Sunday, December 22, 2024

నారి బాగుంటె మనుగడ

అంశం: నారీ
శీర్షిక: *నారి బాగుంటే మనుగడ*

 అంతర్జాతీయ మహిళాదినోత్సవం :
 *మహిళ బాగుంటె మనుగడ* 
(ప్రక్రియ: మణిపూసలు)

01.
సృష్టికి మూలం స్త్రీయే
ప్రకృతికి రూపం స్త్రీయే
స్త్రీ యే కదా భూదేవి
సహన శీలియు  స్త్రీయే!
02.
అమ్మగా ఆలిగానూ
అక్కగా చెల్లిగానూ
ఎన్నో వరుసలతో
అలరించు ప్రేమతోనూ!
03.
అబలలు కాదు సబలలు
చదువులలోనూ మహిళలు
అనేక రంగాలలోను
ముందు నిలిచే తరుణిలు!
04.
ఉద్యోగంలో వివక్ష
జీతం లోనా వివక్ష
గౌరవం లోను తేడా
మరెంతకాలమీ కక్ష!
05.
పిల్లలపై మహిళలపై
అత్యాచారం తమపై
లైంగిక వేధింపులు
పిచ్చి బిచ్చగత్తెలపై!
06.
చట్టాలెన్నో ఉన్నను
కోర్టులెన్నో ఉన్నను

ఎన్ని ఉన్న ఏమిఫలము

సాక్షాలు లేకున్నను!
07.
తమలో మార్పురావాలి
మానవత్వం విరియాలి
స్వేచ్ఛ ఉండటమే కాదు
సాధికారత రావాలి!
08.
ఒక మహా పురుషుడి గెలుపు
ఒక గొప్ప పురుషుడి మలుపు
వెనుక  స్త్రీ హస్తము ఉండు
గుర్తించరు వనిత మెరుపు!
09.
నారి బాగుంటె మనుగడ
లేదంటె ఇంట్లో రగడ
ప్రతి ఒక్కరూ మారాలి
అసభ్య రాక్షస పోకడ!
10.
వేతనం లేకుండా
సెలవులే లేకుండా
చెమటోడ్చుతూ నారీ
బ్రతుకు పనిమానకుండా!

No comments: