Friday, August 1, 2025

శ్రావణ మాసం విశిష్టత

*అంశం*శ్రావణ సంతోషం*


శీర్షిక: *శ్రావణ మాసం విశిష్టత*

తెలతెల్లవారంగా తెమ్మరలు వీయంగా
ముంగిళ్ళలో ముత్యాల ముగ్గులతో
పసుపు కుంకుమలతో కడపలనంకరణలు
పచ్చ పచ్చని మామిడి తోరణాలతో
కళకళలాడే పవిత్ర మాసం శ్రావణ మాసం!

మాసాలలో కెల్లా పవిత్ర మాసం
మాసాలలో ఐదవ మాసం
ఐదవ తనం సౌభాగ్యం కల్గించే
సమస్త జనులకు భక్తిని ముక్తిని పెంచే
శుభ మాసం  శ్రావణ మాసం!

విష్ణు మూర్తి జన్మ నక్షత్రం శ్రవణం
ఇది చంద్రుడితో కూడి ఉన్న నక్షత్రం
పిలువబడుచుండెనదియే శ్రావణ మాసం
విష్ణువుకు మహా ప్రీతికరం శ్రావణ మాసం!

శ్రావణ మాసపు విశిష్టతలు మెండు
రైతులకు వర్షాలు జనులకు పండుగలు
సోమ మంగళ శుక్ర శనివారాలు
పూజలు వ్రతాలు నోములకు పవిత్ర వారాలు!

నాగ చతుర్ధి నాగ పంచమి
సుసంపన్నం శ్రావణ శుక్రవారం
మంగళకరమైన సౌభాగ్యాలను
ప్రసాదించు పసుపు కుంకుమలను
కాపాడు మంగళ గౌరీ వ్రతం
కోరిన వరాలనిచ్చే వరలక్ష్మి వ్రతం
గాయత్రీ దేవి జంధ్యాల పౌర్ణమి
అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధాల పెంచే
రక్షాబంధన్ అదియే రాఖీ పౌర్ణమి
శ్రీకృష్ణుడిని మెండుగా కొలిచే
గోకులాష్టమి మరెన్నో పండుగలకు
నెలవైన మాసం శ్రావణ మాసం!

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు
పరిపుష్టి నిస్తూ భక్తిని పెంచు మాసం
పూజలు జపాలు నోములు పేరంటాలు
ముత్తైదువులకు వాయినాలతో
శోభను సంతరించు మాసం శ్రావణ మాసం!

కొత్తగా పెళ్లయిన కోడళ్ళకు అత్తగారు
శ్రావణపట్టు చీర కట్టించి తీసుకొచ్చుకొను
శుభ మాసం శ్రావణ మాసం 
మహిళలకు పరమానాందాన్నిచ్చే మాసం
అత్యంత విశిష్టత గల మాసం శ్రావణ మాసం! 

No comments: