అంశం: అలంకారాలు (అంత్యానుప్రాస)
శీర్షిక: *మారుతున్న కాలం*
(ప్రక్రియ: వచన కవిత
అంత్యనుప్రాసాలంకారాలు)
కొడుకులు బిడ్డలు కోడండ్లు కొందరు
కొరివి దీపాలుగా మారుతున్నారు
వచ్చిన పెన్షన్ వాడుకుంటున్నారు
దాచిన సొమ్ములు దోచుకుంటున్నారు
భూములనన్నిటినీ అమ్ముకుంటున్నారు!
బ్రతికున్నన్నాళ్ళు కసురు కుంటరు
కుక్క కిచ్చిన విలువ యివ్వకుంటరు
గాడిద చాకిరి చేయించుకుంటరు
మూలల్లో, సందుల్లో పడుకో బెడుతరు
మారుతున్నది కాలమని చెప్పుకొస్తరు!
చలిదో బులిదో కంచాన పెడుతరు
పాచిన కూరను పక్కన వేస్తరు
ముంతెడు నీల్లను ముందుకు నూకుతరు
మారన్నమడుగుతే విసుక్కుంటరు
ఎక్కువ మాట్లాడితే కసురకుంటరు!
రోగమొచ్చినా, కాళ్ళునొచ్చినా కనబడరు
బి పి పెరిగినా, షుగర్ పెరిగినా చూడరు
వృద్ధ తల్లిదండ్రులకు నొప్పి వచ్చినా రారు
కనబడరు కొడుకూ కోడలుకు ఎవరు!
చచ్చిన నాడు వరుస కడుతారు
తనయులకు కారుతుంది అద్దెకొచ్చిన కన్నీరు
అబ్బురపరుచు వారి ఆర్భాటాల తీరు
కాటి వరకు కోటి తాళమేళాల జోరు!
పది మంది చూడ,పదోరోజు వరకుంటరు
వేలు లక్షలు ఖర్చు పెడుతరు
విందులు వినోదాలు చేసుకుంటరు
త్రాగుతు వూగుతు గోలజేస్తరు!
నెలమాషికాలని ,సంవత్సరీకాలంటరు
అప్పులు తెచ్చైన, మేకలను కోస్తరు
పంచభక్ష ఫలహారాలు చేస్తరు
పిట్టకని పెడుతరు పుష్టిగ తింటరు
వాట్సాప్ లలో ఫోటోలు పెడుతరు
కొడుకులు బిడ్డలు,కోడండ్లైనను వారు
తల్లి పాలు చీకే ,తండ్రి బుజాన పెరుగుతారు
యాంత్రిక జీవితంతో కాలం గడుపుతారు
వృద్ధ తల్లిదండ్రులు ఎంతో కాలం బ్రతుకరు
కలో గంజో పోసినా తృప్తి పడేరు
ప్రేమతో పలకరించిన సంతోష పడేరు
నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించేరు
మోక్షం పొందాలని కోరుకునేరు!
No comments:
Post a Comment