Saturday, August 9, 2025

బాల సాహిత్యం -గేయాలు

శీర్షిక: బాల సాహిత్యం 

తుర్రు పిట్ట గేయం 
*************
తుర్రు పిట్టా తుర్రుపిట్టా
ఎక్కడికెళ్ళావూ
అడవికెళ్ళావా 
పుల్లలు తెచ్చావా 
గూడు కట్టావా 
గుడ్లు పెట్టావా 
పిల్లల చేశావా 
ఆకలన్నాయా 
ఆహారం పెట్టావా 
రెక్కలొచ్చాయా 
తుర్రు మన్నాయా!

తాత గేయం 
*********
తాతా తాతా తాబేలు 
తాతకు మీసాలు బారేడు
నవ్వకు నవ్వకు నా ముందు 
రాలును ఏమో నీ పండ్లు!

సర్కారు బస్సు 
************
సర్కారు బస్సు వస్తుందీ 
వెనుకకు వెనుకకు జరగండీ 
చక్కగ బస్సు ఎక్కండీ 
వృద్దులకు సీట్లు ఇవ్వండీ
స్త్రీలకు చోటు ఇవ్వండీ
టికెట్ పక్కగ అడగండీ 
సరైన చిల్లర ఇవ్వండీ
హాయిగ ప్రయాణం చేయండీ!

బావపై గేయం 
*********
బావా బావా 
ఎప్పుడొచ్చావు 
సూటు బూటులో 
బాగున్నావు 
మరుదలు పిల్లకు 
ఏమి తెచ్చావు 

ఏమి ఇష్టమో చెప్పూ...

లంగా ఓణీ 
నా కిష్టం
కాళ్ళకు గజ్జెలు 
నా కిష్టం 
రెండు జడలు 
నా కిష్టం 
తలలో పాపెడ 
నా కిష్టం 
జడలో పువ్వులు 
నా కిష్టం 

మరి నాకేమి ఇష్టమో చెప్పూ...

నేనంటేనే 
నీ కిష్టం 
అమ్మ చేసిన పాయసం 
మరీ ఇష్టం 
అందరి సంతోషాలు 
మరెంతో ఇష్టం 
*******

అంశం: సీతాకోకచిలుక

శీర్షిక: ఆదర్శ జీవి

రంగు రంగుల రెక్కలతో
రయ్ రయ్ మంటూ ఎగురుతూ
నలుదిక్కులా తిరుగుతూ
పుష్పాలపై వ్రాలుతూ
మకరందాన్ని గ్రోలే  చిలుకా
ఓ రంగు రంగుల సీతాకోక చిలుకా!

లార్వాగా ఆవిర్భవిస్తూ
గొంగళి పురుగుగానూ ప్యూపాగానూ
అనేక జననారిష్టాలు తట్టుకుంటూ
సీతాకోకచిలుకగా మారుతావూ
ఓ రంగు రంగుల సీతాకోక చిలుకా!

చూడ  ముచ్చటగా ఉంటావూ
సుందరంగా ఎగురుతావూ
పూల తోటలలో ఎగురుతావూ
ఏ జీవికీ హాని తలపెట్టవూ
ఆదర్శ జీవివి చిలుకా
ఓ రంగు రంగుల సీతాకోక చిలుకా!
*****

అంశం: జెండా పండుగ

శీర్షిక: జాతీయ జెండా! (దేశ భక్తి గీతం)

పల్లవి:
ఎగరవే.. ఎగరవే... జాతీయ జెండా
ఎగురెగురవే.. మువ్వొన్నెల జెండా
పైపైకి ఎగరవే.. వజ్రోత్సవ జెండా..."ఎగరవే"

చరణం:01
ఇంటింటా ప్రతి యింటా
వాడవాడన  ప్రతి బడినా
వీది వీదినా ప్రతి మదినా
దేశం  నలుమూలలా..     "ఎగరవే"

చరణం:02
ప్రజలకు ధైర్యాన్నిచ్చు జెండా
జనులకు శక్తి నిచ్చు జెండా
యువతకు ఊపిరి నిచ్చు జెండా
జనులలో ఐఖ్యత పెంచు జెండా.. "ఎగరవే"

చరణం:03
దేశ గౌరవం పెంచనూ
దేశ భక్తిని పెంచనూ
దేశ కీర్తిని పంచనూ
యువత శక్తిని పెంచనూ..   "ఎగరవే"

చరణం:04
పింగళి వెంకయ్య అందించిన
ఎరుపు తెలుపు ఆకుపచ్చ
మూడు రంగుల జెండా
ముచ్చటైన మేటి జెండా....      "ఎగరవే"
****
అంశం: పని

శీర్షిక: పని చేస్తేనే చురుకుదనం 

పాపల్లారా రారండి 
బాబుల్లారా రారండి 
ఆడుతూ పాడుతూ పనిచేద్దాం 
అందరిలో గొప్పగ  నిలుద్దాం  "పాపల్లారా"

పని చేస్తేనే ఉల్లాసం 
పని చేస్తేనే ఉత్సాహం 
పని చేస్తేనే చురుకుదనం 
పని చేస్తేనే  మనకు ఆరోగ్యం   "పాపల్లారా"

పని చేస్తేనే గుర్తింపు 
పని చేస్తేనే విలువ 
పని చేస్తేనే అనుభవం 
పని చేస్తేనే మనకు ధనం       "పాపల్లారా"

