Friday, May 16, 2025

పిల్లల పెంపకం - తల్లిదండ్రుల భాద్యత

 శీర్షిక: పిల్లల పెంపకం - తల్లిదండ్రుల భాద్యత


*నేడు కష్ట పడితేనే రేపు సుఖం*
*ఏదైనా ఇష్టపడి పని చేస్తేనే విజయం*
*అతి గారాబం అనర్ధదాయకం*
*అది ఆనందదాయక జీవితానికి పరాభవం*

జీవితం ఎవరికీ నల్లేరు మీద నడక కాదు
ఎవరికీ పూల పాన్పూ కాకూడదు
పచ్చని పొలంలో కలుపు ముక్కలు ఉన్నట్లే
జీవితంలో కష్టాలు సుఖాలు దుఃఖాలు
బాధలు భాద్యతలు హక్కులు అన్నీ ఉండాలి

పిల్లలు ఇప్పుడిప్పుడే పుడమి చీల్చుకుని
బయటి ప్రపంచానికి వస్తున్న లేలేత మొక్కలు
కొమ్మలు ఎలా వంచుతే అలా వంగి నట్లే
పిల్లలు ఎలా చెబుతే అలా వింటారు

మా తాత కడు పేదరికంలో జీవించాడనీ
కష్ట పడి మమ్ములను పెంచడాంటూ
మమ్మలను చదివించ లేక పోయాడంటూ
మా పిల్లలను కష్ట పడకుండా  పెంచాలనీ
కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా పెంచుతారు

అదే పిల్లల కోసం పెద్దలు చేసే పెద్ద తప్పు 
తప్పు అనుకోకుండా చేస్తున్నారు పెద్ద అప్పు
అప్పు అవుతుందనుకోవడం లేదు  ముప్పు
ముప్పు అయినా నమ్ముతున్నారు అది ఒప్పు
ఒప్పు అని భావించడం వలననే రేపు కష్టాలు

బుద్దుడి వలే దయ కరుణను బోధించాలి
రాముడి వలే నీతిని ధర్మాన్ని నేర్పాలి
కృష్ణుడి వలే శిష్టరక్షణ దుష్టశిక్షణ బోధించాలి
జిజియా బాయి వలే ధైర్యాన్ని నూరి పోయాలి
అబ్దుల్ కలామ్ లా కష్టాలను అలవర్చాలి
తాము పడ్డ కష్టాలను భాద్యతలను చెప్పాలి

అప్పుడే పిల్లలు క్రమశిక్షణతో ధైర్యంతో
చక్కగ చదివి విద్యాబుద్ధులు నేర్చి
సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులుగా
జీవిస్తూ ఎలాంటి సమస్యలు ఎదురైనా
ఎదుర్కొనే తట్టుకునే శక్తి కలిగి ఉంటారు 

- మార్గం కృష్ణ మూర్తి 

No comments: