శీర్షిక: *పట్టణాలకు వలసలకు కారణాలు - నివారణోపాయాలు*
*నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు* అన్నట్లు
పల్లె వాసుల పట్టణాల వలసలకు కారణాలు 
దేవుడే ఎరుగును
గతుకుల రోడ్లపై నడువ లేక
ఉరిసే గుడిసెలలో ఇమడ లేక
చిమ్మ చీకటిలో బ్రతక లేక
అప్పుల బాధలను తట్టుకోలేక
ఉపాధి కరువైన ఊర్లలో జీవించ లేక
నీరు పల్లమెరిగినట్లే గ్రామీణులు 
పట్టణాలకు వలసలు వెళ్తుంటారు
వలస పక్షుల లాగా , మనుషులు
వారి వారి ఉన్నతి కొరకు,
ఉన్నత జీవనం కోసం
పరిస్తితుల కారణంగానో
ప్రకృతి పరిహాసం చేయడం వలననో
పల్లె ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి
ఒక గ్రామం నుండి పట్టణానికి
ఒక దేశం నుండి మరొక దేశానికి
నిత్యం వలసలు వెలుతూనే ఉంటారు
ఎక్కడి కష్టాలు అక్కడే ఉండును 
దేశానికి వెన్నెముక గ్రామాలన్నారు గాంధీ
అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయకుండా
పట్టణాలను అభివృద్ధి చేస్తే ఫలితమేమి
పట్టణాల్లో జల్సాలు  పల్లెల్లో వలసలు తప్పా 
మరేమి ఉంటుంది తెలియని వింత!
నాయకులలో స్వార్ధం 
నేతలలో అవినీతి పెరిగి పోవడం
ఆశ్రిత పక్షపాతం ఉండటం
వ్యవస్థలు ప్రభుత్వాల నియంత్రణలో
చట్టాలు ధనికులకు చుట్టాలవడం
ప్రజలు ఉచితాలకు
చకోర పక్షుల్లా ఎదిరి చూడటం
సోమరి తనానికి, బానిసత్వానికి
అలవాటు పడటం
ప్రశ్నించే శక్తి కోల్పోవడం
ఓటును నోటుకు అమ్ముకోవడం
పేద తనం పిరికి తనం
మొదలైన అనేక కారణాల వలన
నేడు వలసలకు నాంది పడిందని చెప్పాలి!
పట్టణాలకు వలసలు తగ్గాలంటే
నిస్వార్థంతో నాయకులు, ప్రభుత్వాలు
పట్టణాలతో సమానంగా
పల్లెలను అభివృద్ధి చేయాలి
అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలి
పట్టణ యువతకు వలెనే
ఉన్నత విద్య సాంకేతిక విద్యా 
సౌకర్యాలను ఏర్పాటు చేయాలి 
నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి 
గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలి
పల్లెటూర్లలో  కంపెనీలను స్థాపించాలి 
కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలి 
మౌళిక సదుపాయాలైన  విద్యుత్తు
రోడ్డు రవాణా, విద్య వైద్య వసతులను 
ఇంటర్నెట్/వైఫైని అభివృద్ధి చేయాలి! 
దేశానికి వెన్నెముక పల్లెలు 
పల్లె వాసుల  రైతులకు ఉపాధికి 
వెన్నెముక వ్యవసాయమనేది నగ్నసత్యం 
వ్యవసాయానికి తగిన సాగునీరు అందించాలి 
రైతులకు నాణ్యమైన విత్తనాలను 
సరియైన సమయంలో ఎరువులను 
అధునాతన యంత్ర పరికరాలను అందించాలి
పంటల మార్పిడి జరుగాలి 
వరినే కాకుండా మిల్లెట్స్ పండించాలి 
వ్యవసాయ శాస్త్రవేత్తల సహాకారం అందించాలి 
పంటలను నిల్వ చేసుకోడానికి గిడ్డంగులు 
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు 
నిర్ణయించుకును స్వేచ్ఛ కల్పించాలి! 
ఇలా చేసిన యెడల గ్రామాలు 
పల్లెలు తాండాలు అభివృద్ధి చెందుతాయి 
పట్టణాలకు వలసలు తగ్గుతాయి 
హాస్టల్లో ఉంటూ జరిపే బిత్తిరి వేషాలు మోసాలు 
అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయి
అందరు గ్రామాలలో నివసించడం వలన 
బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు 
చెక్కు చెదరకుండా పరిఢవిల్లుతాయి
గ్రామీణ ప్రజలు పిన్నలు పెద్దలు ఆనందంగా 
ఉల్లాసంగా ఉత్సాహంగా జీవిస్తారు!
No comments:
Post a Comment