Tuesday, December 10, 2024

విభజన

అంశం: విభజన:

శీర్శిక: విభజించి పాలించు

*విభజన* నాలుగు అక్షరాల పదమే.
కానీ దాని చుట్టూ ఉంటుంది అగ్ని జ్వాల

*విభజించి పాలించు*
*అనేది రాజకీయ నాయకులకు*
*వెన్నతో పెట్టిన విద్య*

*విభజన* అనునది
రెండు వైపులా పదునైన కత్తి లాంటిది

దానిని మంచికి వాడుకుంటే
సుఖసంతోషాలను , సంపదలను ఇస్తుంది
చెడుకు వాడుకుంటే
సమాజ వినాశనానికి దారి తీస్తుంది

రాష్ట్ర విభజన
పాలన సౌలభ్యం కొరకైనా
సమాజ హితం కొరకైనా
రాష్ట్ర అభివృద్ధి కొరకైనా మంచిదే
కానీ సమాజం తిరోగమనానికో
రాష్ట్ర సంపద మొత్తాన్ని ఒకే కుటుంబం
దోచుకోడానికోనైతే మంచిది కాదు

*పుర్రెకో బుద్ది*
అంటారు పెద్దలు
పుర్రెలో పుట్టిన బుద్ది
పుడకలలోనే పోతుంది
మధ్యలో మారడం అసంభవం

మనిషి ఆశాజీవి
మానవుడు స్వార్ధ పరుడు
దీపం ఉండగానే
ఇల్లు చక్క బెట్టు కోవాలని
ఉబలాట పడుతుంటాడు

మనిషి స్వార్థం
ఎంతకైనను తెగిస్తుంది
దానికి అవకాశాలు తోడైతే
అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది

అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ
మోహ మధ మాత్సర్యాలను
తాను అదుపులో పెట్టకోలేక పోతే
తానూ నష్టపోతాడు
సమాజాన్ని కష్టాల్లో పడేస్తాడు

ఫలించే కల్ప వృక్షాన్ని పెకిలిస్తే
ఫలాలు పుష్పాలు, కలప సంపద
వన మూలికలను కోల్పోతాం
అలానే  ఉమ్మడి కుటుంబాలు
విచ్చిన్నమైతే ఒంటరి కుటుంబాలై
దిక్కులేని పక్షుల్లా చెట్టుకొకటి
పుట్టకొకటిగా ఎగిరి పోతారు

విభజన వలన నష్టాలు
ఎన్ని ఉన్నాయో
లాభాలు కూడా ఉన్నాయి
అవసరాలు , అవకాశాలు, పరిస్థితులు
మానవుల కోరికలు, మార్పులకు సంకేతాలు

ఉమ్మడి కుటుంబాల వలన
ఐక్యత, సంస్కృతి సాంప్రదాయాలు
కట్టుబాట్లు, నాగరికత , పరిమిత ఖర్చు
ప్రేమాప్యాయతలు ,ఆత్మీయ పలకరింపులు
బంధుత్వ వరుసలు, పెద్దల పట్ల గౌరవం
సమస్యల పరిష్కారం
ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉంటే

ఒంటరి కుటుంబాల వలన
స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సంపద అభివృద్ధిని
చదువు సంధ్యలపై , ఉద్యోగాలు చేయడంలో
జీవన శైలిపై , పిల్లల పెంపకాలపై స్వేచ్ఛ
ఎవరి అజమాయిషీలేకుండా ఉంటుంది

అలానే ప్రాంతాల ,రాష్ట్రాల , కులాల మతాల
విభజన లోనూ మంచి చెడులు ఉంటాయి
నిస్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటే క్షేమం
స్వార్ధంతో నిర్ణయాలు తీసుకుంటే క్షామం

        

No comments: