Saturday, December 7, 2024

నేనే ఒకవేళ స్త్రీ నైతే

అంశం: నేను స్త్రీ/ పురుషుడైతే 

శీర్షిక: *నేనే ఒకవేళ స్త్రీ నైతే* 

'పుష్పం' ఏదైనా 
'తామర'  బురుదలో పుట్టినా
విష్ణువు పాదాల చెంతకు చేరినట్లు 
జెండర్ ఏదైతే నేమి ఏ కులంలో ఏ మతంలో 
ఏ గుడిసెలో పుడితే నేమి 
చివరికి ఏం స్థాయికి చేరుకున్నాం
అనేదే ముఖ్యం!

ఈ సృష్టిలో ప్రకృతి తరువాత 
గొప్ప ఆకర్షణ శక్తి గలది స్త్రీ 
అది పడతులకు దేవుడు ప్రసాదించిన వరం 
కానీ శాపం కాదు పాపం కాదు!

నేనే ఒకవేళ స్త్రీ నైతే
ప్రకృతి ధర్మాలపై సృష్టి ధర్మాలపై 
అవగాహన పెంచుకుంటాను
సభ్యతగా సంస్కారవంతగా జీవిస్తాను!

బలహీనమైన మల్లెలు 
బొడ్డుమల్లెలుగా కాకుండా 
బలమైన గులాబీ మొక్కల్లా 
ధైర్యంగా పెరుగుతాను!

సూర్య కిరణాలకు చేట అడ్డం పెట్టి ఆపనట్లే 
ఎవరి చూపులను కొంగు అడ్డం వేసి ఆపలేను!

అతి చనువుగా ఉంటే 
ఈగైనా దోమైనా వచ్చి నెత్తిన కూర్చుంటాయని
నమ్ముతాను!

సృష్టి ధర్మాలను పాటిస్తూ 
హద్దులలో అందరితో కలిసి మెలిసి 
సభ్యతగా బట్టలు ధరిస్తూ 
తిరుగుతూ ఆడుతూ పాడుతూ 
విద్యనభ్యసిస్తాను ఉద్యోగం చేస్తాను
అవకాశాలు అవసరాలు ఉంటే 
ఇష్టమైన రంగాలలో రాణిస్తాను!

భర్తను బానిసగా చేసి 
ప్రక్కన దాసిగా ఉండకుండా 
భర్తను రాజును చేసి 
ప్రక్కన నేను రాణిగా ఉంటాను! 

అంటువ్యాధి లాంటి చాడీలు సీరియల్స్ ను 
ప్రక్కన పెట్టి అత్తామామలకు సేవలందిస్తూ 
కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తాను!

డిల్లీకి రాజైనా భర్త పెండ్లానికి దాసుడే 
ఎలాంటి వారినైనా మార్చగలిగే శక్తి ఉంది!

సమాజంలో సవాలక్ష సమస్యలకు కారణం 
అత్తా కోడళ్ళే ననుట నగ్న సత్యం 
నేడు నేను కోడలును రేపు నేను అత్తను పరిష్కారానికి ఆదర్శంగా ఉంటా ప్రతినిత్యం!

పిల్లలను క్రమశిక్షణతో పెంచుతూ
బావి భారత పౌరులుగా తీర్చి దిద్దుతూ 
మంత్రిగా బోధకురాలిగా ఆర్ధిక వేత్తగా 
సేవకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా 
కీర్తి ప్రతిష్టలు గడిస్తాను!

No comments: