Wednesday, December 11, 2024

గీత సారం /భగవద్గీత

అంశం: "గీతా సారం - జీవిత సమన్వయం"

శ్లోకం: *పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ*
           *దుష్కృతామ్! ధర్మ సంస్థాపనార్ధాయ*
           *సంభవామి యుగే యుగే!*
                   (4 అధ్యాయం 8 వ శ్లోకం)

శీర్షిక: *గీతా సారం*

*భగవద్గీత ఒక కల్పతరువు*
*విశ్వ మానవాళికి ఆది గురువు*
*జీవిత అనసంధానానికి సందేశాత్మక సింధువు*

మహాభారతంలో కురుక్షేత్రం సంధర్భంగా
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన
సారాంశంమే భగవద్గీత అదియే గీతా సారం!

భగవద్గీత,  కృష్ణ పరమాత్మ అర్జునునకు
అందించిన జ్ఞానప్రభోదమే కాదు
గీత - కుల మత జాతి ప్రాంత ఖండాలకు
అతీతంగా విశ్వ జనులందరికీ సమస్యా
పరిష్కార మార్గదర్శి!

ఒక వైద్యుడు రోగి జబ్బులను నయం చేస్తే
ఒక న్యాయవాది మనిషిని శిక్షల నుండి రక్షిస్తే 
ఒక జ్యోతిష్యుడు శుభాశుభాలను తెలియజేస్తే 
భగవద్గీత సమస్యలనే రాకుండా చేస్తుంది!

ఎలాంటి సమస్యలతో సతమతమౌతున్నా 
మానసిక బాధలతో కృంగి పోతున్నా
భగవద్గీత మనసుకు స్వాంతన నిస్తుంది
మనిషిని నవనవోన్మేషం దిశగా నడిపిస్తుంది!

జలముతో శారీరక మాలిన్యం తొలగినట్లే
గీతాధ్యయనంతో మానసిక మాలిన్యం
నశించి పోతుంది

"తల్లి చనుబాలకంటే శ్రేష్టమైనది భగవద్గీత"
అంటారు వినోబా భావే

శ్రీ కృష్ణుడు జూదంలో శకుని, పాండవులను
మోసంతో ఓడించినపుడు
శకునిని దండించే ధైర్యం లేక కాదు
ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినపుడు
కౌరవులను శిక్షించే శక్తి లేక కాదు
కురుక్షేత్ర యుద్ధంలో, అధర్మానికి పాల్పడిన
కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టే మార్గం లేక కాదు

ఏదైనా సమస్య పక్వానికి రావాలి
సమస్తలోకానికి దాని పర్యావసానం తెలియాలి
ధర్మాధర్మాలు సమాజానికి తెలియాలి
మంచి ఏదో చెడు ఏదో అనుభవం లోకి రావాలి 
ఒక మానవుడిగా  సమస్యలను ఎదుర్కోవాలి,
అని భావించాడు కృష్ణ పరమాత్ముడు!

కురుక్షేత్ర సంగ్రామంలో,
అటువైపు తండ్రులు, అన్నదమ్ములు,
గురువులను తనవాళ్ళను చూసాక 
హృదయం ద్రవించి పోగా
అర్జునుడు దుఃఖితుడై , అస్త్ర శస్త్రాలను
వదిలేసి నేను యుద్ధం చేయనంటూ
విషాద వదనంతో,

నా వాళ్ళను సంవరించాక సాధించిన
రాజ్యాలు , భోగాలు నాకు వలదని 
రథం లోనే ధనుస్సును జారవిడవగ!

అప్పుడు రథ సారథి అయిన శ్రీ కృష్ణుడు
అర్జునుడికి గీతోపదేశం చేసే

"అర్జునా! యుద్దాన్ని వారే కోరుకున్నప్పుడు
బంధుత్వం ఆలోచించడం తగదు"
నీ పైకి యుద్దానికి వచ్చిన వారు బంధువులేల?

"చావు పుట్టుకలు సహజం. 
పుట్టిన వారు ఏ రూపం ధరిస్తారో తెలియదు
అయినా నీ బంధువుల శరీరమే నాశనమౌతుంది
ఆత్మ కాదు, అందుకు విచారించడం తగదు
ధర్మాన్ని నిర్వర్తించడం లోనే నీకు అధికారం
కానీ దాని కర్మఫలాన్ని అనుభవించడంలో 
లేదు నీకు అధికారం"

అంటూ యుద్దానికి  సన్నద్ధం చేసి
అధర్మ పాలకులైన దుర్మార్గులైన కౌరవులను
కురుక్షేత్ర సంగ్రామంలో సంవరించడానికి
యుద్ధంలో గెలుపుకు మూల కారకుడై
విశ్వ మానవాళి జీవిత సమన్వయానికి
గొప్ప సందేశం అందించాడు
శ్రీ కృష్ణ భగవానుడు!

No comments: