Monday, January 6, 2025

అభ్యుదయం

అంశం: *అభ్యుదయం*


శీర్షిక: *ఎవరో వస్తారని*

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా,
నిజం మరిచి నిదుర పోకుమా"
అని ఒక  సినీ కవి అన్నట్లు

ఎవరో వచ్చి ఏదో చేస్తారని
కాలం వెళ్ళ దీయకు
విలువైనది కాలం,
వెలకట్టలేనిది కాలం
కొందామన్న దొరకనిది,
తిరిగి రానిది కాలం
మీలో యుక్తి ఉన్నది
మీలో అనంతమైన శక్తి ఉన్నది!

ఎవరి అభ్యుదయానికి వారే
ఎవరి ప్రగతికి వారే పాటు పడాలి
మానవీయ విలువలతో జీవించాలి
మమతానురాగాలను  పంచాలి!

ఒక గురజా అప్పారావులా
ఒక వీరేశలింగం పంతులులా
ఒక మధర్ థెరిసా లా
ఒక సావిత్రి పూలే లా
అభ్యుదయ భావాలతో
తోటి వారికి మేలు చేసే
విధంగా జీవించాలి!

మారు మూల గ్రామాన జన్మించిన
డాక్టర్ అబ్దుల్ కలాం గారు
వేప గింజలు, పాల ప్యాకెట్లు అమ్మి
గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు
దేశ రాష్ట్రపతిగా సేవలందించాడు
భారత రత్న పొందాడు
భారత దేశాన్ని  ఉన్నత స్థితిలో నిలిపాడు!

భగవంతుడు అందరికీ
సమానంగానే అవయవాలు,
ఆరోగ్యం, ఆలోచనలు ఇచ్చాడు
ప్రకృతిని ఇచ్చాడు
పంచభూతాలను ఇచ్చాడు!

శ్రమించే శక్తి ఉన్నవారు
చదువుకున్న విద్యావంతులు
చకోర పక్షుల్లా రోజంతా
ఇరువది నాలుగు గంటలు
ప్రభుత్వ పధకాల కొరకు
పేపర్లలో, యూట్యూబ్ లలో
ఉచితాల కొరకు ఎదురు చూస్తూ
విలువైన సమయాన్ని
వృధా చేసుకోకూడదు
మీ మీ ఆలోచనలకు
ప్రత్యామ్నాయ వనరుల కొరకు
పరుగులు తీయించాలి!

వ్యక్తిత్వాన్ని వదులుకుంటూ
ఆత్మాభిమానం చంపుకుంటూ
బానిసలుగా బ్రతుకడం సరికాదు
ఆత్మాభిమానానికి మించిన
ఆభరణం లేదు ఈ జగత్తులో
జీవితం విలువైనది!

బ్రతికిన పది కాలాలైనా
బానిసలుగా కాకుండా
సోమరితనంలా కాకుండా
నందిలా నాలుగు కాలాలు
గౌరవంగా బ్రతకినా ఎంతో మేలు!

సూర్యభానుడిలా స్వయం ప్రకాశంతో
స్వశక్తితో సాధిస్తూ జీవించాలి
అభ్యుదయ భావాలతో
కులమత భేదాలు లేకుండా
ప్రాంతీయ విభేదాలు లేకుండా
నిస్వార్థంగా, నిజాయితీగా
పరుల మేలును కోరుతూ
ఆదర్శంగా చరిత్రలో
స్థిర స్థాయిగా నిలిచి పోవాలి !

హామి: ఇది నా స్వీయ రచన దేనికి అనువాదం అనుకరణ కాదు 

No comments: