Monday, July 22, 2024

రైతు - త్యాగధనుడు

 శీర్షిక : రైతూ - త్యాగధనుడు 

(ప్రక్రియ: ఆ.వె. పద్యాలు)

01.

కోడి కూతతోనె కునుకును దులిపేసి

హలము నెత్తి రైతు పొలము దున్న

బాట పట్టు నింట భార్య పిల్లలిడిచి

పురుగు బూషి యనక పుడమి నమ్మి!

02.

సాగు చేయు భూమి చక్కగ దున్నియు

నారు పోసి మడిలొ నాట్లు వేసి

కలుపు తీయు రైతు కష్టము నెంచక

పంటలు కొన మనుచు పరువుదీసె!

03.

అప్పు పెరిగి పోయె నసలు మిత్తి కలిసి

ఆలి బిడ్డ సొమ్ము నమ్మి యైన

కడుద మన్న బాంకు మడతపేచిని పెట్టె

నేల నిడ్ద మన్న  నేర మనిరి!

04.

పంట తీయ రైతు బహు కష్టములుపడిన

అమ్మ బోతె ధరలు దిమ్మ దిరుగె 

తాలు యంటు తుదకు తగవులాడిరి సేట్లు

అప్పు దీర్చ నమ్మ తప్ప దాయె!

05.

కష్టములకు నోర్చి నష్టముల భరించి

అన్న దాత గాను నవని నిలిచె

అమృతములను పంచి నాయుష్షు పెంచుతు

తృప్తి చెందు రైతు త్యాగ ధనుడు!

No comments: