Saturday, December 28, 2024

సంక్రాంతి విశిష్టత

అంశం: *ఐచ్ఛికం*

శీర్షిక: *సంక్రాంతి విశిష్టత*

*మంచు పరదాలతో ప్రకృతి అందచందాలు*
నింగినెగిరే రంగు రంగుల పతంగులు
మనోహర భరితంబు పిల్లల కేరింతలు
అంబురాన్ని తాకే  సంక్రాంతి సంబురాలు!

ముచ్చటగా మూడు రోజుల  పండుగ
భోగి సంక్రాంతి కనుమ వరుసగా రానుండగ
పల్లెల్లో కొత్త ధాన్యాలు ప్రతి ఇంటా నిండుగ
చెడు జ్ఞాపకాలను బోగిమంటలలో కాల్చగ!

ఉషోదయాన కాంతల కోలాహాలాలు
వాకిళ్ళ నిండా ఇంద్ర ధనస్సులా ముగ్గులు
అంద చందాలతో వాకిళ్ళలో ఆవుపేడతో
పిరమిడ్ లను తలపించిన గొబ్బెమ్మలు!

సకల సంపదల నిచ్చు భూమాతను
కొలిచే చక్కని ఆచార సాంప్ర దాయాలతో
పసిడి అందాలతో పుడమి పులకరింపులు
లేత పచ్చని మామిడాకుల తోరణాలు
బంతి చేమంతిపూలతో నిండుగా గుమ్మాలు!

తలస్నానాలాచరించి ధరించే కొత్త బట్టలు
రేగు బండ్లు ,నవధాన్యాలు , పుష్పాలు
పిల్లల తలపై పోసి అరిష్టాల తొలగింపులు
ఆటపాటలు పసందైన విందులు వినోదాలు
చకినాలు,అర్షలు,లడ్డూలు పిండివంటలు!

డూ డూ బసవన్నంటూ గంగిరెద్దుల జోరు
తంబూర,వాయిధ్యాలతోసన్నాయీల హోరు
హరిలోరంగహరియంటూ హరిదాసులవారు
గుక్కతిప్ప లేని గొప్పలతో తుపాకిరాముడు!

సంక్రాంతి సెలవులతో తల్లిగారిండ్లకు
కొత్త అళ్ళుండ్లు , కోడండ్లు పిల్లల రాకతో
రోడ్లు ,బస్సులు రైళ్ళు కిక్కిరిసి పోతుండ
గ్రామాలన్నీ కళ కళ లాడుతుండు!

బొమ్మల కొలువులు , కోతి కొమ్మచ్చిలు
కోళ్ళ పందాలు ,  ఎద్దుల అలంకరణలు
కోడెల పోటీలు , తిరునాళ్ళ జాతరలు
ఆనందించేరు ఎంతో పిల్లలు పెద్దలు!

ధనస్సునుండి మకరంలోకి భానుడి ప్రవేశం
ధనుర్మాస వేళ ఉత్తరాయణంలోకి పయనం
పెద్దలకు పిండతర్పనం ఎంతో పుణ్యఫలం
మునులు ఋషులు మహర్షులకిది నిదర్శనం!

మరెన్నో గొప్ప విశిష్టతలతో సంక్రాంతి
భారతీయులలో తెచ్చు కొత్త కాంతి
ఇదే మన భారతీయ సంస్కృతి
విశ్వాన గడిస్తుండే ఎంతో ఖ్యాతి!


No comments: