Tuesday, August 5, 2025

చిన్న నాటి జ్ఞాపకాలు / మధుర స్మృతులు

అంశం: స్మృతి

శీర్షిక: *చిన్న నాటి మధుర స్మృతులు*

చిన్న నాటి స్మృతులు ఒకటా రెండా
చెప్పుకుంటూ పోతే బోలెడు!

అది గ్రామీణ ప్రాంతం చల్లని వాతావరణం
మట్టి గోడల ఇండ్లు మమకారాలతో జనులు
అవి ఎప్పటికీ మరువలేని మధుర స్మృతులు!

పల్లె వాసుల ప్రేమానురాగాలు కరుణ
ఆప్యాయతలు తనివి తీరనివి
గ్రామస్తుల స్నేహితుల బంధుమిత్రుల 
రారా పోరా అనే పలకరింపులలో
ఎంతో అనురాగం ఆత్మీయత! 

చెప్రాసి బరిగే తీసుకుని వస్తున్నాడంటే
పలకా బలపం పట్టుకుని
ప్రక్క సందులో పడి పరుగో పరుగు
చిన్న నాటి జ్ఞాపకాలు నేటికీ కోట్ల వరాలు!

గోలీలాట సిర్ర గోనే పత్తాలు కోతికొమ్మచ్చి
చెరువుల్లో బావుల్లో ఈత కొట్టడాలు
మనసులో తట్టిన నీతి సూక్తులను
సిగరెట్టు పెట్టెల వెనుకాల వ్రాసుకుని
భద్ర పరుచకోవడం అవి నిత్య కృత్యాలు!

హైస్కూల్ కు రానూ పోనూ
ఆరు కిలోమీటర్లు కాలినడకనే
ఒక్కోసారి కాళ్ళకు చెప్పులు లేకుండానే 
పోయేటప్పుడు వచ్చేటప్పుడు
దారిలో ముళ్ళ కంపను, గాజు వక్కలను
రాళ్ళను బాటసారులకు గుచ్చుకోవద్దని
స్నేహితులందరం కలిసి ఏరి వేయడం
నాడే గాంధీ గారు బోధించిన పాఠాలు!

రాత్రి కాగానే దీపం బుడ్డి వెలుతురులో
చుట్టు ప్రక్కల నివశించు నిరక్షరాస్యులకు
ఉత్తరాలు చదివి వినిపించడం
వారి బంధు మిత్రులకు ఉత్తరాలు వ్రాయడం
అప్పు కాగితాలు వ్రాయడం
అప్పుల లెక్కలు చేసి సర్ది చెప్పడం
చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం
ప్రతి నిత్యం షరా మామూలే!

భోజనం అయ్యాక ఎనిమిది గంటలలోపేనిద్ర
ఉదయం కోడి కూయగానే మేల్కొని
కాల కృత్యాలు తీర్చుకొని
ఇంటి ముందు గద్దెల మీద కూర్చుని
హోమ్ వర్క్ చేసుకోవడం ఆనవాయితీ!

ఇంటి పనులుంటే చూసుకోవడం
పుస్తకాలు టిఫిన్  బుజంపై పెట్టుకుని 
స్కూలుకు బయలు దేరడం
వచ్చేటప్పడు రైలు పట్టాలపై నడవడం! 

గ్రామస్తులు ఇచ్చిన గౌరవం విలువ 
పంచిన ప్రేమ ఆప్యాయత ఆత్మీయతలు
వెలకట్టలేనివి అవి ఇప్పటికీ ఎప్పటికీ
మధురాతి మధుర బాల్య స్మృతులే! 

No comments: