Tuesday, December 3, 2024

ప్రపంచీకరణ (GLOBALISATION)

 నేటి కవిత:


అంశం: వెలుగుల కబుర్లను చెప్పుకుందాం:

శీర్శిక:  *ప్రపంచీకరణ*


"నేటి కాలము కన్న నాటి కాలమే మేలు"

పందొమ్మిది వందల తొంబది ఒకటిలో 

దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి

ప్రపంచీకరణను తీసుకొచ్చారు

నాటి ప్రధాని శ్రీ పి.వి. నర్సింహారావు 


"ప్రపంచీకరణ" రెండు వైపులా

పదునైన కత్తి లాంటిది 

అది మంచి చెడును రెండింటినీ

మోసుకొచ్చింది 

బెల్లం చుట్టే ఈగలు వాలుతాయన్నట్లు

జనులు చెడు వైపే మొగ్గు చూపారు

ఆర్ధిక వ్యవస్థ బాగుపడింది గానీ

పేదలకు అందని ద్రాక్షే అయింది


లక్షాధికారులు కోటీశ్వరులయ్యారు 

కానీ, బిక్షాధికారులు 

మరింత దిగజారి పోతున్నారు 

చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు 


లోపమెక్కడుందని భూతద్దం పట్టిచూస్తే 

ఒకరిపై మరొకరు నెపం మోపుతున్నారు

కాలుకు నిప్పంటిన పిల్లుల్లా 

నేను నేను కాదు అంటున్నారే తప్పా 

ఒప్పుకోవడం ఎవరికీ ఇష్టం లేదు

వాస్తవానికి సర్వం అవినీతి మయం 


ప్రపంచీకరణ వలన 

"ప్రపంచం ఒక కుగ్రామం' గా మారింది

అవకాశాలు దండిగా పెరిగాయి 

అవి అవకాశ వాదులకు స్వర్గధామాలయ్యాయి

ఆమాయకులను బలిపశువులను చేశాయి


చట్టాలు ధనికులకు చుట్టాలుగా మారాయి

పేదలకు చట్టాలు భారమయ్యాయి 

రాజ్యాంగాన్ని అనుకూలంగా మార్చుకునే 

అవకాశాలు మెరుగయ్యాయి 

ధనికులు అందల మెక్కడానికి మార్గాలు 

సుగమం అయ్యాయి 


రాజ్యాంగ వ్యవస్థలు పేరుకు వేరుగా ఏర్పడినా

వాస్తవానికి , ఎవరు నమ్మినా నమ్మక పోయినా 

వ్యవస్థలన్నీ నేతల కబంధ హస్తాలలో 

బంధించ బడినాయి 

వ్యవస్థల ఏర్పాట్లు, ఆఫీసర్ల అపాయింట్మెంట్లు 

వేతనాల నిర్ణయాలు, ట్రాన్సఫర్లు , టర్మినేషన్లు 

అన్నియు నాయకుల చేతుల్లోనే


దేశంలోని కోట్లాది ప్రజలు 

ఈ పాలకుల చేతుల్లోనే కొట్టుమిట్టాడిల్సిందే

అడ్డూ అదుపూ లేని నేతలు

ప్రజలను ఉచితాలకు బానిసలను చేసి

సోమరితనాన్ని అలవాటు చేసి

శ్రమ జీవనానికి దూరం చేసి

జీవశ్చావాలుగా మార్చేశారు 

అందినంత దోచుకుని 

విదేశాల్లో దాపెడుతున్నారు 

రాబోయే ఎన్నికల ఖర్చుకు 

లాయర్ల ఫీజులకు కూడబెడుతున్నారు 


ఉచితాలకు , మద్యానికి బానిసలను చేసి 

ప్రశ్నించే గొంతులకు తాళం వేసి

పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు పాలకులు 

పేరుకే ప్రజాస్వామ్యం , చూపేది నిరంకుశత్వం


ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్యానికి 

ఎగనామం పెడుతూ

ఉపాధి అవాకాశాలను కాలరాస్తే

కట్టుకున్న గూళ్ళను కూల్చుతుంటే 

బీదలు బీదవారు గాక 

ధనవంతులు ఎలా అవగలరు


కారణాలు ఏమైనా

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటినా

భారత దేశం అభివృద్ధి చెందుతున్న 

దేశం గానే మిగిలిపోయింది

యాంత్రిక జీవితంలా మారిపోయింది 

*నేటి కాలం కన్న నాటి కాలమే మేలనిపిస్తుది*

No comments: