Wednesday, August 27, 2025

నిశీధిలో జాబిలి P

అంశం: చిత్ర కవిత 

శీర్షిక: *నిశీధిలో జాబిలి* 


నింగి లోన చందమామ నిగనిగ లాడుతూ 

తొంగి చూస్తూ కొలను లోకి 

నిదుర లేపి కలువ భామను వెన్నెల వెలుగులో 

లేలేత బుగ్గలను ముద్దాడే!


ప్రతి మాసం శుక్ల పక్షం రోజులలో చకోరపక్షిలా 

నిత్యం ఎదురు చూస్తున్న కలువ భామ 

అరవిరిసిన ముద్దు గుమ్మలా 

సిగ్గులొలక బోస్తూ చేయి చాపే!


సిగ్గు పైటను తొలగించి చందమామ 

కలువను కనులారా తిలకించ

జనులకు కనబడకుండా చెలిని 

మాయజేసే పడవను అడ్డంగాపెట్టి!


ఆహా! ఎంతటి మనోహర దృశ్యం నిశీధిలో 

నిశ్చలమైన నదిలో జాబిలి వెన్నెలకు 

చేపలు ఎగిరి పడుతుండే చంద్రవంకలా

పడవ నిట్టూర్పుతో బానిసై కదలకుండే!

Tuesday, August 26, 2025

లౌక్యం

 శీర్షిక: *లౌక్యం!*


*పెట్టని తల్లి పెట్టకనే పాయే*
*రోజూ పెట్టే ముదునష్టపుదన్న పెట్టకపాయే*
అనేది వాడుకలో ఉన్న నానుడి
దీనిని అనేక సందర్భాలలోనూ
అన్వయించుకోవచ్చు !

ఎన్ని సార్లు సహాయం చేసినా
ఎన్ని మార్లు ఆహారాలు అందించినా
ఎన్ని సార్లు దానధర్మాలు చేసినా
ఎన్ని మార్లు మంచి సలహాలు ఇచ్చినా
ఎన్ని సార్లు శుభ కార్యాలకు వెళ్ళినా
ఎన్ని మార్లు అశుభ కార్యాలకు పోయినా!

చివరలో ఒక్కసారి చేయక పోతే
గతంలో  చేసినన్నీ వ్యర్ధమైపోతాయి
నీవు నీచంగా హీనంగా చూడబడుతావు
అంతేనా  కోపం పెరుగవచ్చు
కారాలు మీరాలు రువ్వ వచ్చు
కలతలు పెరుగవచ్చు
బంధుత్వం స్నేహం దూరం కావచ్చు!

అలా కాకుండా!
నీకు ఎప్పుడు వారితో అవసరమో
అప్పుడే సహాయం చేయడమో
ఆ సమయంలో మాంచి సలహాలు ఇవ్వడమో
అప్పుడే వారి కార్యాలకు వెళ్ళడమో చేస్తే
నీకు వేయి సహాయాలు చేసిన గౌరవం
గొప్ప తనం  ఆ ఒక్క సారికే దక్కుతాయి
కీర్తిస్తారు కూడా!
ఇది నేటి సమాజ తీరు

స్వార్ధమే కావచ్చు
కానీ *లౌక్యం* అంటే ఇదే!
నీకు సౌఖ్యం లభించేది కూడా ఇక్కడే!
 

భూ కైలాస్ దేవాలయం

అంశం: మై సెల్ఫీ


శీర్షిక: *భూ కైలాస్ దేవాలయం*

అదిగదిగో భూ కైలాస్ దేవాలయం
తాండూరు పట్టణం నడిబొడ్డున వెలసిన
అవనిలో అద్భుత కట్టడం సుందర జల మార్గం
జల మార్గం ఉంటుంది రెండు వందల మీటర్లు
అందులో గలగలా పారుతుంది స్వచ్ఛమైన నీరు

చల్ల చల్లని నీటిలో మెల్లమెల్లగా అడుగులెస్తుంటే
ఆహా! ఏదో తీయని ఆనందం మదిలో మెదులు
ఇక భక్తుల నోటిని ఆపడం ఎవరి తరం 
ఓం నమః శివాయ అంటూ కేరింతలతో
మారుమ్రోగు భూకైలాస జలమార్గం!

వెళ్ళడానికి రావడానికి వెడల్పాటి ఒకే మార్గం
పొడుగూనా మధ్యలో బిగించిరి స్టీల్ పైపులు
ఒకరికొకరు తగలరు ఎవరి దారి వారిదేనోయ్
జల మార్గాంతం వరకూ జ్యోతిర్లింగాలే!

నీటి లోతు ఉండు మోకాళ్ళ నుండి గొంతు వరకు
ఎవరి భక్తి వారిదే కొడుతారు కొబ్బరి కాయలు
ఆనందంతో కొడుతుంటారు పిల్లలు కేరింతలు 
అబ్బో! పెద్దలు మునుగుతారు తేలుతారు!

ఓహో! అది ఒక భూతల స్వర్గమే
చివరలో ఉంటుంది శివుని ఆలయం
శివుని సేవించు కొని తీర్థం పుచ్చుకొని
తిరిగి జల మార్గం గుండా రావచ్చూ
లేదా అక్కడి నుండే బయటకు వెళ్ళ వచ్చు!

వారేవా!ఎత్తెన తరువులు ఆహ్లాదకర ప్రకృతి 
చుట్టూరా అందమైన మనోహర శివపార్వతుల
సప్త ఋషుల త్రిమూర్తుల గణపతి విగ్రహాలు
ఎన్నో మరెన్నో అనుభవిస్తే గానీ తనివి తీరదు
అన్నీ వసతులు ఉచిత భోజనమూ!

Saturday, August 23, 2025

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

అంశం: విప్లవ జ్వాల

శీర్షిక: *ఎక్కడ వేసిన గొంగళి అక్కడే* 

*ప్రభువెక్కిన పల్లకి కాదు* 
*దానిని మోసిన బోయలెవ్వరు?*
అంటూ మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ                గారు అన్నట్లు


నేతలు పదవులు అధికారం
చేపట్టడంతోనే హీరోలు కారు
అందులో నాయలకు ఓటు వేసి గెలిపించిన
ఓటర్ల శ్రమ ఎంతో ఉంది!

అలాంటి ఓటర్లను ప్రజలను
లెక్క చేయకుండా అధికార దాహంతో
దోచుకుంటూ మోసం చేస్తూ
భూ కబ్జాలు చేస్తూ అవినీతి పాలనతో
ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ!

ఉచితాల మాయలో దింపినా
త్రాగుడుకు బానిసలును చేసినా
చిత్రసీమలో లాగా వారసులను
పోటీలో దింపుతూ దోచకుంటున్నా
దేశ రాష్ట్రాల సంపద ఏవో కొన్ని కుటుంబాల
కబంధ హస్తాలలో బంధించబడినా!

ఏదో ఒక రోజు విప్లవ జ్వాలలా
స్వార్ధ అవినీతి ప్రభుత్వాలను 
ప్రజలు గద్దెలు దింపుతారు!

*పిల్లి యే కదా అని దానిని* 
*నాలుగు గోడల మధ్య బంధిస్తే*
*అది పులిగా మారి రక్కుతుంది*!
 
ఎన్నో దశాబ్దాలు గడిచినా 
నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నా
ప్రజల సమస్యలు పరిష్కారం
కాక పోవడమే కాదు పై పెచ్చు పెరుగు తుండే! 

ప్రజలు కలిసి కట్టుగా ఉండి 
విప్లవ జ్వాలలు రగిలిస్తే
అది అగ్ని పర్వతమైనా బద్దలవక తప్పదు
అగ్ని జ్వాలలు ఎగిసి పడక తప్పవు!

హృదయాలను విశాలం చేసుకుంటేP

*నేటి అంశం -చిత్ర కవిత*


శీర్షిక: *హృదయాలను విశాలం చేసుకుంటే*

పెళ్ళంటే నూరేళ్ళ పంట
మనుసులు కలువకపోతే 
ఇక జీవితాంతం పెంట!

వివాహం చేసుకునే ముందే
అర్ధం చేసుకోవాలి ఒకరినొకరు
మోహాన్ని ప్రేమని తలువక 
అందం చందం ఆహార్యం 
భాష సంస్కృతి సంప్రదాయాలు 
సరే అనుకుంటేనే ఒక నిర్ణయం తీసుకోవాలి! 

జాతకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా
మనస్థత్వాలు భావాలు ఆలోచనలు
కలిసాకనే వివాహ వేడుకలు జరిపించాలి
ఇక ఆ తరువాత కష్టమో నష్టమో
కలిసి నూరేళ్ళు అన్యోన్యంగా జీవించాలి!

ఒక చేతికి ఉన్న ఐదు వ్రేళ్ళే
సమానంగా ఉండవనేది నగ్న సత్యం!

ఒకే కడుపులో జన్మించిన ముగ్గురు పిల్లల
అందాలకు ఆలోచనలకు పోలికే ఉండదు 
అలాంటిది కొత్త వ్యక్తులు అనుకూలంగా
ఉంటారనుకోవడం అత్యాశే అవుతుంది!
పెళ్ళిబంధం అన్నాక సమస్యలు సహజం
అవి తల్లిదండ్రులతోనే సమస్యలు అధికం!

హృదయాలను విశాలం చేసుకుంటే
ఎలాంటి సమస్యలైనా చిన్నవైపోతాయి
ఒకరినొకరు విశ్వసిస్తూ అర్ధం చేసుకుంటూ
వారికివారే సర్దుబాటు చేసుకుంటూ
సంయమనం పాటిస్తే ఆ జీవితం స్వర్గ ధామం
అది వేలాది కుటుంబాలకు ఆదర్శం!

లేదంటే పెళ్ళైన ఆరు నెలలకే
విలువైన జీవితాన్ని కాలన్ని ధనాన్ని 
వృధా చేసుకుంటూ 
పరువు ప్రతిష్టలను మంటగలుపుతూ
ఇరు కుటుంబాల నట్టేట ముంచుతూ 
రాజ్యాంగ వయవస్థలకు భారమవుతూ 
విడాకుల కొరకు కోర్టుల చుట్టూ తిరగడం 
అనివార్యం కావచ్చు!

పంతాలు పట్టింపులతో విడాకులు వచ్చినా 
ఆ తరువాత ఇరువురూ చెడిపోయిన 
భాగస్వాములతోనే సంసారాలు చేయాలన్న 
పచ్చి నిజాన్ని విజ్ఞులు మరిచి పోవద్దు!
 

మెగాస్టార్

అంశం: చిరంజీవి 


శీర్శిక: *మెగాస్టార్*

మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు
నాటి మేటి నటులలో గొప్ప నటుడు
చలనచిత్ర రంగంలో ప్రవేశించి నటనలో
నవనవోన్మేషంతో విభిన్న వేషధారణలతో
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రేక్ డాన్స్ లతో
కొత్త ఒరవడి సృష్టించిన మహానటుడు!

పాత్ర ఏదైనా అందులో లీనమయ్యే స్వభావం
అతడికి దేవుడిచ్చిన వరం
డాక్టర్ గానూ లాయర్ గానూ
రాజకీయ నాయకుడుగానూ నృత్యం లోనూ
మరెన్నో పాత్రలలోనటించి సత్తాచూపిన
బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి

మెగాస్టార్ నటుడే కాదు
గొప్ప మహోన్నత మానవతావాది
బ్లడ్ బ్యాంక్ ను స్థాపించి ఎంతోమందికి
ఉచితంగా రుధిరాన్ని అందిస్తున్న ప్రాణదాత

చిరంజీవి నటుడు మానవతా వాదే కాదు
నిజ జీవితంలో రాజకీయ నాయకుడు
దానకర్ణుడు సంఘసంస్కర్త సామాజిక వేత్త
వారసత్వ నటుల సృష్టి కర్త ఆదర్శమూర్తి

వినూత్నమైన గొప్ప నటనలకు గాను
అనేక నంది అవార్డులు రివార్డులు
పద్మభూషణ్ పద్మ విభూషణ్  వంటి
ఎన్నో పురస్కారాలు అందుకున్న
వినూత్నమైన హీరో మెగాస్టార్ చిరంజీవి
 

Thursday, August 21, 2025

వృద్ధాప్య దశ

అంశం: చిత్ర కవిత (వృద్ధాప్య దశ)


శీర్షిక: *ఎండిన మ్రానులా*

*సముద్రాన్నైనా ఈదవచ్చు నేమో గానీ
సంసారాన్ని ఈదడం కష్టం*  అన్నట్లు

ఈ జీవన సాగరంలో
ఎన్నో ఆటుపోట్లను మరెన్నో ఇక్కట్లు 
సముద్రంలోని సుడిగుండాల వలెను
ఎన్నెన్నో అవమానాలు మరెన్నో అనుభవాలు 

బాధలు సంతోషాలు దుఃఖాలు ఆనందాలు
కష్టాలు సుఖాలు అచ్చట్లు ముచ్చట్లు ఎన్నెన్నో

గెలుపులు ఓటమిలు నిందలు అపనిందలు 
దెబ్బలు ఎదురు దెబ్బలు
ఆరోగ్యాలు అనారోగ్యాలు  అన్నీ గుండెలోనే 

సంపద పోగు చేస్తే నిరుపయోగమని
పైసా పైసా కూడబెట్టి పిల్లల చదివిస్తే
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలై
మనసుకు నచ్చిన వారిని మనువాడి
రెక్కలొచ్చిన పక్షుల్లా తెగిన గాలిపటాల్లా
దారిన వదిలేసి దూరం వెడలి పోయిరి

అంతిమ దశలో అర్ధమాయే
పిల్లలకు కష్ట సుఖాలు తెలుపాలని
ఆర్ధిక వ్యవహారాలు వివరించాలని
పిల్లలను డబ్బు డాబుసరితో కాదు
మంచి మనసుతో ప్రేమతో పెంచాలని

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు 
ఇప్పుడు విచారిస్తే ఏమి ప్రయోజనం
గడిచిన కాలం తిరిగి రాదు
సాధించాలని కోరిక  మనసున్నా
వయసుడిగిన శరీరం సహకరించదు

జీవిత కాలం తోడుంటానని బాస చేసిన
భాగస్వామి  స్వార్డంతో  వెడలి పోగా
*ఎండిన మ్రాను* వోలే మొండి బ్రతుకాయే
ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి?
ఎక్కడికి వెళ్ళాలి? ఈ చేతి కర్ర సాయంతో
ఇంకెంత కాలం ఈదాలి? ఈ జీవన సాగరంలో
ఆ పడమటి సంధ్యాతీరం కోసం వేచి చూస్తూ!

మహా పతివ్రత మండోదరి

శీర్షిక: మహా పతివ్రత మండోదరి


అందాల రాశి
అతిలోక సుందరి
అపురూప సౌందర్యవతి
మమతానురాగాలకు మారు పేరు
మృదుభాషిణి రావణ సతి *మండోదరి*!

విశ్వకర్మ కుమారుడు రాక్షసరాజు మయుడు
దేవకన్య హేమల గారాల పుత్రిక
సకల వేద పండితుడైన రావణుడి భార్య
పంచకన్యలలో మండోదరి ఒకరు!

మహా సాత్వికీ సద్గుణాల వాణి
పరమపవిత్ర పతివ్రతా శిరోమణి
లంకా రాజ్యానికి పట్టపు రాణి
మహిళా లోకానికి ఆదర్శ వనిత!

రావణుడు సామవేద దాన
దండోపాయాలతో మోహించి పెళ్ళి చేసుకోగా
తల్లి దండ్రుల క్షేమ కాంక్షతో
రావణుడిని వివాహమాడిన గుణవతి!

భర్త క్షేమం కోరి ఇంద్రలోకం వెళ్ళి
విభీషణుడి సహాయంతో అమృతభాండం
రావణుడి పొత్తికడుపులో పెట్టి
ఆయుష్షును పెంచిన ప్రతివ్రత మండోదరి!
 

Tuesday, August 19, 2025

దేవుడే వరమిస్తే

అంశం: *దేవుడే వరమిస్తె ఏం కోరుకుంటారు*


శీర్షిక: విశ్వ శాంతిని కోరుకుంటాను

ఈ సృష్టియే విచిత్రం
అందులో మానవ జీవితం నిమిత్త మాత్రం
దేవుడు వరమిస్తాననడం మరో విచిత్రం
మానవుడికి ఇంకేమి కావాలి సంతోషం!

ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో
మానవ జీవితం ఉత్కృష్టమైనది
మనిషి జీవితమే దేవుడిచ్చిన ఒక వరం
అందుకు చెప్పాలి నిత్యం ప్రణామం!

దేవుడే వచ్చి వరమిస్తానంటే
ఊరుకుంటానా ఏమి?
విశ్వ శాంతిని కోరుకుంటాను
ప్రకృతి  పంచభూతాలు సమన్వయంతో
ప్రశాంతంగా ఉండాలనీ కోరుకుంటాను
ప్రజలందరికీ సద్బుద్ధిని ప్రసాదించమని
అందరూ ఆనందంగా సంతోషంగా
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
జీవించాలని కోరుకుంటాను
అందరిలో నేను ఒకరిని కావాలని
కోరుకుంటాను!
 

Monday, August 18, 2025

ప్రతిస్పందన

అంశం: ప్రతిస్పందన


శీర్శిక: *పుండొక చోట ఉంటే మందొకచోట*

మత్తు పానీయాలు సారా బ్రాండీ బీరు విస్కీ
వంటివి శీతల పానీయాలు మత్తు పదార్ధాలు గంజాయి జర్దా కొకిన్ సిగరెట్ల వంటివి
రాష్ట్రంలో చాక్లెట్లు బిస్కెట్లు లాగా!

మొదట ఆశలు రేకెత్తిస్తాయి ధ్యాసలు పెంచుతాయి
కోరికలు పుట్టిస్తాయి తియ్యగా ఆకర్షిస్తాయి
జోలపాటలు పాడుతాయి జోకొడుతాయి
మత్తు లోకి దించుతాయి మాయజేస్తాయి!

సరదాగా ప్రారంభమైన మత్తు పానీయాలు
మనిషికి అలవాటుగా మారి పోతాయి
ఆ అలవాటే మరికొన్నాళ్ళకు మెల్లమెల్లగా
గమ్మత్తు గా తనను బానిసను చేస్తాయి!

అవి పోకిరిగాను సంఘ విద్రోహ శక్తిగాను
సమాజానికి గుదిబండగా మార్చుతాయి
మత్తు పానీయాలు మత్తు పదార్థాలు
స్వయం కృపారాధంతో  సర్వం నాశనం చేసి
మనిషిని *చిత్తు* చిత్తు చేస్తాయి!

*పుండొక చోట ఉంటే మందొక చోట* పెడుతే
ప్రయోజనం శూన్యం
అన్నింటికీ మూలం అవినీతి స్వార్ధ నేతలే
నేతలకు మడుగులొత్తే బ్యూరో క్రాట్స్
పోలీసు వ్యవస్థలు
చట్టాలు ధనికుల చుట్టాలు
తోటలో తులసి మొక్కలను పెంచుతే
తులసి మొక్కలు
గంజాయి మొక్కలను పెంచితే
గంజాయి మొక్కలే పెరుగుతాయి
 

Saturday, August 16, 2025

గజల్

గజల్ 

విదేశీ వస్తువుల వాడొద్దు /భారత ప్రగతినీ

మరువద్దు
స్వదేశీ వస్తువుల వీడొద్దు /భారత ఉన్నతినీ మరువద్దు
***
మనజాతీమతాలు వేరైన  / భారతీయులంతా ఒకటేను
మన దేశ ఉత్పత్తి మనదోయి /నాయకుల వినతినీ మరువద్దు
***
పరదేశ వస్తువుల వాడకము/ నిశ్చయము జనులు ఆపాలోయి
స్వదేశీ సరుకుల నెప్పుడునూ /జాతి ఉత్పత్తినీ మరువద్దు
***
టారిఫ్ లు పెంచినా /భీతిల్ల జేసినా/ బెదురకూడదోయీ
ఎగుమతులు తగ్గినా /దిగుమతులు పెరిగినా/ నీతినీ  మరువొద్దు
***
కల్తియే లేనట్టి చౌకైన వస్తువులు /మనవేను కృష్ణా!
స్వయం సమృద్ధిని  సాధించు /భారత జాతినీ మరువొద్దు 

Tuesday, August 12, 2025

గరుడ పంచమి

 సాహితీ వీణా కుసుమాలు:

తేది: 20.08.2023

అంశం: ఐచ్ఛికం 

శీర్షిక: *నాగుల పంచమి*

ప్రక్రియ: వచన కవిత 


పవిత్ర 'శ్రావణ మాస' శుక్ల పంచమిని

జనులు కొలిచెదరు గరుడపంచమని

భవిష్యత్ పురాణంలో నుండెనొక గాథయే

అది చదివినను , విన్నను గొప్ప పుణ్యమే!


కశ్యప రాజుకు నుండిరి నిరువురు భార్యలు

ఆ ఇరువురు మహారాణులే కద్రువ వినతలు

సంతానం లేక గడిచే నెన్నో కాలములు

కశ్యపుడు పుత్రకామేష్ఠి యాగములు

చేయ, కలిగిరి సంతానం కద్రువకు నాగులు

మహారాణి వినతకు కలిగే గరుడులు!


కద్రువ, ధవళ అశ్వ మోసపూరిత పందెమున

చేసే  వినితను , కుద్రువకు దాసి గాను

గరుడు నదియు భరించ లేక విముక్తి కోరే

అంతట పెద్దతల్లి , నాగుళ్ళు షరతు విధించే

దేవలోకం నుండి అమృతమును కొనిరమ్మనే!


గరుడు సమ్మతించి , స్వర్గం పయణించే

దేవలోకము నుండి అమృతం తెచ్చే

తల్లికి గరుడు దాస్య విముక్తిని గావించే

అట్టి శ్రావణ శుక్లపంచమిరోజే ,గరుడపంచమి!


గరుడ పంచమి రోజుయే , నాగుల పంచమి

ఈ రోజు వనితలు స్నాన మాచరించి

పాలు గ్రుడ్డు నైవేధ్యాలు , ధూప దీపాలతో

పుట్టలకు , నైవేధ్యాలు జరిపించి మ్రొక్కేరు

నాగ దోషాలు బాపమని,సంతానం కల్గాలని

ముత్తైదవుగా నిలుపమని, శుభాలు కల్గాలని!


ఓం తాక్ష్యాయ నమః! 

ఓం గరుడాయ నమః

ఓం వైన తేజాయ నమః! 

ఓం ఖగాయ నమః

ఓం ఖగేశ్వరాయ నమః!


అని పఠించిన చాలు తొలుగు నాగ దోషాలు

ప్రజలకు కలుగు నెన్నో శుభాలు

జనులెల్లరు పొందేరు సుఖాలు!

Monday, August 11, 2025

రామప్ప శిల్ప కళా నైపుణ్యం

అంశం: పదాల కవిత

శీర్షిక: రామప్ప శిల్ప కళా నైపుణ్యం 

*అరుణ కాంతులు* సోక రామప్ప గుడిలో
దేదీప్యమానం వెలుగులు గర్భగుడిలో
తళతళా మెరుపులు దేవతా మూర్తులలో
అది కాకతీయుల శిల్ప కళానైపుణ్యానికి ప్రతీక!

గుడి ఏ స్తంభం మీటినా  ఏ రాయి తాకినా
వినిపించు సప్తస్వరాలు *హృదయగానం* లా
రుద్రుడు నిర్మించే మహేశ్వర దేవాలయం
కీర్తి పొందే దేశ దేశాల నందున!

చుట్టూరా పూల మొక్కలు ఎత్తెన తరువులు
పచ్చిక బయళ్ళు ఆ ప్రక్ననే రామప్ప చెరువు
అచటి *హరిత శోభ* చూడవలనే గానీ
వర్ణించ నెవరి తరం!

ఇసుకలో కట్టడం నీటిలో తేలే ఇటుకలు
నేటికీ వెలిసి పోనీ రంగులు ఆశ్చర్యకరం
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి
*నయన మనోహరం* అందరూ చూడదగిన ప్రదేశం!
 


అంశం: చిత్ర కవిత

శీర్షిక: కొత్త ఒక వింత పాత ఒక రోత

ఒక రోజు ఎర్ర డబ్బ మెరిసేది తళతళ
దాని నిండ మెండుగా ఉత్తరాలు గలగల
రోజంతా ఎండలకు మాడేది మలమల
నేడు పోతుంది ఎర్ర డబ్బా వెల వెల

బంధు మిత్రుల బాగోగులు తెలుసుకొనను
కొడుకులు బిడ్డల మంచిచెడుల తెలుసుకొనను
నిరుద్యోగులు ఉద్యోగాల వేట కొరకు
రాఖీలు పంపించను శుభాకాంక్షలు తెలుపను
ఆలస్యమైనా శుభాశుభాలు తెలుసుకొనను
అవి ఎంతో చక్కగా ఉపయోగ పడేవి

ఎవరు ఉత్తరాలు డబ్బలో వేసినా
ఎవరు లిపాపాలు పోస్ట్ బాక్స్ లో వేసినా
ఎండలకు ఎండిపోనీయ కుండా
వానలకు తడువనీయకుండా
చలికి వణకనీయకుండా
అమ్మ వలె పొత్తి కడుపులో పెట్టుకొని
రోజంతా  భద్రంగా కాపాడుతుంది

చరవాణిలు ఈ మేయిల్స్ రావడంతో
ఎర్ర పెట్టెల అవసరాలు తగ్గిపోయాయి
పోస్ట్ బాక్స్ ల రంగులు వెలిసిపోతున్నాయి
కొన్ని చోట్ల తుప్పు బడుతున్నాయి

నేడు సాంకేతిక విజ్ఞానం పెరగడంతో
దిక్కు మొక్కు లేక కొక్కు పట్టిన కోడిలా ఉంది
సృష్టిలో ఏదైనా కొత్త ఒక వింత పాత ఒక రోత 

చిత్త శుద్ధి

అంశం:చిత్త శుద్ది


శీర్శిక: *చిత్త శుద్ధి లేని శివపూజ లేల*

*చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద*
అన్నట్లు
శరీరాన్ని శివుడి వద్ద నిలిపి
నా కష్టాలను బాపమని కోరుతూ
మనసును బయట చెప్పులు ఎవరైనా
జాతీయం చేస్తున్నారేమోనని ఆలోచిస్తే
అది భక్తి అని పించుకోదు

ఎన్ని కలలు కంటే నేమి
ఎన్ని ఆశలు ఉంటే నేమి
ఎన్ని ప్లానులు వేస్తే నేమి
చిత్త శుద్ధి అనేది లేకుంటే!

అంతా వ్యర్ధమే కదా వెచ్చించిన డబ్బు 
విలువైన సమయం వృధా
వెలకట్టలేని ఆసక్తి మరల ఎప్పుడో
రావచ్చు రాక పోవచ్చు!

*చిత్త శుద్ధి లేని శివ పూజ లేల* అన్నట్లు
ఏదైనా సాధించాలంటే
మనసు నిర్మలంగా పరిశుద్ధంగా ఉండాలి
ఎలాంటి వ్యతిరేక భావనలు ఆలోచనలు
దరిదాపుల్లోకి రాకూడదు
ద్వంధ వైఖరి ఉండ కూడదు!

మనసు బుద్ధి ఏకాగ్రతతో ఉండాలి
అప్పుడే కోరుకున్న కోరికలు ఫలిస్తాయి
కనిన కలలు సాకారం అవుతాయి
జీవితంలో విజయం సాధిస్తారు!

మనసు బుద్ధి ఏకాగ్రత సాధించాలన్నా
మనసు లోని వ్యతిరేక ఆలోచనలు పోవాలన్నా
సానుకూల ఆలోచనలు కలుగాలన్నా
యోగా మెడిటేషన్ చేయడం ముఖ్యం!
 

Sunday, August 10, 2025

మౌనం పదునైన ఆయుధం

 అంశం:మౌన విహారం


శీర్శిక: *మౌనం పదునైన ఆయుధం*

మౌనం రెండు వైపులా పదునైన
ఆయుధం లాంటిది
తెలివిగా సమయానుకూలంగా అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటే వరం లేదంటే షాపం

అడవులలో ఆహారం లభించక పోతే
గ్రామాలలో వానరుల సైర విహారాలే
పంతాలు నెగ్గక పోతే మౌన సైర విహారాలే
నిశ్చల నదులలో నీరు మౌన విహారాలే

పూర్వ కాలంలో జనులు మునులు
మహా ఋషులు అవడానికి కారణం మౌనం
వ్యాస భరద్వాజ గౌతమాది సప్త ఋషుల
మేధస్సుకు కారణం మౌన దీక్షనే
చక్కని ఆరోగ్యానికి ప్రశాంతతకు వరం మౌనం

ఒక్కోసారి మౌనం ఒక ఉప్పెనలా
అణుబాంబు కంటేనూ అత్యంత ప్రమాదకరం
ఇంట్లో భార్య మౌనం భర్త మౌనం
పిల్లల మౌనం తల్లిదండ్రుల మౌనం
ఎటు దారి తీస్తుందో తెలియని గందరగోళం

నేడు భారత్ తో సహా అనేక దేశాలపై
అమెరికా అధ్యక్షుడు వేస్తున్న  టారిఫ్ లు
చాపకింద నీరులా మౌనంగా పాకుతుంది
భారత్ పై అధిక పన్నులు విధించడం
అది ఎంతటి పెను ముప్పునకు దారి తీస్తుందో
ట్రంప్ ద్వంద నీతి ఎలాంటి యుద్ధాలకు
అంకురం ఏర్పడుతుందో ఇప్పుడే చెప్పలేము
కాలమే నిర్ణయించాలి 

Saturday, August 9, 2025

రక్షాబంధన్/ పాట

అంశం: రక్షాబంధన్ గీతాలు


శీర్షిక:  అన్నా....ఓ అన్నా.....

పల్లవి:
అన్నా.... అన్నా.... ఓ అన్నా ....
అన్నవైనా...తమ్ముడైనా మీరే నన్నా..."2"
అమ్మవైనా నాన్నవైనా మీరే కదన్నా....
మా పాలిట దైవాలు మీరే నన్నా.... "2"  "అన్నా"

చరణం:01
ఒకే కడుపులో పుట్టామూ....
ఒకే రక్తం పంచుకున్నామూ..."2"
ఒకే కంచంలో తిన్నామూ...
ఒకే మంచంలో పన్నామూ.... "2"        "అన్నా"

చరణం:02
కొట్టుకున్నా  తిట్టుకున్నా
మనసు లేమి పెట్టుకోలే ...."2"
ఎవరు గెలిచినా ఎవరు ఓడినా
ఈర్ష్య లేమీ లేవు మనకూ ...."2"             "అన్నా"

చరణం:03
మధ్యన వచ్చిన బంధాలే
కలతలు పెంచు తుండెనా..."2"
ఆస్తులు అంతస్తులే
అహాలు పెంచు తుండెనా.... "2"             "అన్నా"

చరణం:04
అన్నా చెల్లెళ్ళ బంధాలకు
హద్దు రాళ్ళే పాతిరా....."2"
రక్షాబంధన్ రోజు రాఖీ తెచ్చానన్నా....."2"
నీ ప్రేమ కోరి వచ్చానన్నా....
నీ ఆస్తులేమీ నాకు వద్దన్నా.... "2"             "అన్నా"
 

బాల సాహిత్యం -గేయాలు

శీర్షిక: బాల సాహిత్యం 

తుర్రు పిట్ట గేయం 
*************
తుర్రు పిట్టా తుర్రుపిట్టా
ఎక్కడికెళ్ళావూ
అడవికెళ్ళావా 
పుల్లలు తెచ్చావా 
గూడు కట్టావా 
గుడ్లు పెట్టావా 
పిల్లల చేశావా 
ఆకలన్నాయా 
ఆహారం పెట్టావా 
రెక్కలొచ్చాయా 
తుర్రు మన్నాయా!

తాత గేయం 
*********
తాతా తాతా తాబేలు 
తాతకు మీసాలు బారేడు
నవ్వకు నవ్వకు నా ముందు 
రాలును ఏమో నీ పండ్లు!

సర్కారు బస్సు 
************
సర్కారు బస్సు వస్తుందీ 
వెనుకకు వెనుకకు జరగండీ 
చక్కగ బస్సు ఎక్కండీ 
వృద్దులకు సీట్లు ఇవ్వండీ
స్త్రీలకు చోటు ఇవ్వండీ
టికెట్ పక్కగ అడగండీ 
సరైన చిల్లర ఇవ్వండీ
హాయిగ ప్రయాణం చేయండీ!

బావపై గేయం 
*********
బావా బావా 
ఎప్పుడొచ్చావు 
సూటు బూటులో 
బాగున్నావు 
మరుదలు పిల్లకు 
ఏమి తెచ్చావు 

ఏమి ఇష్టమో చెప్పూ...

లంగా ఓణీ 
నా కిష్టం
కాళ్ళకు గజ్జెలు 
నా కిష్టం 
రెండు జడలు 
నా కిష్టం 
తలలో పాపెడ 
నా కిష్టం 
జడలో పువ్వులు 
నా కిష్టం 

మరి నాకేమి ఇష్టమో చెప్పూ...

నేనంటేనే 
నీ కిష్టం 
అమ్మ చేసిన పాయసం 
మరీ ఇష్టం 
అందరి సంతోషాలు 
మరెంతో ఇష్టం 
*******

అంశం: సీతాకోకచిలుక

శీర్షిక: ఆదర్శ జీవి

రంగు రంగుల రెక్కలతో
రయ్ రయ్ మంటూ ఎగురుతూ
నలుదిక్కులా తిరుగుతూ
పుష్పాలపై వ్రాలుతూ
మకరందాన్ని గ్రోలే  చిలుకా
ఓ రంగు రంగుల సీతాకోక చిలుకా!

లార్వాగా ఆవిర్భవిస్తూ
గొంగళి పురుగుగానూ ప్యూపాగానూ
అనేక జననారిష్టాలు తట్టుకుంటూ
సీతాకోకచిలుకగా మారుతావూ
ఓ రంగు రంగుల సీతాకోక చిలుకా!

చూడ  ముచ్చటగా ఉంటావూ
సుందరంగా ఎగురుతావూ
పూల తోటలలో ఎగురుతావూ
ఏ జీవికీ హాని తలపెట్టవూ
ఆదర్శ జీవివి చిలుకా
ఓ రంగు రంగుల సీతాకోక చిలుకా!
*****

అంశం: జెండా పండుగ

శీర్షిక: జాతీయ జెండా! (దేశ భక్తి గీతం)

పల్లవి:
ఎగరవే.. ఎగరవే... జాతీయ జెండా
ఎగురెగురవే.. మువ్వొన్నెల జెండా
పైపైకి ఎగరవే.. వజ్రోత్సవ జెండా..."ఎగరవే"

చరణం:01
ఇంటింటా ప్రతి యింటా
వాడవాడన  ప్రతి బడినా
వీది వీదినా ప్రతి మదినా
దేశం  నలుమూలలా..     "ఎగరవే"

చరణం:02
ప్రజలకు ధైర్యాన్నిచ్చు జెండా
జనులకు శక్తి నిచ్చు జెండా
యువతకు ఊపిరి నిచ్చు జెండా
జనులలో ఐఖ్యత పెంచు జెండా.. "ఎగరవే"

చరణం:03
దేశ గౌరవం పెంచనూ
దేశ భక్తిని పెంచనూ
దేశ కీర్తిని పంచనూ
యువత శక్తిని పెంచనూ..   "ఎగరవే"

చరణం:04
పింగళి వెంకయ్య అందించిన
ఎరుపు తెలుపు ఆకుపచ్చ
మూడు రంగుల జెండా
ముచ్చటైన మేటి జెండా....      "ఎగరవే"
****
అంశం: పని

శీర్షిక: పని చేస్తేనే చురుకుదనం 

పాపల్లారా రారండి 
బాబుల్లారా రారండి 
ఆడుతూ పాడుతూ పనిచేద్దాం 
అందరిలో గొప్పగ  నిలుద్దాం  "పాపల్లారా"

పని చేస్తేనే ఉల్లాసం 
పని చేస్తేనే ఉత్సాహం 
పని చేస్తేనే చురుకుదనం 
పని చేస్తేనే  మనకు ఆరోగ్యం   "పాపల్లారా"

పని చేస్తేనే గుర్తింపు 
పని చేస్తేనే విలువ 
పని చేస్తేనే అనుభవం 
పని చేస్తేనే మనకు ధనం       "పాపల్లారా"

అమ్మ చెప్పిన పనులను 
నాన్న చెప్పిన పనులను 
ఆడుతూ పాడుతూ చేస్తూ
అమ్మానాన్నకు సహాయపడుదాం  "పాపల్లారా"
*****
అంశం: బంతి..బంతి

శీర్షిక: *బహు సుందరమైన బంతులు*

పల్లవి:
బంతులోయ్ బంతులు 
బహు సుందరమైన బంతులు 
మనసును దోచే గుండ్రని బంతులు 
మరులు గొలిపే రంగుల బంతులు "బంతు"

చరణం:01
ఇంట్లో ముంగిళ్ళలో
సందులలో బొందులలో 
ఆవరణలో మైదానంలో 
పిల్లలు పెద్దలు విరివిగా ఆడేటి..  "బంతు"

చరణం:02
రబ్బరు ప్లాస్టిక్ బంతులు 
క్రికెట్  టెన్నిస్ బంతులు 
ఫుట్ బాల్ వాలీబాల్ బంతులు 
రంగు రంగుల బంతులు             "బంతు"

చరణం:03
అంబరాన్ని చుంబించే 
అందమైన బంతులు 
ముద్దగ ఒద్దుగ చేతిలో ఇమిరేటి
సుందరమైన బంతులు                 "బంతు"

చరణం:04
శక్తిని యిచ్చు యుక్తిని పెంచు 
ప్రతిభను కనబరుచు
స్నేహాలను పెంచు
సంతోషాలను పంచు        
వ్యాపారాలతో లాభాలు గడించు   "బంతు"
*****
అంశం: వానలు (గేయాలు)
శీర్షిక: వానమ్మా వానమ్మా!

వానమ్మా వానమ్మా
దాహం తీర్చే వానమ్మా 
మహిని తడిపే వానమ్మా 
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా 
చెరువులు నింపే వానమ్మా 
తరువులు పెంచే వానమ్మా
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా 
కడుపు నింపేను చెరువమ్మా 
నీడ నిచ్చేను తరువమ్మా 
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా 
సేద తీర్చేను తరువమ్మా 
పంటలు పండించేను చెరువమ్మా 
జీవకోటికి ప్రాణదాతలు మీరమ్మా!
******

అంశం: బాలసాహిత్యం - ఫలం

శీర్శిక: సీతా ఫలం చిన్నారులారా!
(గేయం)

సీతా ఫలం చిన్నారులారా
తీయగ నుండును బాలల్లారా  "సీతా"

అడవులలోనా స్వేచ్ఛగ పెరుగును
వర్షాకాలంలో విరివిగా కాయును
నిగ నిగ లాడుతూ నుండును
గోళాకారంలో కనువిందు చేయును  "సీతా"

నింగిలోన మిలమిల మెరిసే ఎర్రని తారల్లా
పండులోన తళతళ మెరిసే నల్లని గింజలు
కుప్పలు తెప్పలుగా నుండును
ఫలము తినుటలో సమయం పెంచును "సీతా"

పల్లెలలో పట్టణాలలో విరివిగా అమ్మేరు
చౌక ధరలలో చక్కగా దొరికేను
బేరమాడవద్దు రైతుల వద్ద
షుగర్ ఉన్న వారు ఉబ్బసం ఉన్నవారు
తినకుండా ఉండటమే మేలురా       "సీతా"
*****

శీర్షిక:  *ఘల్ ఘల్ గణపయ్యా*
(గేయం)

ఘల్ ఘల్ గణపయ్య 
గజముఖ సుందరా
మూషికా వాహనా
ఓ బొజ్జ గణవయ్యా!

పార్వతీ తనయా
పరమేశ్వర నాయకా
ఓ భక్త వత్సలా
విఘ్నాలు తొలగించు
విఘ్నేశ్వరుడా!

భారతాన్ని రచించిన
మేధావి నీవయ్య
విశ్వాన్ని జయించిన
వినాయకుని వయ్య
నిను మించిన వారు
జగతిలో లేర!

శుభకార్యాలలో నిన్నే
తొలుత సేవింతురయ్య
బుజ్జి బుజ్జి పాదాలతో 
ఓ బొజ్జ గణపయ్య
ముద్దు ముద్దుగా నడిచేవు
నవరాత్రులు నీకు
పూజలు సేతురు
భక్త జనుల కెల్ల
విఘ్నాలు బాపయ్య
ఉండ్రాళ్ళు నీకయ్య
ఓం బొజ్జ గణపయ్య
 ******

అంశం: *వాన మబ్బు*

శీర్షిక: *అదిగదిగో మబ్బు*

అదిగదిగో మబ్బు
అల్లదిగో మబ్బు
ఆకాశంలో మబ్బు
అందమైన మబ్బు!               "అదిగదిగో"

నల్లనల్లని మబ్బులు
దట్టమైన మబ్బులు
చూడదగ్గ మబ్బులు
సుందరమైన మబ్బులు !         "అదిగదిగో"

చల్లగాలి తాకినా
వానలు జలజలా కురియును
ఒకటి నొకటి తాకినా
మెరుపులు తళతళా మెరియును
ఒకటి నొకటి ఢీ కొనినా
ఉరుములు డబడబా ఉరుమును!     "అదిగదిగో"

మబ్బుల వలనే వర్షాలు పడును
వర్షాల వలెనే చెరువులు నిండును
చెరువుల వలనే పంటలు పండును
పంటల వలనే కడుపులు నిండును!     "అదిగదిగో
 ******

Friday, August 8, 2025

ఎన్నికల సంస్కరణలు జరుగాలి

 శీర్షిక: *ఎన్నికల సంస్కరణలు జరుగాలి*


తెల్ల దొరల నెదిరించి
గుండెను ఎదురు నిలిపి పోరాడే
నాడే వీర నారి ఝాన్సీ మన్యం దొర అల్లూరి
టంగుటూరి సర్ధార్ వల్లభాయ్ పటేల్

అహింసా వాదంతో సంఘటిత శక్తితో
సాధించిరి స్వాతంత్ర్యం గాంధీజీ మరెందరో

మచ్చుకైన కానరావు నాటి పోకడలు
దోచుకుంటూ పోతుండిరి, దోపిడి దారులు

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాభ్ధాలైనా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు
ధనికులు కుబేరులైరి పేదలు నిరుపేదలైరి!

ఇప్పటికైనా సంస్కరణలు రాకుంటే
బడుగులు బ్రతకడం దుర్లభం
భావి తరాలకు మనుగడ కష్టం

నేరస్తులు, అవినీతి పరులకు
రంగులు మార్చే ఊసరవెళ్ళులకు,
ఎనబైయేండ్ల నేతలకు అదుపు ఏది?
ఎన్నికల ఖర్చుపై నియంత్రణ ఏది?

నేతల జీతాల పెంపుకొక నియమం ఉందా?
ఐదేండ్ల సేవలకు  65 యేండ్లు పెన్సన్లా?
రాజకీయ నాయకులేమైనా కార్మికులా ?
పదవికొక పెన్సన్ వీరేమైనా దేవదూతలా?
జీతాలకు పెన్సన్లకు  పన్నులు ఏవి?
అఫిడవిట్లకు వాస్తవ ఆస్తులకు పొంతనేది?
బినామి చట్టాల ఆమలు ఏది?

చట్టాలు ధనికుల చుట్టాలు కాకూడదు
అసమర్ధ నేతలను, అవినీతి నాయకులను
వెనుకకు పిలిచే హక్కు ఓటర్లకుండాలి
ఎన్నికల హామీలను అమలు చేయక కపోతే
అది మోసపూరిత నేరమవ్వాలి

మార్పు కొరకే ఈ తపన
అసమానతలు తొలగాలని ఆవేదన
వెలుగు నిండాలి జగతిన
దేశం సాగి పోవాలి ప్రగతి బాటన!

కరోనా ఓ కరోనా

 *లాక్ డౌన్ అసలే వద్దు*

కరోనా! ఓ కరోనా!

ఏమిటి నీ హైరానా!

ఎందుకు మాపై నజరానా!

విశ్వమంతా చేసుకున్నావు టికానా!

ఇక నీవు ఎత్తైయ్యాల్సిందే బిచానా!

లేదంటే నీకు ఉంటుంది జుర్మానా!


కరోనా అంటే భయం వద్దు

బయట విందులు వినోదాలు రద్దు

షోషల్ డిష్టాన్స్ పాటించడమే ముద్దు

నాకేమీ కాదులే అనే అశ్రద్ద వద్దు

లాక్ డౌన్ అసలే వద్దు

దేశాన్ని అంధకారం లోకి నెట్టొద్దు

కరోనాతో సహ జీవనం చేయాల్సిందే!

దానికో శాశ్వత పరిష్కారం వెతకాల్సిందే!


కరోనాపై అవగాహన పెంచుకోవాలి

మనమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

మన బంధువులే ,మిత్రులే నన్న భావన వీడాలి

దూరం దూరం ఉండి మాట్లాడాలి

అందరు మూతికి మాస్కులు కట్టుకోవాలి

పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలి

కరోనాతో సహజీవనం చేయాల్సిందే!

దానికో శాశ్వత పరిష్కారం వెతకాల్సిందే!


జ్వరం వస్తే పారాసిటమాల్ రోజూ వేసుకో

విటమిన్ సి నాలుకపై పెట్టకో

డి విటమిన్ ,మల్టీ విటమిన్ రోజూ వేసుకో

వేడి నీటితో  రోజూ ఆవిరి పట్టుకో

పాలు ,గ్రుడ్లు , డ్రైఫ్రూట్స్ తింటూ ఉండు

గోరువెచ్చని నీరు తేనెతో త్రాగుతూ ఉండు

అనుమానం వస్తే టెస్ట్ చేయించుకో

కరోనాతో సహజీవనం చేయాల్సిందే!

దానికో శాశ్వత పరిష్కారం వెతకాల్సిందే!


ఎవరి ప్రాణంపై వారికి ఉండాలి బాధ్యత

ప్రతి ఒక్కరం పాటించాలి  నిబద్ధత

ప్రభుత్వాలదే పూర్తి బాధ్యతనడం మూర్ఖం

ప్రభుత్వాలకు సహకరించడం శుభకరం

లేదంటే వెలుతాం మనం యమలోకం

కరోనాతో సహజీవనం చేయాల్సిందే!

దానికో పరిష్కారం వెతకాల్సిందే!


బ్రతికున్నపుడే యేదో ఒక మంచి పని చేయాలి

ఇంకా మెరుగైన ఔషదం కని పెట్టాలి

దానిని పది మందితో పంచు కోవాలి

ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి

అందరూ ఆరోగ్యంగా  జీవించాలి

కరోనాతో సహజీవనం చేయాల్సిందే!

దానికో పరిష్కారం వెతకాల్సిందే!

బుజ్జి పిట్ట బుల్లి పిట్ట (గేయం)

అంశం: బుజ్జి పిట్ట


శీర్షిక: *బుజ్జి పిట్ట బుల్లి పిట్ట*
(గేయం)

బుజ్జి పిట్ట బుల్లి పిట్ట
చేరువయ్యాయీ.....
ముచ్చట్లు అచ్చట్లతో
కాలం గడిపాయీ.....
అటూ ఇటూ తిరుగుతూ
ఆలోచించాయీ....
మా ఇంటి చెట్టు పైన
గూడు కట్టాయీ....
గూడు లోన రెండు
గుడ్లు పెట్టాయీ...
గుడ్ల పైన బుజ్జి పిట్టలు
చక్కగ పొదిగాయీ....
కిచకిచ మంటూ రెండు
పిల్లలొచ్చాయీ...
ఆ..ఆ..ఆ..అంటూ
నోర్లు తెరిచాయీ...
పురుగు పుట్రల తెచ్చి
పిల్లల నోట్లో పెట్టాయీ...
రెక్కలు వచ్చేదాకా
చక్కగ పెంచాయీ...
బుజ్జి బుజ్జిగ కొమ్మలపై
ఎగరడం నేర్చాయి...
రెక్కల్లో శక్తి వచ్చాక
తుర్రుమన్నాయీ....

Thursday, August 7, 2025

త్రిశ్ర గతి గజల్

 త్రిశ్ర గతి గజల్  33333333-24


వాన చినుకు /పడుతుంటే /నేలతడిచి /పోతుందీ
చినుకు చినుకు/తోడైతే/వరద నిలిచి/ పోతుందీ

వరదలన్ని/పెరిగి పోయి/దారులన్ని/ మునుగుతాయి
నీళ్ళన్నీ/కలిసిపోయి/మోరి ఎగిచి/ పోతుందీ

మోరిగుంత/తెరిచుంటే/ప్రాణాలే/హరీనోయి
వాన నీరు/చేరుతుంటె/చెరువు మురిచి/ పోతుందీ

ఇండ్లలోకి/నీరు చేరి/సామానులు/తడుచునులే
నీరు నిలిచి/ పోతుంటే/ఇల్లు కురిచి/ పోతుందీ

నష్ట పోవు/నిరుపేదకు/నష్టపరిహారమేదీ
ప్రభుత్వాలు/మరిచిపోతే/పేద వగచి/పోతుందీ

నిస్వార్ధపు/పాలకులే/ఏలవలెను/ఓ కృష్ణా!
నీతి నేత/మంత్రైతే/పుడమి మెరిచి/పోతుందీ
















మానవ నైజం

 *కవితార్చన*:*ఉన్నప్పుడు శత్రృత్వం పోయాక విలాపం*


శీర్షిక: *మానవ నైజం*

చేతిలో డబ్బున్నప్పుడు పొదుపు చేయరు
లేనప్పుడు తెగ బాధ పడిపోతారు
కుండలో నీరున్నప్పుడు జాగ్రత్త పడరు
లేనప్పుడు బాధ పడుతారు అది మానవ నైజం

గాదెలో బియ్యం ఉన్నప్పుడు ఆకలవదు
కూజాలో నీరు ఉన్నప్పుడు దూపవదు
సమస్యలు లేనప్పుడు  బాధ ఉండదు
అది మనిషి మానసికమైన ధైర్యం

అలానే మనిషి ఉన్నప్పుడు శతృత్వం
ఎందుకంటే రోజు పోట్లాడుతారు
అనుమానిస్తారు అడ్డుపడుతారు
స్వేచ్ఛకు అవకాశము ఉండదు గనుక

అదే మనిషి లేనప్పుడు విలాపం
ఎందుకంటే తోడూ నీడా పోయాయని
రాక్షస సమాజంలో ఎలా బ్రతకాలని
పని చేసిపెట్టే వారు ముద్ద పెట్టే వారులేరని

మరికొందరు ఉంటారు శోఖించకుంటే
సమాజం ఏమనుకుంటుందో నని
విలపిస్తున్నట్లు నటిస్తారు 

Wednesday, August 6, 2025

కలతలు Pకన్నీళ్లు కొందరికి చెలమలు

*కవితార్చన* *కలతలు-కన్నీళ్ళు*


శీర్షిక: *కొందరికి చెలమలు*

సంసారం ఒక మహా సాగరం
కడలి అంతా లోతైనది విశాలమైనది
సముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో
జీవితాన్ని సజావుగా నడపడం అంతే కష్టం!

అయిననూ సాగరంలో సుడిగుండాలను
ఎదుర్కొని ఒడ్డుకు చేరాలన్నా
సంసారంలో సమస్యలను తట్టుకుంటూ
గౌరవ ప్రదమైన జీవితం గడపాలన్నా
కొన్ని విషయాల్లో త్యాగం చేయక తప్పదు!

జీవిత ప్రయాణంలో అప్పుడప్పుడు కొన్ని
క్లిష్టమైన సమస్యలు ఏర్పడటం సహజం
అలాంటప్పుడు అదరకుండా బెదరకుండా
అనుకూలమైన అందుబాటులో ఉన్న
పరిష్కారం మార్గాల కొరకు ప్రయత్నించాలి!

విధి రాతను ఎవరూ తప్పించ లేదన్నట్లు
ఎన్ని ప్రయత్నాలు చేసినా *కలతలు కన్నీళ్లు*
"కొందరికి చెలమలు" లా కళ్ళ నుండి
కన్నీరు పెల్లుబికుతునే ఉంటుంది!

హృదయం విశాలమైతే P

అంశం:పదాల కవిత


(సాగరం,సాహసం, సంసారం, సమీపం
సందర్భము,సంతోషము)

శీర్షిక: *హృదయం విశాలమైతే*

*సాగర* మనినా  *సంసార* మనినా
పెద్దగా తేడా లేదంటారు అనుభవజ్ఞులు
సముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో
జీవితాన్ని సజావుగా నడపడం అంతే కష్టం!

సాగరంలో సుడిగుండాలను
ఎదుర్కొని ఒడ్డుకు చేరాలన్నా
సంసారంలో సమస్యలను తట్టుకుంటూ
గౌరవ ప్రదమైన జీవితం గడపాలన్నా
కష్టమైననూ  *సాహాసం* చేయక తప్పదు!

జీవిత ప్రయాణంలో అప్పుడప్పుడు దుర్భరమైన 
*సందర్భాలు* ఏర్పడటం అతి సహజం
అలాంటప్పుడు అదరకుండా బెదరకుండా
*సమీపం* లో అందుబాటులో ఉన్న
పరిష్కారం మార్గాల కొరకు ప్రయత్నించాలి!

హృదయం విశాలమైతే సమస్యలు
చిన్నవై కలతలనేవి దరి చేరవు
కష్టాలు దూది పింజాల్లా తేలిపోతాయి
సర్దుకుపోయే గుణాలు గల కుటుంబాలలో
*సంతోషాలు* వెల్లివిరుస్తాయి!
 

నీకు నీవే రాజువు నీకు నీవే రాణివి

 శీర్షిక: నీకు నీవే రాజువు నీకు నీవే రాణివి


ఆకాశంలో విహరించే భానుడు వెలుగును
సంచరించే జాబిలి వెన్నెలను
నిశీధిలో తళతళ మెరిసే నక్షత్రాలు 
ఎంతో ఆహ్లాదాన్ని కలుగజేస్తాయి

కానీ చుట్టు పక్కలే ఆకాశహార్మాలలో ఉంటూ
ఏసి కార్లల్లో నగలు నట్రా ధరించి తిరిగే
హోదాల్లో పదవుల్లో ఉన్న గొప్ప వారి వలన
ప్రయోజనం శూన్యం పైగా డామినేషన్

నీ జీవితం నీది నీ బ్రతుకు నీది 
ఎవరికో బంగ్లాలు భవంతులుంటే నీకేమి
ఎవరికో కోట్ల ఆస్తులుంటే నీకేమి 
హోదాల్లో పదవుల్లో ఉంటే నీకేమ

నిన్ను నీవు గుర్తించు నిన్ను నీవు ప్రేమించు 
నిరంతరం నిన్ను నీవు గౌరవించుకో
నీకు నీవే రాజువు నీకు నీవే రాణివి
నీకు నీవే దొరవు నీకు నీవే దొరసానివి
నిన్ను మించిన వారు లేరు ఈ జగతిన
నీలా మంచి మనసును పంచిన
గొప్ప వారు లేరు ఈ లోకాన

డబ్బున్న వారని ఈర్ష్య పడకు భయపడకు
డాబసరిని చూసి బెదిరిపోకు అదిరిపోకు
కుబేరులకైనా కూలి వారికైనా  ఉండేవి
రెండే చేతులనీ ఒకటే ఉదరమనీ  మరువకు!

లక్షాధికారైన లవణమన్నమే గానీ
మెరుగు బంగారం మ్రింగబోడు
వజ్ర వైఢూర్యాలు తిన లేరు
వెళ్ళేటప్పుడు డైమండ్స్ పట్టుకెళ్ళరు
నీవు పేదవనీ ఓ రూపాయి రాల్చి పోరు!

సంపద గలవారమని విర్రవీగే వారిని చూసి
నీవెందుకు భయపడాలి? విలువ నివ్వాలి?
ఎందుకు ఉన్నత గౌరవం ఇవ్వాలి?
నీవు ఎందుకు వ్యక్తిత్వం చంపుకోవాలి ?
వారి ముందు ఎందుకు బానిసగా మోకరిల్లాలి?

నరసింహా శతకంలో కవి ధర్మపురి
శ్రీనివాస్ గారు రచించిన ఒక పద్యం
మననం చేసుకుందాం

"తల్లి గర్భం నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళి పోయెడి నాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమే గానీ
మెరుగు బంగారంబు మ్రింగ బోడు
విత్తమార్జన జేసి విర్ర వీగుటే గానీ
కూడబెట్టిన సొమ్ము కుడువ బోడు
పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగల కిత్తురో దొరలకవునో
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర!

*బలవంతమైన పాము చలిచీమలకు*
*చిక్కి చావదే సుమతీ* వినలేదా
*బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి*
అన్న సామెత కనలేదా

లోకంలో ఎన్నో మార్పులు సహజం
కాలం నిరంతరం రైలులా సాగె ప్రయాణం
అందులో ప్రయాణికులం మనం
ఎవరి స్టేషన్ వస్తే వారు దిగి పోయే వారే

బ్రతికిన కొద్ది కాలమైనా హంసలా జీవించు 
గౌరవంగా తలఎత్తి జీవించడం అలవర్చుకో
వెల కట్టలేని వ్యక్తిత్వాన్ని కాపాడుకో
నీ కంటూ ఒక గుర్తింపు తెచ్చుకో!
 

గోముఖ వ్యాఘ్రాలు P

అంశం:విశ్వాస ద్రోహం

శీర్శిక: *గోముఖ వ్యాఘ్రాలు*

సృష్టిలో ఉత్కృష్టమైన జీవి మనిషి
మనిషి అనేవాడు ఓక సంఘజీవి
సంఘ జీవి సమాజంలోని తోటి మనుష్యులు
మనుష్యుల మనసులతో కలిసి జీవించాలి!

సమాజంలో జీవించే టప్పుడు
కొన్ని విలువలకు మాటలకు కట్టుబడి
నిజాయితీగా నమ్మకంగా విశ్వాసంగా
నడుచు కోవాలి!

డబ్బు లేకపోయినా
కొంతకాలం ఆహారం లేక పోయినా
కొంత సమయం నీరు లేక పోయినా
ఎలాగో అలాగ జీవించ వచ్చు!

కానీ ఒక సారి విశ్వాసం కోల్పోతే
ఎదుటి వారిలో సమాజంలో
నమ్మకం కోల్పోతే గౌరవంగా బ్రతకడం
చాలా కష్టం!

ఇచ్చిన మాటకు నిలబడక పోయినా
చేస్తానన్న పని చేయక పోయినా
అసత్యాలు మాట్లాడినా చాడీలు చెప్పినా
విశ్వాసం కోల్పోయిన వారిగానే భావించాలి!

నమ్మకంగా ఉంటూ మోసం చేసినా
విశ్వాసంతో ఉంటూ వెన్నుపోటు పొడిచినా
ముందు పొగుడుతూ వెనుకాల తెగిడినా
విశ్వాస ద్రోహం మనే చెప్పాలి!

ఇస్త్రీ బట్టలతో పైకి ఉన్నతంగా కనబడుతూ
తిరిగే *గోముఖ వ్యాఘ్రాలు*  సమాజంలో
అడుగడుగునా కనిపిస్తారు
గురువింద గింజ తన నలుపును ఎరుగదన్నట్లు
నమ్మక ద్రోహులు తిరుగుతూ ఉంటారు
వాస్తవంగా చెప్పాలంటే
తేలికగా డబ్బు సంపాదించాలనుకునే వారికి
క్షణాలలో కోటీశ్వరులం కావాలనే దుర్బుద్ధి
కొందరి వృత్తి ప్రవృత్తి అదియే!

తాత్కాలికంగా గోడమీద కళ్ళు మూసుకొని
పాలు త్రాగిన పిల్లిలా
తెలిసి మోసం చేసినా తెలియక ద్రోహం చేసినా
ఎవరు ఎలా తప్పించుకున్నా
విశ్వాస ఘాతకులు సమాజంలో
గౌరవం గుర్తింపు పొంద లేరు
అలానే కర్మ నుండి శిక్షను  తప్పించు కోలేరు
అది రేపే కావచ్చు జీవిత కాలంలో కావచ్చు
మరణించాక కావచ్చు
తాను కావచ్చు లేదా తన తరాలు
శిక్షలు అనుభవించాల్సి రావచ్చు
 

Tuesday, August 5, 2025

చిన్న నాటి జ్ఞాపకాలు

 శీర్షిక: చిన్న నాటి జ్ఞాపకాలు:


చిన్న నాటి జ్ఞాపకాలు ఒకటా రెండా
చెప్పుకుంటూ పోతే బోలెడు

గ్రామీణ ప్రాంతం చల్లని వాతావరణం
చిన్న నాటి జ్ఞాపకాలు మరుపు రానివి
ఎంతో మధురం మైనవి

పల్లె వాసుల ప్రేమలు ఆప్యాయతలు
మరువ లేనివి మరువ రానివి

గ్రామస్తుల స్నేహితుల
రారా పోరా అనే పలకరింపులో
ఎంతో అనురాగం ఆత్మీయత ఉంటుంది

చెప్రాసి యాకూబ్ అలీ
బరిగే తీసుకుని వస్తున్నాడంటే
పలకా బలపం పట్టుకుని తయారు

గోలీలాట,సిర్ర గోనే,పత్తాలు, కోతికొమ్మచ్చి
చెరువుల్లో బావుల్లో ఈత కొట్టడం
మనసులో తట్టిన ఆలోచనలను
సిగరెట్టు పెట్టెల వెనుకాల వ్రాసుకుని
భద్ర పరుచకోవడం నిత్య కృత్యాలు

హైస్కూల్ కు రానూ పోనూ
ఆరు కిలోమీటర్లు కాలినడకనే
ఒక్కోసారి కాళ్ళకు చెప్పులు ఉండవు
పోయేటప్పుడు వచ్చేటప్పుడు
దారిలో ముళ్ళ కంపను, గాజు వక్కలను
రాళ్ళను ఇతరులకు గుచ్చుకోవద్దని
స్నేహితులందరం కలిసి ఏరి వేయడం
గాంధీ బోధించిన పాఠం

రాత్రి కాగానే దీపం బుడ్డి వెలుతురులో
చుట్టు ప్రక్కల వారికి వచ్చిన
ఉత్తరాలు చదవి వినిపించడం
వారి బంధు మిత్రులకు ఉత్తరాలు వ్రాయడం
అప్పు కాగితాలు వ్రాయడం
అప్పుల లెక్కలు చేసి సర్ది చెప్పడం
చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం
ప్రతి నిత్యం షరా మామూలే !

భోజనం అయ్యాక ఎనిమిది గంటల లోపే నిద్ర
ఉదయం కోడి కూయగానే మేల్కొని
కాల కృత్యాలు తీర్చుకొని
ఇంటి ముందు గద్దెల మీద కూర్చుని
హోమ్ వర్క్ చేసుకోవడం ఆనవాయితీ

ఇంటి పనులుంటే చూసుకోవడం
టిఫిన్ పట్టుకుని స్కూలుకు బయలు దేరడం
ఇక రోజు వారిగా జరిగేదే

గ్రామస్తులు ఇచ్చిన విలువ గౌరవం
పంచిన ప్రేమ ఆప్యాయత ఆత్మీయతలు
వెలకట్టలేనివి 

వానమ్మా వానమ్మా

అంశం: వానలు (గేయాలు)

శీర్షిక: వానమ్మా వానమ్మా!

వానమ్మా వానమ్మా
దాహం తీర్చే వానమ్మా
మహిని తడిపే వానమ్మా
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా
చెరువులు నింపే వానమ్మా
తరువులు పెంచే వానమ్మా
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా
కడుపు నింపేను చెరువమ్మా
నీడ నిచ్చేను తరువమ్మా
జీవకోటికి ప్రాణదాతవమ్మా!

వానమ్మా వానమ్మా
సేద తీర్చేను తరువమ్మా 
పంటలు పండించేను చెరువమ్మా
జీవకోటికి ప్రాణదాతలు మీరమ్మా!


   

Monday, August 4, 2025

వైద్య విధానానికే తీరని మచ్చ

అంశం: ప్రతిస్పందన (టెస్ట్ ట్యూబ్ బేబి)


శీర్షిక: *వైద్య విధానానికే తీరని మచ్చ*

వైద్య విధానానికే తీరని మచ్చ
సమాజంలో చెరిగిపోని రచ్చ
కుటుంబ సభ్యులకు మరువలేని శిక్ష
ఆ దంపతులకు దేవుడు పెట్టిన పరీక్ష!

వైద్యులంటే దేవుళ్ళ తరువాత దేవుళ్ళు
నిద్రాహారాలు లేకుండా కష్టపడుతారు
ఇంటి బాధ్యతలను లెక్క చేయకుండా
ప్రాణాలను రక్షిస్తారనేది రోగుల నమ్మకం!

డాక్టర్లు కొందరు మోసం చేస్తారని విన్నాం
డబ్బు సర్వం దోచుకుంటారనేదీ చూసాం
ఆపరేషన్ లో కత్తెరలు మరుస్తారని విన్నాం
కిడ్నీలు అమ్ముకుంటారనేదీ చూసాం!

ఇది డాక్టర్ల పొరపాటా దంపతుల గ్రహపాటా
డిఎన్ఏ పరీక్షలో  తేడాలు తెలిసి నప్పుడు
బేబీని మార్చడమనేది మహా పాపం
భార్యా భర్తలకు ఇంటిల్లిదిపాదికి తీరని శాపం
ప్రజలకు హాస్పిటల్స్ అంటేనే ఎనలేని భయం!

ఇక ఏ మాత్రం ఉపేక్షించ కుండా
సంబంధిత డాక్టర్ నమ్రతపై సిబ్బందిపై
హాస్పిటల్ పై తగిన చర్యలు తీసుకోవాలి
ఇతర డాక్టర్లకు సిబ్బందికీ హాస్పిటల్స్ కు
అది ఒక కఠిన గుణపాఠం కావాలి!


Sunday, August 3, 2025

స్నేహ బంధం

 అంశం: స్నేహ బంధం


శీర్షిక: అతి స్నేహం అమృతం - విషం

ప్రక్రియ: వచన కవిత

స్నేహముంటే ఒక ధైర్యం
స్నేహముంటే ఒక బలం
స్నేహముంటే ఒక పరిష్కారం
స్నేహముంటే ఒక ఓదార్పు
స్నేహం ఎంతో మధురం!

స్నేహమంటే ఇద్దరి మనసుల కలయిక
స్నేహమంటే ఇద్దరి అభిప్రాయాల కలయిక
స్నేహమంటే ఇద్దరి ఆలోచనల కలయిక
స్నేహమంటే ఒక గౌరవం, ఒక నమ్మకం!

కవిత వేరు కథ వేరు కావ్యం వేరు
సినిమా వేరు జీవితం వేరు
ఒప్పందం వేరు స్నేహం వేరు
కృత యుగం వేరు త్రేతా యుగం వేరు 
ద్వాపర యుగం వేరు కలియుగం వేరు
త్రేతా యుగంలో రామ సుగ్రీవుల స్నేహం వేరు 
ద్వాపరయుగంలోకుచేలుడు కృష్ణుడి స్నేహంవేరు
కలియుగంలో ఇద్దరి మనుష్యుల స్నేహంవేరు!

స్నేహం అమృతం  విషం
అతి స్నేహం అనర్ధ దాయకం
గుడ్డి  స్నేహం  ప్రమాదకరం
అతి విశ్వాసం తో జీవిస్తే మిగిలేది శూన్యం!

స్నేహమని మేలు చేకూర్చే వారు 
నూటికి ఒక్కరు 
స్నేహమని చెప్పి కుటుంభాలను
కూల్చిన వారు లక్షలు
భార్య ప్రియుడు కలిసి భర్తలను 
హత్యలు చేసిన వారు వేలు
మోసాలు చేసిన వారు కోకొల్లలు
స్నేహం ఎంత వరకు ఉండాలో
అంత వరకే ఉండాలి
బయటి వరకే పరిమితం కావాలి
స్నేహం రెండు వైపులా పదునైన 
కనబడని కత్తి లాంటిది
అతి విశ్వాసం ఆత్మ వంచనే 
నమ్మకం నట్టేట ముంచుతుంది 
అమితాబచన్ ను ఏబిసి కార్పోరేషన్ లో
నిరుపేదను చేసింది స్నేహితులే 
కోన్ బడేగా కరోడ్ పతి సీరియల్ తో 
మల్లీ కుబేరుడయ్యాడు 
అనిల్ అంబానీ ని చాడీలు చెప్పి
కుప్పకూల్చింది ప్రాణ స్నేహితులేగా!

 

పొగడ్త

అంశం: మరో చరిత్ర


శీర్షిక: పొగడ్త 

(నాకు మా ఊరు పటువారికి మధ్య జరిగిన సంభాషణ. ఈ కవితను వద్ది చెన్నయ్య పటేల్ గారికి అంకితం ఇస్తున్నాను)

అది చలి కాలం,
అందులో చల్లని ఈదురు గాలులు వీస్తున్నాయి
అప్పుడు నేను బి.కామ్ మొదటి సంవత్సరం
హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ లో
చదువుచున్నాను.

మా ఊరు సూరి పెల్లి , వరంగల్ జిల్లా
సెలవులు కావడం వలన ఇంటికి వచ్చాను
నాన్న వ్యవసాయం, నూనె గానుగ పని
అమ్మ ఇంటి పని, వ్యవసాయ పని
మాది నిరుపేద కుటుంబం అనే చెప్పాలి
పెంకు టిల్లు. ఆ కాలంలో టాయిలెట్స్
మా ఊరిలో పటేళ్లకు మాత్రమే ఉండేవి
మాకూ టాయిలెట్స్ లేవు

మాకు దగ్గరలోనే ఒక చెరువు ఉంది
అది నిజంగా కల్పతరువు
చెరువు మత్తడి బడితే వందల ఎకరాల
పొలాలకుసాగునీటిని అందిస్తుంది.
అందులోనే చాకలి వారు బట్టలు ఉతుకుతారు
చెరువు లోపలికి వెళ్ళి శుద్ధమైన మంచి నీళ్ళు
తెచ్చుకుంటారు
బహిర్భూమికి ఆ చెరువు వైపే వెలుతారు
ఊరి చుట్టూర ఇలాంటి చెరువులు, కుంటలు
చాలా ఉంటాయి
గ్రామాల ప్రజలు కల్మషం లేని వారు
కరుణ మమత దయ సానుభూతి, దానగుణం
మంచిని మంచి అని మెచ్చుకోవడం
చెడుని చెడు అని మాటలతో చేతులతో
శిక్షించడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య
ఏ చిన్న విషయం అయినా, జరిగిన
క్షణాలలో ఊరు మొత్తం తెలిసి పోతుంది
ఎవరికీ ఏ ఆపద వచ్చినా, వెంటనే ఆదుకునే
మనస్థత్వం గల వారు పల్లె ప్రజలు
పట్టణాలలో ప్రక్క ఇంటిలో ఏమి జరుగుతుందో
భూతద్దం పట్టి వెదికినా తెలియని దుస్థితి

ఒక రోజు నేను ఉదయం ఈదురు చెరువుకు
వెళ్ళి  గజగజ వణుకుతూ వస్తున్నాను
చెరువుకు ఎందుకు వెళ్ళానో మీకు తెలుసు
ఎదురుగా పటువారి వద్ది చెన్నయ్య పటేల్
ఊళ్ళో నుండి చెరువు వైపు వస్తున్నాడు
అప్పుడు పటేల్ పటువారి ఉండే వారు.
భూముల లెక్కలు శిస్తు వసూలు చేసేవారు
ఆదాయం సర్టిఫికెట్స్ కొరకు
వీరే తహశీల్దార్ కు రెకమెండ్ చేస్తారు
*నమస్కారం సర్* అని అన్నాను
*ఆ.. నమస్కారం నమస్కారం,
అంత దూరాన ఉండే  *ఏంటి నీవు
చస్తావా బ్రతుకుతావా?*
అని నవ్వుకుంటూ అన్నాడు.
*ఎందుకు సర్, అలా అంటున్నారు*
అని నేను అడిగాను
"ఆ.. ఏమి లేదయ్యా ! ఊళ్ళో ఎక్కడ చూసినా
నీ గురించే మాట్లాడుకుంటున్నారు, మంచి పిల్లవాడు, లెక్కలు బాగా చేస్తాడు
మంచిగా చదువుతాడు, బుద్ది మంతుడు అని అనుకుంటున్నారు"

నాకు ఆశ్చర్యం వేసింది. నాలో ఇంత మంచి తనం
ఉందా , ఇంకా నేను బాగా చదివి ఊరికి మంచి పేరు తేవాలని అని అప్పుడే అనుకున్నాను.
అప్పటి నుండి ఇప్పటివరకూ ఊరికి మంచి పేరుతోనే నడుచుకుంటున్నాను.

Saturday, August 2, 2025

స్నేహ గీతాలు/ పాట

అంశం: స్నేహ గీతాలు


శీర్షిక: *మన స్నేహం మధురమురా*

పల్లవి:
మన స్నేహం మధురమురా...
మన స్నేహం వీడమురా...."2"
మరుపు రాని మన స్నేహము
కలకాలం నిలుచునురా.... "2"       "మన"

చరణం:01
తరములెన్ని మారినా....
వరము మన స్నేహమురా...."2"
వయసు ఎంత పెరిగినా...
మనసు ఎదిగి పోవునురా...."2"        "మన"

చరణం:02
చిన్న నాటి జ్ఞాపకాలు...
మరిచి పోము మనమురా..."2"
ఒకరికొకరి సహాయాలు....
ఎనలేనివి మనవిరా.....  "2"                "మన"

చరణం:03
ఎవరు ఎన్ని చెప్పినా....
విడిపోము మనమురా..."2"
ఎవరికి ఏ ఆపద వచ్చినా ...
ఒకరికొకరము తోడురా...."2"            "మన" 

ప్రేమలు ఒక బూటకం

అంశం:వంచక ప్రేమలు


శీర్శిక: *ప్రేమలు ఒక బూటకం*

జీవితమే ఒక నాటకం
అందులో ప్రేమలు ఒక బూటకం
ప్రదర్శించడానికే  ప్రేమల వాలకం
మనసులో ఉన్న దంతా కామం

సృష్టిలోని అందమైన ప్రకృతిని చూసి
పరవసించినట్లు
సృష్టిలోని మరో అందమైన యువతను చూసి
పరవసించడం
యుక్త వయస్సులో ఉన్నప్పుడు
ఇరువురి శరీరాలలో వచ్చే మార్పుల వలన
ఆహార్య ప్రదర్శనల వలన కలిగే
మాటల గారడి వలన ఏర్పడే ఆకర్షణ
అది కేవలం వ్యామోహం!

అది వారి వయస్సుల్లో వచ్చిన మార్పే గానీ
వారి మనస్సుల్లో వచ్చిన పరిపక్వత కాదు
డబ్బుకో పొగడ్తలకో ఐస్క్రీమ్ కో
చాక్లెట్లకో ఎదుటివారికి చూపించుకోడానికో
నటించే నటనే కానీ అది ప్రేమా కాదు దోమా కాదు
అవసరాలను తీర్చుకునే నయవంచక నటన!

ప్రకృతిలో స్త్రీ పురుషుల ఆకర్షణ అనేది
సృష్టి రహస్యం
దానిని ఛేదించడం ఎవరి తరం?
రాధా కృష్ణుల లైలా మజ్నూల  ప్రేమలు
నేడు చాలా అరుదు
ఆకు మీద ముల్లు పడినా ముల్లు మీద
ఆకు పడినా నష్టపోయేది మహిళనే!

చట్టాలలో సానుకూలత వలన
సమాజం దానిని అంగీకరిస్తుండటం వలన
నేడు యువతీయువకులు ఒకరిపై ఒకరు
డామినేషన్ తో
నష్టపోతున్నామనే భావన పోయింది!

స్త్రీల సాధికారత డామినేషన్ పెరగడం వలన
యదేచ్ఛగా ప్రేమించుకుంటున్నారు
కోరికలు తీరాక ఇష్ట పూర్వకంగానే
మరొకరి చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు
ఇరువురివీ నయవంచక ప్రేమలే!

నేడు కొందరు స్త్రీలు పెళ్లి చేసుకోడానికే
ఆసక్తి చూపడటం లేదు
కొందరు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోడానికే
బెంబేలెత్తి పోతున్నారు!

ప్రేమ  పెళ్ళి  అనేది జీవితంలో
ఒక భాగమే గానీ అదే జీవితం కాదు
వ్యక్తిత్వాన్ని మించిన శక్తి మరోటి లేదు
యువత పరిపక్వతతో ఆలోచించాలి
అందమైన జీవితాన్ని అనుభవించాలి
రేపటి తరానికి ఆదర్శంగా నిలువాలి!
 

ఉద్యోగ మాయాజాలం

అంశం: ఉద్యోగ మాయా జాలం


శీర్శిక: రెక్కాడితే డొక్కాడని

లోకమే మాయా లోకం
బాధ్యతలు ఎంతో అధికం
పెరుగుతుంది జనాభా నిత్యం
తిరుగుతుంది భూగోళం నిరంతరం!

రెక్కాడితే డొక్కాడని కాలం
ఉద్యోగం పురుష లక్షణం
కానీ అది నేడు స్త్రీ పురుషులకు అవసరం
చెరో ఉద్యోగం లేకపోతే జీవించడం కష్టం!

అది యజమానులు భావించే బలహీనత
ప్రభుత్వాలను చేతుల్లోకి తీసుకొనిరి
కార్మిక చట్టాలను మార్చి వేసిరి
గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రవేటైజేషన్
అవతరించే
ప్రపంచమే కుగ్రామమాయే
ఉద్యోగ మాయాజాలం మొదలాయే!

అధిక పని గంటలు వసతులు శూన్యం
యజమానులు ఆడిందే ఆట పాడిందే పాట
ఉంటే ఉండు పోతే పో
అవసరం లేకుంటే మేమే పంపేస్తావము!

కార్మికులకు ఉద్యోగ భద్రత కరువు
ఇక పోతుంది సమాజంలో పరువు
సరుకులు దుకాణాలలో అరువు
చెల్లించలేక ఇంటిల్లి పాది కన్నీటి చెరువు!

Friday, August 1, 2025

స్వేచ్చంటే ఇదేనా?

శీర్షిక: స్వేచ్ఛంటే ఇదేనా?

ఉరుములు మెరుపుల కాంతులు 
ఆకాశంలో మబ్బుల దుప్పట్లు 
బస్సుల రణగొణ ధ్వనుల రాగాలు
ఎవరి ఆలోచనలలో వారు ప్యాసెంజర్లు!

భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకు 
వారు మచ్చ తెచ్చే ఖడ్గ మృగాలు 
ఎడారులలో సంచరించే వికృత విష నాగులు!

సంచిత కర్మయో! ప్రారబ్ధ కర్మయో!
విధి వైపరీత్యమో! చట్టాలలో లొసుగులో! 
కలియుగంలో మానవత్వం నశించె
మనిషిలో కౄరత్వం నిద్ర లేచె!

ఆ పసి బిడ్డకు అది ఒక కాళరాత్రాయే
ఎన్ని ఆశలతో బస్సులో జన్మించినో 
ఏమి సాధించను జగతికి వచ్చెనో 
వెలకట్టలేని మానవ సంపద మట్టిపాలాయే!

అన్యం పుణ్యం ఎరుగని ఆ పసిగుడ్డును 
గుడ్డలో చుట్టి బస్సు కిటికీ నుండి బయటకు విసిరేయ చేతులేల వచ్చే ఆ దుశ్శాసనుడికి 
బస్సు అద్దం నుండి డ్రైవరు గమనించకుంటే
ప్రపంచానికి తెలిసేదేనా ఆ నికృష్టుల చేష్టలు 
తెలియకుండా పోతున్నవి మరెన్నో!

బస్సునాపి ఏమిటా వస్తువని ప్రశ్నించగ 
తడబడుతూ చెప్పె భార్య వాంతియని
అనుమానం తో ప్యాసెంజర్లతో వెతికి జూడ 
బస్సులో ప్రసవించిన మృతజీవని తేలే!

మీరెవరిని అడుగ , భార్యా భర్తల మనిరి
మరల గద్దించి అడుగగా సహజీవనమనిరి
మహారాష్ట్ర లోని పర్బానీ ప్రాంతంలో 
సంత్ ప్రయాగ్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ లో 
పెత్రు- సెలూ రహదారిపై ప్రసవించె 
యువతిరతిక దీరీ  పెళ్లి కాకుండానే
విసిరి పారేసే జీవిని ఆల్తాఫ్ షేక్!

స్వేచ్చ అంటే ఇదేనా సాధికారతంటే ఇదేనా 
ఒకటిన్నర సంవత్సర కాలం పూణేలో 
సహజీవన ఫలితమే రతిక దీరీకి గర్భం 
డాక్టర్లనే ప్రశ్నించే ప్రసవం ఇంత సులువా అని 
గాలిలో కలిసి పోయే పసిగుడ్డు నిండు ప్రాణం!

రెక్కాడితే డొక్కాడని కాలం

అంశం: ఉద్యోగ మాయా జాలం


శీర్శిక: రెక్కాడితే డొక్కాడని కాలం

లోకమే మాయా లోకం
బాధ్యతలు ఎంతో అధికం
పెరుగుతుంది జనాభా నిత్యం
తిరుగుతుంది భూగోళం నిరంతరం!

రెక్కాడితే డొక్కాడని కాలం
ఉద్యోగం పురుష లక్షణం
కానీ అది నేడు స్త్రీ పురుషులకు అవసరం
చెరో ఉద్యోగం లేకపోతే జీవించడం కష్టం!

అది యజమానులు భావించే బలహీనత
ప్రభుత్వాలను చేతుల్లోకి తీసుకొనిరి
కార్మిక చట్టాలను మార్చి వేసిరి
గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రవేటైజేషన్
అవతరించే
ప్రపంచమే కుగ్రామమాయే
ఉద్యోగ మాయాజాలం మొదలాయే!

అధిక పని గంటలు వసతులు శూన్యం
యజమానులు ఆడిందే ఆట పాడిందే పాట
ఉంటే ఉండు పోతే పో
అవసరం లేకుంటే మేమే పంపేస్తావము!

కార్మికులకు ఉద్యోగ భద్రత కరువు
ఇక పోతుంది సమాజంలో పరువు
సరుకులు దుకాణాలలో అరువు
చెల్లించలేక ఇంటిల్లి పాది కన్నీటి చెరువు!