Wednesday, January 13, 2016

' అరిషడ్వర్గాలు ' అనగా నేమి ? వాటి పర్యవసానాలు ఏమిటి ?

ప్ర . ' అరిషడ్వర్గాలు ' అనగా నేమి ? వాటి పర్యవసానాలు ఏమిటి ?
జ . మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు పడే  శత్రువులు , మనిషి  దుఃఖాలకు   మూల కారణాలు ' అరిషడ్వర్గాలు '.  మనిషి మనసును , చెట్టుకు పట్టిన  చెదలా  పీల్చి పిప్పి చేసేవి  ' అరిషడ్వర్గాలు '. ఈ అరిషడ్వర్గాలు  రెండు వైపులా  పదునున్న కత్తి లాంటివి .   అసలు ఏమిటి  ఈ  'అరిషడ్వర్గాలు ' . 
"కామ , క్రోధ , లోభ  , మోహ , మధ  మరియు  మాత్సర్యం " అనే ఆరు వర్గాలే  ( శత్రువులు ) ఈ ' అరిషడ్వర్గాలు'.   
మనిషి అభివృద్ధికి   అడ్డు పడే , మనిషి  దుఃఖాలకు   మూల కారణమయ్యే  ఈ ' అరిషడ్వర్గాలు'  ఏమిటో వివరంగా  
******************************************************************************
చూద్దాం : 
******
01. కామం :  కామం అంటే  వివిధ రకాల  శారీరక  , మానసిక కోరికలు  కలిగి ఉండటం . కామం మనిషికి ఒక  శత్రువు లాంటిది .  మనిషి  వివిధ రకాల కోరికలు  కలిగి ఉండటం వలన , విచక్షణ కోల్పోయి  చేసే  పనుల వలన  మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు  పడి , మనిషి  దుఃఖాలకు   మూల కారణమవుతుంది .  ఉదా :  కామంతో కీచకుడు  తనకు తానే  వినాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు . కీచకుడు  ఎవరో కాదు , విరాట మహారాజు  బావమరిది . విరాట మహా రాజు  బావమరిది ననే అహంకారంతో , తనను కూడా  లెక్క చేయ కుండా , అనేకమైన కీచక పనులు , ఆకృత్యాలు  చేసేవాడు .  అజ్ఞ్యాత వాస సమయంలో , విరాట మహారాజు  ఇంట  , సతీ  సమేతంగా   పంచ పాండవులు కొలువుదీరుతారు . అప్పుడు ఈ కీచకుడు  ద్రౌపతిని  చెర  పట్టేందుకు ప్రయత్నిస్తాడు .  తెలివిగా   ద్రౌపతి నర్తన శాలకు  రమ్మంటుంది . అక్కడ నల్లటి ముసుగులో వున్న  భీముడు,   భయంకరమైన  పిడిగుద్దులతో   కామంతో  ఊగి పోయే   కీచకుణ్ణి  హతమారుస్తాడు  .   


02.  క్రోధం : క్రోధం అంటే  కోపాన్ని , ఉద్రేకాన్ని, ఆవేశాన్ని  కల్గి ఉండటం . అనుకున్న పనులు కాలేదని , తన మాట చెల్ల లేదని, పని వత్తిడి పెరిగిందని , దానికి కారణం  ఎదుటి  వారే నని  వారిపై  కోపాన్ని ప్రదర్శించడం , కక్ష పెంచు కోవడం  మొ. నవి . కోపం  లో , ఆవేశం లో  తీసుకునే  ఏ   నిర్ణయం  కూడా  నష్ట పరుస్తుందే కాని  విజయాన్ని  చేకూర్చదు . క్రోధం  మనిషికి ఒక  శత్రువు లాంటిది . క్రోధం   కలిగి ఉండటం వలన , విచక్షణ కోల్పోయి  చేసే  పనుల వలన  మనిషి  మనుగడకు , మనిషి  ఎదుగుదలకు , మనిషి అభివృద్ధికి   అడ్డు పడి , మనిషి  దుఃఖాలకు   మూల కారణమవుతుంది .  ఉదా : శ్రీ  మహావిష్ట్నువు  మీద  క్రోధం వలన  హిరణ్యకశ్యపుడు , తన కొడుకు  ప్రహల్లాదుడు  నిరంతరం  హరినామ  స్మరణం  చేయడం  తట్టుకోలేక , కన్నా కొడుకని  కూడా చూడ కుండా, అత్యంత  కఠినమైన  శిక్షలు  పెడుతాడు . ఐనను   ప్రహల్లాదుడు హరి నామ స్మరణ  మానడు . " ఎక్కడరా  నీ  హరి  , ఈ  స్థంభం లో చూప మనగా " ,  " ఇందు గల డందు లేడన  వలదు , ఎందెందు  వెతికినా  నందు గలడు  హరి "   అంటాడు  ప్రహల్లాదుదు . వెంటనే  అదే  స్తంభాన్ని  చీల్చుకుని  శ్రీ  లక్ష్మి  నరసింహ  స్వామి  వచ్చి , హిరణ్యకస్యపున్ని  హతమారుస్తాడు . 


03. లోభం : లోభమంటే  పిసినారి తనం . తాను  సంపాదించింది  తనకు  తప్పా ఇతరులకు  చెంద కూడదు  అని అనుకోవడం . ఈ లోభత్వం గల  కొందరు  తాము తినరు , ఇతరులను  తిన నివ్వరు . చివరికి అది , దొంగల పాలో  లేక  భూమి పాలో కాక తప్పదు . లోభం  మనిషి ఎదుగుదలకు , దేశ అభివృద్దికి  ఒక  శత్రువు లాంటిది . ఉదా : ద్రుతరాసష్ట్రుడికి  లోభం ఎక్కువ . దేశ సంపద అంతా తన కొడుకులైన  దుర్యోధనాది  నూరుగురు కౌరవులకే  దక్కాలి గాని , పాండవులకు  సూది మొన  భూమి కూడా  చెంద  కూడదని  ఎత్తులు వేసి ,  ఓడించి , వారిని అరణ్య వాసం  పంపిస్తాడు . కాని  చివరికి  పాండవుల చేతిలో  లోభులైన  , క్రూరులైన , హీనులైన  కౌరవులు ,  అత్యంత ఘోరంగా  మరణిస్తారు .  

04. మోహం : మోహమంటే  అత్యధిక  కోరికలు కలిగి ఉండటం . అత్యధికంగా  వ్యామోహం  కలిగి ఉండటం . అభి మానం  పెంచుకోవడం .  తాను కోరుకున్నది తనకే  చెందాలి తప్పా  ఇతరులకు  చెంద కూడదు  అనే  గట్టి  భావన కలిగి ఉండటం . దానినే  ఇతరులు పొందితే  తట్టుకోలేక పోవడం . అనుకున్న కోరిక తీరక పోతే  మానసికంగా  క్రుంగి పోతారు .  మోహం  మనిషికి ఒక  శత్రువు లాంటిది .  ఉదా : కన్న  కొడకు పై  వ్యామోహంతో , కైకేయి  , రాముడిని కాకుండా  , భరతునికే   పట్టాభి షేకం  చేయాలని  కోరగా , మాట తప్పని  దశరథ మహారాజు  రాజు  , రాముడిని  14 సంవత్సరాలు  అరణ్య వాసానికి  పంపడం  , ఆ తరువాత   సీతా మాత , శ్రీ  రాముడు ఎదుర్కొన్న  శారీరక  మానసిక  బాధలు  వర్ణనాతీతం . చివరికి సీత  అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది  . భరతుడు  రాజ్యాధికారం  ఒప్పుకోలేదు .  అలానే  ద్రుత రాష్ట్రుడు కూడా తన కొడుకులైన  కౌరువలపై  వాళ్ళ మాలిన  వ్యామోహం  వలన  , వారిని సక్రమ మార్గం లో పెంచక సర్వాన్ని కోల్పోతాడు .   


05. మధం  : మధమనగా   గర్వం .  గాంభీర్యాన్ని  ప్రదర్శించడం . గొప్పలకు  పోవడం . అంతా  నా  వల్లనే  జరిగింది, ఇది నా వల్లనే సాధ్యం  . నేను  లేక పోతే  ఇది జరిగేది కాదు  అని  తమకు తామే  జబ్బలు  చరుచు కోవడం.  
ఎదుటి వారిని  లెక్క  చేయక పోవడం , కించ పరుచడం , దూషించడం , చిన్న చూపు చూడటం.  మధం   మనిషికి ఒక  శత్రువు లాంటిది . ఉదా : మధం తోటి , లంకాధి పతి  రావణా సురుడు, తన  మాయలతో  బంగారు  జింకను  సృష్టించి , శ్రీ రాముడిని  , లక్ష్మణుడిని  అటు వైపు  మళ్ళించి , మారు వేషంలో  బిక్షాటనకు  వచ్చి , శ్రీ రాముడు  గీసిన  గీతను  కూడా దాటి  వచ్చి  బిక్షం వేయాలని  ఒప్పించి , సీతను  అపహరించి,  లంకలో బంధిస్తాడు . హనుమంతుడు లంకకు  నిప్పు పెట్టినా  లెక్క చేయడు . వద్దని  వారించిన  తమ్ముడు విభీషణుడిని తరిమి  కొడుతాడు.  శ్రీ రాముడు తో  తలపడి  సర్వాన్ని కోల్పోతాడు . చివరికి   శ్రీ  రాముడి  చేతిలో  తానూ  హతుడయ్యాడు  

06. మాత్సర్యం : మాత్సర్యం అనగా  అసూయ , ఈర్ష్య , ద్వేషం . సిరి సంపదలన్నీ  తనకే దక్కాలి గాని  , ఇతరులకు దక్కకూడదు  అనే  భావన  , ఆలోచన  కలిగి ఉండటం . ఇతరులు  ఇండ్లు కట్టుకుంటే  చూసి  ఈర్ష్య  పడటం , ఇతరులు  బట్టలు కొనుక్కుంటే  చూసి  అసూయ పడటం , ఇతరుల ఇంట్ల  పెండిండ్లు  అవుతుంటే ఏడవడం మొ . నవి  గా చెప్పుకోవచ్చు .   ఉదా : పాండవుల ఎదుగుదలను  జీర్నిచుకోలేని  దుర్యోధుని మామ ' శకుని '  ఈర్ష్యతో ,  వారిని ఎలాగో  ఓడించాలని  మోసపూరిత  పాచికలు  వేసి , ఓడించి  పాండవులను  12 సంవత్సరాలు  అరణ్య వాసం  1 సంవత్సరం అజ్ఞ్యాత వాసం  పాలు చేస్తారు . 


ఈ అరిషడ్వర్గాలు  మనిషిని  శారీరకంగా  , మానసికంగా , ఆర్ధికంగా  సాంఘీక  పరంగా , సామాజిక పరంగా  అదః పాతాళ లోకానికి  త్రొక్కేస్తాయి . అందుకని  వీటిని  ఎప్పుడూ అదుపులో ఉంచు కోవాలి .  ఎప్పుడూ అవి మన అదుపులో ఉండాలి   గాని  , వాటి  అదుపు  లోకి మనం వెల్ల  కూడదు . 

No comments: