 

 వయసు భేదం 
 తెలియకుండే 
 వివాహికులా 
 అవివాహికులా 
 పట్టింపులు 
లేకుండే 

 నిండు 
సంసారాలు 
 సాగర
తీరాలవుతుండే 

 పెళ్లికి ముందే 
 అగ్రిమెంట్లు 
 రిలేషన్ షిప్ 
 విత్ బెనిఫిట్స్ 

 కలిసి 
జీవించవచ్చు 
 ఏమైనా చేసుకోవచ్చు 
 మల్లీ బయట 
 ఎవరి 
పర్సనల్ లైఫ్ 
 వారిదే 

 ఎవరు 
ఎవరి తోనైనా 
 తిరుగ వచ్చు 
 ఎంజాయ్ చేయవచ్చు 

 అగ్రిమెంట్ 
కాలంలో 
 మనసులు శరీరాలు 
 కలిస్తే పెళ్లి 
 లేదంటే లొల్లి 
 ఎవరి దారి వారిదే 
 లేదంటే గోదారే 

 ఇదేనా 
 భారతీయ వేదాలలో 
 పురాణాలలో 
 ఇతిహాసాలలో 
ఉన్న సారం ?

 ఇదేనా 
 భారతీయ సంస్కృతి ?
 ఇదేనా 
 ఋషులు 
ప్రసాదించిన 
 భారతీయ విశిష్టత ?

 ఇదేనా 
 భారతీయ 
పెళ్లి గొప్ప తనం ?

 ఇదేనా 
 నూరేళ్ళ 
వివాహ బంధమంటే ?

ఆకు మీద 
 ముల్లు పడ్డా 
 ముల్లు మీద 
 ఆకు పడ్డా 
 జరిగిన నష్టం 
 పూడ్చ లేనిది 
 కలిగిన కష్టం 
 తీర్చ లేనిది 

 మానవ విలువలు 
 రేపటి తరాలకు 
 ఆస్తులు 

 మానవ విలువలు 
వెలకట్టలేని 
 సంపదలు 

 విలువలను 
 కాలదన్నిన రోజు 
 రేపటి తరాల జీవితాలు 
 అగమ్య గోచరాలు!