Sunday, January 12, 2025

మాట్లాడట మనేది ఒక కళ

అంశం: వినదగు నెవ్వరు చెప్పిన


శీర్షిక: *మాట్లాడటమనేది ఒక కళ*

వసంత కాలంలో
లేత చిగుళ్ళను చప్పరిస్తూ
వేప పండ్లనూ ఆస్వాదిస్తూ
గుబురు చెట్లపై కూర్చుని
కోకిలమ్మలు కుయూ కుయూ
అని కూస్తుంటే కమ్మగా ,
వినసొంపుగా ఉంటుంది
కోకిల కూతలను వినడానికి
పిల్లలు చెవులు నిక్కబొడుచుకుని
వింటూ , వారి స్వరాలను కూడా
జోడిస్తారు!

తీరానికి వచ్చి పోయే
ఎగిసిపడే కడలి కెరటాల
పొంగులు మనసుకు ఎంతో
ఉల్లాసాన్ని ఇస్తాయి
కడలి సవ్వడులు మనోహరంగా
చెవులకింపుగా ఉంటాయి,
మనసును మైమరిపిస్తుంటాయి!

అమ్మ పలుకు తీయన
అమ్మ  మాట అమృతం
ఇష్టమైన అమ్మ మాట వేదం
అమ్మ మాట శాసనం బిడ్డలకు
అది వినసొంపుగా ఉంటుంది!

మాట ఎదుటి వారిని
హత్తుకోవాలంటే
మాట ఎవరు చెప్పినా
వినసొంపుగా ఉండాలి
అందులో స్వచ్ఛత ఉండాలి
నిజాయితీ ఉండాలి
ప్రేమ ఆప్యాయత ఉండాలి!

చెప్పే మాట నచ్చే విధంగా,
మనోహరంగా, ఇష్టంగా ఉండాలి
హృదయాన్ని కదిలించాలి
ఆలోచనను రేకిత్తింపజేయాలి
చైతన్య పరుచాలి
సంస్కరింప చేయాలి!

పరుషం, కఠినం
వక్రభాషణం
ఉండకూడదు
పరిహాసం చేసేవిధంగా
కించ పరిచే విధంగా
కోపం తెప్పించే విధంగా
బాధ పెట్టే విధంగా
ఉండకూడదు
మధురంగ ఉండాలి

*నోరు మంచిదైతే*
*ఊరు మంచిది* అన్నట్లు
మన నోరు మంచిదైతే
ఊరిలో ఉన్న వారంతా కూడా
బాగానే కలిసి మెలిసి ఉంటారు
తీయగా మాట్లాడుతారు!

అంతేనా,
మాటే మంత్రం అన్నారు పెద్దలు
మాట చెప్పడం , మాట్లాడటం
సమయం, స్థలం, సందర్భ
సహితంగా ఉండాలి

"మాట్లాడటమనేది ఒక కళ"
ఇది అందరికీ సాధ్యం కాదు
అది భగవంతుడు కొందరికే
కలిగించిన అదృష్టం!

     

బంధాలు - అనుబంధాలు

శీర్షిక: బంధాలు - అనుబంధాలు


సారం

లేని మాను

వట్టి పోయిన 

కొమ్మలు 

వాలిపోయిన 

ఆకులు 

వాసన పోయిన 

పువ్వులు 

వాడి పోయిన 

కాయలు 

ఏవి పచ్చదనాలు !


ఆప్యాయతలు 

అనురాగాలు 

కరుణా కటాక్షాలు 

బంధాలు 

అనుబంధాలు 

కనుమరుగవుతున్న 

రక్త సంబంధాలు 

ఏవీ ఆత్మీయతలు !


రక్త మాంసాలు 

ధారపోసి

దేహ కండరాల 

కరిగించి 


కాలుకు 

ముల్లు గుచ్చితే 

పంటితో పీకి 


కంట్లో 

నలుసు పడితే 

నాలుకతో తీసి 


శ్రమించి 

చెమటోడ్చి 

పెంచి పెద్ద చేసి 

విద్యాబుద్దులు 

నేర్పించి 


ఉద్యోగాలు 

చేయించి 

శక్తి కొలది 

కట్న కానుకలిచ్చి 

పెండ్లిళ్ళు చేసి 

సాగనంపుతే 



వృద్ధ తల్లి దండ్రులు 

చుట్టు పక్కలనే 

నివశిస్తున్నా

ఊరి పొలిమేరలోనే 

జీవిస్తున్నా


మాటే

బంగారమైనట్లు

తీపి జ్ఞాపకాలు 

చేదైనట్లు


కాగితపు 

పూల లాంటి 

మెస్సేజ్ లతో

పుట్టిన రోజు 

శుభాకాంక్షలు 

వివాహ మహోత్సవ 

శుభాకాంక్షలు 

వాట్సాప్ లలో 

ఫేస్ బుక్ లలో 

ట్విట్టర్ లో

పంపిస్తుంటారు

కన్న కొడుకులు బిడ్డలు 


కొందరికి 

అవియునూ 

ఇష్టముండదు

తీరికుండదు 

గుర్తుండదు 


ఇంకా లేదంటే 

మాతృమూర్తుల 

సేవలకు 

డబ్బుతో 

వెల కడుతారు 


ప్రేమలు 

తరిగి పోయే

మమతలు 

కరిగి పోయే

మనసు 

కలవరపెడుతుండే


గడిచిన రోజు 

తిరిగి రాదు 

పోయిన కాలం 

మరల రాదు 


ఆపద వచ్చి

నాలుగు రోజులు తింటే 

లెక్కలు వేస్తారు 

కాదు కూడదంటే

నరకం చూపిస్తారు 


అనారోగ్యానికి 

పదో పాతికో 

ఖర్చు చేస్తే 

లెక్కకు లెక్కే అంటారు 

పగలు పెంచుకుంటారు 

పది మందికి 

పంచి పెడుతారు 


తలుచుకుంటే 

గుండెలో బాధ 

అయినా 

దాచుకోవాలి 

హృదయంలోనే వ్యధ

కడుపు చించుకుంటే

కాళ్ళ మీద పడుతాయి

రుధిరము చుక్కలు!


తెలిసి వస్తుంది 

వారికీ

వారి బిడ్డలు 

వారికీ  

ఆ కాగితపు పుష్పాలు 

అందించి నప్పుడు 


తల్లిదండ్రుల

సేవలను 

డబ్బుతో 

వేలల్లో వెలకడితే 

వారి బిడ్డలు 

అదే డబ్బుతో

డాలర్లలో వెలకడుతారు 

అంతే తేడా 


బంధాలు 

అనుబంధాలు 

రక్త సంబంధాలు 

ఇక రైలు పట్టాలేనా!

మానవ సేవయే మాధవ సేవ

అంశం: *సర్వ జన హితం*


శీర్షిక: *మానవ సేవయే మాధవ సేవ*

ప్రకృతి జీవకోటికి వరం
చూపిస్తుంది ఎంతో కనికరం
తలపడితే ఉంటుంది ఘరం ఘరం
తెలుసుకోవాలి తప్పిదాలను సత్వరం!

ఆహారం కనబడితే చాలు
కాకులు పిలుస్తాయి తోటివారిని
నోరెత్తి కావు కావు మంటూ
వచ్చే వరకు ముట్టవు నొక్క మెతుకైనా!

తోటి చీమల హితం కోరి
కలిసికట్టుగా బయలు దేరుతాయి
అది యుద్దమైనా, ఆరగించే పదార్ధమైనా
ఆహారాన్ని ఎండాకాలంలో సేకరించుకుని
వర్షాకాలంలో కలిసి కూర్చుని తింటాయి!

అరువది నాలుగు లక్షల జన్మల
అనంతరం వస్తుంది మానవ జన్మ
సార్ధకం చేసుకోవాలి కొంతైనా
స్వార్ధం విడనాడి , నైతికతను పాటిస్తూ
చేసిన మేలు స్థిరస్థాయిగా నిలిచిపోవు!

కులాలు వేరైనా, మతాలు వేరైనా
భిన్నత్వంలో ఏకత్వంలా
భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా
పేద ధనిక, చిన్నా పెద్దా
అక్షరాస్యులు, నిరక్షరాస్యులెవరైనా!

చేసే పని ఏదైనా ,
మాట్లాడే మాట ఏదైనా
చేసే సహాయం ఏదైనా
ఏమీ ఆశించకుండా, నిస్వార్థంగా
పరుల మేలును కోరి చేయాలి
అది సర్వ జన హితం కావాలి
*మానవ సేవయే మాధవ సేవ*
సర్వే జనాః సుఖినోభవంతు!

తడి మనసులను అద్దుదాం

అంశం: *తడి మనసులను అద్దుదాం*


శీర్షిక: *జీవించాలనే చిన్న ఆశ*

చూసిన కళ్ళకు తెలుసు
రోడ్డుపైన ఏమి జరిగిందో అనేది
వినిన చెవులకు తెలుసు
తోవన పోయే వారు మాట్లాడుతూ ఉంటే
అక్కడ ఎంత రుధిరం పారుతుందోనని
కానీ ఏమి లాభం
మనసుకు ఉండాలి కదా కాసింత మానవత్వం
గాయ పడిన వారికి సాయం చేయాలని

ఎంత కాలం గడిచినా
ప్రకృతి నుండి ఎన్ని నేర్చినా ఏమి నేర్చినా
అవి బూడిదలో పోసిన పన్నీరే
ఏమి ఆశించి తరువులు నీడనిస్తున్నాయి
ఏమి ఆశించి చెరువులు దాహాన్ని తీరుస్తున్నాయి
పక్షులు జంతువులు జీవకోటి నుండి ఎన్ని
నేర్చినా అవి ఎండ మావులేనా

శునకాలు ఒంటరిగా చెత్త కుండీలో
ఆహారాన్ని తినవు
కాకులు ఒంటరిగా ఆహారాన్ని
స్వీకరించవు
ఒక కాకి చనిపోతే , మిగిలిన కాకులన్నీ
దాని చుట్టూరా చేరి సానుభుతి ప్రకటిస్తాయి
కొన్ని కీటకాలు , చనిపోయిన కీటకాన్ని
బరిలో పూడుస్తాయి

కొన్ని సందర్భాలలో
బద్ద శత్రువులైన శునకాలు, పిల్లులు,
కోళ్ళు కలిసి మెలిసి ప్రేమతో జీవనం
కొనసాగిస్తున్నాయి
జన్మ లన్నింటిలో ఉత్తమ జన్మమైన మనిషి
మానవత్వం మరిచి పోతున్నాడు

బాధలో ఉన్న వారికి, ఆపదలో ఉన్నవారికి
కావల్సింది కాసింత ఓదార్పు
కాసింత సహాయం , కాసింత సానుభూతి
కన్నీరు తూడ్చడానికి, తుండ్రు గుడ్డకూడ
అందించని మనిషి జన్మ ఎందుకు?

భూభ్రమణం భూపరిభ్రమనం వలన
పగలు రాత్రులు, కాలాలు ఎలా ఏర్పడతాయో
అలానే ప్రతి మనిషిని కష్టాలు నష్టాలు
దుఃఖాలు బాధలు ఆవరిస్తాయి
ఇక్కడ ఎవరూ అతీతులు కారు

ఆపదలో ఉన్న వారిని ,కన్నీరు కార్చే వారిని
కష్టాల్లో ఉన్న వారిని,చీదరించుకోకుండా
విసుక్కోకుండా, అవహేళన చేయకుండా ,
వారిపై,  కొద్దిగా ప్రేమ, దయ, కరుణ
కాసింత ఓదార్పు , సానుభూతి చూపినా
సానుకూల మాటలు మాట్లాడినా
వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది
తడి మనసులను అద్దినా ,  రేపటి
భవిష్యత్తుకు, వారికి దారి కనబడుతుంది
*జీవించాలనే చిన్న ఆశ* చిగురిస్తుంది

మానవత్వంతో జీవించే వారికి
ఎల్లప్పుడూ లభిస్తుంది ఆత్మ సంతృప్తి

గ్రామ దేవత మొక్కులు

అంశం: చిత్ర కవిత


శీర్షిక: *గ్రామ దేవత మొక్కులు*

సంస్కృతి సాంప్రదాయాలకు
పుట్టినిల్లు భారత దేశం
అవి లక్షల సంవత్సరాల నుండి
వస్తున్న ఆచార సంప్రదాయాలు!

ప్రతి మనిషికి ఉంటాయి
లక్షా తొంభై సమస్యలు
ఒక్కొక్కరిది ఒక్కోదారి
డబ్బున్న వారు ప్రయివేటు
దవాఖానాకు పోతారు
డబ్బులేని వారు సర్కారు
దవాఖానాకు పోతారు
ఆస్తికులందరూ గుడులకు
ఊరి దేవతల వద్దకు వెలుతారు
మరొకరు మరోదారిని
ఎంచుకుంటారు!

ఎవరి బాధలు వారివి
ఎవరి కష్టాలు వారివి
ఎవరి దుఃఖాలు వారివి
ఎవరి విశ్వాసాలు వారివి
ఎవరి నమ్మకాలు వారివి
ఎవరి ఇష్టాలు వారివి
ఎవరి మొక్కులు వారివి
ఎవరి అవసరాలు వారివి!

మొక్కులు తీర్చుకోక పోతే
ఏదో జరుగుతుందన్న భయం
అప్పు సప్పు చేసైనా
ఎంత ఖర్చు అయినా
అది ఎంత దూరం అయినా
మొక్కులు తీర్చుకుంటారు జనం!

గ్రామ దేవతకు
గొర్రె బలిని ఇస్తామని మొక్కారు
కోరిన కోరిక తీరింది
చుట్ట పక్కాలను, బంధుమిత్రులను
పిలుచు కున్నారు
నూతన వస్త్రాలను ధరించి
గొర్రెను,కత్తిని పసుపు కుంకుమలు
పట్టువస్త్రాలు అక్షింతలను
నూతన వస్త్ర నీడలో పట్టుకుని
అంగరంగ వైభవంగా, ఆనందోత్సాహాలతో
ఫోటో గ్రాఫర్ ముందుండి ఫోటోలు తీస్తుంటే
భాజా బజంత్రీలతో, సన్నాయి మేళాలతో
బయలు దేరారు మొక్కులు తీర్చుకునను!

రూపకాలంకారాలు - శ్రీ కృష్ణుడు

అంశం: రూపకాలంకారాలు


శీర్షిక: "శ్రీ కృష్ణుడు*

శ్రీ కృష్ణుడు
దశావతారాలలో
ఒక అవతారం కృష్ణావతారం
లోక కల్యాణం కొరకు
విశ్వశాంతి కొరకు
శిష్టరక్షణ, దుష్టశిక్షణ శిక్షణ గావించ
ద్వాపర యుగంలో
దేవకీ అష్టమ గర్భాన
కంసుడు నిర్భంధించిన కఠిన చెరసాలలో
ఆదివారం అష్టమి రోజున
అర్ధరాత్రి సమయాన
ఆకాశంలో ఉరుములు మెరుపులు
కుంభ వర్షం పడుతున్న వేళ
కెవ్వున కేకలేస్తూ దివ్య తేజస్సుతో
జగతిన అవతరించాడు కృష్ణుడు

శ్రీ కృష్ణుడు
దేవకీ వసుదేవుల నందనుడు
యశోద నందులు పెంచిన తనయుడు
కంస చాణూర మర్ధనుడు
నల్లని మేను గలవాడు.
నీల మేఘాశ్యాముడు
పద్మ నయనమ్ముల వాడు
నవ్వు రాజెల్లెడు మోము వాడు
వివిధ ఆభరములకు ఇష్టుడు
మౌళి పరిసర్పిత పింఛం గలవాడు
మందార మాల, పీతాంబరములు
తులసి మాలలు ధరించు వాడు
మెలి దిరిగిన ముంగురులు కలవాడు
చేతిలో పిల్లన గ్రోవి ధరించు వాడు
వనమాల శంకు చక్రాలను ధరించు వాడు
సుధారసమ్ము పై జల్లెడు వాడు
యదు భూషణుడు, శృంగార రత్నాకరుడు
భక్తవత్సలుడు, లోకేశ్వరుడు
గరుత్మంతుడను పక్షి వాహనం గలవాడు
రుక్మిణి సత్యభామాదులతో విహరించు వాడు

శ్రీ కృష్ణుడు ,
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము
కాళింది పడగలపై కప్పిన పుష్యరాగం
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
సంజయుని సఖుడు ,
ద్రౌపది వస్త్రాపహరణ నుండి కాపాడిన వాడు
కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథి
గీతా బోధకుడు , జగద్గుగురువు
విశ్వ జీవకోటి సంరక్షకుడు
భగవంతుడు, శ్రీ కృష్ణుడు
వందే కృష్ణం! వందే జగద్గురుం!

మొక్కై వంగనిది మానై వంగునా

శీర్షిక: *మొక్కై వంగనిది మానై వంగునా*


"మొక్కైవంగనిది మానై వంగునా"
అన్నట్టు
ఒక విత్తు ఒక మొక్కగా
ఒక మొక్క చక్కని చెట్టుగా,
వటవృక్షంగా, కల్పతరువుగా
ఎదుగాలాంటే,ఫలాలు తీయలంటే
తోటమాలి మొదటి నుండే
శ్రద్ధాసక్తులు చూపుతాడు!

నాణ్యమైన విత్తనాలు నాటడం
నీరు,ఎరువులు గాలి సూర్య రశ్మి
తగిలేటట్లు చూస్తాడు
మొక్కగా ఎదుగు తున్నప్పుడు
క్రిమి కీటకాలు పక్షుల బారిన
పడకుండా చర్యలు తీసుకుంటాడు!

మొక్కగా ఎదుగుతున్నపుడు
చక్కగ పెరుగడానికి, జంతువుల
బారిన పడకుండా ఉండాలని
చుట్టూ కంచెను నాటుతాడు
నీరు పోస్తాడు ఎరువులు చల్లుతాడు
ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పా
విత్తు మొక్క, మొక్క చెట్టు కాదు
వటవృక్షము కాదు!

*నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా*
అన్నట్లుగా
పిల్లలు , వారు చేసే తప్పులను
తల్లిదండ్రుల పైకి, సమాజం పైకి
తోయకుండా, సంస్కార వంతంగా
తల్లిదండ్రులు నడుచుకోవాలి
విద్య అంటే మంచి చదువు ఒకటే కాదు
మంచి సంస్కారం, మంచి ప్రవర్తన
సత్సంబంధాలు,సమాజహితం కూడాను!

పిల్లలకు ఆది గురువులు తల్లిదండ్రులు
మొదటి బడి వారి ఇల్లు
ఇల్లు బడే కాదు, అది ఒక వేద పాఠశాల
జ్ఞానబోధశాల, ఒక పార్లమెంటు
తల్లిదండ్రులు గురువులేనా? కాదు
పిల్లలకు జ్ఞాన బోధ జేయు ఋషులు
మహర్షులు, దేవుళ్ళు!

పిల్లలను ఎంత క్రమశిక్షణతో పెంచితే
అంత గొప్పగా రాణిస్తారు
క్రమశిక్షణ అంటే నాలుగు గోడల మధ్య
బంధించడం కాదు
కొట్టడం తిట్టడం  అంతకంటే కాదు!

*ఆవు చేనులో మేస్తే దూడ*
*గట్టున మేస్తుందా* అన్నట్లు
ముందుగా తల్లి దండ్రులు
మంచి క్రమ శిక్షణ, మంచి ప్రవర్తనతో
ఉంటూ పిల్లలకు ఆదర్శంగా నిలువాలి!

పిల్లలు ఆలోచనలు గమనించాలి
వాటికి అనుగుణంగా చేయూతనివ్వాలి
వారి స్నేహాలను గమనించాలి
మంచి చెడులను తెలియజేయాలి
చదువుతో పాటు ఆటలు పాటలలో
స్వేచ్ఛ నివ్వాలి!

బంధుత్వాలు మానవసంబంధాలను
తెలియజేయాలి
పిల్లలకు మంచి అలవాట్లను అలవర్చాలి
చక్కని పాఠశాలలలో చదివించాలి
ఒక స్థాయి చదువు పూర్తయిన పిదప
వారి ఆలోచనలకు,అభిరుచులకు తగిన
విద్యాబోధన జరిగేటట్లు జాగ్రత్త వహించాలి
డాక్టరే కావాలి, ఇంజినీరే కావాలని
పిల్లలపై వత్తిడి తీసుకని రాకూడదు
తల్లిదండ్రుల ఇష్టాలను,
బంధువుల ఇష్టాలను పిల్లలపై
రుద్దకూడదు 

తల్లి తండ్రులే ఆది గురువులు

అంశం: నీవు నేర్పిన విద్యయే


శీర్షిక: *తల్లి దండ్రులే ఆది గురువులు*

*యధా రాజా తధా ప్రజా*
రాజు నీతి మంతుడైతే మంత్రులు
పాలకులు, ప్రజలు నీతిమంతులై ఉంటారు
రాజు అవినీతి పరుడైతే మంత్రులు
పాలకులు, ప్రజలు అవినీతి పరులవుతారు
ఇది జగమెరిగిన నగ్న సత్యం!

*నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా*
అనే నానుడి కూడా అలా ఏర్పడినదే
నాన్న చాటుగా సిగరెట్లు త్రాగినా,
ఆల్కహాల్ త్రాగినా
అమ్మ, నాన్నకు తెలియకుండా
జేబులో నుండి డబ్బు తీసి దాచుకున్నా
అక్క అమ్మ నాన్నకు తెలియకుండా
చరవాణిలో నీలి వీడియోలు చూసినా
అమ్మా నాన్న ఎవరైనా మార్కెట్లో
వస్తువులను దొంగిలించినా
లేదా పిల్లలు దొంగిలిస్తుంటే ప్రోత్సహించినా
నాయకులు అవినీతికి పాల్పడుతుంటే
చట్టాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నా
ఆ ప్రభావం పిల్లలపై, యువతపై,
సమాజంపై తప్పక పడుతుంది!

కలియుగంలో అవినీతి , పాపాలు
మోసాలు నాలుగు పాదాలు
నడవడానికి ముఖ్యకారణం
పూర్వ కాలం నుండి ఒకరినుంచి
మరొకరికి "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా"
అనే సామెత అద్దం పడుతుంది

పిల్లలకు *ఆది గురువులు తల్లిదండ్రులు*
మొదటి బడి వారి ఇల్లు
ఇల్లు బడే కాదు, అది ఒక వేద పాఠశాల
జ్ఞానబోధశాల, ఒక పార్లమెంటు
తల్లిదండ్రులు గురువులు మాత్రమేనా? కాదు
పిల్లలకు జ్ఞాన బోధ జేయు ఋషులు
మహర్షులు, దేవుళ్ళు వీరే!

పిల్లలను ఎంత క్రమశిక్షణతో పెంచితే
అంత గొప్పగా రాణిస్తారు
క్రమశిక్షణ అంటే నాలుగు గోడల మధ్య
బంధించడం కాదు
కొట్టడం తిట్టడం  అంతకంటే కాదు!

*ఆవు చేనులో మేస్తే దూడ*
*గట్టున మేస్తుందా* అన్నట్లు
ముందుగా తల్లి దండ్రులు
మంచి క్రమ శిక్షణ, మంచి ప్రవర్తనతో
ఉంటూ పిల్లలకు ఆదర్శంగా నిలువాలి
పిల్లలు తల్లిదండ్రులను ప్రతిక్షణం
అనుకరిస్తారు , అనుసరిస్తారు!

పిల్లలు ఆలోచనలు గమనించాలి
వాటికి అనుగుణంగా చేయూతనివ్వాలి
వారి స్నేహాలను గమనించాలి
మంచి చెడులను తెలియజేయాలి
చదువుతో పాటు ఆటలు పాటలలో
స్వేచ్ఛ నివ్వాలి!

బంధుత్వాలు మానవసంబంధాలను
తెలియజేయాలి
పిల్లలకు మంచి అలవాట్లను అలవర్చాలి
చక్కని పాఠశాలలలో చదివించాలి
ఒక స్థాయి చదువు పూర్తయిన పిదప
వారి ఆలోచనలకు,అభిరుచులకు తగిన
విద్యాబోధన జరిగేటట్లు జాగ్రత్త వహించాలి
డాక్టరే కావాలి, ఇంజినీరే కావాలని
పిల్లలపై వత్తిడి తీసుకని రాకూడదు
తల్లిదండ్రుల ఇష్టాలను,బంధువుల ఇష్టాలను
పిల్లలపై రుద్దకూడదు

నేటి బాలలే రేపటి పౌరులు
వారే నవసమాజ నిర్మాణానికి పునాదులు

సంక్రాంతి సంబరాలు

అంశం: కలం గళం- సంక్రాంతి గేయాలు


శీర్షిక: *సంక్రాంతి సంబరాలు*

పల్లవి:
ఆమె:
ఆకాశంలో రంగు రంగుల పతంగులతో..
అవనిలో పచ్చ పచ్చని పంటలతో..
పట్టు పీతాంబరంలా మంచు తెరలతో..
శోభ నిస్తుంది సంక్రాంతి... "ఆకాశంలో"
అతడు:
పాడి పంటలతో పశుపక్ష్యాదులతో
సకల సంపదలతో పచ్చిక బయళ్ళతో
పిల్లల పెద్దల కోలాహలంతో
పరవసించి పోతుంది సంక్రాంతి .. "ఆకాశంలో"
చరణం: 01
డూ డూ బసవన్న వచ్చాడు
కుంకుమ బొట్లు నుదుట ధరించి
ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ... "2" "డూడూ"
అతడు:
కాళ్ళ గజ్జెలను ఆడిస్తూ...
అమ్మకు అయ్యకు దండం పెడుతూ
యేడాది కోసారి సంక్రాంతి పండుగకు
ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ ... "2" "డూడూ"

చరణం: 02
ఆమె:
తుపాకి రాముడు గొప్పలు చెబుతూ ..
వంద తుపాకులున్నాయంటూ...
వజ్ర వైడూర్యాలున్నాయంటూ...
అమెరికా ప్రెసిడెంట్ నంటూ...    "తుపాకి"
అతడు:
నాకేమి తక్కువంటూ....
వెయ్యి పుట్లు పండించానంటూ..
దేశంలోని జనులందరికీ....
ఒక్క మెతుకుతో కడుపు నింపుతాననీ "తుపాకి"

చరణం:03
ఆమె:
కొత్త అళ్ళుళ్ళు బంధు మిత్రులు రాగా....
నూతన వస్త్రాలు ధరించి..
కొత్త ధాన్యంతో పిండి వంటలు
కనుల విందుగా సంక్రాంతి పండుగ.. "ఆకాశంలో"
అతడు:
కోడి పందాలు జోరుగా సాగే
కోలాహలంగా రోజంతా...
సంక్రాంతి పండుగ సంబరాలు
మెండుగ జరిగే  ఉత్సాహంగా... "ఆకాశంలో"



ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

అంశం: *శ్రమ జీవుల గళం*


శీర్షిక: *ఎక్కడ వేసిన గొంగళి అక్కడే*

స్వాతంత్ర్యం వచ్చినా
చట్టాలు ఏర్పడినా
సాహిత్యం విస్తరించినా
విప్లవ గీతాలు పాడినా
*ఎక్కడ వేసిన గొంగళి అక్కడే*
శ్రామికుల జీవితాలు అంగడే!

పందొమ్మిది వందల తొంబై ఒకటిలో
గ్లోబలైజేషన్, లిబరలైజేషన్
ప్రయివేటైజేషన్ ఏర్పడ్డాక
ప్రపంచమొక కుగ్రామంగా మారింది
టెక్నాలజీ విస్తరించింది
పదిమంది శ్రామికులు చేసే పనిని
ఒక మెషీన్ పూర్తి చేస్తుంది
కార్మిక చట్టాలను తుంగలో
తొక్కేశారు
ఇక ఇప్పుడు *ఆర్టిఫీషియల్ ఇంటిలీజెన్స్*
వచ్చింది
కార్మికులు ఇప్పుడు  ముప్పేట దాడి
ఎదొర్కొంటున్నారు
రాజకీయ నాయకుల మోసాలు
దళారీ దారుల దోపిడి
చట్టాలు ధనికులకే చుట్టాలవడం
కార్మికుల పక్షాన పోరాడే నేతలు
లేక పోవడం
కార్మికులలో ఐక్యత లేకపోవడం
రాజకీయ నాయకులకు బానిసలుగా
మారడం
ఉచితాలకు చకోర పక్షుల్లా ఎదిరి చూడటం
ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు
వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే
ఒకే ఒక మార్గం ఉంది, అదేమంటే,
*ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశంలో*
*రాష్ట్రపతి పాలన* విధించాలి
అప్పుడే నాయకులలో , అవినీతి
వ్యాపారులలో, బ్యూరోక్రాట్స్ లలో
భయం అనేది ఏర్పడుతుంది

పంటలు పండించే రైతులు
వ్యవసాయ సాగులో పని చేసే కూలీలు
పరిశ్రమలలో పని చేసే కార్మికులు
భవన నిర్మాణాలలో పనిచేసే కార్మికులు
మైనింగ్ లలో పని చేసే కార్మికులు
ప్రభుత్వ కార్యాలయాలలో
ప్రయివేటు కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు
కర్మాగారాలలో, కారాగాలలో పనిచేసేవారు
పాఠశాల, కళాశాలలో పనిచేసే ఉద్యోగులు
దేశాన్ని రక్షించే జవానులు అందరూ శ్రామికులే

ఎవరి వృత్తి వారిది,అందరూ దేశానికి
ఉత్పాదకత శక్తులే
ఎవరి వ్యధలు వారివే, ఎవరి బాధలు వారివే
ఎవరి కష్ట నష్టాలు వారివే
ఎవరినీ తక్కువ చేయడం గానీ
ఎవరినీ తక్కువ చేయడం గానీ సరికాదు

శ్రామికులు కలిసి కట్టుగా , ఐక్యంగా ఉండి
వారి వారి హక్కులను సాధించుకోడానికి
గళం ఎత్తాలి.
లేదంటే ఎన్ని ఏండ్లు గడిచినా శ్రామికుల
బ్రతుకులు, ఆర్ధిక స్థితి గతులు
*ఎక్కడ వేసిన గొంగళి అక్కడే*  అన్నట్లుగా
ఉంటుంది

వెలిగి పోతుంది నా దేశం

అంశం: *గణతంత్ర ధగధగలు*


శీర్షిక: *వెలిగి పోతుంది నా దేశం*

*వెలిగి పోతూంది నా దేశం*
ప్రపంచం నలుమూలలా
ప్రకాశిస్తుంది సూర్య కాంతిలా
విశ్వ మానవాళికి అందిస్తుంది
శాంతి పవనాలను శశి వెన్నెలలా!

డాక్టర్ అంబేద్కర్ రచించిన
రాజ్యాంగ స్ఫూర్తితో
భారత గణతంత్ర ధగధగలు
మెరిసి పోతున్నాయి
వాడవాడలా గ్రామగ్రామాన
భారత దేశ మంతటనూ!

ఆర్టికల్ 370 రద్దు , తలాక్ తలాక్ రద్దు
బాబ్రిమసీద్ సమస్య పరిష్కారం
రామ మందిరం నిర్మాణం,పెద్ద నోట్ల రద్దు
కరోనా అరికట్టడంలో సఫలీకృతం
చంద్రమండలానికీ చంద్రయాన్ -3 ను పంపి
విశ్వ విజేతగా చరిత్రలో నిలిచి
ఆగష్టు,23 ను *అంతరిక్ష దినోత్సవం* గా
ప్రకటించి
భారత గణతంత్ర ధగధగలు
మెరిసి పోతున్నాయి దేశమంతటా!

జనాభా అదుపులో ఎంతో పురోగతి
జి.ఎస్టీ వృద్ధిలో, జి.డి.పి వృద్ధిలో
స్వయంసమృద్ధిలో, సాంకేతికాభివృద్ధిలో
దేశ రక్షణలో, శాంతి స్థాపనలో
అభివృద్ధి సాధించింది దేశం
నేడు గణతంత్ర ధగధగలు
దేశ నలుమూలలా విస్తరించాయి!

విద్య వైద్య వికాసంలో పురోగతి
జీవన ప్రమాణంలో అభివృద్ధి
శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి
వ్యాపార స్వేచ్ఛా విధానంలో అభివృద్ధితో
దేశం వెలిగిపోతోంది సూర్య కిరణాల్లా
గణతంత్ర ధగధగలు తళుకు తళుకు మంటూ
మెరిసి పోతున్నాయి విశ్వవ్యాప్తంగా!

పైలం కొడుకా!

అంశం: *నువ్వు వెళ్ళే దారిలో*

శీర్షిక: *పైలం కొడుకా!*

పైలం కొడుకా!
ఎక్కే కాడ దిగే కాడ
జర పైలం కొడుకా!

పైసలు ఆడ ఈడ పెట్టకు
జాగ్రత్తగ పెట్టుకో బిడ్డా
ఎవరేమిచ్చినా త్రాగకు కొడుకా
పయోముఖ విష కుంబనాలుంటారు
ఎవరితో ఎక్కువగా ఏమి మాట్లాడకు
పెద్ద పెద్ద మాటలు గలిపి మట్టి బుక్కిస్తరు
పైలం కొడుకా!

బట్టలన్నీ బ్యాగులో పెట్టుకన్నవు కదా
నౌకరి కాయితం కూడా పెట్టుకున్నవు కదా
పైసలు కూడా అల్లనే పెట్టుకో
బ్యాగు అక్కడ ఇక్కడ పెట్టకు
కాళ్ళ దగ్గరే పెట్టుకో
మల్ల యాది మరువకు బిడ్డా
ఇప్పుడే గజగజ చలి పెడుతుంది 
షెటరేసుకో
ఇంకా పైసలు కావాలంటే నాయనతో చెప్పి
గా శంకర్ తో పోన్లో పంప మంట
పెద్ద కొలువాయే, అప్పటికప్పుడే
జీతమియ్యరట!

బస్సు దిగినంక, *నువ్వు వెల్లేదారిలో*
ఏమైనా కాయగూరలు, కూరగాయలు
కనబడితే కొనుక్కొనిపో
నువ్వు పోయే సరికి సిమ్మ సీకటి 
పడుతోంది కావచ్చు
జర భద్రం కొడుకా
ఏమి భయపడకు , సరేనా
ఇక నేను ఉంటాను!

అన్నట్లు, చెప్పడం మరిచి పోయిన బిడ్డా
పోంగనే దగ్గర దగ్గర పోను చేయి 
నాయన పొలం పనిలో పడి ఎత్తక పోతే
గా స్వామికి చేయి బిడ్డ
ఇక ఉంటాను మరి
బస్సులోకి డ్రైవర్ మెల్లమెల్లగా ఎక్కుతుండు
ఇక బస్సు కదిలేటట్లు ఉంది
నువ్వు ముక్కుకు మాస్కు పెట్టుకో
మల్లేవో రోగాలు వస్తున్నాయట
చేను కాడ నిన్న అనుకుంటే విన్న
మరిచి పోకు, ఇక నేను ఉంటాను!

నౌకరికి పోతున్నప్పుడు
*నువ్వు వెళ్ళే దారిలో*
బస్సు ఎక్కే కాడ, దిగే కాడ
నువ్వు పని చేసే ఆఫీసులో
నల్ల నాగులుంటాయి
కాటేసే వరకు తెలియదు 
పడుసు పిల్లలు ఉంటరట
ఒయ్యారాలు ఒలక బోస్తరు
ఎర్రగా బుర్రగ ఉన్నవని
తియ్యని మాటలు కలుపుతరు
నీకేమో నోట్లో నాలుక లేదాయే
ఎట్లనో ఏమో
సైగలు చేస్తరు, దగ్గరవుతరు
నీవు పట్టించు కోకు
డ్యూటీ అయిపోగానే
సక్కగా ఇంటికి పో
నువ్వే మంచిగా వండుకొని తినుబిడ్డ
చిన్న చిన్నగా అలవాటు చేసుకో
హోటల్ల తినకు, సున్నం కలుపుతరు
కడుపు నొప్పి లేస్తది
బస్సు కదుల్తాంది ఇక ఉంటాను కొడుకా
ఎట్లుంటవో ఏమో
ఆరానికోసారి ఫోన్చెయ్యి బిడ్డా!

Monday, January 6, 2025

ఇంతకు నువ్వెవరు

అంశం: ఇంతకు నువ్వెవరు?


శీర్షిక: *మనీషిని నేను*

నేవెవరిని?
మనిషినా ? మానునా? మనిషిని పోలిన రోబోనా?

లేదు నేను మనిషినే, నేను ఒక ప్రాణిని
ఈ భూ మండలంలో నేను ఒక సంఘ జీవిని
రవి గాంచని చోటును గాంచు కవిని

మాటలాడ గలను ,చూడ గలను
విన గలను, అర్ధం చేసుకోగలను
విద్య నభ్యసించ గలను, విజయం సాధించ గలను
ప్రకృతి నుండి ఎన్నో నేర్చుకోగలను
జీవితం సార్ధకం చేసుకోగలను
శాస్త్ర సాంకేతిక ,విద్య వైద్య కళా రంగాలలో
వ్యవసాయ రంగాలలో స్వయం సమృద్ధి
సాధించ గల *మనీషిని నేను*

పంటలు పండించే రైతుగా,కష్టించే కార్మికుడిగా
విద్యను బోధించే గురువుగా
వైద్యాన్ని అందించే డాక్టర్ గా
జ్ఞానాన్ని పంచే శాస్త్ర వేత్తగా
పోరాడే యోధుడిగా, దేశాన్ని రక్షించే జవానుగా
బహుముఖ పాత్రలను పోషించు *మనీషిని నేను*

సమాజ హితం కోరు,సమతా భావం చూపగల
సమాజాన్ని,వ్యవస్థల సంస్కరించగల
*మనీషిని నేను*

భారత దేశ పౌరుడిగా ,ఆదర్శ నీయుడిగా
మార్గదర్శిగా శక్తికి తగిన సేవలు అందిస్తూ
భారం కానీ దాన ధర్మాలు చేస్తూ
ఆపదలో నున్నవారికి అభయమిస్తూ
భారత సంస్కృతి సంప్రదాయాలను
మానవ సంబంధాలను కాపాడుతూ
ఆత్మీయంగా పలకరిస్తూ ,అమ్మా నాన్నల
గురువులను, ప్రతి నిత్యం దైవాన్ని పూజించే
*మనీషిని నేను*

కార్తీక మాసం మహాత్యం

అంశం: *సెల్ఫీ కవిత *

శీర్షిక: *కార్తీక మాసం మహాత్యం*


కార్తీక మాసంబు పూజలకును శుభంబు
ఉపవాసాలు చేయుటకు దేదీప్య మాసంబు
శుభప్రద దినములకు మంచి ముహూర్తాలకు
వివాహాలు జరుపించ నూతనపు జంటలకు
తెలుగు సంవత్సరంలో తెలుగు మాసంబులలో
ఎనిమిదవ మాసంబు కార్తీక మాసమిలలో
నిండు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రమున
చంద్రుడు కృత్తిక కలిసి మొదలగు కార్తీకమున
శివుడు విష్ణువులిరువురికి హిందూ ప్రజలు అందరికి
కార్తీక మహత్యంబు పూజా ఉపవాసములకి
పుణ్య క్షేత్రాలన్నియు పవిత్రపూ నదులన్నియు
కళకళలాడుతుండు గుడులు గోపురాలన్నియు
ఆయురారోగ్యాలకు సుఖ సంతోషంబులకు
ఉత్తమమైన మాసము.
ప్రజలు వృద్ధి చెందుటకు
కార్తీక మాసమందున పూజా ధ్యానమునుండిన
జనులకు గౌరవం పెరుగును
ఇది మన భారతీయ సంస్కృతి
కార్తీక మాసమందు ఉపవాసముండిన
కోటి దీపాలు వెలిగించిన
వేద పండితులతో పూజలాచరించిన
కలుగు సుఖ సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు
అష్టైశ్వర్యాలు

స్వాగత గేయాలు - హ్యాపీ న్యూ ఇయర్

శీర్షిక:  *హాపీ న్యూఇయర్*

         (గేయాలు)

పల్లవి:
ఆమె:
కొత్త కొత్త ఆలోచనలతో.
కొంగ్రొత్త విధానాలతో ...          "కొత్త"
ముందుకు సాగుదాం..
మునుముందుకు సాగుదాం...  "ముందుకు"
లక్ష్యాలను  సాధిద్దాం.... "2"
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.. "2"

చరణం:01
ఆమె:
కోరికలకు కళ్ళెం వేస్తూ...
ఆశలను అదుపున పెడుతూ...      "కోరిక"
అతడు:
ఊసులు ఎన్నో చెప్పుకుంటూ...
ఉన్నతంగ గడుపుదాం  ....     "2".    "విష్ యు"       "కోరస్"

చరణం: 02
ఆమె:
వాగులు వంకలు తిరుగుకుంటూ...
ఆడుతు పాడుతు అడుగులు వేస్తూ... "2"
అతడు:
అనుకున్నది సాధిద్దాం...
అందమైన బిడ్డకు జన్మనిద్దాం..         "2"
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్....   "2"   "విష్ యు"
"కోరస్"

చరణం:03
ఆమె:
నింగీ నేలా తాకేటట్లూ....
మేనూ మేనూ తగిలేటట్లూ.... "2"
చెంగు చెంగున ఎగరుదాం...
చెరో పని చేసుకుందాం.....  "2"      
అతడు:
చట్టా పట్టా లేసుకుంటూ...
చంటి పిల్లను ఎత్తుకుని....  "2"
చెంగు చెంగున ఎగురుదాం...
సన్నిహితంగా  కలిసి ఉందాం......   "2".     
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్  "2"   "కొత్త"  "కోరస్"

అభ్యుదయం

అంశం: *అభ్యుదయం*


శీర్షిక: *ఎవరో వస్తారని*

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా,
నిజం మరిచి నిదుర పోకుమా"
అని ఒక  సినీ కవి అన్నట్లు

ఎవరో వచ్చి ఏదో చేస్తారని
కాలం వెళ్ళ దీయకు
విలువైనది కాలం,
వెలకట్టలేనిది కాలం
కొందామన్న దొరకనిది,
తిరిగి రానిది కాలం
మీలో యుక్తి ఉన్నది
మీలో అనంతమైన శక్తి ఉన్నది!

ఎవరి అభ్యుదయానికి వారే
ఎవరి ప్రగతికి వారే పాటు పడాలి
మానవీయ విలువలతో జీవించాలి
మమతానురాగాలను  పంచాలి!

ఒక గురజా అప్పారావులా
ఒక వీరేశలింగం పంతులులా
ఒక మధర్ థెరిసా లా
ఒక సావిత్రి పూలే లా
అభ్యుదయ భావాలతో
తోటి వారికి మేలు చేసే
విధంగా జీవించాలి!

మారు మూల గ్రామాన జన్మించిన
డాక్టర్ అబ్దుల్ కలాం గారు
వేప గింజలు, పాల ప్యాకెట్లు అమ్మి
గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు
దేశ రాష్ట్రపతిగా సేవలందించాడు
భారత రత్న పొందాడు
భారత దేశాన్ని  ఉన్నత స్థితిలో నిలిపాడు!

భగవంతుడు అందరికీ
సమానంగానే అవయవాలు,
ఆరోగ్యం, ఆలోచనలు ఇచ్చాడు
ప్రకృతిని ఇచ్చాడు
పంచభూతాలను ఇచ్చాడు!

శ్రమించే శక్తి ఉన్నవారు
చదువుకున్న విద్యావంతులు
చకోర పక్షుల్లా రోజంతా
ఇరువది నాలుగు గంటలు
ప్రభుత్వ పధకాల కొరకు
పేపర్లలో, యూట్యూబ్ లలో
ఉచితాల కొరకు ఎదురు చూస్తూ
విలువైన సమయాన్ని
వృధా చేసుకోకూడదు
మీ మీ ఆలోచనలకు
ప్రత్యామ్నాయ వనరుల కొరకు
పరుగులు తీయించాలి!

వ్యక్తిత్వాన్ని వదులుకుంటూ
ఆత్మాభిమానం చంపుకుంటూ
బానిసలుగా బ్రతుకడం సరికాదు
ఆత్మాభిమానానికి మించిన
ఆభరణం లేదు ఈ జగత్తులో
జీవితం విలువైనది!

బ్రతికిన పది కాలాలైనా
బానిసలుగా కాకుండా
సోమరితనంలా కాకుండా
నందిలా నాలుగు కాలాలు
గౌరవంగా బ్రతకినా ఎంతో మేలు!

సూర్యభానుడిలా స్వయం ప్రకాశంతో
స్వశక్తితో సాధిస్తూ జీవించాలి
అభ్యుదయ భావాలతో
కులమత భేదాలు లేకుండా
ప్రాంతీయ విభేదాలు లేకుండా
నిస్వార్థంగా, నిజాయితీగా
పరుల మేలును కోరుతూ
ఆదర్శంగా చరిత్రలో
స్థిర స్థాయిగా నిలిచి పోవాలి !

హామి: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు 

జీవనోపాధి గుడారాలు

అంశం: *శ్రామిక డేరాలు*


శీర్షిక: *జీవనోపాధి గుడారాలు*

*పొట్ట కూటి కోసం పుట్టెడు మార్గాలు*
అన్నట్లు

ఉన్న చోట
బ్రతుకు దెరువు లేక
తిండి లేనిదే బ్రతక లేక
భార్యా బిడ్డల ఆర్తి దీర్చ
సద్దీమూట ‌సర్ధుకుని
పొట్ట చేత పట్టుకుని
ప్రక్క జిల్లాల నుండో
పొరుగు రాష్ట్రాల నుండో
నేపాల్ దేశాల నుండో!

నెత్తిపై మూటలు
కాళ్ళ క్రింద మంటలు
భార్యా పిల్లలతో తంటాలు
కొండలు కోణలు దాటి
మండు టెండలలో
ఎండిన కడుపులతో
బ్రతుకు దెరువున్న చోటికి
జీవనోపాధి కొరకు
వెతుకు తుంటారు!

గ్రామ శివార్లలో
పట్టణ రహదార్లలో
గుడారాలు కట్టుకుని
డేరాలు వేసుకుని
జీవనం సాగిస్తారు
అదే వారి నివాసం
అదే వారి ప్యాలేస్!

కొలిమి పనులలో
స్వెటర్ల అమ్మకాలలో
పింగాణీ వస్తువులు
గ్లాసు వస్తువులు
ప్లాస్టిక్ వస్తువులు
పిల్లల ఆట వస్తువులు
అమ్మడంలో
అలసట ఎరుగరు!

ఎండనక వాననక
చలి అనక చప్పుడనక
రేయనక పగలనక
చిన్న పెద్దా తేడాలనక
స్త్రీలనక పురుషులనక
పిల్లలనక ముదుసలినక
సమైక్యంగా శ్రమిస్తారు
కష్టాన్ని నమ్ముకుని!

ఏ అర్ధ రాత్రి వేళలోనో
మామూళ్ళకు వచ్చే
పోలీసులను చూసి
క్షణ క్షణం భయంభయంగా
కక్కలేక మ్రింగలేక అన్నట్లు
కాలం గడుపుతారు!

కష్టాలు వచ్చినా
నష్టాలు వచ్చినా భరిస్తూ
వచ్చిన దాంతోనే తృప్తి పడుతూ
ఒక చోట నుండి మరోచోటికి
పలస జీవులు
డేరాలను విప్పుకుంటూ
దేహాలపై కప్పుకుంటూ
పంచభూతాలను నమ్ముకుని
జీవన ప్రయాణం సాగిస్తారు!

కలిసి ఉంటే కలదు సుఖమనీ
బ్రతకడానికి ఈ ప్రపంచం ఎంతో విశాలమనీ
మనసుంటే జీవన మార్గముంటుందనీ
ఆత్మాభిమానంతో బ్రతకడంలో తృప్తి లభిస్తుదని
గొప్ప సందేశాన్నిస్తూ జీవితం సాగిస్తారు!

ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా

శీర్షిక: ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా:


స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా
గణతంత్రపు జెండా ఆకాశమెత్తు ఎగిరినా
ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా
నా తెలంగాణ కోటి రతనాల వీణ
ఉద్వేగంతో కవి హృదయం స్పందిస్తుంది
ధీన జనుల గుండెల మాటున!

మూడున్నర కోట్ల జనాభా నా తెలంగాణా
ఎనుబై ఆరు లక్షలు రేషను కార్డుల నటన
కార్డుకు ముగ్గురు సభ్యుల లెక్క వేసిన
రెండు కోట్ల యాబై ఎనిమిది లక్షలు
పేదలున్న నా తెలంగాణా
ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా
నా తెలంగాణ కోటి రతనాల వీణ!

ప్రతి ఐదేళ్లకు ఒకసారి వస్తుంది కొత్త సర్కారు
వచ్చిన ప్రతి సర్కారు, గత సర్కారును
విమర్శిస్తూనే కాలం గడుపుతూ ఉంటుంది
అప్పటి వరకు ప్రతిపక్షంలో విమర్శించిన నేతలే
ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలను మరిచిపోతుంటారు
ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా
నా తెలంగాణ కోటి రతనాల వీణ!

మల్లీ ఏవైనా ఎన్నికలు వస్తుస్తున్నాయంటే
ఇక ఓట్లు వేసే ప్రజలే గుర్తుకొస్తారు నేతలకు
ఎక్కడ లేని ప్రేమను ఒలక బోస్తారు
పేదవారంటూ, కష్ట జీవులంటూ
అమ్మలు, అక్కలు దివ్యాంగులంటూ
హామీల పథకాలను ప్రకటిస్తారు
అరి చేతిలో వైకుంఠం చూపెడుతారు
అందమైన ఉపాన్యాసాలు దంచేస్తారు
ఆకర్శనీయ ప్రచారాలు చేస్తుంటారు
ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా
నా తెలంగాణ కోటి రతనాల వీణ!

ఎన్నికలు అయిపోయాక
పథకాలను మధ్యలోనే ఆపేస్తారు నాయకులు
దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకొనను
పన్నులు పెంచేస్తారు జనుల పైన ఎంతైనా
బారులు తెరిచేస్తారు, ఉచితాలను లాగేస్తారు
గెలుపు ఓటమిల పోరాటంలో
కాళ్ళు విరిగే దూడ లెన్నో
తెలియకుండా పోయేవెన్నో
ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా
నా తెలంగాణ కోటి రతనాల వీణ!

గత సర్కారు అవినీతిని చేధించలేరు
మరల అప్పులను పెంచుతూ పోతారు
ప్రజలపై భారం మోపుతారు
అందుకే  *రావాలి ఐదేళ్ల కొక సారి*
*రాష్ట్ర పతి పాలనా దేశమంతా*
భయం పెరుగు అవినీతి నేతలలో కొంతైనా
ఆగి పోవు అవినీతి, బినామీల సంత
ధర్మ పాలన దేశమంతా కొనసాగు కొంత
దేశంలో ఉత్పాదకత పెరుగునెంతో!

ధగధగా మెరుస్తుంది నా తెలంగాణా
నా తెలంగాణ కోటి రతనాల వీణ!

  

విపంంచికలు

అంశం: విపంచికలు


శీర్షిక:  *జీవితం నల్లేరుపై నడక కాదు*

జ్ఞాన అజ్ఞాన మిలితమే మానవుడి మనోహర జీవితం
ఎప్పుడైతే మానవుడు మాధవుడవుతాడో, వారి కీర్తి శాశ్వితం
విశ్వంలో ఎపుడూ భూమి ఆకాశం ఏకం అవడం అనేది అసాధ్యం
మనోహర జీవితం ఎప్పుడూ శాశ్వతం కాదు
మరణం అశాశ్వితమని,అది సుసాధ్యం కాదనేది నిజం
మంచివారు చెడ్డవారు ఉండటం అనేది సమాజంలోసహజం
వారిలో పేదవారు ధనికులు ఉండటం సహజమే
అంతేనా అందులోనూ అక్షరాస్యులు నిరక్షరాస్యులు కొందరు
సమాజమన్నపుడు అన్ని రకాల వారు ఉంటారు
అసహజమన్నారే గానీ అసహజంగానే ఎందరో ఉండరు
కష్టాలు నష్టాలు లేని వారు ఉండరు ఈ భూలోకంలో
మనుషులకు సుఖ దుఃఖాలు కూడా ఉంటాయి
కాకపోతే కొందరికి తక్కువ ఎక్కువ ఉండటం సత్యం
ఈ భూలోకంలో మనుషులకే ఉంటాయి అన్నియు
స్వర్గంలో దేవతలకు ఇలాంటి ఏ బాధలు ఉండవు కొన్ని కూడా 

Saturday, January 4, 2025

సిమ్లా ,రోతాంగ్ పాస్ టూర్

అంశం: వృత్యానుప్రాస అలంకారం


శీర్షిక: సిమ్లా, రోతంగ్ పాస్ టూర్ 
(వృత్యానుపాస అలంకారం)

ఆకాశంలో తారలు మినుకు మినుకు
మంటూ మెరుస్తున్నాయి.
క్యాబులో ఎయిర్ పోర్ట్ కు పిల్లా జల్లా
కలిసి బయలు దేరాం.
వాతావరణం చల్ల చల్లగా ఉంది.
మెల్ల మెల్లగా ఏయిర్ పోర్ట్ లో అడుగు పెట్టాం.
గేట్ దగ్గర చక చక ఆధార్ కార్డు వెరీఫై
చేసి లోనికి పంపించారు.
లోనికి వెళ్ళాక వెంట వెంటనే టికెట్స్ ,
లగీజ్ చెక్ చేయించాం.
డగ్ డగ్ మంటూ గుండె కొట్టు కుంటుంది. ఎందుకంటే మొదటి సారి విమాన ప్రయాణం.

బెదురు బెదురుగ స్కానింగ్ వరుసలో నిలబడ్డాం.
ఇక్కడ సెక్యూరిటీ ప్రయాణికులను,
మనతో తీసుకెళ్ళుచున్న వస్తువులను
స్కానింగ్ చేస్తారు.
నేను దబ దబా ముందుకు వెళ్ళాను.
నన్ను దూరంగా వెనక్కి వెనక్కి పొమ్మన్నారు. ఒక్కరొక్కరినే స్కానింగ్ చేస్తారట.
బెల్టు కూడా తీయమన్నారు.

అందరికీ స్కానింగ్ అయిపోయాక
మెల్లమెల్లగా లాంజ్ లోకి వెళ్లి  ఎదురెదురుగా కూర్చున్నాం.

నిమిష నిమిషానికి అనౌన్స్ మెంట్స్ చేస్తున్నారు. మేము ప్రయాణించే స్పైసైజెట్ విమానం
రానే వచ్చింది.
గేట్ నుండి ఒక్కరొక్కరిని చెక్ చేసి పంపించారు. టకటకా బస్సులో ఎక్కి విమానం వరకు వెళ్ళాం. అక్కడా మళ్ళీ టికెట్స్ వెరీఫై చేసి
స్పైస్ జెట్ లోకి పంపించారు.
ప్రక్క ప్రక్కనే సీట్లు. సీటు సీటుకు నెంబర్లు,
సీట్ల ముందర ఫోల్డింగ్ టేబుల్,
ప్రమాద హెచ్చరికల బ్రోచర్స్, పైన లైట్లు ఉన్నాయి.
టేకాఫ్ తీసుకున్నాక, రయ్ రయ్ మంటూ
విమానం నింగి లోకి తొంగి చూడకుండా
దూసుకెల్లింది.
కొద్ది కొద్దిగా పైకి వెలుతూ తెల్ల తెల్లని మబ్బులు దాటుతున్నపుడు, గతుకుల రోడ్లపై
బస్సుపోతున్నట్లే లోడలొడ శబ్ధం చేసుకుంటూ మరింత పైకి వెళ్ళాక మెల్లమెల్లగా శబ్దం ఆగిపోయింది. ఢిల్లీలో దిగాం.

గల్లీ నుండి మేము ముందుగానే బుక్ చేసుకున్న యాత్రా మినీ బస్సు పుయుం పుయుం అంటూ హారన్ చేస్తూ ప్రయాణించింది. సరదా సరదాగా మాట్లాడు కుంటూ ప్రయాణించాం.

సిమ్లాలో దిగాం. ఇది ఏడువేల అడుగల ఎత్తున ఉన్న మంచు ప్రదేశం. ఇటు అటు ఎటూ చూసినా లోయలు , ఎత్తెన చెట్లే కనబడుతున్నాయి. అక్కడక్కడ ఎప్పుడు పడిపోతాయో అన్నట్లు ఇండ్లు . మంచు దారలు దారులుగా కురుస్తుంది . ఆ రోజు హోటల్ లో బసచేసి, మరుసటి రోజు గుర్రాలపై కుర్ఫీ, ఆ మరుసటి రోజు క్యాబులో మనాలి, రోతంగ్ పాస్ లో
మంచు గడ్డలపై జారి జారి , బొర్లి బొర్లి, ప్రక్కనే ఉన్న నదిలో ఆడిఆడి, ఘరం ఘరం చాయ్ త్రాగి తిరుగు ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాం.

Friday, January 3, 2025

ఆవు చేనులో మేస్తే...

 అంశం: చిత్ర కవిత : చరవాణి

శీర్షిక:  "ఆవు చేనులో మేస్తే...."

*ఆవు చేనులో మేస్తే*

*దూడ కంచెలో మేస్తుందా*
అన్నట్లు

తల్లిదండ్రులు పొద్దస్తమానం
చరవాణీలు పట్టుకుంటే
పిల్లలు *పాల పీకలు*
పట్టుకుంటారా!
వాళ్ళు చరవాణీలే
కావాలని మారాం చేస్తారు

పెద్దలు అనుభవజ్ఞులు
అమలు చేయువారు
పిల్లలు పసికూనలు
అనుసరించు వారు

ఎదుటి వారిని
సరియైన పంధాలో
నడిపించాలంటే
చెప్పే నీతులు
చేసే చేతలు
ఒకే రీతిలో ఉండాలి

గురువు మాట
వేదం లాంటిది
అమ్మా నాన్నలు
కన్న బిడ్డలకు
మొదటి గురువులు
నివసించే ఇల్లు
పాఠశాల లాంటిది

తల్లిదండ్రులు
ఎంత క్రమశిక్షణతో ఉంటే
అంతే క్రమశిక్షణతో
పిల్లలు పెరుగతారు

చరవాణి పెద్దలు వాడటం
తప్పు అని అనడం లేదు
ఎంత వరకు వాడాలో
అంత వరకే వాడాలి

*చరవాణి రెండు వైపులా*
*పదునైన కత్తి లాంటిది*
పసి పిల్లలకు చరవాణితో
అవసరం లేదు

డబ్బు ఉందనో ,గొప్పలకనో
సరదాకనో అలవాటు చేస్తే
అది రేపు వ్యసనమైపోతుంది
అత్యవసరమై కూర్చుంటుంది
*మొక్కై వంగనిది మానై వంగున్నా*
అన్న చందాన
చరవాణి లేక పోతే
పాలు త్రాగననీ
అన్నం తినను అని
చదువుకోను అనే స్థాయికి
వెళ్ళి పోతారు పిల్లలు

చరవాణి ని చిన్న పిల్లలకు
ఎంత దూరముంచుతే
అంత మంచిది
పెద్ద పిల్లలకు
అవసరాలకు తగ్గట్టు
ఫోన్లు ఇవ్వడం
అనవసర అప్ లకు
లాక్ లు వేయడం చేయాలి
తల్లి దండ్రులు మితంగా
చరవాణిలను ఉపయోగించాలి
అధికంగా వాడుతే
పిల్లలకు సున్నితంగా
వివరణ ఇవ్వాలి
అప్పుడే
సమయం మిగులు తుంది
ఆరోగ్యం బాగుంటుంది
ఖర్చు తగ్గుతుంది
సమాజం బాగుపడుతుంది