అమ్మ చెప్పిన పనులను 
నాన్న చెప్పిన పనులను 
ఆడుతూ పాడుతూ చేస్తూ
అమ్మానాన్నకు సహాయపడుదాం  "పాపల్లారా"
*****
అంశం: బంతి..బంతి

శీర్షిక: *బహు సుందరమైన బంతులు*

పల్లవి:
బంతులోయ్ బంతులు 
బహు సుందరమైన బంతులు 
మనసును దోచే గుండ్రని బంతులు 
మరులు గొలిపే రంగుల బంతులు "బంతు"

చరణం:01
ఇంట్లో ముంగిళ్ళలో
సందులలో బొందులలో 
ఆవరణలో మైదానంలో 
పిల్లలు పెద్దలు విరివిగా ఆడేటి..  "బంతు"

చరణం:02
రబ్బరు ప్లాస్టిక్ బంతులు 
క్రికెట్  టెన్నిస్ బంతులు 
ఫుట్ బాల్ వాలీబాల్ బంతులు 
రంగు రంగుల బంతులు             "బంతు"

చరణం:03
అంబరాన్ని చుంబించే 
అందమైన బంతులు 
ముద్దగ ఒద్దుగ చేతిలో ఇమిరేటి
సుందరమైన బంతులు                 "బంతు"

చరణం:04
శక్తిని యిచ్చు యుక్తిని పెంచు 
ప్రతిభను కనబరుచు
స్నేహాలను పెంచు
సంతోషాలను పంచు        
వ్యాపారాలతో లాభాలు గడించు   "బంతు"
*****
అంశం: వానలు (గేయాలు)
శీర్షిక: వానమ్మా వానమ్మా!

వానమ్మా వానమ్మా
దాహం తీర్చే వానమ్మా 
మహిని తడిపే వానమ్మా 
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా 
చెరువులు నింపే వానమ్మా 
తరువులు పెంచే వానమ్మా
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా 
కడుపు నింపేను చెరువమ్మా 
నీడ నిచ్చేను తరువమ్మా 
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా 
సేద తీర్చేను తరువమ్మా 
పంటలు పండించేను చెరువమ్మా 
జీవకోటికి ప్రాణదాతలు మీరమ్మా!
******

అంశం: బాలసాహిత్యం - ఫలం

శీర్శిక: సీతా ఫలం చిన్నారులారా!
(గేయం)

సీతా ఫలం చిన్నారులారా
తీయగ నుండును బాలల్లారా  "సీతా"

అడవులలోనా స్వేచ్ఛగ పెరుగును
వర్షాకాలంలో విరివిగా కాయును
నిగ నిగ లాడుతూ నుండును
గోళాకారంలో కనువిందు చేయును  "సీతా"

నింగిలోన మిలమిల మెరిసే ఎర్రని తారల్లా
పండులోన తళతళ మెరిసే నల్లని గింజలు
కుప్పలు తెప్పలుగా నుండును
ఫలము తినుటలో సమయం పెంచును "సీతా"

పల్లెలలో పట్టణాలలో విరివిగా అమ్మేరు
చౌక ధరలలో చక్కగా దొరికేను
బేరమాడవద్దు రైతుల వద్ద
షుగర్ ఉన్న వారు ఉబ్బసం ఉన్నవారు
తినకుండా ఉండటమే మేలురా       "సీతా"
*****

శీర్షిక:  *ఘల్ ఘల్ గణపయ్యా*
(గేయం)

ఘల్ ఘల్ గణపయ్య 
గజముఖ సుందరా
మూషికా వాహనా
ఓ బొజ్జ గణవయ్యా!

పార్వతీ తనయా
పరమేశ్వర నాయకా
ఓ భక్త వత్సలా
విఘ్నాలు తొలగించు
విఘ్నేశ్వరుడా!

భారతాన్ని రచించిన
మేధావి నీవయ్య
విశ్వాన్ని జయించిన
వినాయకుని వయ్య
నిను మించిన వారు
జగతిలో లేర!

శుభకార్యాలలో నిన్నే
తొలుత సేవింతురయ్య
బుజ్జి బుజ్జి పాదాలతో 
ఓ బొజ్జ గణపయ్య
ముద్దు ముద్దుగా నడిచేవు
నవరాత్రులు నీకు
పూజలు సేతురు
భక్త జనుల కెల్ల
విఘ్నాలు బాపయ్య
ఉండ్రాళ్ళు నీకయ్య
ఓం బొజ్జ గణపయ్య
 ******

అంశం: *వాన మబ్బు*

శీర్షిక: *అదిగదిగో మబ్బు*

అదిగదిగో మబ్బు
అల్లదిగో మబ్బు
ఆకాశంలో మబ్బు
అందమైన మబ్బు!               "అదిగదిగో"

నల్లనల్లని మబ్బులు
దట్టమైన మబ్బులు
చూడదగ్గ మబ్బులు
సుందరమైన మబ్బులు !         "అదిగదిగో"

చల్లగాలి తాకినా
వానలు జలజలా కురియును
ఒకటి నొకటి తాకినా
మెరుపులు తళతళా మెరియును
ఒకటి నొకటి ఢీ కొనినా
ఉరుములు డబడబా ఉరుమును!     "అదిగదిగో"

మబ్బుల వలనే వర్షాలు పడును
వర్షాల వలెనే చెరువులు నిండును
చెరువుల వలనే పంటలు పండును
పంటల వలనే కడుపులు నిండును!     "అదిగదిగో
 ******

No comments: