Saturday, May 31, 2025

ఘన చరిత్ర గల దేశం భారతదేశం

అంశం:ఘన చరిత్ర


శీర్శిక: ఘన చరిత్ర గల దేశం భారతదేశం

సింధులోయ నాగరికత నుండి
వేద యుగం మౌర్య సామ్రాజ్యం
గుప్త మరియు విజయనగర సామ్రాజ్యం
ముస్లిం సామ్రాజ్యాల పాలనలతో
పలు యుద్ధాలతో ఆక్రమణలతో
భారత దేశ చరిత్ర ఎంతో ఘనమైనది!

భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం
పశ్చిమాన అరేబియా సముద్రం
ఉత్తరాన హిమాలయా పర్వతాలు
దక్షణాన హిందూ మహాసముద్రం!

చతుర్వేదాలు రామాయణం
మహాభారతం భగవద్గీత ఇతిహాసాలు 
పురాణాలు చతుష్షష్టి కళలతో
పదునెనిమిది శక్తి పీఠాలతో
ఘనత కెక్కినది భారత దేశ చరిత్ర!

ఆపదలో ఉన్న విదేశీయులను
ప్రేమతో అక్కున చేర్చుకునే ఘనత
ఆపదలో ఉన్న దేశాలకు ఆర్ధిక
ఔషద సైనిక సేవలను అందించు
ఘనత గలగిన దేశం భారతదేశం!

జనాభాలో రెండవ అతి పెద్ద దేశంగా
అతి పెద్ద రాజ్యాంగం గల దేశంగా
సంయమనంలో శాంతి కాముక దేశంగా
ఘన చరిత్ర గల దేశం భారతదేశం!

శ్రీ దత్తాత్రేయా.. దిగంబరా!

అంశం: భక్తి గీతాలు


శీర్షిక: శ్రీ దత్తాత్రేయా... దిగంబరా..!

పల్లవి:
దిగంబరా... దిగంబరా...
శ్రీ పాద వల్లభ దిగంబరా.. 
శ్రీ దత్తాత్రేయా.. దిగంబరా....  "దిగంబరా"

చరణం:01
భక్త వత్సలా దిగంబరా..
ధీనుల బంధువా దిగంబరా.. "2"
కష్టాల కడతేర్చు దిగంబరా...
దుఃఖాల తొలగించు దిగంబరా..."2" "దిగంబరా"

చరణం:02
దుష్ట శక్తుల తొలగించు దిగంబరా...
దయ్యాల వదిలించి దిగంబరా..."2"
స్వస్థత చేకూర్చేవు దిగంబరా...
సంతోషాల నిచ్చేవు దిగంబరా.... "2"  "దిగంబరా"

చరణం:03
వట్టి ఆవుకు దిగంబరా...
క్షీరం నొసిగిన దిగంబరా ...."2"
సంతానం లేని వారికి దిగంబరా..
సంతాన మిస్తావు దిగంబరా...  "2"   "దిగంబరా"

చరణం:04
మిమ్ము స్మరించు నంతనే దిగంబరా..
మిమ్ము కొలిచినంతనే దిగంబరా... "2"
సర్వరోగాలు తొలిగేను దిగంబరా...
సకల పీడలు వదిలేను దిగంబరా..."2" "దిగంబరా"

స్వాతి ముత్యంలా నీలో ఒదిగి పోనా

*నేటి అంశం*- *కవితాపూరింపు*


శీర్షిక: *స్వాతి ముత్యంలా నీలో ఒదిగి పోనా*

*నీ మది లోగిలిలో కొలువుండనా*
*నీ ఆరాధనలో సేదతీరనా*
*కలకాలం నీతో కలసి నడవనా*
*పరవశాల ముచ్చట్లు నిత్యం వినిపించనా*
*తేనే లాంటి నీ కనులలో కరిగి పోనా*
*స్వాతి ముత్యంలా నీలో ఒదిగి పోనా*
*అదిరిన నీ ఎదలపై వాలిపోనా*
*చెదిరిన నీ పైటను నా పైన కప్పుకోనా*
*నీ ప్రేమామృతాన్ని సర్రున జుర్రుకోనా*
*నీ మమతల కోవెలలో నిలిచిపోనా*
*అలసి సొలసిన నీ సొగసులకు వింజామరనైపోనా*
*పట్టు పరుపులపై  సేద తీర వేణు గానమై పోనా*
*ఆనంద రాగాలతో లతలా అల్లుకు పోనా*


గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు

శీర్షిక: గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు


*అతడు లేని తెలంగాణ*
*అలంకరణ లేని జాణ* అన్నారు ఓ కవి

నాటి  నిజూం ముసలి నక్క నిరంకుశ
ఆగడాలపై ఆన్యాయాలపై అక్రమాలపై
అనాగరికతలపై రగిలిన నిప్పురవ్వ
నిజాం నవాబు దుశ్చర్యలపై
ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆగ్నిజ్వాల

స్వాతంత్ర్య సమరయోధుడు
సంఘ సంస్కర్త తెలంగాణ వైతాళికుడు
విద్యా వంతుడు బహుభాషా కోవిదుడు
న్యాయ శాస్త్ర నిపుణుడు దేశ భక్తుడు 
మానవతావాది పండితుడు పరిశోధకుడు
రచయిత గ్రంధకర్త వ్యాఖ్యాత
గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు
భారతి సాహిత్య పత్రిక
ప్రజావాణి పత్రిక సంపాదకుడు
బహుముఖ ప్రజ్ఞాశాలి

దాతల పదాన్యతలతో
రెడ్డి హాస్టల్ ను ఏర్పాటు చేసి
పలు సేవలందిస్తూ వారి దాతృత్వ
పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన
మానవతావాది

తన చిన్న నాటే నాన్న మరణిస్తే
చిన్నాన్న  రామకృష్ణారెడ్డి గారి వద్ద
పెరిగి పెద్దయి విద్యాబుద్ధులు నేర్చే
సమయంలోనే అభ్యుదయ భావాలు
వంటబట్టిన సురవరం
నాటి రజాకార్ల పెత్తందార్ల అనిచివేతపై
ఆగడాలపై గోల్కొండ పత్రిక 
సంపాదకీయంలో వ్యాసాలు వ్రాసి
చెమటలు పట్టించిన  ధైర్యశాలి

జన చైతన్యానికి విద్యయే
సరియైన మార్గమని తలచి
గ్రంధాలోధ్యమ పోరాటంలో పాల్గొని
అనేక గ్రంధాలయాలు స్థాపించిన ఘనాపాటి

అప్పటి కాలంలో తెలంగాణలో
కవులే లేరన్న ఆంధ్రుల హేళనలకు
చలించి తెలంగాణ తెలుగు సాహిత్యంపై
మక్కువతో తక్షణమే
354 మంది తెలంగాణ కవులతో
వారి పూర్తి జీవిత విశేశాలతో
*గోల్కొండ కవుల* గ్రంథాన్ని ముద్రించి
వారి చెంప చెల్లుమనిపించిన
సాహిత్య పిపాసి ధీరోదాత్తుడు

తెలుగు భాషను యాసను తెలుగు జాతిని
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను
పరిరక్షిస్తూ సాంఘీకంగా సామాజికంగా
రాజకీయంగా జనులను చైతన్య
పరుచడంలో విశేష కృషి సలిపినాడు
"ఆంధ్రుల సాంఘిక చరిత్ర" రచించి
"కేంద్ర సాహిత్య అకాడమీ" అవార్డు పొందిన
గొప్ప సాహితీ వేత్త

చివరి దశలో రాజకీయ శాసనసభ్యుడిగా
ఎన్నికై తన జీవితాన్ని ప్రజా సేవకు
అంకితం చేసిన సేవా తత్పరుడు
మాన్య శ్రీ సురవరం ప్రతాపరెడ్డి 

అన్వేషణ/వెతుకులాట

అంశం: అన్వేషణ


శీర్శిక: *వెతుకులాట*

శిశువు జననం నుండి మరణం వరకు
నిత్యం అనుక్షణం వెతుకులాడు
అన్వేషణ ఒక జీవన విధానం
అనుకున్నది సాధించే వరకు వెతుకులాట!

పసి వయసులో పాల కొరకు
బాల్యంలో ఆటలు పాటల కొరకు
కౌమార్యంలో చదువు కొరకు
యవ్వనంలో ఉద్యోగం పెళ్లికి వెతుకులాట!

అటుపిమ్మట సంతానం సంపాదన
ఆహారం ఆహార్యం  ఆనందాలు
కార్లు గృహాలు భూములు సంపదలు
పిల్లల చదువుల కోసం వెతుకులాట!

ఆ తరువాత అందమైన ఉద్యోగమైన
సంపద కలిగిన గౌరవ మర్యాదలు గల
వరుల కొరకు కోడళ్ళ కొరకు
దేశమంతా ప్రపంచమంతా వెతుకులాట!

వృద్ధాప్యంలో  పేరు ప్రతిష్ఠలు
గౌరవ మర్యాదలు గుర్తింపు కొరకు
ఆరోగ్య సంరక్షణ కొరకు
అలా కాటికి వెళ్ళే వరకు వెతుకులాటే!

Friday, May 30, 2025

అదిగదిగో మా బడి (బాల సాహిత్యం)

అంశం: మా బడి


శీర్షిక: *అదిగదిగో మా బడి*

అదిగదిగో మా బడి
అందమైన మా బడి
ఊరు బయట మా బడి
విద్య నిచ్చు మా బడి!

అమ్మ ఒడిలా మా బడి
దేవుని గుడిలా మా బడి
విశాల ప్రదేశం మా బడి
పచ్చని చెట్లతో మా బడి!

రోజూ బడికి వెళ్తాము
ప్రార్ధన గీతం పాడెదము
చక్కగ చదువులు చదివెదము
హాయిగ ఆటలు ఆడెదము!

గణగణ గంట వినెదము
మితృలకు బాయ్ బాయ్ చెప్పెదము
గురువులకు నమస్కరించెదము
గబగబ ఇంటికి వెళ్ళెదము!

Thursday, May 29, 2025

అరచేతిలో స్వర్గం చరవాణి

అంశం: *అతడు ఆమె ఓ చరవాణి*


శీర్షిక: *అరచేతిలో స్వర్గం చరవాణి*

కొత్తగా పెళ్లయిన జంట
తిరుపతి వెళ్దామనుకున్నారంట
అత్తా మామలు వస్తామన్నారు వెంట
ఉభయులూ వద్దనుకున్నారు ఆ పెంట!

ఇరువురి తల్లిదండ్రులు హైదరాబాదే
ఉన్నత విద్య ధనవంతుల కుటుంబాలే
సాగనంప వచ్చారు కాచిగూడ స్టేషన్
వెంకటాద్రి ట్రేయిన్ లో ఎక్కించారు!

కొత్త జంట ఒంటరి ప్రయాణమనుకున్నారేమో
నగలు తీయించి సూటుకేసుల్లో పెట్టించారు
డబ్బులు బ్యాగుల్లో పెట్టించారు
ఒకరికి మించి ఒకరు జాగ్రత్తలు చెప్పారు!

పై బెర్త్ ఒకరిది ఆపై బెర్త్ మరొకరిది
ఆమె బెర్త్ లో ఆమె అతడి బెర్త్ లో అతడు
అరచేతిలో స్వర్గం చరవాణియే
ఎవరి చరవాణి వారి చేతిలోనే పట్టుకుని
హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు
ఎవరి వీడియోలలో వారు మునిగిపోయారు!

మధ్య మధ్యలో అతడికి ఆమె
ఆమెకు అతడు వాట్సాప్ మెసేజ్ లు
నీవేమి యూట్యూబ్ వీడియో చూస్తున్నావ్
నీవేమి యూట్యూబ్ వీడియో చూస్తున్నావ్!

టి.టి.వచ్చి తట్టే వరకు చూపట్లేదు టిక్కెట్లు 
ట్రేన్ చకచకా సాగిపోతూ స్టేషన్లను దాటేస్తున్నది
ఎక్కేవారు ఎక్కుతున్నారు దిగేవారు దిగుతున్నారు
తెల్ల వార్లు చరవాణి ద్యాస తప్పా
లగేజీ సోయి కూడా మరిచారు!

ఉదయం ఏడు గంటలు అవుతుంది
తిరుపతిలో ట్రేన్ ఆగింది
అప్పుడు మెల్లమెల్లగా బెర్త్ లు దిగారు
ఆవులింతలతో చెప్పులు వేసుకున్నారు
సూట్ కేసులు లేవు బ్యాగులు లేవు
లబోదిబోమంటూ ట్రేన్ దిగేశారు
అతడు ఆమె ఓ చరవాణితో!

జయహో వీర సైనికులారా/వచన కవిత

శీర్శిక: *జయహో వీర సైనికులారా!


జయహో వీర సైనికులారా!
జయ జయహో వీర సైనికులారా!
ఆపరేషన్ సిందూర్ లో
ఘన విజయం సాధించిన ధీర సైనికులారా! 

పరుల ప్రాణం తీస్తేనే
మోక్షం లభిస్తుందని విశ్వసించే
మతోన్మాద కర్కోటకులపై
నరుల ప్రాణం విలువ తెలియని
నరరూప రాక్షసులపై
మారణహోమం సృష్టించిన
ఉగ్రవాద మూకలపై
బ్రహ్మోస్ లను వదలండోయ్!

అందాల కాశ్మీర్ ను రావణ కాష్టం చేసిన
హిందువుల నెత్తురుకు మరిగిన
ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపండోయ్!

అదర వద్దు బెదర వద్దు
ఇక ఆకాశమే మీకు హద్దు
అస్త్రశస్త్రాలతో మనమున్నాం
శత్రు దేశాన్ని అష్టదిగ్భంధం చేస్తూ
ఉగ్రవాదులను గడగడ లాడించండోయ్
ఉగ్రవాద తావురాలపై
గబగబ బాంబు లేయండోయ్!

ఇల్లు అలుకగానే పండుగ కాదన్నట్లు
ప్రక్కలో బళ్ళెలా మన వెంటే నివశిస్తున్న
దేశ ద్రోహులకు బుద్ధి వచ్చేట్లుగా
ప్రపంచ దేశాలు కలిసి వచ్చేట్లుగా
శత్రు దేశాలకు తెలిసి వచ్చేట్లుగా
భారత్ సత్తా చూపాలండోయ్
వెయ్యేండ్లైనా బారత్ పేరెత్తాలంటే
గడగడ వణుకాలోయ్!
 

జయహో వీర సైనికులారా /పాట

అంశం: విజయ గీతాలు

శీర్శిక: *జయహో వీర సైనికులారా!*

పల్లవి:
జయహో వీర సైనికులారా!
జయ జయహో వీర సైనికులారా!
ఆపరేషన్ సిందూర్ లో
ఘన విజయం సాధించిన ధీర సైనికులారా! 
జయహో వీర సైనికులారా!
జయ జయహో వీర సైనికులారా!

చరణం:01
నరుల ప్రాణం విలువ తెలియని
నరరూప రాక్షసులపై "2"
మారణహోమం సృష్టించిన
ఉగ్రవాద మూకలపై
బ్రహ్మోస్ లను వదలండోయ్ .... "జయహో"

చరణం:02
అందాల కాశ్మీర్ ను
రావణ కాష్టం చేసిన "2"
హిందువుల నెత్తురుకు మరిగిన
ఉగ్రవాదులపై
ఉక్కుపాదం మోపండోయ్ "జయహో"

చరణం:03
అదర వద్దు బెదర వద్దు
ఇక ఆకాశమే మీకు హద్దు
అన్ని హంగులతో మనమున్నాం
ఉగ్రవాదులను గడగడ లాడించండోయ్
ఉగ్రవాద తావురాలపై గబగబ బాంబు లేయండోయ్.  "జయహో"

చరణం:04
ప్రక్కలో బళ్ళెలా నివశిస్తున్న
దేశ ద్రోహులకు బుద్ధి వచ్చేట్లుగా
ప్రపంచ దేశాలు కలిసి వచ్చేట్లుగా
శత్రు దేశాలకు తెలిసి వచ్చేట్లుగా
భారత్ సత్తా చూపండోయ్ !   "జయహో"

సామెతల కవిత

 అంశం: *సామెతల కవిత*

*అప్పు చేసి పప్పు కూడు*
*చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు*

శీర్షిక: *స్థిత ప్రజ్ఞత*

మనిషి మనసు కోరికల పుట్ట
వాటిని సాధించుకోవడంలో కొందరు దిట్ట
ఆ తరువాత పడుతారు అగచాట్లు
అవి గ్రహపాట్లు అంటూ సర్దుబాట్లు

బట్ట ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి
ప్రక్క వారు గొప్పగా బ్రతుకుతున్నారనీ
ఎదుటి వారు లగ్జరీ కారు కొన్నారనీ
నక్కను చూసి వాత పెట్టుకున్నట్లుగా
మేము అలానే జీవించాలని
అనుకోవడం సరికాదు

*అప్పు చేసి పప్పు కూడు* అన్నట్లుగా
పిల్లల పెండ్లిళ్ళకనీ  ప్రభోజానాలకనీ
బంధు మిత్రులకు గొప్పలు చూపించుకోవాలనీ
అప్పులు చేసి ఘనంగా శుభకార్యాలు చేస్తారు

తాహత్తుకు మించి అప్పులు చేయడంతో
అసలు వడ్డీ తడిసి మోపడవుతుంది
సకాలంలో అప్పు తీర్చలేకపోతే
అవమానాల పాలు కావాల్సి వస్తుంది
ఆత్మ హత్యలకూ దారితీయవచ్చు

*చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు* అన్నట్లు
కష్టాలైనా సుఖాలైనా సంతోషాలైనా దుఃఖాలైనా
ఏవీ స్థిరంగా ఉండవు ఏవైనా కొన్నాళ్ళే
ఎండ మావుల్లా వస్తూ పోతుంటాయి
గ్రహాల మార్పులను బట్టి మారుతుంటాయి
ఉన్నంతలో సమాజ హితంగా గడపాలి
కష్టాలకు కృంగి పోకుండా
సుఖాలకు పొంగి పోకుండా
ఎల్లప్పుడూ స్థిత ప్రజ్ఞతతో జీవించాలి 

Wednesday, May 28, 2025

జీవితం అంటే నల్లేరుపై నడక కాదు

 *నేటి అంశం: *జీవితం అంటె*


శీర్షిక: *జీవితం అంటే నల్లేరుపై నడక కాదు*

జీవితం అంటే ఎవరికీ నల్లేరుపై నడక కాదు
జీవితం అంటే ఎవరికీ పట్టు పాన్పు కాదు
జీవితం అంటే ఆరాట పోరాటాల సంగ్రామం
సురులు అసురుల వలె అమృతం కొరకు
చేసే సాగర మధనం

జన్మస్థానం నుండి బయలు దేరి
ఎత్తు పల్లాలు దాటుకుంటూ
తరువులను ఝరులను రాళ్ళు రప్పల
గుద్దుకుంటూ భూమిని చీల్చుకుంటూ
ఎత్తు పల్లాలు దాటుకుంటూ
చెత్తాచెదారాలను మోసుకుంటూ
ఫార్మా కెమికల్ పరిశ్రమలు విడుదల చేసిన
రసాయనాల కంపును మోసుకుంటూ
ప్రవహించే నదుల నీరు వంటిది జీవితం!

జననం నుండి మరణం వరకు
ఎన్నో ఒడుదొడుకులను కష్టసుఖాలను
బాధలు దుఃఖాలను నిందలను అపనిందలను
అవమానాలను హేళనలను భరిస్తూ
ఆనందాలను సంతోషాలను సుఖాలను
సంతృప్తులను అనుభవిస్తూ
సాగే ప్రయాణమే జీవితం!

నీటిలో అనేకమైన ఖనిజాలు ఉన్నట్లే
జీవితంలో కోపతాపాలు ఈర్ష్య అసూయలు
మోసాలు ద్వేషాలు రోషాలు పగలు
కార్పణ్యాలు అరిషడ్వర్గాలు అన్నీ ఉంటాయి!

నీటిలో మినరల్స్ లేకుంటే ఎలా సప్పగా ఉంటుందో
జీవితంలో కష్టసుఖాలు బాధలు దుఃఖాలు
సంతోషాలు లాభాలు నష్టాలు లేకుంటే
అలానే సప్పగా ఉంటుంది
అందుకే అన్నీ ఉండాలి అనుభవించాలి
కష్టపడకుండా అమృతం వస్తే దానికి
విలువ ఏముంటుంది?

ఏది ఏమైనా జీవితానికి
ఒక సార్థకత కీర్తి ప్రతిష్టలు సాధించాలంటే
క్రమశిక్షణ సభ్యత సంస్కారంతో పాటు
మంచి ప్రవర్తన కలిగి ఉండాలి
దాన గుణం దైవ గుణం సేవా గుణం
తోటి వారిపై  దయ కరుణ మమత
ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఉండాలి
మేలు చేయకపోయినా కీడు తలపెట్టరాదు
భౌతికంగా లేకపోయినా
పదికాలాలపాటు కీర్తింప బడాలి
అదే జీవితం అదే అసలైన జీవితం!

అద్భుతమైన బహుమతి ప్రకృతి

అంశం: *అందమైన బహుమతి*

శీర్షిక: *అద్భుతమైన బహుమతి ప్రకృతి*

జననం నుండి మరణం వరకు 
మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని 
ఆనందాన్ని ఆహ్లాదాన్ని సంతోషాన్ని 
సంతృప్తిని శాంతిని ప్రశాంతతను 
అందించే అందమైన బహుమతి! 

కుల మత  జాతి ప్రాంత భాష 
భేద భావాలు వైషమ్యాలు లేకుండా 
ప్రతి ఒక్కరికీ అనుక్షణం జీవిత కాలం 
ఉచితంగా లభించే అపురూప కానుక! 

మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు 
ఔషధంలా స్వస్థతను చేకూర్చేటి 
బాధలు దుఃఖాలలో ఉన్నప్పుడు 
మనసుకు ఓదార్పు నిచ్చే అపూర్వ కానుక!

కోపాలు తాపాలలో ఉన్నప్పుడు 
సలహాదారులా సహనాన్ని చేకూర్చేటి 
సంఘర్షణలో ఆలోచనలో ఉన్నప్పుడు 
పరిష్కారాన్ని చూపే అద్భుత బహుమతి!

వృద్ధాప్య దశలో ఒంటరిగా లేకుండా 
తోడు నీడగా మనసుకు ప్రశాంతతను 
మరణించాక ఎవరికీ ఇబ్బంది కలుగకుండా 
మట్టిలో నీటిలో కలుపుకొని పోయే 
అద్భుతమైన బహుమతి *ప్రకృతి*

నిత్యం పోరాటమే

నేటి అంశం: *నిత్యం పోరాటమే*


శీర్షిక: *తప్పవు ఏ మనిషికైనా!*

అంతా సృష్టి మయం
సృష్టి రహస్యం తెలుసుకోవడం ఎవరి తరం
పాటించాలి ఎవరైనా సృష్టి ధర్మం
లేదంటే తప్పదు దండనం!

సృష్టి కర్త ప్రతి మూగ జీవికి
ఆహారంగా ఏదో ఒకటి పెట్టాడు
గ్రద్దలకు పాములను  పాములకు కప్పలను
కప్పలకు కీటకాలను  కీటకాలకు మరొకటి!

ఇక మనిషికి మాటలను తెలివిని
వివేకాన్ని ఇచ్చి సృష్టించాడు
దేనికి పరిమితులు విధించ లేదు
కానీ చేసిన కర్మలకు ఫలితం
అనుభవించక తప్పదు అన్నాడు

చివరి మాటలు అర్ధం కాకనో
లేక సృష్టి కర్త చూస్తున్నాడా అనో
లేక అందరూ చేస్తున్నారు కదా అనో
భుక్తి కోసం ముక్తి కోసం విముక్తి కోసం
నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాడు
తప్పటడుగులు వేస్తూనే ఉంటాడు!

జననం నుండి మరణం వరకు
ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటాడు
పాల కొరకు ఆటల కొరకు పాటల కొరకు
చదువు ఉద్యోగం వివాహం పిల్లలు
కార్లు బంగ్లాలు లగ్జరీ జీవితం కొరకు
మల్లీ పిల్లల చదువులు ఉద్యోగాలు
వారి వివాహాలు సంపదలు
కూడ బెట్టడాలు భూములు కొనుగోలు
తల్లిదండ్రుల పోషణ కర్మకాండలు
ఆపదలు అనారోగ్యాలు
అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ల తో
ఆస్తుల పంపకాల తగాదాలు
రాజకీయ పదవులు హోదాలు
ఇలా నిత్యం ఏదో ఒక రకమైన పోరాటంతో
మనిషి సతమతమవుతుంటాడు
నిజాయితీగా జీవిస్తే కొన్ని పోరాటాలు
అవినీతితో జీవిస్తే మరిన్ని పోరాటాలు
*తప్పవు ఏ మనిషికైనా!*

శ్రమ ఫలితం డబ్బు

అంశం:శ్రమ ఫలితం


శీర్శిక: *శ్రమ ఫలితం డబ్బు*

*పనికి ఫలితం డబ్బు అది సర్వసాధారణం*

*ధనమేరా అన్నిటికీ మూలం* అన్నట్లు
*ధనం మూలం ఇదం జగత్* అన్నట్లు
ప్రతి దానికీ డబ్బు కావాలి
మనిషి డబ్బు లేకుండా జీవించడం కష్టం!

మనిషి బ్రతకడానికి
సంసారం వెల్లదీయడానికి
భార్యా పిల్లల పోషించడానికి
పిల్లల చదివించడానికి డబ్బు కావాలి
అందుకు నిత్యం శ్రమిస్తారు!

శ్రమ పడితేనే ధనము లభిస్తుంది
శ్రమ పెడితేనే లభిస్తుంది గౌరవం
ఏ పనీ చేయకుండా డబ్బు రాదు
ఏ పని చేయకుండా గుర్తింపు రాదు
అది ఇంట్లో పాచి పని చేసేవారు కావచ్చు
చెత్త తీసుకెళ్ళే పని వాడు కావచ్చు!

అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు
న్యాయ మూర్తి ఉద్యోగం కావచ్చు
రాష్ట్ర పతి పదవి కావచ్చు
ఎవరైనా శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది!

ప్రతి పనికి డబ్బుతో వెలకడుతామా
ప్రతి శ్రమకు ఫలితం ఉంటుందా అంటే
లేదు కాదనే చెప్పాలి!

పిల్లలకు తల్లిదండ్రులు చేసే సేవలకు
భార్య పొద్దస్తమానం చేసే వెట్టిచాకిరికి
సోదరులు ఒకరికొకరు చేసే సహాయాలకు
అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు చేసే సేవలకు
ఇతర సేవా పరులు చేసే శ్రమకు
వెల కట్టడం సాధ్యం కాదు!

భగవద్గీతలో  శ్రీకృష్ణుడు అంటాడు
*కర్మ చేయి కానీ ఫలితం ఆశించకు* అని
పని చేయాలి కానీ దాని నుండి
ఫలితాన్ని ఆశించకూడదని అర్ధం!

వాస్తవ జీవితంలో షావుకారు
డబ్బు లేదంటే సరుకు ఇస్తాడా ?
సరుకు లేకుండా భార్య వంట చేయగలదా?
వంటి లేకుండా ఆకలి తీరుతుందా?
ఎండిన కడుపుతో శ్రమించే గలమా?
ఇదంతా ఒక విషెష్ సర్కిల్

భుక్తి కోసం పని చేసి ఫలితం ఆశించాలి
శ్రమ ఫలితం డబ్బు
ముక్తి కోసం సేవ చేసి ఫలితం ఆశించవద్దు
కర్మ ఫలితం డబ్బు!

Tuesday, May 27, 2025

వాన దేవుడా వాన దేవుడా!

 శీర్షిక: వాన దేవుడా వాన దేవుడా!


వాన దేవుడా వాన దేవుడా
వర్షాలు పడాలి వాన దేవుడా
చెరువులన్నీ నిండాలి వాన దేవుడా
మత్తడులు పడాలి వాన దేవుడా
కుంటలన్నీ నిండాలి వాన దేవుడా  "వాన దేవుడా"

రైతులు హలాలు పట్టాలి వాన దేవుడా
పొలాలు దున్నాలి వాన దేవుడా
పంటలన్నీ పండాలి వాన దేవుడా
మా కరువు లన్నీ తీరాలి వాన దేవుడా!   "వాన దేవుడా"

మా గుమ్ములన్నీ నిండాలి వాన దేవుడా
మా గాజలన్నీ నిండాలి వాన దేవుడా
మా కడుపులన్నీ నిండాలి వాన దేవుడా
మా కష్టాలన్నీ తీరాలి వాన దేవుడా!     "వాన దేవుడా"

వాగులన్నీ పారాలి వాన దేవుడా
వంకలన్నీ పారాలి వాన దేవుడా
తరువులన్నీ పెరుగాలి వాన దేవుడా
ఝరులన్నీ మురియాలి వాన దేవుడా!  "వాన దేవుడా"

మనిషికి మనిషి తోడైతే

 నేటి కవిత:

తేది:27.05.25
అంశం: మనిషికి మనిషి తోడైతే


శీర్షిక: *భర్తకు భార్య, భార్యకు భర్త తోడైతే*

*పాలను పాలలాగే నిలువ జేసిన*
*పాలుగానే ఉంటాయి ఒక రోజు*
*పాలకు పెరుగును తోడువేసినా*
*అది పెరుగవుతుంది*
*పెరుగును నీటితో గిలకొట్టిన చల్ల అగును*
*చల్లనుండి వెన్న, వెన్నను వేడి చేసిన*
*నెయ్యి తయారయినట్లే*

మనిషికి మనిషి తోడైతే
భర్తకు భార్య, భార్యకు భర్త తోడైతే
జీవితం ఇక స్వర్గమే
లేదంటే ఆ జీవితం నరకమే
ఇంకనూ స్త్రీల మనోధైర్యం కంటే
పురుషుల మనోధైర్యం చాలా బలహీనం
అందుకే పురుషుల ఆయుష్షు తక్కవ!

మనిషి సంఘజీవి
సమాజంలో కలిసి తిరగాలి
కలిసి మాట్లాడాలి కలిసి పనిచేయాలి
కలిసి మెదులాలి కలిసి జీవించాలి!

మానసిక శారీరక సుఖాలను
పొందాలన్నా సంతానం కావాలన్నా
కష్టసుఖాలు దుఃఖాలు బాధలు
సంతోషాలు ఆనందాలు పంచుకోవాలన్నా
సలహాలు ఇవ్వాలి తీసుకోవాలన్నా
నిర్ణయాలు తీసుకోవాలన్నా
భర్తకు భార్య , భార్యకు భర్త తోడు కావాలి!

పిల్లలను క్రమశిక్షణతో పెంచాలన్నా
భాద్యతలను నెరవేర్చాలన్నా
సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు
గౌరవ మర్యాదలు పొందాలన్నా
డబ్బు సంపాదించాలన్నా
భార్యకు భర్త ,భర్తకు భార్య తోడు ఉండాలి!

కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు
ఒకరికొకరు తోడుగా ఉంటే కొండంత బలం
ఒకరికొకరు అండగా ఉంటే గుండెకు ధైర్యం
ఒకరికొకరు చేరువగా ఉంటే ఆయురారోగ్యం
అదే ఆనంద మయ జీవితం!

గేయాలు/ సెలవులన్న సెలవులు

శీర్షిక: *సెలవులన్న సెలవులు*

ప్రక్రియ: గేయాలు
〰️〰️〰️〰️〰️〰️〰️

సెలవులన్న సెలవులు
ఎండా కాలం సెలవులు
యేడాదికొకసారి వచ్చు
వేసవి కాలం సెలవులు      "సెలవు"

ఉదయం సాయంకాలం
ఆడుకోవడానికి పాడుకోడానికి
ఆనందంగా ఎగరడానికి
కొత్త  ఆటలు నేర్వడానికి      "సెలవు"

స్నేహాలు పెంచుకోడానికి
పోటీతత్వం పెంచుకోడానికి
లీడర్షిప్ పెంచుకోడానికి
సమాజాన్ని చదువడానికి.     "సెలవు"

ఆటలు పాటల వలన
ఎగరడం దుముకడం వలన
ఆరోగ్యంగా ఉండెదము
ఆయుష్షు పెంచుకునెదము.     "సెలవు"

అమ్మానాన్నలతో కలిసి
టూర్లకు ప్లాన్ చేస్తాము
కొత్త కొత్త ప్రదేశాలను
చరవాణిలో బంధిస్తాము.        "సెలవు"

అమ్మమ్మలు నానమ్మలు
తాతయ్యలు చెప్పిన
కమ్మని  కథలను వింటూ
సెలవులను గడిపేస్తాము.        "సెలవు"

సంస్కార జీవితానికి గీటు రాళ్ళు

అంశం: సంస్కార జీవితం


శీర్శిక: సంస్కార జీవితానికి గీటు రాళ్ళు

*అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి*
*కుండెడు మెతుకుల పిసుకనవసరం లేదు*
*ఒక మెతును పిసికినా చాలు* అన్నట్లు

*పనివాడితో ప్రేమగా పలకరింపుతోనే*
*తెలుస్తుంది యజమాని సంస్కారమేంటో*

నీతి నిజాయితీ మంచి నడవడికతో
మాట తీరు మాటకు కట్టుబడి ఉండటం
ఎదుటి వారి పట్ల సమభావం
పెద్దల పట్ల గౌరవం పిల్లల పట్ల ప్రేమ
హద్దులు దాటకుండా ప్రవర్తించడం

క్రమశిక్షణతో జీవించడం
శుచి శుభ్రత పాటించడం
సత్ప్రవర్తన సజ్జనులతో సాంగత్యం
తోటి వారికి చేతనైన సహాయం చేయడం
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం
అందరితో ప్రేమానురాగాలు కలిగి ఉండటం
అరిషడ్వర్గాలైన కామక్రోధ లోభ మోహ
మదమాత్సర్యాలను అదుపులో ఉంచడం

తోబుట్టువులు ఆత్మీయులు బంధువులతో అనుబంధాలు కలిగి ఉండటం
అతిథులను ఆదరించి సపర్యలు చేయడం
భార్యా భర్తలు అన్యోన్యంగా గడుపుతూ
ఆదర్శంగా జీవించడం
పిల్లలను భాద్యతగా సక్రమ మార్గంలో
పెంచుతూ విద్యా బుద్దులు నేర్పించడం

దాన గుణం ధర్మగుణం కలిగి
ఆధ్యాత్మికత దైవంపై నమ్మకం ఉండటం
తల్లిదండ్రుల వృద్ధుల  అంగవైకల్యుల
మూగ ప్రాణుల పట్ల ప్రేమ దయ చూపడం
వారికి  సపర్యలు చేయడం
గతించిన వారికి కర్మలు చేయడం
రేపటి తరాలకు ఆదర్శంగా జీవించడం
మొదలైనవి సంస్కార జీవితానికి గీటు రాళ్ళు!


Monday, May 26, 2025

అక్షయ తృతీయ వైభవం

అంశం:అక్షయ తృతీయ


శీర్షిక: అక్షయ తృతీయ వైభవం

సీ.ప:
వైశాఖ మాసంలొ వైభవముగవచ్చు
శుక్లపక్షమునందు శుభ దినమున
తదియ తిధియు నెంతొ తరియింప జేయును
కొనెదరు మహిళలు కొంత నైన
బంగారు నగలను భారంబు తలచక
మంచిరోజుయునని మదిన తలచి
ఏది కొనినగాని యెప్పటి కైనను
వచ్చును లక్ష్మని వనిత నమ్ము!

ఆ.వె:
అక్షయపు తృతీయ నరుదైన రోజున
తాజ పూలు తెచ్చి పూజ జేసి
బయలు దేరు తరుణి బంగారము కొనను
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

ఆ.వె:
పిసరు కొన్న చాలు పసిడి నెచటనైన
లక్ష్మి వచ్చు ననియు లక్షలాది
జనులు నమ్మి కొంద్రు జాగుచేయకనాడు
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

జయహో అంబేద్కర్

*అంశం*పదకవిత*


పదాలు:
*చేదు జ్ఞాపకాలు*
*మనసు మూలిగింది*
*కన్నీటి కొలను*
*భావితరం*

శీర్షిక: *జయహో అంబేద్కర్!*

చిన్న నాటి జీవితాలు
కొందరికి పూలు పాన్పులు అవుతాయి
మరికొందరికి *చేదు జ్ఞాపకాలు* గా
మిగిలిపోతాయి

అది భూస్వాముల కాలం దొరల పాలన
ఊరు బయట గుడిసెలు
అంటరాని వారంటూ ముద్ర
మంచి నీళ్ళు త్రాగ నివ్వరు
బావి కాడికి రానివ్వరు
స్నేహితులతో కలువ నివ్వరు
స్కూలులోపల కూర్చోనివ్వరు
చదువుకోవాలని బలమైన కోరిక
అప్పుడప్పుడు *మనసు మూలిగేది*

తప్పు చేయకున్నా నిందలు
తగిలావని కొరడా దెబ్బలు
ఎండలో నిలబెట్టడాలు
తిండికి ఎండబెట్టి డొక్కలు చీల్చే వారు
కరెంట్ స్తంభాల క్రిందనే పుస్తక పఠనం
బాధలను గుర్తు చేసుకుంటుంటే
*కన్నీటి కొలను* లా కట్టలు తెంచుకునేది

తాను కష్ట పడినా బాధలను భరించినా
తన జాతియే కాకుండా పీడిత జనులు
బహుజనులు ఇతర పేద వర్గాల వారు
బానిసత్వపు బ్రతుకులలో మ్రగ్గ కూడదని
*భావి తరాల* భవిష్యత్తు కొరకు
వారి సంక్షేమం కొరకు  హక్కుల కొరకు
ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చియు
వినయ విధేయతలతో  బారిష్టర్ చదివి
రాజ్యాంగాన్ని రచించినట్టి రాజ్యాంగ కర్త
తాడిత పీడిత అనగారిన కుటుంబాలలో
వెలుగులు నింపిన ఘనుడు డాక్టర్ అంబేద్కర్
జయహో అంబేద్కర్!

పుస్తకం హస్త భూషణం

అంశం: పుస్తకం


శీర్షిక: *పుస్తకం హస్త భూషణం*

పుస్తకం హస్త భూషణం
జ్ఞానానికి నాంది, ఆలోచనకు పునాది
ఆశయ సాధనకు, చైతన్యానికి సారధి
సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు వారధి
ఒంటరులకు స్నేహితుడు, బంధువు
పుస్తక పఠనం బ్రతుకుదెరువుకు ఆలంబన
భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు 
పుస్తకం ఒక దిక్సూచి
పుస్తకం ఒక యోగా గురువు
పుస్తకం ఒక పరిష్కార మార్గం 
పరిశోధకులకు పరిశోధనాత్మక గ్రంథం
పుస్తకం కొందరికి వ్యాపకం, ఎందరికో ప్రాణం
కొందరికి ఉల్లాసం, మరికొందరికి వినోదం
భక్తులకు ఆరాధ్య దైవం

నీ ఆయుధం కలం అయితే 
కొన్ని పేజీలు మాత్రమే వ్రాయగలవు
నీ ఆయధం పఠనమైతే 
కొన్ని పుస్తకాలు మాత్రమే చదువగలవు
నీ ఆయుధం చూపులు అయితే 
కొందరి పైనే దృష్టి సారించ గలవు
నీ ఆయుధం కత్తి అయితే 
శత్రువును మాత్రమే గెలువ గలవు
నీ ఆయుధం ఆలోచన అయితే 
మనసును మాత్రమే గెలువ గలవు
నీ ఆయుధం అనుభవం అయితే 
ఆశయాన్ని మాత్రమే గెలువ గలవు
నీ ఆయుధం ఈర్ష్య అయితే 
కొందరికి మాత్రమే హాని చేయగలవు
నీ ఆయుధం అహం అయితే 
నీ ప్రతిష్ఠను నీవే దిగజార్చుకోగలవు
నీ ఆయుధం సానుకూల ధోరణి అయితే 
సమాజాన్ని మాత్రమే గెలువగలవు
నీ ఆయుధం పుస్తకమైతే 
ప్రపంచాన్నే గెలువగలవు


  


Sunday, May 25, 2025

చకోర పక్షి లా /ఆమని

 *చకోర పక్షి లా *

అందమైన ఆమని 
అరవిరిసిన పూబోనీ 
తడి ఆరని చీరె లో
కనువిందు చేస్తున్నది

ఉషోదయాన లేచి 
సింగులు సర్దుకుని 
రెండు కడువలు 
చేత పట్టుకుని 
వయ్యారంగా నడుచుకుంటూ 
ఊరు బయట నదిలోకి 
ఒంటరిగా వచ్చి చేరే

వేడి వేడి సెగలతో 
రగులుతున్న మేనును 
శీతల జలంతో నేలకు దించి 
సేద తీరే రాళ్ళపై!

మేలిమి బంగారం వలె
మిలమిలా మెరుస్తూ 
ప్రియుని కోసమనీ 
చూస్తుండే భామ రెప్ప వాల్చకుండ 

చకోర పక్షిలా!

Saturday, May 24, 2025

సంకల్పం -2

అంశం: సంకల్పం


శీర్శిక: *సంకల్ప బలం ఉంటే విజయం తధ్యం*

*సంకల్పం సగం విజయం* అంటారు పెద్దలు
టెన్సింగ్ నార్కేలా ఎవరెస్ట్ శిఖరం
అధిరోహించాలన్నా
ఆర్కిమెడిస్ లా *ఆర్కిమెడిస్ సూత్రం*
కనుగొనాలన్నా
న్యూటన్ లా *గురుత్వాకర్షణ సిద్ధాంతం*
కనుగొనాలన్నా
అబ్దుల్ కలామ్ లా *మిస్సైల్స్*
కనుగొనాలన్నా
ముందుగా సంకల్ప బలం కావాలి!

ఏదైనా సాధించాలనే  *పట్టుదల*
విజయం సాధించాలనే  *దృడనిశ్చయం*
ఏదేని కార్యం నెరవేర్చాలనే  *సాహాసం*
ఆ పనిని అనుకున్న సమయంలో
పూర్తి చేయాలన్న తపననే  *సంకల్పం!*

మనిషి  లక్ష్యం లేకుండా
తపన లేకుండా సంకల్పం లేకుండా
ఏ పనిని సంపూర్ణం చేయలేడు
ఏ విజయం సాధించలేడు
ఏ లక్ష్యాన్ని చేరుకోలేడు

సంకల్పం ఒకటే ఉంటే సరిపోతుందా?
సంకల్పంతో అన్నీ సాధ్యమవుతాయా?
సంకల్పంతో సకాలంలో పనులు పూర్తయితాయా?
కాదు లేదు అనే సమాధానం వస్తుంది!

సంకల్పంతో పాటు క్రమశిక్షణ ఉండాలి
విషయ పరిజ్ఞానం పరిచయాలు కావాలి
నిరంతర సాధన చేయాలి
సహనముండాలి సమయమివ్వాలి
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా 
అదృష్టం గ్రహ బలం పరిస్థితులు 
తోడు అవ్వాలి 

సాధించేవరకు తగిన ఆర్ధిక శక్తి ఉండాలి 
సాధ్యమయ్యే వాటిపైననే సంకల్పం చేయాలి
సూర్యుడిని పడమటన ఉదయింపజేస్తా
పంచభూతాలను స్తంభింపచేస్తా
ఆకాశాన్ని చుట్టిపెడుతా అంటే కుదరదు
అవి జరగని పనులు
సాధ్యమయ్యే పనులకు సంకల్పం ఉంటే
విజయం తధ్యం!

ఒకే కడుపులో జన్మించిన వారము

*నేటి అంశం : * కవిత పూరించండి*


శీర్షిక: *ఒకే కడుపులో జన్మించిన వారము*

*ఒకే గూటి లోని గువ్వలమై**
*కష్టసుఖాలు పంచుకున్న సోదరులమై*
*రక్తసంబంధ అనుబంధమై*
*మేనులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉండే అన్నదమ్ములం*

*ఓకే కడుపులో పుట్టిన వారము*
*ఒకే ఉగ్గుపాలను త్రాగిన వారము*
*అన్నదమ్ములం మేము ఆత్మీయులము*
*అనురాగాలతో అన్యోన్యంగా జీవిద్దాం*

*కలిమి లేములు ఎలా ఉన్నా*
*కష్టాలు దుఃఖాలు ఎన్ని ఎదురైనా*
*ఆటుపోటులు ఎన్ని తగిలినా*
*అంగ వైకల్యాలు ఎన్ని ఉన్నా*
*జేష్ట కనిష్ఠ భాగ వైషమ్యాలు లేకుండా*
*కలుపుగోలుతనంగా కలిసుందాం!*

*ఆలి పులి వలె అడ్డు వచ్చినా*
*మధ్యలో దూరి ఎన్ని చిచ్చులు పెట్టినా*
*అత్తా మామలు గడ్డాలు పట్టుకున్నా*
*తోబుట్టువులం మనం తోడునీడగ ఉందాం*
*ఒకరికి నొకరం ధైర్యంగా ఉంటూ*
*కట్టె కాలే వరకు కలిసి బ్రతుకుదాం*

పర్యావరణ గీతాలు

అంశం: పర్యావరణ గీతాలు 


శీర్షిక:తరువులు పెంచాలి చెరువులు నింపాలీ

పల్లవి:
మానవా... ఇది నీకు ధర్మమా...
ఆధునికతంటూ... అభివృద్ధి అంటూ..
పర్యావరణంతోనే పరిహాసమా.....   "మానవా"

చరణం:01
నీటి కొరత నీకు ఎరుక...
నీటి అవసరం నీకు తెలుసు..
నీటిలో చెత్తాచెదారం వేస్తూ..
నీటిని కలుషితం చేయడం ధర్మమా.... "మానవా"

చరణం:02
స్వచ్ఛ గాలిని పీల్చకుండా..
అర నిమిషం జీవించలేమూ...
పెట్రోల్ డీజిల్ ఇంధనాలు మండిస్తూ..
యుద్దాలంటూ బాంబులు వేస్తూ..
వాయు కాలుష్యం చేయడం ధర్మమా... "మానవా"

చరణం:03
నల్లబంగారం అంటూ బావులు త్రవ్వుతూ
నిర్మాణాలంటూ నదులలో ఇసుకతోడుతూ
పరీక్షలంంటూ అణుబాంబులు వేస్తూ
భూమాతను చిధ్రం చేస్తున్నారు.       "మానవా"

చరణం:04
తరువులు పెంచాలి చెరువులు నింపాలీ
ప్లాస్టిక్ వస్తువులు వాడటం ఆపేయాలీ
నడిచి ప్రయాణించాలీ సైకిల్లపై వెళ్ళాలీ
పర్యావరణాన్ని పరిరక్షించాలీ      "మానవా"

Friday, May 23, 2025

ప్రేమ జంట/ ఆనందాల తీరాలకు చేరి పోదామా!

*నేటి అంశం*చిత్ర కవిత* (ప్రేమ జంట)


శీర్షిక: *ఆనందాల తీరాలకు చేరి పోదామా!*

అందాల దివిలో ఆకాశం అంచులో
అందనంత ఎత్తుకెదిగిన నా మయూరీ
కనువిందు చేసే నీ ఓర చూపులు
నను మైమరిపిస్తున్నాయే
వయ్యారాల నీ సొగసులకు తన్మయం
చెందుతున్నానే!

ఓ ఊర్వశీ!  అపురూపమైన నీ రూపం
హంస రెక్కల వంటి నీ కనులు
చంద్రవంకను పోలిన నీ మోము
దొండ పండు లాంటి పెదవులకు
కడలిలో ఎగిసిపడే కెరటాలు తీరాన్ని తాకినట్లు
నా మనసు నీ మది తీరాన్ని తాకుతున్నది
తాళ లేక పోతున్నా
సరిగమలు పాడలేక పోతున్ళా!

తళుకు బెళుకుల విశ్వంలో
తారలు మిరిమిట్లు గొలుపే నీలి ఆకాశంలో
కనువిందు చేసే నెలవంక వెన్నెలలో
కలిసి పోదామా కరిగి పోదామా !

కమ్మని ఊసులు చెప్పుకుంటూ
మల్లెల పరిమళాలలో తేలియాడుతూ
మధుర రసాలను జుర్రుకుంటూ
సుందర స్వప్నాలను పంచుకుంటూ
ఆనందాల తీరాలకు చేరి పోదామా!
 

AI ల ఎలాన్ మాస్క్ గ్రోక్ ప్రభావం

అంశం:AI ల ఎలాన్ మాస్క్ గ్రోక్ ప్రభావం

(ప్రతిస్పందన)

శీర్షిక: *AI సోషల్ మీడియా రెండు వైపులా*  *పదునైన కత్తి*

*AI సోషల్ మీడియా రెండు వైపులా*
*పదునైన కత్తి లాంటిది* 
కత్తితో పండును కోయవచ్చు 
అదే కత్తితో ప్రాణాన్ని కూడా తీయవచ్చు !

"AI సోషల్ మీడియా" అలానే మంచి
చెడులతో కత్తి కంటేను రెండు వైపులా
పదునైన సాధనం 
కత్తి ఒక గాయమే చేస్తుంది, కానీ సోషల్
మీడియా క్షణాలలో విప్లవాన్నే తీసుక వస్తుంది!

నేడు సోషల్ మీడియాను అతి వేగంగా
నడిపించేదే ఆర్టిఫీషియల్ ఇంటిలీజెన్స్
అందులో  *ఎలాన్ మాస్క్ బ్రోక్*
ప్రభావం అంతా ఇంతా కాదు
అతను ఇప్పుడు అగ్రరాజ్యాన్ని
గుప్పిట్లో పెట్టుకున్న అపర మేధావి
స్వార్ధం గుత్తాధిపత్యం పోకడలు
అధికమనే చెప్పవచ్చు

*AI ఒక బహుళార్థ సాధక సాధనం* 
అరక్షణంలో అద్భుతాలను సృష్టిస్తుంది
క్షణాలలో అనంత సమాచారం అందిస్తుంది
చిత్రాలను నిజ సంభాషణలు అందిస్తుంది
విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది!

*ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు*
*అతి తెలివి వినాశనానికి దారితీస్తుందన్నట్లు*
మంచి ఎంత ఉందో అంతకు వేయి రెట్లు
చెడు ఉందనడం సందేహం లేదు
చరవాణితోనే అనేక ఇబ్బందులు
ఎదుర్కొంటున్న  తరుణంలో
AI ఎలాన్ మాస్క్ గ్రోక్ తో సమస్యలు తప్పవు

*తానుపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు*
అనేటి దేశాధి నేతల చేతులలో
AI ఎలాన్ మాస్క్ బ్రోక్ ఉంటే వినాశనమే

సోషల్ మీడియాలో మంచితో పాటు
నీడలా చెడు కూడా  సహజమే
చెడు జోలికి పోకుండా
ఎలాన్ మాస్క్ ఆర్టిఫీషియల్ ఇంటిలీజెన్స్
మంచికి వాడుకో గలుగుతే అది స్వర్గధామమే!

మొక్కలు (బాల సాహిత్యం)

 అంశం: మొక్కలు


శీర్షిక: మామిడి మొక్కలు

ఆహా ఓహో మొక్కలు
అందమైన మొక్కలు
పచ్చ పచ్చని మొక్కలు
పసందైన మొక్కలు!          "ఆహా ఓహో"

భూమిని చక్కగ త్రవ్వాలి
మట్టిని చదును చేయాలి
పిక్కలు లోతుగా నాటాలి
నీటిని పలుచగ చల్లాలి!         "ఆహా ఓహో"

చక్కగ ఎరువును చల్లాలి
రోజూ నీటిని చల్లాలి
ఎండా గాలి తగలాలి
మొలకెత్తే వరకు చూడాలి!      "ఆహాఓహో "

మొక్కలు బాగా పెరిగాక
దూరం దూరం నాటాలి
చెట్లు పెరిగి కాయలు కాశాక
మామిడి పండ్లు కోసుకు తినాలి!  "ఆహా ఓహో"

Thursday, May 22, 2025

మనిషి వెళ్ళి పోయాడు

అంశం: మనిషి వెళ్ళి పోయాడు


శీర్షిక: *మంచి పనులు చేసి వెళ్లి పోవాలి*

*పుట్టిన మనిషి గిట్టక మానడు*
*గిట్టిన మనిషి పుట్టుక మానడు*

మనుషులు జన్మిస్తారు వెళ్లి పోతారు
అది సృష్టి ధర్మం ఎవరూ కాదనలేని సత్యం


మనిషి వెళ్ళి పోతే
ఆ మనిషిని పది కాలాల పాటు
స్మరించుకునే విధంగా వెళ్ళి పోవాలి
కానీ ఆ మనిషిని పది కాలాల పాటు
హీనంగా చూసే విధంగా వెళ్ళి పోకూడదు

తాను చూడరాక పోవచ్చు
వారి వంశాల తరాల శేషం మిగిలే ఉంటుంది
వారి దుష్ట చర్యలు జీవించి ఉన్న వారిపై
దీర్ఘకాలికంగా అతడి ప్రభావం ఉంటుంది

చెడు పనులు చేసి మోసాలు చేసి
పాపాలు చేసి ఎలా వెళ్ళిపోయినా
వారిపై ఆధారపడిన భార్యా పిల్లలు
తల్లిదండ్రులు ఆసరా కోల్పోతారు

అప్పులు ఇచ్చిన వారు బ్రతికి ఉన్నవారిని
పీడిస్తుంటే ఆ జీవితం మరీ దుర్భరంగాను
హృదయ విదారకంగా ఉంటుంది
మేమూ సహితం వెళ్లి పోతే బాగుండు కదా
అని మనసు చంచలమౌతుంది

ఎవరి ఆయుష్షు ఉన్నంత వరకు
వారు జీవిస్తారు ఈ లోకంలో
ఎప్పుడు వెళ్ళిపోయినా ఎలా వెళ్ళి పోయినా
మంచి పనులు సేవలు దాన ధర్మాలు
చేసి బ్రతికి ఉన్న వారికి భారం లేకుండా
వారు సంతోషంగా గడిపే విధంగా
సమకూర్చి వెళ్ళాలి
అందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి

చివరికి మంచి పనులు చేయక పోయినా
ఎవరికీ హాని చేయకుండా వెళ్లి పోవాలి

సామెతల కవిత

*నేటి అంశం -సామెతల కవిత*


*1.ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు*
*2. డబ్బుకు లోకం దాసోహం*

శీర్షిక: *అనుభవాల నుండి పుట్టినవే ఆర్యోక్తులు*

రెక్కాడితే డొక్కాడని బడుగు జీవులకు
రోజంతా శ్రమించే శ్రామికులకు
రోజుకు ఒక్క పూట తిండి దొరకని దీనులకు
పంచభక్ష్య పరమాన్నాల రుచి యేల తెలుసు!

చెమటోడ్చి పనిచేసిన కార్మికులకు
సడలిన కండరాలకు అలసట దీర్చను
నిద్ర ముఖ్యం గానీ పట్టు పరుపులు కాదు
అందుకే అంటారు  *ఆకలి రుచి ఎరుగదు*
*నిద్ర సుఖమెరుగదు* అని పెద్దలు!

*డబ్బుకు లోకం దాసోహం* అనే ఆర్యోక్తి
జనుల నాలుకలలో నాటుకు పోయింది
డబ్బుకు జనులు దాసోహం కావచ్చు కానీ
అందరూ అవుతారనుకోవడం మూర్ఖత్వం!

డబ్బుతో అన్ని వస్తువులను కొనగలమని
అనుకోవడం కూడా సరికాదు
డబ్బుకు లొంగేది బలహీనులు పేదలు
అత్యాశ పరులు మాత్రమే ననీ గుర్తుంచుకోవాలి
ఇలా అనుభవాల నుండి పుట్టినవే ఆర్యోక్తులు!

Wednesday, May 21, 2025

సత్యం శివం సుందరం

అంశం:*సత్యం శివం సుందరం*


శీర్శిక: *సత్యమేవ జయతే!*

*సత్యమేవ జయతే!*
ఎప్పుడూ సత్యమే నిలుస్తుంది
ఎల్లప్పుడూ సత్యమే విజయం సాధిస్తుంది

ఈ జగత్తు అంతా సత్యం
ఈ సృష్టి అంతా సత్యం
ఈ ప్రకృతి అంతా సత్యం
ఈ జీవ కోటి జీవించడం సత్యం
అలానే ఈ జీవకోటి నశించడం సత్యం

అందుకే ఈ సత్యం శాశ్వతం
ఈ సత్యాన్ని ఎవరూ శాసించ లేరు
ఈ సత్యాన్ని ఎవరూ మార్చలేరు

ఈ విశ్వమంతా శివ మయం
శివుడు లయ కారకుడు
ఈ జీవకోటిని తోలుబొమ్మలాట
ఆడించే వాడు శివుడు
అందుకే అంటారు శివుడు తలపెట్టనిదే
చీమైనా కుట్టదంటారు

సత్యం శివం సుందరం
సుందరం అంతర్గత సౌందర్యం
విలువలతో కూడిన వ్యక్తిత్వం
ప్రేమ దయ కరుణ జాలి దాన గుణం
సేవా గుణం దైవ గుణం మొదలైనవి
అంతర్గత సౌందర్యాలు

సత్య జగత్తులో గడుపుతూ
ఓం శివం అంటూ దైవాన్ని స్మరిస్తూ
సుందరమైన ప్రేమ దయ కరుణతో
జీవిస్తేనే మనిషికి సార్ధకత ఉంటుంది

ఎండాకాలం హడావుడి

అంశం: ఎండాకాలం హడావుడి 


శీర్షిక: *తల్లి తండ్రులకు తలపోట్లు*

ఎండాకాలంలో మండుటెండలు
ఏడాది కోసారి బడులకు సెలవులు
ఆటలు పాటలతో హడావుడి పిల్లలు
తినడానికి పెట్టమని పిల్లల గోలలు!

చరవాణీలలో మునుగుతారు కొందరు
స్విమ్మింగ్ పూల్ అంటారు కొందరు
డ్యాన్సులు నేర్చుకుంటారు మరికొందరు
కరాటే నేర్చుకుంటారు ఇంకొందరు!

నాన్న డ్యూటీ నాన్నది
అమ్మ డ్యూటీ అమ్మది
డ్యూటీ కయితే వెలుతారు
మనసంతా ఇంటి కాడనే
పిల్లలు ఏమి చేస్తున్నారో తెలియదు
ఎందులో వ్రేలు పెడుతున్నారో తెలియదు
ఎక్కడ ఆడుతున్నారో తెలియదు
ఏమి తగాదాలు తెస్తారో తెలియదు!

డ్యూటీలకు హడావిడిగా వెలుతారు
హడావిడిగా వస్తారు
ఇంటికి వచ్చేసరికి తగాదాల మూటలు
ఎవరివైపు మాట్లాడినా కోపాలు తాపాలు
ఎండాకాలం ఎలాగడస్తుందా అని
తల్లిదండ్రులకు తలపోట్లు!

వారాంతపు సెలవుల్లో టూర్లు షికార్లు
పార్కులు గుడులు గోపురాలు
విందులు వినోదాల హడావుడి
సెలవులు అయిపోయే దాకా పట్టణాలలో
ఇలానే ఉంటుంది తప్పదు మరి!

మనసు పొరలు విచ్చుకుంటే

*నేటి అంశం*హృదయం ఏమంటుంది*

శీర్షిక: *మనసు పొరలు విచ్చుకుంటే*

మల్లెపువ్వు రెమ్మలు విచ్చుకుంటే
సుగంధ పరిమళాలు వెదజల్లి నట్లు
పక్షులు రెక్కలు విచ్చుకుంటే
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరి నట్లు
*మనిషి మనసు పొరలు విచ్చుకుంటే*
నవనవోన్మేషంగా ఆలోచిస్తారు 
మానవ భూలోకంలో అజరామరంగా
విరాజిల్లుతారు!

లోకంలో గొప్ప పేరు
కీర్తి ప్రతిష్టలు సంపాదించాలంటే
మనిషికి ఉండాల్సింది శరీర ఆకృతి కాదు
మనిషి మనసు లోన ప్రేమ దయ కరుణ
జాలి దాన గుణాలు ధర్మ గుణాలు నమ్మకాలు
అనురాగాలు ఆప్యాయతలు విశ్వాసాలు
నిస్వార్థ ఆలోచనలు ఆధ్యాత్మిక చింతనలు!

మానవుడు విశాల హృదయంతో
ఉన్నపుడే ఇవి సాధ్యం అవుతాయి
వారి ముఖం లోనే కనబడుతుంది
ఆ తేజస్సు ఆ యశస్సు ఆ వర్చస్సు!

మనసు పొరలు విచ్చుకోనటువంటి
సంకుచిత హృదయస్తులు కఠినంగాను
బండ రాయి గానూ కోపంగానూ
తుమ్మ చెట్ల ముల్లుల్లా గుచ్చుకుంటాయి 
చిరాకుగా ఉండి ఎవరి మనసునూ
దోచుకో లేరు ఎవరినీ ఆకట్టుకోలేరు
అలాంటి వారు ప్రశాంతంగా జీవించలేరు
ఎదుటి వారిని ప్రశాంతంగా జీవించనివ్వరు!

మానవ జీవితం చాలా చిన్నది
బ్రతికిన కొంత కాలమైనా
ముఖంపై చిరు నవ్వుతో
విశాల హృదయంతో వెన్నలాంటి మనసుతో
నలుగురితో కలిసి మెలిసి జీవించాలి
ప్రశాంత వదనంతో గడుపాలి
చేతనైన సహాయం చేస్తూ  ఆదర్శంగా నిలుస్తూ
రేపటి తరాలకు  అశాశ్వతమైన వెంటరాని
సంపదలను కాకుండా సంస్కారాన్ని 
భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను 
తాను చేసిన మంచి కర్మలను వ్యక్తిత్వాన్ని 
భావి తరాలకు వారసత్వంగా అందించాలి
అదే నిజమయిన జీవితం 
అతడే నిజమైన మనీషి! 

Tuesday, May 20, 2025

ఉక్కిరిబిక్కిరి

అంశం: ఉక్కిరిబిక్కిరి


శీర్షిక: *అంతా మెకానికల్ టెక్నికల్ కదా!*

అవి అందమైన బావులు
చూడ ముచ్చటగా ఉంటాయి
పదుల కిలోమీటర్ల లోతులో ఉంటాయి
చుట్టూరా సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది

కొత్తగూడెం ఫాయింక్లైన్ మణుగూరు
సింగరేణి గోదావరి ఖని మందమర్రి
అందమైన బావులకు తావులు
వేలాది మంది కార్మికులు పనిచేస్తారు

ఉదయం పగలు సాయంత్రం
తలకు హెల్మెట్ లైట్ కాళ్ళకు బూట్లు
చేతిలో పనిముట్లు పట్టుకుని
చక్కగా మూడు షిఫ్టుల్లో దిగుతారు

బావులలోకి దిగాక గనులను
దూరంగాఉండి బాంబులు పెట్టి పేల్చుతారు
పడిన గనుల వద్దకు పిట్టలను పంపిస్తారు
పిట్టలు ప్రాణంతో తిరిగి వస్తే
కోట్ల విలువ చేసే నల్ల బంగారాన్ని
టబ్ ల్లోకి ఎక్కించి పైకి పంపిస్తారు
ఒక్కోసారి ఆక్సీజన్ అందక ఊపిరి ఆడక
*ఉక్కిరిబిక్కిరై*  కార్మికులు చనిపోతారు

బావుల్లో కి గాలిని పంపిస్తారు
లోపల ఊరే వేడి నీటిని పైకి తోడేస్తారు
విద్యుత్తు సరఫరా ఉంటుంది
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంతా
మెకానికల్ టెక్నికల్ కదా!


ముసలి వాడని అంట వేమిరా

 శీర్షిక: *ముసలి వాడని అంటవేమిరా*


ముసలి వాడని అంటవేమిరా  ఓ నరుడా .."2"
ముసలి ముసలి వాడని 
పిలువబోకుమురా ఓ మానవుడా...."2"
ముసలి తనం లేని జీవి యేడరా
రేపు నీవు ముసలివాడివవుతావని తెలుసుకోరా!

ముసలి వారని ఎవరినీ తీసి పారేయకురా
వారిని కరివేపాకులా ఏరి పారేయకురా
మరీ మసిగుడ్డలా తీసిపారేయకురా
ముసలి వారనీ హేళన చేయకురా
పండు ముసలివారని తోసి పారేయకురా! "ముసలి"

ప్రకృతి ధర్మమే ముసలి తనంరా
జీవితంలో భాగమే ముసలి తనంరా
ముసలి తనం అనుభవాల గనిరా
ముసలి తనం జ్ఞాపకాల సౌధంరా
ముసలి తనం విజ్ఞాన భాండాగారంరా
ముసలి తనం లేని జీవితమే వ్యర్థంరా! "ముసలి"

ఆరోగ్య వంతులకే ఉంటుంది ముసలి తనంరా
ఆయుష్షు మంతులకే వస్తుంది ముసలి తనంరా
పుణ్యాత్ములకే వరం ముసలి తనంరా
యోగాత్ములకే భాగ్యం ముసలి తనంరా! "ముసలి"

ముసలి వారికి సేవ చేయని నీ కొంప
అది దయ్యాల కొంపని గ్రహించరా
ముసలి వారు నివసించని నీ బంగ్లా
అది బూతు బంగ్లాయని తెలుసుకోరా ! "ముసలి"

వృద్ధులతో పిల్లలు ఆడుకోవాలిరా
వృద్ధులతో పిల్లలు పాడుకోవాలిరా
వృద్ధులతో కథలు చెప్పించుకోవాలిరా
వృద్ధులను నిత్యం సేవించాలిరా! "ముసలి"

వృద్ధులను ఎల్లప్పుడు ఆదరించరా
వృద్ధులనుండి అనుభవాలు నేర్చుకోరా
వృద్ధుల బాధలను పంచుకోరా
మరుజన్మ లేకుండ మోక్షం పొందరా! "ముసలి" 

కలహా భోజుడు నారదుడు

అంశం: చిత్ర కవిత


శీర్షిక: కలహ భోజుడు

కుడి చేతిలో తంబూర
ఎఢమ చేతిలో చిరుతలు పట్టుకుని
నుదుట భుజాలకు నామాలు పెట్టుకుని
హరిలో రంగ హరిలో రంగ అంటూ 
నారాయణ జపము చేయుచు 
ముల్లోకాలను చుట్టి వచ్చే 
లోకకళ్యాణ కారకుండు

చరిత్రలో చిర పరిచి తుండు
కనులు తెరిచి కనులు మూయు లోపు
మూడు లోకాలను చుట్టి వచ్చు ఘనుడు
హాస్య ప్రియుడు అజాత శత్రువు నారదుడు

బ్రహ్మ మానస పుత్రుడు
నరనారాయణులకు వారదుండు
ఎందెందు వెతికినా అందుగలండు
ఎక్కడేమి జరిగినా తెలుసుకోగల శక్తి పరుడు
జగన్నాటక సూత్రధారి
ఎవరెవరికి కలహాలు పెట్టించాలన్నా
ఎవరెవరి మెప్పు పొందాలన్నా
నారద మహర్షికి మించిన వారు
లేరు లోకాన అందుకే వీరికి
కలహ భోజుడనే నామధేయం గలదు

కానీ వాస్తవానికి సమస్యల పరిష్కారకుడు
చక్కని చతురత గలవాడు బ్రహ్మ చారి
విష్ణు భక్తుడు వినయ విధేయతలు గలవాడు
దేవదేవతల మన్ననలను పొందిన వాడు
మంచి గౌరవం కీర్తి ప్రతిష్టలు గలవాడు
హరిలో రంగ హరి అంటూ 
హరి నామస్మరణ చేస్తూ ఏ లోకానికైనా
వెళ్ళగల స్వేచ్ఛ గలవాడు దేవర్షి!

వద్దు బాబోయ్ పెళ్లి మాకు వద్దు

అంశం: పెళ్లి (గేయం)
శీర్షిక: వద్దు బాబోయ్ పెళ్లి మాకు వద్దు  ( గేయం)
〰️〰️〰️〰️〰️〰️〰️
అమ్మాయులూ పెళ్లి చేసుకోండమ్మా...
అబ్బాయిలూ పెళ్లి చేసుకోండయ్యా...
వయసు తరిగి పోతుందీ...
సొగసు చెదిరి పోతుందీ......  "అమ్మా"

బెండకాయలు ముదిరినా....
వంటకు పనికి రావంటారూ...
యువత వయసు మీరినా...
సంతానం కలుగదంటారూ.....        "అమ్మా"

పిల్లలు పుట్టినా మీరు పెంచలేరూ...
పెంచినా మీరు చదివించ లేరూ...
చదివించినా మీరు చెప్పినా వినరూ...
విన్ననూ మిమ్ములను పోషించలేరూ...  "అమ్మా"

అమ్మ బాబోయ్ పెళ్లి మాకు వద్దూ...
వద్దు బాబోయ్ పెళ్లి మాకు వద్దూ...
పెళ్ళయితే రోజూ ఓ తంటా...
ఇక రోజూ గొడవలు మా ఇంటా...      "అమ్మా"

అత్తా మామ ఆడపడుచులతో తంటా 
ఇంట్లో చేయాలి రోజూ వంటా 
కేసులతో తిరుగాలీ కోర్టుల వెంటా...
వద్దు బాబోయ్ ఈ పెళ్లి పెంటా....        "అమ్మా"

Monday, May 19, 2025

మా అరుగు ముచ్చట

అంశం: *మా అరుగు ముచ్చట* 


శీర్షిక: *ఇంటింటికీ శోభనిచ్చు అరుగులు*

ఆహా! ఏమి అరుగులు
అందమైన అరుగులు
ఆనందాలు పంచే అరుగులు
రంగు రంగుల అరుగులు
ఇంటిముందర ఎత్తెన అరుగులు
ఇంటింటికీ శోభనిచ్చు అరుగులు
ఇంతులు కూర్చును ఇంపైన అరుగులు!

ఉదయం సాయంత్రం అనకుండా
రోజంతా సేదతీర అనువైన అరుగులు
కాలక్షేపానికి కడుపులో సొధ తీర్చుకోడానికి
అలసట తీర్చుకోడానికి అరుదైన అరుగులు!

పెద్దలు చిన్నలు వచ్చేరు
అమ్మలక్కలు కూర్చునేరు
ఎక్కడెక్కడియో  ఎప్పడెప్పటియో
అచ్చట్లు ముచ్చట్లు గుసగుసలు చెప్పుకునేరు!

ఆపదలు తీర్చుతాయి అరుగులు
అలసటలు తీర్చుతాయి అరుగులు
పరిచయాలు పెంచుతాయి అరుగులు
పంచాయితీలు పెట్టిస్తాయి అరుగులు
పరిష్కారాలు చేస్తాయి అరుగులు!

ఆహా! ఏమి అరుగులు
రంగు రంగుల ముగ్గులతో అరుగులు
ఆహ్లాదకరమైన అరుగులు
ఇంటి ముందర ఎత్తైన అరుగులు!
 

ఆమె నవ్వ గలదా?

అంశం:ఆమె నవ్వగలదా ?


శీర్శిక: ఆమె నవ్వ గలదు

శిశు తనంలో అమ్మను చూడగానే
విరబూసిన మల్లె పువ్వులా
కిలకిలా నవ్వుతుంది
పాలు పట్టగానే నిండు గులాబీలా
పెదవుల చివరల నుండి
పాలు  కార్చుతూ నవ్వుతుంది

అమ్మ జోల పాట పాడి నప్పుడు
నాన్న వ్రేలు పట్టుకుని నడిచినప్పుడు
బుజాన ఎత్తుకుని ఆకాశాన్ని
చూపినపుడు ఆమె నవ్వుతుంది

క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు
తల్లిదండ్రులు గురువులు స్నేహితులు
ప్రశంసించినపుడు
అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు
తల నిమిరి నప్పుడు
ముసిముసి నవ్వులు నవ్వుతుంది

ఉద్యోగం వచ్చినప్పుడు
మొదటి జీతం తీసుకున్నప్పుడు
పళ్ళి చూపులకు కూర్చున్నపుడు
ఇష్ట మైన భర్త లభించినప్పుడు
ఆమె ఆనంద భాష్పాలు దాల్చుతుంది

సాధికారత సాధించిన నేడు
వ్యోమగామి నౌకలో విహరిస్తున్న నేడు
శత్రు మూకలను సంహరిస్తున్న నేడు
అన్ని రంగాలలో దూసుకుని పోతున్న నేడు
ఆమె ధీరత్వంతో నువ్వుతుంది!

ప్రయాగ ప్రక్రియ/ పిల్లల పెంపకం

అంశం:  *ప్రయాగ*


శీర్షిక: పిల్లల పెంపకం - తల్లిదండ్రుల భాద్యత

నేడు పిల్లలు కష్ట *పడి* తేనే ఏదైనా ఇష్ట *పడి*
పనిచేస్తేనే విజయం రేపు జీవితం సుఖం...

పిల్లల పెంపకంలో అతి గారాబం అనర్ధదాయకం...

అది ఆనందదాయక జీవితానికి ప్రతిబంధకం...

పిల్లలకు బుద్దుడి దయ కరుణ ప్రేమను ధర్మాన్ని బోధించా *లి*..

జిజియా భాయి లా ధైర్యాన్ని శౌర్యాన్ని బోధించా *లి*..

అబ్దుల్ కలామ్ వలే బాధలను కష్టాలను దుఃఖాలను అలవర్చా *లి*....

పిల్లలను కష్టపడకుండా పెంచాలని
అనుకోవడం తల్లిదండ్రులు చేసే పెద్ద *తప్పు*

*తప్పు* అనుకోకుండానే చేస్తున్నారు పెద్దలు అప్పులు ..

అవే రేపు పెద్దలకు పిల్లలకు అవుతాయి ముప్పులు బాధలు రందులు అవమానాలు...

జీవితం ఎవరికీ న *ల్లేరు* మీద నడక కాదు ప *ల్లేరు* మీద నడకా కాదు...

ఎవరికీ పూల *పాన్పూ* కాకూడదు ముళ్ళ *పాన్పూ* కాకూడదు...

*పచ్చని* పొలంలో *పచ్చని* కలుపు మొక్కలు
ఉన్నట్లే జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ ఉండాలి...

ప్రతీ కష్టసుఖాలను పిల్లలు అనుభవించేట్లు చేయాలి..

పిల్లలు ఎ *లాగ లాగు* తారో అలా నడుచుకో నివ్వకూడదు..

అప్పుడే వారు విలు *వల వల* కప్పబడి ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు...

పిల్లలను చక్కగా సాన *బడితే బడితే* పట్టుకోనవసరం లేదు...

నేడు పిల్లలు కష్ట *పడి* తేనే ఏదైనా ఇష్ట *పడి*
పనిచేస్తేనే విజయం రేపు జీవితం సుఖం...


Saturday, May 17, 2025

నేను నీ వాడనే.. నీవు నా దానివే.. ..

 అంశం: ట్యూన్ లిరిక్స్


శీర్షిక: నేను నీ వాడనే...నీవు నా దానవే..

పల్లవి:
పొద్దు పొద్దున్నే....
పొద్దు పొద్దున్నే నీవు గుర్తుకొచ్చావే...
పొద్దు పొద్దున్నే నా మనసులోకి వచ్చావే..
దినకరుని కిరణాలలో మెరిసి పోతున్నావే....
మెరిసి పోతున్నావే..   "పొద్దు"

చరణం:01
అతడు:
నా వెంట నీవుంటే....
నీ వెంట నేనుంటే....
ఆకాశమంతా మనముంటే...
ఆ ఆనందమే వేరులే....
మన ఉత్సాహం జోరూలే....
నేను నీ వాడనే ...
నీవు  దానవే ... నీవు దానవే.."పొద్దు"

చరణం:02
అతడు:
నీవు నా చేరువైతే....
నీవే నా స్వంత మైతే...
జీవితంలో ఇంకేమి వద్దు నాకూ....
ఇక ప్రపంచమే హద్దు నాకూ....
నేను నీ వాడనే.....
నీవు దానవే.... నీవు నా దానవే.... "పొద్దు"

చరణం:03
నీతో కొన్ని క్షణాలు గడిపినా...
కొన్ని యుగాలు గడిపి నట్లే...
నీతో కొంత కాలం గడిపినా...
చాలు ఈ జీవితానికి....
నేనున్నా లేకున్నా...
నా ప్రేమ నీకు అంకితం....
నేను నీ వాడనే....
నీవు నా దానవే.... నీవు నా దానవే... "పొద్దు"

జయహో వీర సైనికులారా!

అంశం: విజయ గీతాలు

శీర్శిక: *జయహో వీర సైనికులారా!*

పల్లవి:
జయహో సైనికులారా!
జయజయహో వీర సైనికులారా!
ఆపరేషన్ సిందూర్ లో
ఘన విజయం సాధించిన ధీర సైనికులారా  "జయహో"

చరణం:01
నరుల ప్రాణం విలువ తెలియని
నరరూప రాక్షసులపై
మారణహోమం సృష్టించిన
ఉగ్రవాద మూకలపై
బ్రహ్మోస్ లను వదలండోయ్ .... "జయహో"

చరణం:02
అందాల కాశ్మీర్ ను
రావణ కాష్టం చేసిన
హిందువుల నెత్తురుకు మరిగిన
ఉగ్రవాదులపై
ఉక్కుపాదం మోపండోయ్ "జయహో"

చరణం:03
అదర వద్దు బెదర వద్దు
ఆకాశమే మీకు హద్దు
అన్ని హంగులతో మనమున్నాం
గడగడ లాడించండోయ్
గబగబ బాంబులేయండోయ్.  "జయహో"

చరణం:04
దేశ ద్రోహులకు బుద్ధి వచ్చేట్లుగా
ప్రపంచ దేశాలు కలిసి వచ్చేట్లుగా
శత్రు దేశాలకు తెలిసి వచ్చేట్లుగా
భారత్ సత్తా చూపండోయ్ !   "జయహో"