Monday, January 6, 2025

జీవనోపాధి గుడారాలు

అంశం: *శ్రామిక డేరాలు*


శీర్షిక: *జీవనోపాధి గుడారాలు*

*పొట్ట కూటి కోసం పుట్టెడు మార్గాలు*
అన్నట్లు

ఉన్న చోట
బ్రతుకు దెరువు లేక
తిండి లేనిదే బ్రతక లేక
భార్యా బిడ్డల ఆర్తి దీర్చ
సద్దీమూట ‌సర్ధుకుని
పొట్ట చేత పట్టుకుని
ప్రక్క జిల్లాల నుండో
పొరుగు రాష్ట్రాల నుండో
నేపాల్ దేశాల నుండో!

నెత్తిపై మూటలు
కాళ్ళ క్రింద మంటలు
భార్యా పిల్లలతో తంటాలు
కొండలు కోణలు దాటి
మండు టెండలలో
ఎండిన కడుపులతో
బ్రతుకు దెరువున్న చోటికి
జీవనోపాధి కొరకు
వెతుకు తుంటారు!

గ్రామ శివార్లలో
పట్టణ రహదార్లలో
గుడారాలు కట్టుకుని
డేరాలు వేసుకుని
జీవనం సాగిస్తారు
అదే వారి నివాసం
అదే వారి ప్యాలేస్!

కొలిమి పనులలో
స్వెటర్ల అమ్మకాలలో
పింగాణీ వస్తువులు
గ్లాసు వస్తువులు
ప్లాస్టిక్ వస్తువులు
పిల్లల ఆట వస్తువులు
అమ్మడంలో
అలసట ఎరుగరు!

ఎండనక వాననక
చలి అనక చప్పుడనక
రేయనక పగలనక
చిన్న పెద్దా తేడాలనక
స్త్రీలనక పురుషులనక
పిల్లలనక ముదుసలినక
సమైక్యంగా శ్రమిస్తారు
కష్టాన్ని నమ్ముకుని!

ఏ అర్ధ రాత్రి వేళలోనో
మామూళ్ళకు వచ్చే
పోలీసులను చూసి
క్షణ క్షణం భయంభయంగా
కక్కలేక మ్రింగలేక అన్నట్లు
కాలం గడుపుతారు!

కష్టాలు వచ్చినా
నష్టాలు వచ్చినా భరిస్తూ
వచ్చిన దాంతోనే తృప్తి పడుతూ
ఒక చోట నుండి మరోచోటికి
పలస జీవులు
డేరాలను విప్పుకుంటూ
దేహాలపై కప్పుకుంటూ
పంచభూతాలను నమ్ముకుని
జీవన ప్రయాణం సాగిస్తారు!

కలిసి ఉంటే కలదు సుఖమనీ
బ్రతకడానికి ఈ ప్రపంచం ఎంతో విశాలమనీ
మనసుంటే జీవన మార్గముంటుందనీ
ఆత్మాభిమానంతో బ్రతకడంలో తృప్తి లభిస్తుదని
గొప్ప సందేశాన్నిస్తూ జీవితం సాగిస్తారు!

No comments: