Monday, July 22, 2024

ఓ మనిషిగా బ్రతుకు


శీర్శిక: ఓ మనిషిగా బ్రతుకు 


ఓ మనిషీ

నేను  నేననే

నేనే ఘనమనే

అహము వీడు

ఒక మనిషిగా బ్రతుకు!


సమరస భావమే నీకు నీడ

లేదంటే నీకు ఉంటుంది తేడ

విడిపోయావో అయ్యేవు మోడు

అహంకారం అహంభావం  వీడు

ఉంటారు సమస్త జనులే నీకు ఎప్పటికీ తోడు!


నాకే అంతా తెలుసని

నేనే లేకపోతే ఏమీ జరుగదని

తోటి వారిని తొక్కేస్తానని

నిందించకు వ్యవస్థదే, అంతా తప్పని

గుర్తుంచుకో నీవూ ఈ సమాజంలో ఒకడి వేనని!


నీకన్న మిన్న జగతిలో ప్రకృతి

మార్చ బోకు దాని ఆకృతి

సకల జీవకోటికది  సుకృతి

స్వార్ధభావముండిన చూపు వికృతి!


నాడు మనిషి చేసిన చిన్న తప్పిదం

కరోనా చేసే కరాళ నృత్యం

అల్ల కల్లోలమాయే ప్రపంచం

పేదా ధనికులని లేదు భేదం

చూప లేదు అది కులం మతం

కబలించే జనుల ప్రతి నిత్యం!


తండ్రిని కొడుకు చూడకుండా

కొడుకును తండ్రి చూడకుండా

శవాలను సహితం తాకకుండా

కన్నీరు ఘనీభవించే, రాల్చకుండా!


మట్టిలో పుట్టామని తెలుసు

మట్టిలో జీవిస్తామని తెలుసు

మట్టిలోనే గతిస్తామని తెలుసు

గిట్టిన ఏమీ తీసుకెళ్ళమని తెలుసు!


అయినా , మనిషి కెందుకింత స్వార్ధం

మనిషికెందుకింత అసూయ,అహంభావం

ఓ మనిషీ ... ఇక నైనా మేలుకో

ఓటమి నుండైనా గుణపాఠం నేర్చుకో!

No comments: