శీర్షిక: బంధాలు - అనుబంధాలు
సారం
లేని మాను
వట్టి పోయిన
కొమ్మలు
వాలిపోయిన
ఆకులు
వాసన పోయిన
పువ్వులు
వాడి పోయిన
కాయలు
ఏవి పచ్చదనాలు !
ఆప్యాయతలు
అనురాగాలు
కరుణా కటాక్షాలు
బంధాలు
అనుబంధాలు
కనుమరుగవుతున్న
రక్త సంబంధాలు
ఏవీ ఆత్మీయతలు !
రక్త మాంసాలు
ధారపోసి
దేహ కండరాల
కరిగించి
కాలుకు
ముల్లు గుచ్చితే
పంటితో పీకి
కంట్లో
నలుసు పడితే
నాలుకతో తీసి
శ్రమించి
చెమటోడ్చి
పెంచి పెద్ద చేసి
విద్యాబుద్దులు
నేర్పించి
ఉద్యోగాలు
చేయించి
శక్తి కొలది
కట్న కానుకలిచ్చి
పెండ్లిళ్ళు చేసి
సాగనంపుతే
వృద్ధ తల్లి దండ్రులు
చుట్టు పక్కలనే
నివశిస్తున్నా
ఊరి పొలిమేరలోనే
జీవిస్తున్నా
మాటే
బంగారమైనట్లు
తీపి జ్ఞాపకాలు
చేదైనట్లు
కాగితపు
పూల లాంటి
మెస్సేజ్ లతో
పుట్టిన రోజు
శుభాకాంక్షలు
వివాహ మహోత్సవ
శుభాకాంక్షలు
వాట్సాప్ లలో
ఫేస్ బుక్ లలో
ట్విట్టర్ లో
పంపిస్తుంటారు
కన్న కొడుకులు బిడ్డలు
కొందరికి
అవియునూ
ఇష్టముండదు
తీరికుండదు
గుర్తుండదు
ఇంకా లేదంటే
మాతృమూర్తుల
సేవలకు
డబ్బుతో
వెల కడుతారు
ప్రేమలు
తరిగి పోయే
మమతలు
కరిగి పోయే
మనసు
కలవరపెడుతుండే
గడిచిన రోజు
తిరిగి రాదు
పోయిన కాలం
మరల రాదు
ఆపద వచ్చి
నాలుగు రోజులు తింటే
లెక్కలు వేస్తారు
కాదు కూడదంటే
నరకం చూపిస్తారు
అనారోగ్యానికి
పదో పాతికో
ఖర్చు చేస్తే
లెక్కకు లెక్కే అంటారు
పగలు పెంచుకుంటారు
పది మందికి
పంచి పెడుతారు
తలుచుకుంటే
గుండెలో బాధ
అయినా
దాచుకోవాలి
హృదయంలోనే వ్యధ
కడుపు చించుకుంటే
కాళ్ళ మీద పడుతాయి
రుధిరము చుక్కలు!
తెలిసి వస్తుంది
వారికీ
వారి బిడ్డలు
వారికీ
ఆ కాగితపు పుష్పాలు
అందించి నప్పుడు
తల్లిదండ్రుల
సేవలను
డబ్బుతో
వేలల్లో వెలకడితే
వారి బిడ్డలు
అదే డబ్బుతో
డాలర్లలో వెలకడుతారు
అంతే తేడా
బంధాలు
అనుబంధాలు
రక్త సంబంధాలు
ఇక రైలు పట్టాలేనా!
No comments:
Post a Comment