Sunday, January 12, 2025

తల్లి తండ్రులే ఆది గురువులు

అంశం: నీవు నేర్పిన విద్యయే


శీర్షిక: *తల్లి దండ్రులే ఆది గురువులు*

*యధా రాజా తధా ప్రజా*
రాజు నీతి మంతుడైతే మంత్రులు
పాలకులు, ప్రజలు నీతిమంతులై ఉంటారు
రాజు అవినీతి పరుడైతే మంత్రులు
పాలకులు, ప్రజలు అవినీతి పరులవుతారు
ఇది జగమెరిగిన నగ్న సత్యం!

*నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా*
అనే నానుడి కూడా అలా ఏర్పడినదే
నాన్న చాటుగా సిగరెట్లు త్రాగినా,
ఆల్కహాల్ త్రాగినా
అమ్మ, నాన్నకు తెలియకుండా
జేబులో నుండి డబ్బు తీసి దాచుకున్నా
అక్క అమ్మ నాన్నకు తెలియకుండా
చరవాణిలో నీలి వీడియోలు చూసినా
అమ్మా నాన్న ఎవరైనా మార్కెట్లో
వస్తువులను దొంగిలించినా
లేదా పిల్లలు దొంగిలిస్తుంటే ప్రోత్సహించినా
నాయకులు అవినీతికి పాల్పడుతుంటే
చట్టాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నా
ఆ ప్రభావం పిల్లలపై, యువతపై,
సమాజంపై తప్పక పడుతుంది!

కలియుగంలో అవినీతి , పాపాలు
మోసాలు నాలుగు పాదాలు
నడవడానికి ముఖ్యకారణం
పూర్వ కాలం నుండి ఒకరినుంచి
మరొకరికి "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా"
అనే సామెత అద్దం పడుతుంది

పిల్లలకు *ఆది గురువులు తల్లిదండ్రులు*
మొదటి బడి వారి ఇల్లు
ఇల్లు బడే కాదు, అది ఒక వేద పాఠశాల
జ్ఞానబోధశాల, ఒక పార్లమెంటు
తల్లిదండ్రులు గురువులు మాత్రమేనా? కాదు
పిల్లలకు జ్ఞాన బోధ జేయు ఋషులు
మహర్షులు, దేవుళ్ళు వీరే!

పిల్లలను ఎంత క్రమశిక్షణతో పెంచితే
అంత గొప్పగా రాణిస్తారు
క్రమశిక్షణ అంటే నాలుగు గోడల మధ్య
బంధించడం కాదు
కొట్టడం తిట్టడం  అంతకంటే కాదు!

*ఆవు చేనులో మేస్తే దూడ*
*గట్టున మేస్తుందా* అన్నట్లు
ముందుగా తల్లి దండ్రులు
మంచి క్రమ శిక్షణ, మంచి ప్రవర్తనతో
ఉంటూ పిల్లలకు ఆదర్శంగా నిలువాలి
పిల్లలు తల్లిదండ్రులను ప్రతిక్షణం
అనుకరిస్తారు , అనుసరిస్తారు!

పిల్లలు ఆలోచనలు గమనించాలి
వాటికి అనుగుణంగా చేయూతనివ్వాలి
వారి స్నేహాలను గమనించాలి
మంచి చెడులను తెలియజేయాలి
చదువుతో పాటు ఆటలు పాటలలో
స్వేచ్ఛ నివ్వాలి!

బంధుత్వాలు మానవసంబంధాలను
తెలియజేయాలి
పిల్లలకు మంచి అలవాట్లను అలవర్చాలి
చక్కని పాఠశాలలలో చదివించాలి
ఒక స్థాయి చదువు పూర్తయిన పిదప
వారి ఆలోచనలకు,అభిరుచులకు తగిన
విద్యాబోధన జరిగేటట్లు జాగ్రత్త వహించాలి
డాక్టరే కావాలి, ఇంజినీరే కావాలని
పిల్లలపై వత్తిడి తీసుకని రాకూడదు
తల్లిదండ్రుల ఇష్టాలను,బంధువుల ఇష్టాలను
పిల్లలపై రుద్దకూడదు

నేటి బాలలే రేపటి పౌరులు
వారే నవసమాజ నిర్మాణానికి పునాదులు

No comments: