అంశం: *సామెతల కవిత*
*అప్పు చేసి పప్పు కూడు**చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు*
శీర్షిక: *స్థిత ప్రజ్ఞత*
మనిషి మనసు కోరికల పుట్ట
వాటిని సాధించుకోవడంలో కొందరు దిట్ట
ఆ తరువాత పడుతారు అగచాట్లు
అవి గ్రహపాట్లు అంటూ సర్దుబాట్లు
బట్ట ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి
ప్రక్క వారు గొప్పగా బ్రతుకుతున్నారనీ
ఎదుటి వారు లగ్జరీ కారు కొన్నారనీ
నక్కను చూసి వాత పెట్టుకున్నట్లుగా
మేము అలానే జీవించాలని
అనుకోవడం సరికాదు
*అప్పు చేసి పప్పు కూడు* అన్నట్లుగా
పిల్లల పెండ్లిళ్ళకనీ ప్రభోజానాలకనీ
బంధు మిత్రులకు గొప్పలు చూపించుకోవాలనీ
అప్పులు చేసి ఘనంగా శుభకార్యాలు చేస్తారు
తాహత్తుకు మించి అప్పులు చేయడంతో
అసలు వడ్డీ తడిసి మోపడవుతుంది
సకాలంలో అప్పు తీర్చలేకపోతే
అవమానాల పాలు కావాల్సి వస్తుంది
ఆత్మ హత్యలకూ దారితీయవచ్చు
*చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు* అన్నట్లు
కష్టాలైనా సుఖాలైనా సంతోషాలైనా దుఃఖాలైనా
ఏవీ స్థిరంగా ఉండవు ఏవైనా కొన్నాళ్ళే
ఎండ మావుల్లా వస్తూ పోతుంటాయి
గ్రహాల మార్పులను బట్టి మారుతుంటాయి
ఉన్నంతలో సమాజ హితంగా గడపాలి
కష్టాలకు కృంగి పోకుండా
సుఖాలకు పొంగి పోకుండా
ఎల్లప్పుడూ స్థిత ప్రజ్ఞతతో జీవించాలి
No comments:
Post a Comment