Monday, June 30, 2025

తీపి జ్ఞాపకాలు

*నేటి అంశం*పదాల కవిత*

*పసిడి కాంతులు*
*సైకత శిల్పాలు*
*అనురాగ ఆహ్వానం*
*మానస సరోవరం*

శీర్షిక:  *తీపి తీపి జ్ఞాపకాలు*

ఏమి ఏమీ నాటి మన మధుర మధురానుభూతులు
కాలం కళ్ళెం వేయలేక పోయింది మన ఆనందానికి
నీ అందానికి ప్రకృతి పులకరించి పోయింది సిగ్గుతో
మెలికలేసుకున్నాయి మేనులు కలవరింతలతో!

కమల పద్మం లాంటి అందమైన నీ కనులు
హంస రెక్కలు వంటి నీ కనురెప్పలు
నిశీధిలో నీలి మేఘాల్లాంటి నీ కురులు
చాంతాడంత నాగ సర్పపు నీ వాలు జడ
జడ నిండుగా గుభాలించే మల్లె పూల దండ
చంద్రబింబం లాంటి సుందరమైన నీ మోము
*అనురాగ ఆహ్వానం* పలుకు తున్నాయి

గలగల పారే సెలయేరు ప్రక్కన *సైకత శిల్పాలు* కొలువుదీరి ఉన్నాయి
లేలేత గడ్డి పోచలపై కూర్చుని,గడ్డి సువాసన నాస్వాదిస్తూ
ఆనందిస్తిమి అవనిలో  *మానస సరోవరం* అందాలను చూస్తూ..!

ఆహా! సుందర దరహాసం నీ తడి చీరలో  *పసిడి కాంతులతో* మేను
నీ శుభకర కరములు నా మేను తగలగ
హృదయానంద నందము వలె పరవసించిపోతిని
నాటి తీపితీపి జ్ఞాపకాలు సుస్థిరంగా మదిలో నిలిచిపోయెనా!

      

జయహో! శుభాంశ్ శుక్లా!

అంశం: ప్రతిస్పందన - శుభాంశ్ శుక్లా శుభ్ యాత్ర


శీర్షిక: జయహో! శుభాంశ్ శుక్లా!

యేండ్ల కొలది గగన వీధిలో
నిద్రాహారాలు మాని మొక్కవోని దీక్షతో
ప్రాక్టీస్ చేసి మొదటి శ్రేణిలో నిలబడిన
వ్యోమగామి రాకేశ్ శర్మ , అప్పుడు అదొక చరిత్ర!

అంతరిక్షంలో అడుగు పెట్టి
భారత కీర్తి కిరీటాన్ని ప్రపంచం పటంలో
స్థిర స్థాయిగా నిలబెట్టిన ఘనుడు
వ్యోమగామి రాకేశ్ శర్మ!
అప్పుడు రాకేష్ శర్మ ఇప్పుడు శుభాంశ్ శుక్లా
భారత అంతరిక్ష యానంలో మైలు రాళ్ళు
నలుబది ఒక్క సంవత్సరాల తరువాత
నేడు శుభాంశ్ శుక్లా ఐఎస్ఎస్ లోకి
మానవ సహిత అంతరిక్ష యాత్రలో
ముఖ్య సంఘటన!

ప్రధమ అంతరిక్ష యాత్రలో రాకేశ్ శర్మ
చరిత్ర సృష్టిస్తే
బయో సైన్సెస్ వైద్యం సాంకేతిక రంగాల్లో
నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన
పరిశోధనలకు గాను
నేడు శుభాంశ్ శుక్లా బృందం ఐఎస్ఎస్
వ్యోమనౌకతో యాక్సియం మిషన్ తో
అంతరిక్షంలో విజయవంతంగా
అనుసంధానం చేయడం మరో గొప్ప విశేషం!

శుభాంశ్ శుక్లా బృందం అంతరిక్ష పరిశోధనలు
పరిపూర్ణంగా సఫలీకృతం కావాలని
శుభం జరుగాలనీ మనసా వాచా కర్మణా
జయీభవ! విజయీ భవ! దిగ్విజయీభవ!
*జయహో! శుభాంశ్ శుక్లా!*
 

ద్వంద్వ వైఖరి

అంశం: శాంతి శంఖం


శీర్శిక: *ద్వంద్వ వైఖరి*

భారత దేశం చతర్వేదాలకు పురాణాలకు
రామాయణం మహాభారతం వంటి
ఇతిహాసాలకు పుట్టినిల్లు!

ఋషులు మునులు జన్మించిన పుణ్యస్థలం
శ్రీ రాముడు కృష్ణుడు దేవతా స్వరూపులు
బుద్దుడు అశోక చక్రవర్తి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మహాత్మాగాంధీ వంటి
మహా నీయులు జన్మించిన పవిత్ర దేశం!

*భారత దేశం శాంతి కాముక దేశం*
భారతీయుల నరనరాల్లో ప్రసరిస్తున్న రుధిరం
శాంతి సౌభ్రాతృత్వం కోరుకునేదే
మహాత్మాగాంధీ సత్యాగ్రహాల ద్వారానే
దేశానికి స్వాతంత్య్రం వచ్చినదన్న విషయం
మరువరాదు

*చెప్పేటివి నీతులు సొచ్చేవి మరుగుదొడ్లు*
అన్నట్లు
నేడు కొన్ని దేశాలు శాంతి జపం చేస్తూనే
స్వార్ధంతో  యుద్ధ కాంక్షతో  వ్యాపారం దృష్ట్యా
ఉనికి కోసం ఎదుటి దేశాలను నామరూపాలు
లేకుండా చేస్తున్నాయి
సైనిక జననష్టం సంపదలను బూడిద చేస్తూ
ప్రకృతిని నాషణం చేస్తూ పర్యావరణాన్ని
కలుషితం చేస్తూ మేక పోతు గాంభీర్యంలా
*ద్వంద్వ వైఖరి* తో నటీస్తున్నాయి!

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక దేశం
యుద్దాలను రెచ్చగొడుతూ ఆయుదాలు
పంపిస్తూ వ్యాపారం చేస్తూ, నేనే యుద్ధాన్ని
ఆపివేశాను నా వల్లనే శాంతి ఏర్పడిందని
*నోబుల్ శాంతి బహుమతి*  కొరకు
పోటీ పడుతున్నారు
అందుకు కొన్ని దేశాలకు ప్రయోజనాలను
చేకూరుస్తున్నారు

భారత దేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ
శాంతి కాముక దేశం
భారత దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశమే అయినా
నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటుంది
కానీ ద్వంద్వ వైఖరి ఉండదు
శాంతి శంఖారావమే భారతదేశ ప్రధమ ధ్యేయం!
 

ఆశ జీవకోటి శ్వాస

శీర్షిక: ఆశ జీవకోటి శ్వాస

ప్రక్రియ: పద్యం

ఆ.వె:01
ఆశ  జీవకోటి శ్వాసనెప్పుడునైన
కోతికనియె కాదు నాతికైన
మరల దొరకవనియు యరటిపండ్లనుపట్టి
వానరము కదిలెను కానరనియు!

ఆ.వె:02
సాగు చుండె కోతి సాత్విక జంతువు
అందముగను నడిచి యడవిలోకి
పూటకొకటినంటు నోటను చేతుల్లో
అరటి పండ్లు పట్టి నాగకుండ! 

Sunday, June 29, 2025

సాఫ్ట్వేర్ ఉద్యోగులు

శీర్షిక: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు


కాలం మారుతోందనీ
కాలంతో మనం మారాలనీ
సోషల్ గా ఉండాలని పేర్లు పెట్టే పిలువాలనీ
వీకెండులు వాకెండులతో ప్రోగ్రాములతో
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను
గంగలో కలుపుతున్నాయి సాఫ్ట్వేర్ సంస్థలు!

పగలు రాత్రి అనకుండా
పండుగలు పబ్బాలు లేకుండా
ఆవులించను సమయం లేకుండా
భార్యా పిల్లలతో ప్రేమానురాగాలు లేకుండా
అమ్మా నాన్నలతో ఆప్యాయతలు లేకుండా
అరగంట గడుపలేని దుస్థితి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు!

రోజుకు పదహారుగంటల రేడియేషన్ వలన
*చిగురించని ఎండిన మోడు* లా
సంతాన లేమితో  బాధపడుతుంటే
అత్తవారింటి చుట్టుపక్కల వారి మాటలు
సూదులు గుచ్చినట్లు గుచ్చుకుంటుంటే
నరకమనుభవిస్తున్న జీవితాలు ఎన్నో మరెన్నో!

సాఫ్ట్వేర్ ఉద్యోగులనీ అధిక ప్యాకేజీలనీ
నీడ పట్టున ఉంటారనీ పెళ్ళిళ్ళు జరిపిస్తే
యేడాది తిరుగక ముందే విడాకులంటూ
లక్షలు కోట్ల రూపాయిలకు కేసులు పెట్టి
బ్లాక్ మెయిల్ చేసే సంఘటనలు ఇంకెన్నో!

బంధాలను రక్త సంబంధాలను దూరం చేసే
భార్యా భర్తలను పిల్లలను విడదీసే
ప్రాజెక్ట్ వర్కులతో బందీలను చేసే
గట్టిగా తుమ్ముతే ఊడే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
ఇక అప్పులు కట్టలేక నానా ఇబ్బందులు!

తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా
ఏడ్వ డానికి సహితం సమయం లేని
రోజుకు పదహారు గంటల పని దినాలతో
కృంగి కృశించి పోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు!

వేతనాలు ఎక్కువనేదీ నిజమే
కానీ ఉద్యోగం ఊడిన తరువాత
ఇక అప్పుల వాయిదాలు కట్టలేక
గొప్పలకు పిల్లలను ప్రయివేటు స్కూళ్ళలో 
జాయిన్ చేయిస్తే లక్షల ఫీజులు కట్టలేక 
వేరే ఏ పనీ చేయడం తెలియక
పెద్ద జీతాలు ఎత్తుకుని చిన్న జీతాలలో
ఇమడ లేక అడకత్తెరలో పోక చెక్కలా
బ్రతకడం నరకంగా మారి పోతూంది
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పని గంటలు తగ్గించాలి
రేడియేషన్ తగ్గించే టెక్నాలజీ ప్రవేశపెట్టాలి!

కవిత్వమంటే

 కవిత్వమంటే?

మానవత్వపు మాతృభాష కవిత్వం - కారల్ మార్క్స్ 

బాధ దుఃఖానికి పర్యాయ పదం కవిత్వం - శ్రీ శ్రీ 

ఉన్నతీకరించిన భావోద్వేగమే కవిత్వం 


మనం వ్రాసే కవులను మనమే 100 సార్లు ప్రశ్నించుకోవాలి. అప్పుడే నిజమైన కవిత్వం అమృతం వలె బయటకు వస్తుంది 

ఆపరేషన్ సిందూర్

అంశం: ఆపరేషన్ సిందూర్

ప్రక్రియ: పద్యాలు

శీర్షిక: ఆపరేషన్ సిందూర్

సీ.ప:
అందచందములతొ సుందర కశ్మీరు
మంచు కురుచుచుండు మానకుండ
పర్యటించు నచట పర్యాటకులునంత
ఉల్లములను దోచు చల్లగాలి
కురియును కాసులు కుంకుమ పూలతో
హాయిగ నుండగ యలుపు లేక
మంచు కొండలలోన మదపుటేనుగులోలె
ఉగ్రవాదులుజేరి నుసురు తీసె!

ఆ.వె:01
హిందువులను కాల్చె సింధువు సాక్షిగా
భార్యయెదుటనాడు భర్త తలను
తల్లిబిడ్డముందు తండ్రులతలలను
కాల్చె ఉగ్ర మూక కరుణ మరిచి!

ఆ.వె:02
మోడి రగిలి పోయె వాడివేడిగనుండి
సింధు జలమునాపె సంధివీడి
పక్క బుద్దిచెప్పె పాకిస్థనోడికి
అదిమి వేసె శత్రు నాటకాలు!

ఆ.వె:03
అబల సబల నంటు నబలల చేతనే
ఆపరేషనులతొ హతమార్చె
శత్రు సైన్యములను సంశయములులేక
సిందురమును దాల్చె, స్త్రీల నుదుట!
 

Saturday, June 28, 2025

పూరీ జగన్నాథ్ రథ యాత్ర

అంశం: జై జగన్నాధ


శీర్శిక: పూరీ జగన్నాథ్ రథ యాత్ర

భారత దేశం సంస్కృతి సాంప్రదాయాలకు
చతుర్వేదాలకు రామాయణ మహాభారత
భాగవతం ఇతిహాసాలకు పురాణాలకు
సనాతన ధర్మాలకు సృష్టి లోని చతుష్షష్టి
కళలకు పుట్టినిల్లు!

గుడులకు గోపురాలకు పుణ్యక్షేత్రాలకు
నదులు సముద్రాలు జలపాతాలకు
ప్రకృతి సంపదలకు సకల మతాలకు
నిలయం భారత దేశం!

ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో
నెలకొన్న జగన్నాథ్ పుణ్యక్షేత్రం
ఎంతో పవిత్రమైనది శ్రేష్టమైనదని
భక్తుల ప్రగాఢ విశ్వాసం నమ్మకం!


కృష్ణుడు బలరాముడు చెల్లెలు సుభద్ర
దేవతా మూర్తులను నాటి మహా రాజు
ప్రతిష్టించిన దివ్య క్షేత్రం జగన్నాథ్ పుణ్యక్షేత్రం
నేటికీ కనుల పండుగగా కళకళ లాడుతుంది!

ప్రతి యేటా ఆషాఢమాసం శుక్ల విదియ రోజున
జగన్నాథ్ రథ యాత్ర జరుగుతూ ఉంటుంది
కోట్లాది మంది భక్త జనం  *మనిమా...*
*జగన్నాధా..* అంటూ నినాదాలు చేస్తూ
జగన్నాథ రథ చక్ర త్రాడులను లాగుతూ
ఘణంగా ఉత్సవాలను నిర్వహిస్తారు
దేశవిదేశాల నుండి కోట్లాది భక్తులు పాల్గొంటారు!

 

ఆషాఢమాసంలో / గేయాలు

అంశం: బోనాల గేయాలు


శీర్షిక: ఆషాఢమాసంలో ఆనందాలతో

పల్లవి:
ఆషాఢమాసంలో ఆనందాలతో ...
జరుపుకుంటారు బోనాల పండుగ ...2
పిల్లలు పెద్దలు భక్తి శ్రద్ధలతో ....
చేసుకుంటారు బోనాలు నిండుగ...2    "ఆషాఢ"

చరణం:01
బోనాల పండుగ రోజుల్లో ....
జనులు పాలు బెల్లం బియ్యముతో ...2
నైవేద్యములను చేసేరు ....
ఎత్తేరు బోనాలు మొక్కేరు తల్లినీ....2     "ఆషాఢ"

చరణం:02
వరదలు రాకుండా ....
అంటురోగాలు ప్రభలకుండా ...2
ప్రజలను మూగజీవాలను కాపాడ..
బోనములను జేసెరు పురము నందు...2   "ఆషాఢ"

చరణం:03
గోలుకొండ లోన గొప్పగ బోనము...
మొదట యెత్తి జనులు ముదము నొందు ..2
పిదప భక్తు లంత కదముదొక్కుతుయు
జరుపు నుత్సవము జయము గలుగా... 2 "ఆషాఢ"

చరణం:04
పోతరాజులు తిరుగు చర్నకోలతో....
భక్తులు ఊగేరు కేకలు వేయుచు....2
కడవపై నిలబడి కన్య చెప్పు భవిష్యవాణి
మొక్కేరు జనులు తల్లి దీవెనల కొరకు...2  "ఆషాఢ"

పద్యం/ ఆషాఢమాసం విశిష్టత

 శీర్షిక: ఆషాఢమాసం విశిష్టత


సీస మాళిక:

మాసములందున మహినవిశిష్టత
గొప్పనైన నెలగ మెప్పు పొంది
విశ్వాన జనులకు విశ్వాసమున్నట్టి
ఆషాఢమాసము నరుదయినది
వర్షాల వలననే వరదలు పొంగేను
అంటురోగములెన్నొ నంటుకొనును
నూతన వధువులు మాతపితలజేరు
బోనాల పండుగ బూరెగారె
పిండితో వంటలు మెండుగ వండేరు
మౌనంగ జేసేరు బోనములను
జలముతో రైతుకు పొలమందు పండుగ
చక్కని ధాన్యము సరస ధరలు
పూరీ రథముయాత్ర పుడమిలో యాషాడ
మాసమందు జరుగు మధురముగను!

ఆ.వె:01
కాకతీయులపుడు కాకతీ దేవిని
పూజ చేసి వరము పొందె ననిరి
అంటురోగముళ్ళు నంటకుండనపుడు
బోనములను జేసె పురము నందు!

ఆ.వె:02
గోలుకొండ లోన గొప్పగ బోనము
మొదట యెత్తి జనులు ముదము నొందు
పిదప భక్తు లంత కదముదొక్కుతునేమి
జరుపు నుత్సవములు జయము గలుగ!

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

నచ్చిన ప్రదేశం రోతాంగ్ పాస్

*నేటి అంశం*నచ్చిన ప్రదేశం*


శీర్షిక: సిమ్లా, రోతంగ్ పాస్ ప్రదేశం
(వృత్యానుపాస అలంకారాలు)

ఆకాశంలో తారలు మినుకు మినుకు
మంటూ మెరుస్తున్నాయి.
వాతావరణం చల్ల చల్లగా ఉంది.
ఆకాశ విహాంగంలో డిల్లీ
అక్కడి నుండి మినీ బస్సులో *సిమ్లా*!

అది ఏడువేల అడుగల ఎత్తున ఉన్న చల్లని ప్రదేశం *సిమ్లా*
ఇటు అటు ఎటూ చూసినా లోయలు ఎత్తైన తరువులు
ఎప్పుడు పడిపోతాయో అన్నట్లు అక్కడక్కడా ఇండ్లు!

*కుర్ఫీ* అందమైన ప్రదేశం మనుషులు నడువలేని పరిస్థితి
చుట్టూరా లోయలు రాళ్ళు రప్పలు పొడుగాటి వృక్షాలు
గుర్రాల పైన కూర్చుని వెళ్ళక తప్పదు ఎవరికైనా
పిల్లలకు పెద్దలకు ఆహ్లాదాన్నిచ్చే  రోప్ రైడింగ్ లు
కుందేళ్ళు జడల బర్రెలు కనువిందు చేయు!

హిమాచల్ ప్రదేశ్ లోని *మనాలి* ఉలన్ బట్టలకు పెట్టింది పేరు
*మనాలి* లోని భీముని భార్య హిడింబి దేవాలయం
మహాద్భుతం 
చల్లని ప్రదేశం విస్తారమైన దేవదారు వృక్షాలు
వానరులు
చుట్టూరా దగదగ మెరిసే మంచు కొండలు చూడదగిన ప్రదేశం!

కొన్ని కిలోమీటర్ల దూరంలో *రోతంగ్ పాస్* మంచు గడ్డల ప్రాంతం
ఎత్తైన ప్రదేశం సన్నని దారులు ఎటూ చూసినా లోయలు
ప్రాణం అరిచేతిలోనే పెట్టుకుని బయలు దేరాలి!

అవి చల్లని తెల్లని మంచు కొండలు
మంచు గడ్డలపై ఆడుతుంటే జారి జారి బొర్లి బొర్లి
పడుతుంటే
ప్రక్కనే ఉన్న *బియాస్* నదిలో చేతులు పెడుతుంటే
ఆ అనుభూతి ఆనందం చెప్పనలవి కాదు అనభవించడం  తప్పా
జీవితంలో ఒక్కసారైనా సకుటుంబంతో చూడదగ్గ ప్రదేశం *రోతాంగ్ పాస్*!

Friday, June 27, 2025

శ్రీ కృష్ణుడి లీలలు (బాల గేయాలు)

 బాల గేయాలు 

శీర్షిక: శ్రీకృష్ణుడి లీలలు

(ప్రక్రియ: మణిపూసలు)

ఆబాల గోపాలుడు
చిలిపితనంబు బాలుడు
లోకకళ్యానమునకై
అవతరించిన పురుషుడు

మేనమామైన కంసుడు
పరమ నీచుడు రాక్షసుడు
అల్లుడు గండమనితలిచి
దేవకిని బంధించాడు

దేవకి వసుదేవ సుతుడు
అష్టమీ తిథిన కృష్ణుడు
కఠిన కారాగారమున
జన్మించె శ్రీకృష్ణుడు

అన్న బలరాముడితో
తనమిత్రబృంధముతో
వెన్నముద్ద దొంగిలించె
యశోదమ్మ రాకతో

పెంచెను యశోదనందుడు
పెరిగెను ముద్దుగ కృష్ణుడు
గోపికల ఏడిపించను
చీరెలెత్తుకెల్లె వాడు

పూతకిని హతం చేసి
కంసుని ఖండించేసి
దేవతల రక్షిస్తివి
శిశుపాలుని చంపేసి

ఎన్నెన్నో  నీలీలల
పొగడేదెలాగోపాల
వందే ఓ జగద్గురూ
ఈ సృష్టంత నీలీల!

ప్రజా స్వామ్య ప్రతిధ్వని

అంశం: ప్రజా స్వామ్య ప్రతిధ్వని


శీర్శిక: *ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పాలన*
*విధించాలి*

*పైన పటారం లోన లొటారం* అన్నట్లుగా
పేరుకే ప్రజాస్వామ్యం లోన అంతా నేతల స్వామ్యమే!

ఆదర్శమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం గల దేశం
జనాభాలో రెండవ అతి పెద్ద దేశం
సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు అద్దం!

భిన్నత్వంలో ఏకత్వంలా
విభిన్న మతాలు అనేక కులాలు భాషలు
ఎన్నోరకాల సంస్కృతి సాంప్రదాయాలతో
కలిసి మెలసి అన్యోన్యంగా జీవిస్తారు!

నేడు భారత దేశంలో ప్రజాస్వామ్యం
రోజు రోజుకు అపహాస్యం పాలవుతుంది
అప్రజాస్వామ్యం చాపకింద నీరులా
క్రమ క్రమేణా దేశమంతా విస్తరిస్తుంది!

లౌకిక రాజ్యమైన ప్రజాస్వామ్య  దేశంలో
రాజ్యాంగ వ్యవస్థలు చట్టాలు ఉన్నాయి
రక్షక భటుల యంత్రాంగం ఉంది
కానీ, చట్టాలు ధనవంతుల చుట్టాలుగా
రక్షక భటులు నేతలకు రక్షకులుగా మారారు
*నేడు దుడ్టున్నోడిదే బర్రె*
*ధనం ఉన్నోడిదే మంచి గుణం* అవుతుంది!

రాజ్యాంగంలో అన్ని మతాలు కులాలు
అందరూ సమానమే అయినా
వాస్తవంలో మతాలను కులాలను బట్టి
ఓటు బ్యాంకు రాజకీయాలతో 
భూస్వాములైననూ భూకబ్జా దారులైనా
పన్నుల మినహాయింపులు రైతు బంధు పధకాలు 
ధనికులైనా సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు!

ప్రశ్నించే స్వేచ్ఛ ఓటు వేసే స్వేచ్ఛ లేదు
పనిచేసే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ లేదు!

అందుకే 
ధనవంతులు మరింతగా ధనవంతులుగాను 
పేద వారు మరింత పేదలవుతున్నారు
ఉచితాలను ఆశించకుండా 
యువతలో ప్రశ్నించే శక్తి పెరుగుతే 
ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం జరుగుతుంది 
*ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పాలన*
*రాష్ట్రాలలో దేశంలో విధిస్తే* 
దేశంలో అవినీతి పాలన అంతం అవుతుంది 
 

Thursday, June 26, 2025

ధర్మ కవచం

అంశం: ధర్మ కవచం


శీర్శిక: *మనిషి నీతి నిజాయితే ధర్మ కవచం*

గొడుగును మనం కాపాడుకుంటే
వర్షం బారినుండి ఎండ బారినుండి
గొడుగు మనలను కాపాడుతుంది
ధర్మ కవచం అలానే ధర్మాన్ని రక్షిస్తే!

ధర్మమేమీ బ్రహ్మ విద్య కాదు
అదేమీ అదృశ్య శక్తీ కాదు
కొనడానికి అమ్మడానికి మార్కెట్లు లేవు
కొనడానికి అమ్మడానికి మనుష్యులు లేరు!

ధర్మం అనేది ఒక రక్షణ నియమం
మానవులు ప్రశాంతంగా జీవించడానికి
జీవకోటిని విశ్వాన్ని ప్రకృతిని రక్షించడానికి
ప్రజలే ఏర్పరుచుకున్న నియమమే రక్షణ కవచం!

ఖడ్గానికి వర ఎలాగో ధర్మానికి కవచం అలానే 
రెండు వైపులా పదునైన ఖడ్గం ఎలాగో 
రెండు వైపులా పదునైన ధర్మం అలాగే 
"యదా రాజా తధా ప్రజా" అన్నట్లు 
రాజు ధర్మ పాలకుడైతే ప్రజలు ధర్మాన్నే పాటిస్తారు
రాజు అధర్మ పాలకుడైతే ప్రజలు అధర్మాన్నే 
పాటిస్తారు!

నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్లు
మనం నీతిగా నిజాయితీగా ధర్మ బద్ధంగా
నిస్వార్థంగా ఆశ్రిత పక్షపాతం లేకుండా
క్రమశిక్షణతో మాట తప్పకుండా
అబద్ధాలు మాట్లాడకుండా సత్యమే పలుకుతూ
అహం ఈర్ష్య అసూయ లేకుండా
దానధర్మాలు సేవలు చేయడం
సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ
కర్మలు చేయడమే ధర్మం!

ఇలా ధర్మాన్ని పాటించినను ఆ ధర్మమే
మానవులకు రక్షణ కవచంగా నిలుస్తుంది
అందుకే *ధర్మో రక్షతి రక్షితః* అంటారు పెద్దలు
ధర్మాన్ని జనం రక్షిస్తే ధర్మం జనాల్ని రక్షిస్తుంది
మనిషి నీతి నిజాయితియే అతని ధర్మ కవచం!
 

ఖండగతి గజల్ 5555

అంశం:గజల్  (20 మాత్రలు 5+5+5+5)


ఖండగతి గజల్

కొలనులో తామరలు *పెరుగడం అందుకే*
మామపై నిశిలోన *మురువడం అందుకే*

విరబూసి కమలాలు ఊగాయి నీటిలో
మన్మధుడి రాకకై *అలుగడం అందుకే*

తుమ్మెదలు పుప్పొడికి తిరుగాడు పూలపై
కలువలకు దగ్గరగ *ఎగరడం అందుకే*

బురుదలో పుట్టినను గుమగుమలు అదిరినే
గుడిలోకి పుష్పాలు *తేవడం అందుకే*

కృష్ణుడికి తామరలు ఎంతనో ప్రీతిగా
విష్ణువుకు కమలాలు *పెట్టడం అందుకే*

తెలుగు గజల్ -2

అంశం:ఖండగతి గజల్  (20 మాత్రలు 5+5+5+5)


కొలనులో తామరలు *పెరుగడం అందుకే*
మామపై నిశిలోన *మురువడం అందుకే*

విరబూసి కమలాలు ఊగాయి నీటిలో
మన్మధుడి రాకకై *అలుగడం అందుకే*

తుమ్మెదలు పుప్పొడికి తిరుగాడు పూలపై
కలువలకు దగ్గరగ *ఎగరడం అందుకే*

బురుదలో పుట్టినను గుమగుమలు అదిరినే
గుడిలోకి పుష్పాలు *తేవడం అందుకే*

కృష్ణుడికి తామరలు ఎంతనో ప్రీతిగా
విష్ణువుకు కమలాలు *పెట్టడం అందుకే*
 

Wednesday, June 25, 2025

గజల్స్ లక్షణాలు

సేకరణ:

*గజల్ కి శీర్షిక ఉండదు. కాబట్టి శీర్షిక అని ఎవరూ పెట్టవద్దని ప్రార్థన.* 


ఖండగతి  గురించి సంక్షిప్తంగా:

ఖండగతి : ఐదేసి మాత్రల గతిలో నడిచే ఛందస్సు. 

అంటే పాదానికి 20 మాత్రలు ఉంటాయి. 

చిన్న పాదాలలో మన భావాలను చెప్పలేకపోతున్నట్లుగా 

అనిపిస్తే 30 లేదా 40 మాత్రలతో కూడా వ్రాసుకోవచ్చు. 

గజల్ పూరణంలో ఖండగతిలో గజల్ :

ప్రతీ మిస్రాలో( పాదంలో)  (5 5 5 5)  20 మాత్రలుండాలి. 

మీరు తీసుకొనే పదబంధం 5 కంటే ఎక్కువగానీ, 

తక్కువగానీ ఉన్నప్పుడు పక్కనున్న పదాలతో కలిపితే లయ సరిపోవాలి. 

మీరు వ్రాసే 20 మాత్రల మిస్రాలో తీసుకున్న పదాలన్నీ లయాత్మకంగా ఉండాలి 

*నమూనా మత్లా:* 

*రాధికను మాధవుడు మరువడం సాధ్యమా* 

*ప్రేయసికి  వీడ్కోలు పలకడం సాధ్యమా*

*నమూనా శేర్:*  

*వడిలేని జాములను కదపలేకున్నాను* 

*రాత్రులను కనులతో మోయడం సాధ్యమా*

మీరు వ్రాసే గజళ్ళలో

*రదీఫ్* :  నేను ఇచ్చిన రదీఫ్ తీసుకోవచ్చు.లేదా...  బాగుంది, కష్టమే, ఇష్టమే, సాధ్యమే, సాధ్యమా, ఎందుకో ... ఇలాంటి రదీఫ్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు తీసుకున్న రదీఫ్... మీరు వ్రాసిన భావాలకు, కాఫియాలకు సరిపోవాలనేది గమనించాల్సిన విషయం. 

*కాఫియాలు* :  చివరి అక్షరం *డం* ఉండాలి. దానికి ముందున్న అక్షరం ఏది తీసుకున్నా అచ్చు మాత్రం *అ* ఉండాలి   

ఉదాహరణకి గెలవడం, ఓడడం, కోరడం, ఉండడం, రాయడం, వెళ్ళడం, జారడం, మీరడం, ఇలా ఎన్నో వస్తాయి.  

వీలైనంతలో ఎవరైనా పోస్ట్ చేసినవి తీసుకొని వ్రాయకుండా, భిన్నమైనవి తీసుకొనేందుకు ప్రయత్నించండి. 


ముఖ్యమైన సూచన : మీరు వ్రాసిన శేర్లలో వస్తువైవిధ్యాన్ని చూపేలా శేర్లు ఉండాలి. 

నవరసాలలోని ఏ రసాన్నైనా ఏ శేర్లోనైనా 

తీసుకోవచ్చు. 

చమత్కారయుక్తమైన శేర్లు వ్రాయడానికి ప్రయత్నించండి. 

ప్రతీ శేర్లోనూ గజలియత్ ( రెండు పాదాలకీ చదువరి ఊహించని సమన్వయాన్ని సాధించడమే గజలియత్ అంటే ) ఉండేలా చూసుకోండి నియమాలు ఒకటికి రెండుసార్లు చదివాక దోషరహితంగా మీ గజళ్ళు వ్రాయండి.

మీకు నచ్చిన గజళ్లకు ఎమోజీలా ద్వారా మెచ్చుకోవచ్చు. 

మత్లా, మక్తా, కనీసం 3 శేర్లు ( మొత్తం 10 పాదాలు ) వ్రాయండి.  మత్లా, మక్తా, 5 శేర్లు - మొత్తం 14 పాదాలు కూడా వ్రాయవచ్చు.  

అన్నింటికంటే ముఖమైన సూచన : ఒకటికి రెండుసార్లు నియామాలు చదువుకొని మాత్రమే మీ గజల్ వ్రాయడం మొదలుపెట్టండి. దయచేసి సగంసగం చదివి వ్రాయకండి.

నియమాల ప్రకారం మాత్రమే గజల్ వ్రాయాలి. 



పెళ్ళంటే నూరేళ్ళ పంట

 అంశం:పదాల కవిత

(ఆవేదన, స్వయం కృతం, ప్రాణం, శిక్ష, లిపి, విరామం, కాగితాలు)

శీర్షిక: *పెళ్ళంటే నూరేళ్ళ పంట*

*పెళ్ళంటే నూరేళ్ళ పంట*
*పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగు తాయి*
అంటారు పెద్దలు
వివాహం చేసుకునే ముందు ఒకరినొకరు
చూసుకోవాలి మాట్లాడు కోవాలి
జాతకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా
మనస్థత్వాలు భావాలు ఆలోచనలు
కలిసాకనే పెళ్లి చేసుకోవాలి
అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి
కీడెంచి మేలెంచాలి  ఇక ఆ తరువాత
కష్టమో నష్టమో నూరేళ్ళు కలిసి జీవించాలి!

పెళ్ళైయ్యాక నెలకే అత్త ఆడిబిడ్డలు మరుదులు
కసురు కుంటున్నారనీ భర్త బాదుతున్నాడనీ
*ఆవేదన* చెందుతే ఎలా?

ముందే మంచి చెడులు చూసు కోకుండా
మోహాన్ని ప్రేమ అనుకుని
అందం శాశ్వతమనుకుని
డబ్బే అన్నిటికీ మూలం అనుకుని
ఇప్పుడు బాధపడటం *స్వయంకృతమే* గా!

మోహం కళ్ళకు బైర్లు కమ్మి నప్పుడు
నా దేవుడు నా *ప్రాణం* అనుకుంటూ
జీవితం సర్వస్వం సమర్పించి
*చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే*
ప్రయోజనం ఏమిటి?
*శిక్ష* అనుభవించక తప్పదు!

చివరికి మిగిలేది *లిపి* లేని మౌన రోధనే
చేసిన తప్పులను సరి చేసుకోడానికి
ఆలోచించుకోడానికి *విరామం* సహితం
లభించక పోవచ్చు
ఎందుకంటే *కాగితాలు* పట్టుకుని
కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా!

విద్య విలువ

 అంశం: విద్య విలువ


శీర్శిక: *సంస్కార వంతమైన విద్యై ఉండాలి*

*విద్య లేని వాడు వింత పశువు* అన్నారు
పూర్వం మన పెద్దలు

ఈ తెలుగు నానుడితో విద్య విలువ ఎంతనో
చెప్పకనే చెబుతోంది మన భారతీయ సంస్కృతి
మనిషికి విద్య తోనే విలువ విద్య తోనే గౌరవం
విద్యతోనే గుర్తింపు విద్యతోనే జ్ఞానం సిద్ధిస్తుంది!

విద్య వలన గత చరిత్రలను తెలుసుకోవచ్చు
రేపటి తరాల అభివృద్ధికి అందించ వచ్చు
గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయవచ్చు
దొంగిలించ బడనిది డబ్బు సంపాదించ కలిగేది
విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు!

విద్య వలన వినయం అలవడుతుంది
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది
విద్య సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తుంది
దానల్లో కెల్లా విద్య దానం ఎంతో గొప్పనైనది!

విద్య నేడు కొత్త పుంతలు తొక్కుతోంది
*విద్య లేని వాడు వింత పశువు నాడు*
*విద్య ఉన్న వాడు వింత కసువు నేడు*
*అతి తెలివి కొంపకు చేటు* అన్నట్లు
విద్య పెరిగిన కొలది సాంకేతిక విజ్ఞానం
పెరిగిన కొలది మనిషి కసువై పోతున్నాడు
అదే విద్య వలన తెల్ల వార్లు లేచిన దగ్గర్నుంచి
నిద్ర పోయే వరకు ఎవరిని మోసం చేయాలి
ఎలా మోసం చేయాలి ఎక్కడ మోసం చేయాలి
అనే విషయమే ఆలోచిస్తున్నాడు
మొదట నమ్మకాన్ని పెంచుకుంటున్నారు
ఆ తర్వాత అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు
ఇందులో ఎవరూ తీసి పోలేదు
అతిగా విద్య నేర్చిన వారి ఆయుధాలు
అనుభవం పొందిన వారి ఆయుధాలు
ఎదుటి వారి నమ్మకాలు బలహీనతలు

అతి విద్య వలన డబ్బు బాగా సంపాదించినా
విలువైన ప్రేమలు ఆప్యాయతలు రక్త బంధాలు
పెద్దలను గౌరవించడం మరిచి పోతున్నారు
వాయివరుసలు మరుస్తున్నారు
నీతి నిజాయితీ సత్యం ధర్మాన్ని తుంగలో తొక్కి
మోసం, హింస, యుద్ధాలకు పాల్పడుతున్నారు
*విద్యసంస్కారవంతమైన విద్యై ఉండాలి*
*విద్య తనకు సమాజ హితానికి తోడ్పడాలి*!

సామెతలు అనుభవ పాఠాలు

*సామెతల కవిత*
*1చక్కనమ్మ చిక్కినా అందమే* 
*2బూడిద లో పోసిన పన్నీరు*

శీర్షిక: సామెతలు అనుభవ పాఠాలు 

నిశి రాత్రి ఆకాశంలో పున్నమి చంద్రుడు 
మబ్బులు అడ్డు వచ్చినా అందంగానే కనపడినట్లు 
అందమైన ఆమని ఒత్తుగా బొద్దుగా ఉండి 
అనారోగ్యం కారణంగానో శ్రమ రందులవలనో
వయసు మీద పడుతుండటం వలననో 
సన్న బడినా  *చక్కనమ్మ చిక్కినా అందమే*  ఉంటుంది 

బాహ్యా అందం తెలుపు మేను ముఖ వర్చస్సు 
కన్నులు ముక్కు కురులు శరీర సౌష్టవం
ఆహార్యం అనేవి తాత్కాలికం అశాశ్వతం 

అంతర్య అందం మంచి మనసు దయ కరుణ 
మంచి మాటలు నడవడిక వ్యక్తిత్వం 
శాశ్వతమైనవి విలువైనవి చక్కని గుర్తింపు 
కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతవి 


అబ్దుల్ కలామ్ గారు అంటారు ఎప్పుడూ 
*కలలు కనాలి సాకారం చేసుకోవాలి* అని 
కలలు కనడం  ఊహల్లో తేలిపోవడం 
చాలా సులభం కానీ సాకారం చేసుకోవాలంటే 
సంకల్పం పట్టదల నిరంతర సాధన 
శ్రమ సంబంధించిన సమాచారం సేకరించడం 
నిపుణులను కలిసి సలహాలు తీసుకోవడం 
నిర్ణయాలు తీసుకోవడం జరుగాలి 
మధ్యలోనే పనిని ఆపకూడదు 
అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరడం 
విజయం సాధించడం సులభమవుతుంది 

లేదంటే  అప్పటి వరకు పడిన శ్రమ అంతా 
*బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది*
మధ్యలో నిరుత్సాహంతో పనిని ఆపేసినట్లైతే
ఇప్పటివరకు పడిన శ్రమంతయు నిష్ఫలం 
అవుతుందనేది దీని భావం 
ఒక వేళ ప్రాజెక్టు పనులు నిర్మాణాలు అవుతే 
ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతారు 
అనేది దీని అర్థం 

స్వాంతనకు సాధనం కన్నీరే

అంశం ద్విపాదపూరణ

శీర్షిక :స్వాంతనకు సాధనం కన్నీరే

*ఇచ్చిన వాక్యం : కన్నీటి చెలమను ఎంత తోడినా ఎప్పటికీ ఎండిపోదు, ఎందుకంటే*

1) *అనుమానంలు అవమానాలతో శరీరం మనసు కృంగి కృశించి పోతున్నాయి కాబట్టి*

2) *ఆత్మీయ బంధాల వేదనల భావోద్వేగాలను అదుపు చేయలేము కాబట్టి*

3) *కడుపులోని మనసులోని బాధలను తగ్గించుకోడానికి స్వాంతనకు వేరేమార్గం లేదుకాబట్టి*
 

Tuesday, June 24, 2025

ఓడ దాటే దాకా ఓడ మల్లన్న ఓడ దాటాక బోడి మల్లన్న

 *అంశం*- *వాక్య కవిత*
*ఎదురుగా పొగడ్తలు వెనుక అసూయపు మాటలు* 

శీర్షిక: *ఓడ దాటే దాకా ఓడ మల్లన్న* 

శిశువు పుట్టడమే ఆకలితో 
అందుకే జన్మించగానే తే.. తే..అని ఏడుస్తాడు  మనిషి ఆశా జీవి ఆశ అనేది అతని శ్వాస 
వయసు పెరుగుతున్న కొద్దీ స్వార్ధం పెరుగుతుంది! 

ఆశలు కోరికలు అవసరాలు స్వార్ధానికి దారితీస్తే "అవకాశాలు" స్వార్ధాన్ని సఫలీకృతం చేయడంలో  కృతకృత్యమవుతాయి! ఆ "అవకాశాలు" అనేవి సమాజం కావచ్చు  ఎదురుగా ఉన్న తోటి మనుషులు కావచ్చు  సులభంగా లభించే డబ్బు కావచ్చు  ప్రభుత్వ విధానాలు చట్టాలు కావచ్చు!

మనిషి తన స్వార్ధ పూరితమైన కోరికలు పదవులు గెలుపులు పనులు సునాయాసంగా   నెరవేరడానికి ఎదురుగా వారిని పొగుడుతారు  పని పూర్తి కాగానే వెనుకాల తెగుడుతారు! 

అందుకే పుట్టింది ఒక తెలుగు సామెత కాబోలు  *ఓడ దాటే దాకా ఓడ మల్లన్న ఓడ దాటాక* *బోడి మల్లన్న* అని   

ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేముందు  మల్లన్న గొప్ప నిపుణుడు, ఓడను బాగా  తోలుతాడు అని ఎదురుగా మెచ్చుకుని 
నదిని దాటాక, మల్లన్న దేముంది బోడి, నేనే సలహాలు ఇస్తుంటేనే తెడ్డును తిప్పాడు 
అతనికి ఓడ నడుపడమే రాదని వెనుకాల  ఇతరులకు చెబుతూ తులనాడుతాడు! 

అందరూ ఇలాగే ఉంటారా అంటే,  కాదు,అందరు అలానే ఉండరు అనే చెప్పాలి  మానసిక పరిపక్వత చెందని వారు  స్వార్థం అసూయ అహం తలకెక్కిన వారు  పదవుల కోసం రాజకీయ నాయకులు  పరిస్థితుల ప్రభావం చేత కొందరు ఇలా ఉంటారు 

వ్యక్తిత్వం గలవారు ఆధ్యాత్మిక వేత్తలు 
భగవద్గీత సంపూర్ణంగా చదివిన వారికి 
ఎలాంటి స్వార్ధం ఈర్ష్య అసూయలు అహం సంకుచిత బుద్దులు కుల్లు కుతంత్రాలు దరిచేరవు  ఉదా: రామకృష్ణ పరమహంస గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద మరెంతో మంది గలరు!  

ప్రేరణ ఒక గొప్ప అనుభూతి

అంశం: ప్రేరణ పాఠం


శీర్శిక: *ప్రేరణ ఒక గొప్ప అనుభూతి*

ప్రేరణ మనిషికి ఉత్సాహం
ప్రేరణ అతని ఉన్నతికి ప్రోత్సాహం
ప్రేరణ ఎవరికీ కనిపించని దృశ్యం
ప్రేరణ మనసులో మెరిసే కాంతి పుంజం!

పంచేంద్రియాలు ప్రేరణకు మూలం
కనులతో చూసినప్పుడు గానీ
చెవులతో విన్నప్పుడు గానీ
ముక్కుతో వాసన పసిగట్టి నప్పుడు గానీ!

నాలుకతో రుచి చూసి నప్పుడు గానీ
చర్మంతో స్పర్శ తెలుసుకున్నప్పుడు గానీ
మెరుపులా కాంతిలా మనసులో జనిస్తుంది
ప్రేరణ తళుక్కున మేఘాల్లో మెరిసే మెరుపు!

ప్రేరణ మనిషికి ఒక పాఠం
ప్రేరణ ఆలోచనలను రేకెత్తించే అనుభూతి
మనుషులను ముందుకు నడిపించే గురువు
శక్తి సామర్థ్యాలను బలోపేతం చేసే భావన!

ప్రేరణ తల్లిదండ్రుల నుండి గురువుల నుండి
ప్రకృతి నుండి పుస్తకాలు చదువడం వలన
మంచి స్నేహితుల వలన సంఘటనల వలన
జీన్స్ వలన కలుగ వచ్చు!

ప్రేరణ ఎలా కలిగినా ఎప్పుడు కలిగినా
ఎక్కడ కలిగినా అందుకు మూల కారణం
పంచేంద్రియాలే
మెదడుకు సంకేతాలు అందిన తక్షణమే
మెరుపులా ప్రేరణ స్ఫురిస్తుంది
*ప్రేరణ ఒక గొప్ప అనుభూతి*!

 

ఆవు ప్రాణదాత

 శీర్షిక: *ఆవు ప్రాణదాత*


ఆవు ఆరాధ్య దేవత
ఆవు జనులకు గోమాత
పాలు ఇచ్చును గోమాత
ఆవు మనకు ప్రాణదాత!

గోవులను మ్రొక్కిన చాలు
కలుగును ఎంతయో మేలు
తెలుపు నలుపుల్లొ ఆవులు
నిద్రిస్తుండును మాపులు!

పాల నుండి పెరుగును వచ్చును
పెరుగు నుండి వెన్నయు వచ్చును
వెన్న నుండి నెయ్యియు వచ్చును
నెయ్యి అమ్మిన డబ్బు వచ్చును!

గోమాత పేడతో గోముగ పిడకలు
పాలతోని నెయ్యితోని పానకములు
చేసియు పలుపూజలు చేసేరు జనులు
గోమాత ఇచ్చును జనులకు వరాలు!

పిడికెడు తవుడు పెట్టిన చాలు

ఆవునందు సమస్త  ఆరాద్యులుందురు
ఆవును  జనులెల్ల  అమ్మగా  భావించి
నిత్యము కొలుతురు నిలన  చూడు
గోమాత పేడతో  గోముగా పిడకలు
పాలతో  నెయ్యియు  పాన కంబు
చేసియు పూజలు చేసెదరుజనులు
ఆవు నరులకు దేవత   అన్న ఎద్దు
గోవుల విశిష్టత  
గోవును సేవించి  గోపాలుడైనాడు
గోమాత  నిచ్చును  గోము పాలు
భారతీయులు నిల  పిలిచెదరుగ  
గోవులు  పవిత్రత నెల్లరు గొప్ప ననిరి
గోవు భారతీయులయొక్క  గోపురంబు
ఆవు ఆరాధ్య దేవత అవని యందు
పాలు యిచ్చును మూత్రము పాల వోలె
సేవనంబు చేసేరులే    శీతలమున   

ఆవు ఆరాధ్య దేవత/ గేయం

అంశం: ఆవు చిత్రం గేయాలు


శీర్షిక: *ఆవు ఆరాధ్య దేవత*


ఆవు ఆరాధ్య దేవత
ఆవు జనులకు గోమాత
పాలు ఇచ్చును గోమాత
ఆవు మనకు ప్రాణదాత!

గోవులను మ్రొక్కిన చాలు
కలుగును ఎంతయో మేలు
తెలుపు నలుపుల్లొ ఆవులు
నిద్రిస్తుండును మాపులు!

పాల నుండి పెరుగును వచ్చును
పెరుగు నుండి వెన్నయు వచ్చును
వెన్న నుండి నెయ్యియు వచ్చును
నెయ్యి అమ్మిన డబ్బు వచ్చును!

గోమాత పేడతో గోముగ పిడకలు
పాలతోని నెయ్యితోని పానకములు
చేసియు పలుపూజలు చేసేరు జనులు
గోమాత ఇచ్చును జనులకు వరాలు!

ప్రాణ దాతలు డాక్టర్లు

 శీర్షిక: ప్రాణ దాతలు డాక్టర్లు 


వైద్యులు దేవుళ్ళతో సమానం
దేవుళ్ళు శిశువుకు జన్మను ప్రసాదిస్తే
పునర్జన్మను ఇచ్చే వారు వైద్యులు
అందుకే వైద్యుడిని అంటారు
*వైద్యో నారాయణ హరి* ఆని

"వైద్యో నారాయణ హరి" అనేది
ఒక ప్రసిద్ధ తెలుగు సామెత
వైద్యుల గొప్ప తనాన్ని గొప్ప నిస్వార్థ సేవలను గుర్తు చేస్తుంది...
వైద్యులు రోగులకు వైద్యం చేసి ప్రాణాలను కాపాడుతారు...
కంటికి రెప్పలా వెన్నంటి ఉంటూ నిత్యం సేవలందిస్తారు...
అందుకే వైద్యుడిని దేవుడితో పోల్చుతారు..

ఈ సామెత యొక్క వెనుక ఉన్న భావన...
వైద్యులు తమ వృత్తిలో దేవుడితో సమానంగా
సేవ చేస్తున్నారని...
దేవుడు ఒక్క క్షణంలో ప్రాణాన్నిస్తే  వైద్యులు నూరేళ్ళు ప్రాణ దాతలు...
అందుకే  వైద్యుడిని, విష్ణువు మరో పేరైన *నారాయణుని* వలె కీర్తిస్తారు...

దేవుడిని డాక్టర్లతో సహా కొందరు ప్రజలు
నమ్ముతారు మరికొందరు నమ్మరు...
కానీ వైద్యుడిని నమ్మని ప్రజలు ఈ జగత్తులో లేరు..
డాక్టరు రోగులకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు , దేవుడు కనబడడు...
అందుకే వైద్యుడిని దేవుడి కంటే మిన్నగా భావిస్తారు..

బ్రహ్మ మనిషి  కర్మలను ఆయుష్షును
ముందే తలమీద వ్రాయవచ్చు గాక
కానీ మనిషి కర్మల వలన కలిగే రోగాలను
జబ్బులను పసిగట్టి బాగు చేసి
ఆయుష్షు పెంచే *ప్రాణదాతలు డాక్టర్లు*

వైద్యుడు ప్రత్యక్ష దైవం దేవుడు పరోక్ష దైవం
వైద్యులు  సైనికులు  సైనికులు యుద్ధ వీరులు
సైనికులకు  బార్డర్ లో నిద్రాహారాలుండవు
వైద్యులకు దేశంలోపల నిద్రాహారాలుండవు
సైనికుల అస్త్రశస్త్రాలు బాంబులు డ్రోన్లైతే
వైద్యుల అస్త్రశస్త్రాలు మందులు ఆపరేషన్లు
సైనికులు యావత్ భారత దేశ రక్షకులైతే
వైద్యులు మనుష్యుల ప్రాణ రక్షకులు!

వైద్యులు కనిపించే దైవాలు దేవుళ్ళు కనిపించని దైవాలు!
అందుకే అంటారు *వైద్యో నారాయణ హరి* అని
అందుకే దేవుడిని పూజిస్తారు వైద్యుడిని గౌరవిస్తారు!

Monday, June 23, 2025

కలల కాలం

*నేటి అంశం*-* *పదాల కవిత*
*మబ్బుల్లో చందమామ* *వెన్నెల్లో గోదారమ్మ*
*మధుర స్వప్నం* *కలల కాలం*

శీర్షిక: *కలల కాలం*

అది గ్రీష్మ ఋతువు జ్యేష్ట మాసము శుక్ల పక్షం 
నిండు పున్నమి రోజున నీలి ఆకాశంలో 
చల్లని * మబ్బుల్లో చందమామ* పయనిస్తోంది 
ప్రకృతి నంతయు పరవసించి పోతుంది !

*వెన్నెల్లో గోదారమ్మ* వంపులు తిరుగుతూ 
వయ్యారాలు ఒలకబోస్తూ రైతుల సాగు నీటిని 
జనుల దాహార్తిని తీర్చుకుంటూ నిర్మలంగా
నిశ్చలంగా  ప్రవహిస్తుంది నిండు గర్భిణిలా!

పిండి వెన్నెలలో ఆకాశంలో చందమామ 
చల్లని చూపులకు కొలనులో సిగ్గుతో కలువ భామ 
ఎరుపెక్కిన పూబుగ్గలపై మెరుస్తున్న తేమ 
అరవిరిసిన మోముతో  *మధుర స్వప్నం* లో భామ!

ఝరులు తరువులు అందాల కొలనులు 
ప్రకృతి వనరులు చెరువులు పచ్చని పైరులు 
మేఘామృత వర్షాలు వాగులు వంకలు 
జలపాతాలతో *కలల కాలం* సాగిపోతుంది!

అమ్మంటే ప్రాణం/చిత్ర కవిత

అంశం: చిత్ర కవిత ( వర్షంలో బైకుపైన కూర్చున్న బాలుడు)

శీర్శిక: *అమ్మంటే ప్రాణం*

ఆహా!
చిత్రంగా ఉంది రంగురంగుల ప్రపంచం
విద్యుత్తు ద్విచక్ర వాహనం ఎంతో విచిత్రం
అందచందాల వర్షపు కోటు పిల్లాడికి ఛత్రం
ఇంటికి త్వరగా వెళ్ళాలని విద్యార్ధి ఆత్రం!

అయ్యో!
రోడ్డు పక్కనే వాహనమునకు స్టాండ్ వేసి
భద్రంగ కొడుకును కూర్చోబెట్టి కన్నతల్లి
కూరగాయలు కొనను మార్కెట్ కు వెళ్ళగ
వర్షం పడసాగే జోరుగా ఆగకుండ అప్పుడేను!

నిజానికి!
*అమ్మంటే ప్రాణం* అమ్మంటే దైవం అందుకే
తల్లి సీటు తడుచునేమోనని తనయుడు 
అమ్మ కూర్చునే  బైకు సీటును అప్పటికప్పుడే
తాను వేసుకున్న చొక్కాతో తుడిచి
దానిపైన రేయిన్ కోటు కప్పి
కదలకుండా మెదలకుండా బైక్ పైననే
కూర్చునే  *కంగారు* వోలే!

బలే బలే!
తాను తడువకుండా ఉంటే చాలని కాకుండా
ప్రాణమైన అమ్మ బైకు సీటు తడువ వద్దని
జాగ్రత్తగా కాపాడుచుండే  వణుకుతూ
తల్లి వచ్చు వరకు అలాగే వాహనం పైన!

అద్భుతం!
చిన్ననాడే పిల్లలకు అలవడిన మంచిగుణాలు
ప్రేమ దయ కరుణ అనురాగం మానవత్వపు సుమధుర సుగుణాలు
పెద్ద పెరిగాక వారిపై కురియును కీర్తి ప్రతిష్టల
సుగంధ పరిమళాలు

ఇతరులు చెబుతుంటే వినే అనుభవపాఠాల కన్న
స్వయముగా నేర్చిన అనుభవాలే ఎంతో మిన్న! 

సౌభాగ్యం స్త్రీలకు గొప్ప వరం

 అంశం: పదాల పదనిసలు

శీర్షిక: *సౌభాగ్యం స్త్రీలకు గొప్ప వరం*


*ఆరోగ్యం* ముందు కోట్ల సంపదలు తృణప్రాయం ...
*సౌభాగ్యం* స్త్రీలకు వరం, వీరికి సమాజంలో చక్కని విలువ గౌరవం లభిస్తుంది ...
*అనారోగ్యం* ఆయుష్షును క్షీణింప జేస్తుంది, బిపి షుగర్లు రాకుండా జాగ్రత్తపడాలి...
*దౌర్భాగ్యం* అనేది ఎవరి కర్మలను బట్టి వారు అనుభవించాల్సి ఉంటుంది, తప్పదు...
*నా భాగ్యం* నా సంపదపై అధికారం నేను జీవించి ఉన్నంతవరకే ఉంటుంది...
*వైరాగ్యం* నిరాశ నిస్పృహ లనేవి మనిషి మానసిక స్థితిని బట్టి ఏర్పడుతాయి...
*మృగ్యం* మన విలువలు కీర్తి ప్రతిష్టలు, ఒక వేళ ఏ పనీ చేయకుండా తినీ కూర్చుంటే..
*వ్యంగ్యం* గా విమర్శనాత్మకంగా, హేళనగా మాట్లడటం వలన గౌరవం పోతుంది...
*యోగ్యం* అనిపించే సమాజ హితం అనిపించే పనులను చేయడం వలన నలుగురికి మేలు కలుగుతుంది...
*మహభోగ్యం* గాకుండా ఉంటుందా విలువైన భూములు నేతలకు, ప్రజలు ఉచితాలకు బానిసలైతే..

 

బృందావనం

శీర్షిక: *బృందావనం*


ఆహా! ఏమీ ఆ పచ్చని బృందావనం
అందచందాల నందన వనం
కృష్ణుడు గోపికలతో సేద తీరిన
మైసూర్ బృందావనం ఇదియే కాబోలు!

కృష్ణుడి పాదాలు నొప్పి కలుగకుండా
సుందరంగా తీర్చి దిద్దిన పచ్చిక బయళ్ళు
తలపైనా భానుడి కిరణాలు సోకకుండా
పచ్చని పందిర్లు అక్కడక్కడా లతల ముంగురులు!

కావేరీ నది ఒడ్డున నిర్మించిన
క్రిష్ణ రాజ సాగర్ డామ్ ఆవలివైపులా
ఉన్నట్లుగా కనువిందు చేస్తున్నవి పచ్చని తోరణాలు!

స్వేచ్చగా ఎగిరే శ్వేత పావురాలు పూల మొక్కలు
పచ్చని చెట్ల లతలతో అల్లుకు పోయిన పందిళ్ళు
సాయంకాలం వేళ గోపికలతో కృష్ణుడు
సేద తీర  తీర్చిదిద్దిన సుతి మెత్తని ఆసనాలు
తీయని గానాన్ని ఆస్వాదించ సౌండ్ బాక్సులు!

మనుషులకు ప్రశాంతతను యిచ్చే
మనసులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నిచ్చే
పచ్చని తరువులు పచ్చని లతల పందిళ్ళు
శ్వేత పావురాలు కనువిందు దృశ్యాలు
సృష్టి ఎంత విచిత్రం ప్రకృతి ఎంత మధురం!
 

Sunday, June 22, 2025

మానవత్వం వెలకట్టలేని సంపద

అంశం: చిత్ర కవిత 

శీర్షిక: *మానవత్వం వెలకట్టలేని సంపద*

సృష్టికి ప్రతి రూపం అమ్మ  అమ్మంటే ఆత్మ నాన్నంటే పరమాత్మ...
సంతానం కొరకు కనబడిన దేవుడిని మొక్కుతూ వైద్యశాలలు తిరిగిన...
జీవన ప్రదాతలు నిస్వార్థ పరులు త్యాగధనులు నిరంతర శ్రమజీవులు...
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే అంగరక్షకులు...!

నిత్యం శ్రమిస్తూ కష్టపడుతూ తాము తిన్నా తినకున్నా..
డొక్క మాడ్చుకునైనా పిల్లల కడుపు నింపే
త్యాగ మూర్తులు...
సత్ప్రవర్తన నేర్పే సన్మార్గం చూపే మార్గ దర్శకులు..
గొప్ప ప్రయోజకులను చేయాలనే తపన గల ఆదర్శ మూర్తులు...!

వృద్ధాప్యంలో పోషిస్తారో లేదోనన్న ఆలోచనే లేకుండా పిల్లలు ఎక్కడున్నా...
సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకునేవారు అమ్మా నాన్నలు..
నైతిక విలువలు కోల్పోతున్న నేటి కలియుగంలో...
వృద్దాశ్రమాలలో వేస్తున్నా  వీది బిక్షకులుగా దింపుతున్నా...!

మీ సుఖం కోసం మమ్ములను కన్నారనీ...
మీ చాకిరికి డబ్బు ఎంతో చెప్పండి ఇచ్చేస్తామని అంటున్న ...
మాటలు గుండెల్లో గుణపాల్లా దింపుతున్న తరుణంలో...
అలిసి సొలసిపోయి కునుకు తీస్తున్న కన్నతల్లి మర్కటాన్ని...!

పిల్ల కోతి పేళ్ళు చూస్తూ జోకొడుతూ రక్షకుడిగా ఉన్న దృశ్యాన్ని...
చూసి ఆశ్చర్యమేసి మనసు చలించి పోయింది ఆనంద భాష్పాలు రాలాయి...
కనీసం వానరాలలో ఉన్న ప్రేమ దయ కరుణ మానవత్వమూ...
ఈ మనుష్యులలో లేకుండె కదానని గుండె తరుక్కు పోయింది...!

సమాజాన్ని ప్రశ్నిస్తుంది ఆలోచింప చేస్తుంది గొప్ప ఆదర్శంగా నిలిచింది....
ఏమి ఆస్తులు కూడబెట్టాయి వానరాలు తమ పిల్లల కోసం?
ఎన్ని కోట్ల ఆస్తులు పంచి ఇచ్చాయి మర్కటాలు తమ పిల్లల కొరకు?
కాటికి పోయే టప్పుడు ఏమి పట్టుకుని పోతారు ...
బొడ్డు పేగు తెంపుకుని పుట్టిన మానవత్వం లేని కన్నబిడ్డలు...
*ప్రేమ దయ కరుణ మానవత్వమే వెలకట్టలేని సంపదలు*...!
 

ప్రతి పందెంలో నిచ్చెన వస్తే

అంశం:ప్రతి పందెంలో నిచ్చెన వస్తే

శీర్షిక: శ్రమలో సాంద్రత ఉండాలి

జీవితంలో నైనా పందెంలో నైనా వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కాలి...

అప్పుడే విజయం సిద్ధిస్తుంది దానికో విలువ గుర్తింపు ఉంటుంది...

ఏక బిగిన ఒకే సారి కోటేశ్వరుడయిపోతే పేకమేడలా 

కూలడం తధ్యం...

మోసాలు అక్రమాలతో సంపాదించిన ఆస్తులు సంపదలు ఎంతో కాలం నిలువవు...

ఎప్పుడూ నిదానం ప్రధానంగా ఉండాలి ఎదుగుతూ వెళ్ళాలి...

సాధ్యమైనదే ఎంచుకున్నప్పుడు శ్రమలో సాంద్రత ఉన్నప్పుడు విజయం తప్పక వరిస్తుంది....

అలాంటి విజయం లోనే ఆత్మ సంతృప్తి ఉంటుంది...

నిచ్చెనలతో రెకమండేషన్లతో మారక ద్రవ్యాలు వాడి పోటీలో గెలిస్తే....

అది విజయం అనబడదు ఆ గుర్తింపు ఎంతో కాలం నిలువదు....

ఈ కారణంగానే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్న నానుడి పుట్టింది...

గెలుపు సాధించాలంటే నిచ్చెనలు కాదు చక్కని ప్లానులు వేయాలి...

విషయంపై అవగాహన పెంచుకోవాలి అందరితో అనుకూలంగా ఉండాలి...

చక్కని నిర్ణయాలు తీసుకోవాలి నిరంతరం సాధన చేయాలి...

పనిపై దృష్టి కేంద్రీకరించాలి అప్పుడే విజయం అనుకూలిస్తుంది...

శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది అది శాశ్వతంగా నిలుస్తుంది...

Saturday, June 21, 2025

యోగను విద్యలో భాగం చేయాలోయ్

అంశం: యోగా గేయాలు


శీర్షిక: యోగను విద్యలో భాగం చేయాలోయ్

పల్లవి:
నిత్యం యోగం చేయాలోయ్
నిగనిగ లాడాలోయ్
యోగాన్ని మించిన ఔషధం
మరొకటి లేదోయ్                   "నిత్యం"

చరణం:01
యోగం భారతీయుల సంపదోయ్
యోగం భారతీయ సంస్కృతోయ్
యోగం భారతీయ సాంప్రదాయమోయ్
యోగం భారతీయుల వారసత్వమోయ్  "నిత్యం"

చరణం:02
యోగాసనం ఆరోగ్యమిచ్చునోయ్
యోగాసనం జ్ఞానం పెంచునోయ్
యోగాసనం ఆయుష్షు పెంచునోయ్
యోగాసనం యశస్సు పెంచునోయ్    "నిత్యం"

చరణం:03
యోగా మనస్సు శుద్దిచేయునోయ్
యోగా దార్శనికత పెంచునోయ్
యోగా ప్రశాంతత నిచ్చు నోయ్
యోగా మోక్షం కలిగించునోయ్    "నిత్యం"

చరణం:04
యోగ చతుష్షష్టి కళలలో ఒకటోయ్
యోగను విద్యలో భాగం చేయాలోయ్
యోగకు మార్కులు వేయాలోయ్
యోగను రేపటి తరాలకు అందించాలోయ్ "నిత్యం"
 

ఆశ మనిషికి శ్వాస


అంశం:ఆశ? ఆశయం?

శీర్శిక: *ఆశ మనిషికి శ్వాస*

*ఆశ మనిషికి శ్వాస*
*ఆశ మనిషికి ద్యాస*
*ఆశయం మనిషి లక్ష్యం*
*ఆశయం మనిషి ఎదుగుదలకు నిదర్శనం*

సృష్టిలో ప్రతి జీవికి ఉంటుంది ఆశ
ఆశ ఉంటేనే మనిషి వేస్తాడు ముందడుగు
మనిషి జీవించి ఉన్నంత కాలం ఆశ ఉంటుంది
గాలి పటం ఎగరడానికి వాయువు  లాగా
మనిషి జీవించడానికి కావాలి ఆశ!

ఆశ కోరికల మీదనే మానవుల మనుగడ
ఆశ కోరికలు ఉంటేనే మనిషి అభివృద్ధి
మనిషి ఉన్నతికి దోహదపడేది ఆశ కోరిక
బాగా మార్కులు రావలనేది ఒక ఆశ
అయోధ్య చూడాలనేది ఒక ఆకాంక్ష !

*అత్యాశ కొంపకు చేటు*  అన్నారు పెద్దలు
ఆశ ఉండాలి కానీ అది అత్యాశ కాకూడదు
*ఆశ ఈర్ష్య* కు దారి తీయకుండా ఉండాలి
అత్యాశ అనర్ధాలకు దారి తీస్తుంది
అత్యాశ పతనం అంచులకు చేరుస్తుంది!

హృదయానికి మనసు ఉన్నట్లే
ఆశకు ఆశయానికి విడదీయరాని
అవినాభావ సంబంధం ఉంటుంది
ఆశ అనేది ఏదో ఒకటి కావాలనుకోవడం
ఆశయం అనేది అది సాధించాలనుకోవడం!

ఏదైనా సాధించాలంటే ఒక ఆశయం ఉండాలి
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు
దానిని సాధించాలనే  ఆశయం లక్ష్యం
తపన పట్టుదల సంకల్పం ఉండాలి
అప్పుడే విజయం సాధించడం సులభం!

ఆశ కోరిక లేకుండా ఆశయం ఏర్పడదు
దానికి తగ్గట్టుగా సాధన కృషి లేకుంటే
మనిషి ఏమీ ప్రగతి సాధించలేడు
ఆశ ఆశయం అనే అడుగులు లేకుంటే
మనిషిలో అభివృద్ధి అనేది శూన్యం!
 

Friday, June 20, 2025

వీది వర్తకులు

*నేటి అంశం -చిత్ర కవిత*


శీర్షిక: *వీది వర్తకులు*

*కూటి కోసం కోటి విద్యలు* అన్నట్లు
"పొట్ట కూటి కోసం పుట్టెడు మార్గాలు"

ఉన్న చోట
బ్రతుకు దెరువు లేక
తిండి లేనిదే బ్రతక లేక
రెక్కాడితే గానీ డొక్కాడని బ్రతుకులు
అమ్మా నాన్నల కడుపు నింప
భార్యా బిడ్డల ఆర్తి దీర్చ
సద్దీమూట ‌సర్ధుకుని
పొట్ట చేత పట్టుకుని
ప్రక్క గ్రామాల నుండో
ప్రక్క జిల్లాల నుండో
పొరుగు రాష్ట్రాల నుండో!

నెత్తిపై మూటలు
కాళ్ళ క్రింద మంటలు
భార్యా పిల్లలతో తంటాలు
బస్సులు రైళ్లు దాటి
మండు టెండలలో
ఎండిన కడుపులతో
బ్రతుకు దెరువున్న చోటికి
జీవనోపాధి కొరకు
వెతుకు తుంటారు!

గ్రామ శివార్లలో
పట్టణ రహదార్లలో
గుడారాలు కట్టుకుని
డేరాలు వేసుకుని
జీవనం సాగిస్తారు
అదే వారి నివాసం
అదే వారి ప్యాలేస్!

రంగురంగుల బుగ్గలు
బూరుమిఠాయీలు
పింగాణీ వస్తువులు
గాజు వస్తువులు
అద్దాలు శిక పిన్నులు
ప్లాస్టిక్ వస్తువులు
పిల్లల ఆట వస్తువులు
అమ్మడంలో అలసట ఎరుగరు!

ఎండనక వాననక
చలి అనక పడిశం అనక
రేయనక పగలనక
చిన్న పెద్దా తేడాలనక
స్త్రీలనక పురుషులనక
పిల్లలనక ముదుసలినక
సమైక్యంగా అందరూ శ్రమిస్తారు
కష్టాన్ని నమ్ముకుని!

ఏ పగలో ఏ సాయంత్రంమో
మామూళ్ళకు వచ్చి చెదరగొట్టే
పోలీసులను చూసి
క్షణ క్షణం భయంభయంగా
కక్కలేక మ్రింగలేక అన్నట్లు
కాలం గడుపుతారు!

కష్టాలు వచ్చినా
నష్టాలు వచ్చినా భరిస్తూ
వచ్చిన దాంతోనే తృప్తి పడుతూ
ఒక చోట నుండి మరోచోటికి
పలస జీవులు
డేరాలను విప్పుకుంటూ
దేహాలపై కప్పుకుంటూ
పంచభూతాలను నమ్ముకుని
జీవన ప్రయాణం సాగిస్తారు!

*కలిసి ఉంటే కలదు సుఖమనీ*
*బ్రతకడానికి ఈ ప్రపంచం ఎంతో విశాలమనీ*
*మనసుంటే జీవన మార్గముంటుందనీ*
*శ్రమ మన ఆయుధమైతే విజయం*
*బానిస అవుతుందనీ*
*ఆత్మాభిమానంతో బ్రతకడంలో తృప్తి లభిస్తుదని*
సమాజానికి గొప్ప సందేశాన్నిస్తూ
బ్రతుకు బండి సాగిస్తారు *వీది వర్తకులు*!
 

సహజ రంగుల చెక్క బొమ్మలు

అంశం: చెక్క బొమ్మలు


శీర్షిక: సహజ రంగుల చెక్క బొమ్మలు

పిల్లల్లారా పిడుగుల్లారా
బొమ్మలు పిల్లలు బొమ్మలు
సహజ రంగుల బొమ్మలు
అందమైన చెక్క బొమ్మలు!

చిన్న చిన్న పిట్టల బొమ్మలు
రామ చిలుకల బొమ్మలు
చక్రాల బండ్ల బొమ్మలు
పాలకొడిశు కట్టె బొమ్మలు !

దొంతుల బొమ్మలు
అమ్మానాన్న బొమ్మలు
సీతా రాముల బొమ్మలు
దేవతల దేవుళ్ళ బొమ్మలు!

నిర్మల్ బొమ్మలు
నిగనిగ లాడు బొమ్మలు
సంక్రాంతి దీపావళి పండుగల్లో
కొలువు దీరు బొమ్మలు
కొండపల్లి బొమ్మలు!

పిల్లలకు పెద్దలకు
ఆనందాన్నిచ్చు బొమ్మలు
కళాకారులకు
ఉపాధి కల్పించు చెక్క బొమ్మలు!

సాంప్రదాయ బొమ్మలు
సంస్కృతి కాపాడు బొమ్మలు
రేపటి తరాలకు బొమ్మలు
వరాల నిచ్చు చెక్క బొమ్మలు!

చెక్క బొమ్మలను కొనాలి
బేరసారాలు ఆడ కుండాలి
బొమ్మలను ప్రోత్సహించాలి
కళలను బ్రతికించుకోవాలి!
 

Thursday, June 19, 2025

అకటా! ఏమిటీ వింత?

*నేటి అంశం*అంశపు కవిత*

*ప్రేమ ఎంత మధురం*వికటిస్తె నరకం*

శీర్షిక: *అకటా! ఏమిటీ వింత?

నీవే నా ప్రాణం నీవే నా సర్వస్వం
నీ వెంటా నేనుంటా నీ వెంటే దాగుంటా
నిజముగ చెబుతున్నా
నిన్ను విడిచి నేను ఉండలేను
నిజమైనది నా ప్రేమ నిత్తె మల్లె హేమ
పంచభూతాల సాక్షిగా చెబుతున్నా
అరుంధతీ దేవి సాక్షిగా చెబుతున్నా
నాపైన నీపైన ఒట్టేసి చెబుతున్నా
అమ్మా నాన్న అడ్డు వచ్చినా
మేన మామ దుడ్డు పట్టినా
సూర్యచంద్రులు ఉన్నంత కాలం
మనువాడకున్నను మనమే ఆలుమొగలం
మంగళ సూత్రం ఉన్నా లేకున్నా
భాజాభజంత్రీలు ఉన్నా లేకున్నా
వేద మంత్రాలు పూలమాలలు లేకున్నా
మనమే భార్యాభర్తలం అంటూ
ప్రేమ లొలకబోస్తూ హొయలు కుమ్మరిస్తుంటే
*ప్రేమ ఎంత మధురం* అనుకుంటినీ

చనువుగా తిరిగుతూ చంకలిరికించుకుని
క్రెడిట్ కార్డుల డెబిట్ కార్డుల
ఆధార్ కార్డుల పాన్ కార్డుల నెన్నియో సేకరించి
ఆస్తులు వ్రాయించుకుని నామినీగా పెట్టించుకుని
తల్లిగాక ముందే ప్రేమ వికటించే
తనను మోసం చేసానని
కోటి రూపాయల కొరకు కోర్టులో దావా వేసే
అకటా! ఏమిటీ వింత?
*ప్రేమ వికటించి నరకం చూస్తింటినీ*!

 

వినుడు రామ చరిత విజ్ఞులార

అంశం: అయోధ్య బాల రాముడు

శీర్షిక: అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట
(ప్రక్రియ: ఆట వెలది పద్యాలు)

ఆ.వె:1
ధశరత తనయుండు దయగల రాముండు
విద్య లెన్నొ నేర్చె వినయముగను
తల్లిదండ్రులవలె ధర్మము పాటించె
వినుడు రామ చరిత విజ్ఞులార!

ఆ.వె:2
ఎంత వాడు నైన యెంత కీర్తిగడించ
కాంత మాటనేల కాన కుండు
అడవి నంపె తండ్రి నభిరాముడినికను
వినుడు రామ చరిత విజ్ఞులార!

ఆ.వె:3
రామ రామ యంటు రామున్ని వేడ్కొన
సకల ఫలములిచ్చు శాంత రామ
కోరు కోర్కె దీర్చు కోదండ రాముండు
వినుడు రామ చరిత విజ్ఞులార!

ఆ.వె:4
నలుగురి మదిలోన పలుచనైనంకను
ఎంత వేద మెరిగి నేమి ఫలము
రావణుండు చచ్చె రాముడి చేతిలో
వినుడు రామ చరిత విజ్ఞులార!

ఆ.వె: 5
ఎన్నొ బాధ లెరిగి యెంతొ పేరును గాంచి
అయిదు వందలేండ్లలిగె నయోధ్య
మోడి వలన నేడు వీడె రామ చరలన్
వినుడు రామ చరిత విజ్ఞులార!
 

ఆగదు కాలం ఏ నిమిషం

అంశం:కాల చక్రం తిరుగుతూంది


శీర్శిక: ఆగదు కాలం ఏ నిమిషం

సృష్టి రహస్యం అద్భుతం
దానిని ఛేదించడం ఎవరికి సాధ్యం?
మానవులం మనం నిమిత్త మాతృలం
ప్రయత్నించామో అవుతుంది విశ్వం కలకలం!

కాల చక్రం తిరుగుతూంది గడియారంలా
జీవిత చక్రం తిరుగుతూంది ప్రయాణంలా
సాగుతుంది నిత్యం ప్రవహించేసాగరంలా
ఆగదు ఎప్పుడు మానవ జీవనయానంలా!

కాల చక్రం తిరుగుతుంది నిరంతరం
ఎవరు ఆపినా ఆగదు ఏ నిమిషం
కాలం శాశ్వతం ప్రాణం అశాశ్వతం
కాలం విశ్వ కోటికి పంచ ప్రాణం!

అనుభవాలను నేర్పేది కాలం
జ్ఞానాన్ని బోధించేది కాలం
గుణపాఠాలను చెప్పేది కాలం
శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేసేది కాలం!

బాధలను తగ్గించేది పెంచేది కాలమే
కష్టాలను తగ్గించేదీ పెంచేది కాలమే
సుఖదుఃఖాలను పెంచేది తగ్గించేది కాలమే
సమస్యలను పరిష్కరించేది కాలమే

పంచభూతాలకు ఆయువుపట్టు కాలం
భూగోళాన్ని మనిషి కాపాడుకుంటేనే
పంచభూతాలు గ్రహాలు వాటి పరిధిలో
క్రమబద్ధంగా పనిచేస్తాయి
కాదుకూడదంటే మనుషులపై ప్రాణులపై
పంచభూతాలు ప్రతాపాన్ని చూపెడుతాయి!

సూర్యుడి కేంద్రంగా వివిధ కక్ష్యలలో
బుదగురుశుక్రశనికుజ భూమి చంద్ర గ్రహాలు
రాహువు కేతువు ఛాయా గ్రహాలు!

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ
సూర్యుడి చుట్టూ తిరుగుగ
చంద్రుడు భూమికి ఉపగ్రహం
భూమి చుట్టూ తిరుగునే!

భూమి తనచుట్టూ తాను తిరుగిన
ఒక రోజు అనీ
భూమి సూర్యుని చుట్టూ తిరుగిన
ఒక సంవత్సర కాలంగా లెక్కించెదరు!

భూమి తనచుట్టూ తాను తిరగడాన్ని
భూబ్రమణమనీ సూర్యుడి చుట్టూ
తిరుగడాన్ని భూపరిబ్రమణమనీ అనెదరు!

భూమి తనచుట్టూ తాను తిరుగుతున్నవేళ
చంద్రుడు భూమికి సూర్యుడికి
అడ్డుగా వచ్చిన కాలం రాత్రి అనీ
అడ్డుగా రాని కాలం పగలు అనీ!

ఎంతో విలువైనది సమయం
కాకు ఎప్పుడూ అయోమయం
తెలివిగ ఉపయోగిస్తే విజయం
లేదంటే వెంటాడు అపజయం!

కాలాన్ని లెక్కించారు బ్రహ్మ కాలంలో
కల్పం, మానవ సంవత్సరాలు
మన్వంతరాలు చతుర్యుగాలు
బ్రహ్మ దేవుడికి ఒక రోజు అంటే
432 కోట్ల మానవ సంవత్సరాలు

కాలాన్ని లెక్కిస్తారు  యుగాలలో
కృత త్రేతా ద్వాపర కలియుగాలనీ
కాలాన్ని లెక్కిస్తారు  కాలాలలో
వర్షాకాలం చలికాలం ఎండాకాలమనీ
కాలాన్ని లెక్కిస్తారు ఋతువులలో
వసంత గ్రీష్మ వర్షషరధ్ హేమంత శిశిర
ఋతువులనీ!

దశాబ్ధం శతాబ్దం మిలీనియం అనియు
ప్రభవ నుండి అక్షయ అరువది వత్సరాలు
సంవత్సరాలు నెలలు పక్షాలనీ
రోజులు గంటలు నిమిషాలు సెకనులు
ఘడియలనీ లెక్కిస్తారు!

కంద పద్యం

కందం:

తల్లియె గదనొక తరువౌ
మల్లియు పుట్టదు జగమున ననుకువ నున్నన్
చల్లని మనసుతో నిండిన
తల్లియె పెంచును మనలను తడబడకుండన్!

తెలుగు గజల్


అంశం: తెలుగు గజల్
4+4+4+4+4+4

మదిలో మెదిలే ఆశల ఊహల రూపం నీవే 
కలలో నిత్యం వచ్చే దృశ్యపు మధురం నీవే 

సుందర వదనపు వెచ్చని మెరుపుల బాణం నీవే 
సంధ్య వేళన వీణను మీటే కవనం నీవే

చిరుగాలి చల్లగ తనువుకు తగిలే  తరుణం నీవే 
జోరుగ ఝరిలా చెవులను తాకే శబ్ధం నీవే 

కన్నుల  బొమ్మల తిప్పే మన్మధ ధీరుడు నీవే 
గొప్పగ మదిలో మెదిలే సుందర బంధం నీవే

గులాబి పువ్వుల పరిమళ వాసన గంధం నీవే 
నిండుగ ఒదిగిన పరువపు మనసుక అందం నీవే 

అద్దము నందున గగనపు మబ్బుల స్వప్నం నీవే 
మదిలో వలపుల అలుకల భావపు చందం నీవే 

*కృష్ణా!* నీవే మధురం కలలో స్వప్నం నీవే 
బృందా వనంలొ చూసే సుమధుర హృదయం నీవే

 _ మార్గం కృష్ణ మూర్తి 

 

Wednesday, June 18, 2025

సైబర్ క్రైమ్ /నైతిక హాకింగ్

అంశం: సైబర్ క్రైమ్


శీర్షిక: *నైతిక హాకింగ్*

*అతి తెలివి కొంపకు చేటు* అన్నట్లు
మనిషి అతిగా విద్య సాంకేతిక పరిజ్ఞానం
అలవర్చుకుని సులభంగా తేలికగా
డబ్బు సంపాదించడం కొరకూ విలాసాలలో
తేలియాడేందుకు మొగ్గు చూపుతున్నారు
సోషల్ మీడియా అవకాశాలు ఒక కారణమైతే
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడుతుండడం
మరొక కారణం కావచ్చు

నేడు నైతిక హాకింగ్ కోచింగ్ సెంటర్లు
కోకొల్లలుగా విస్తరించి ఉన్నాయి
గూగుల్ సెర్చ్ చేసినా హాకింగ్ విధానం
సులువుగా దొరికే కలియుగం ఇది

*వినాశకాలమే విపరీత బుద్ధి* అని
తెలుసుకోలేక పోతున్నాడు మనిషి
ఎదుటివారు ఎంత దుఃఖిస్తారో
పట్టింపులేదు డబ్బు సంపాదించడమే
గొప్ప అనుకుంటున్నారు మూర్ఖులు
కర్మయోగం ఉందనేది మరిచి పోతున్నారు

రకరకాల ఆప్ ల ద్వారా స్కైప్ ల ద్వారా
వివిధ రకాల సాఫ్ట్వేర్ లింక్ లు
మొబైల్లకు లాప్ టాప్ లకు పంపి
సులభంగా సునాయాసంగా తెలివిగా
క్షణాలలో కోట్లాది రూపాయలను
బ్యాంక్ అకౌంట్ల నుండి కొల్లగొడుతున్నారు

కొన్ని చరవాణి సంఖ్యలను ఎత్తగానే
ఫోన్లు హాక్ అవుతాయి
హాక్ అవగానే చరవాణి లోని డాటా మొత్తం
డౌన్లోడ్ చేసుకుంటారు

సామభేదదాన దండోపాయాల ద్వారా
ఫోన్లు చేసి భయపెట్టి వారితోనే
వారి డబ్బులనే అకౌంట్లకు ట్రాన్స్ఫర్
చేయించుకో గలుగు తున్నాంటే 
ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం!

డిజిటల్ మీడియా అభివృద్ధి చెందడం
సాంకేతిక విజ్ఞానం తారా స్తాయికి చేరడం
సంతకాలు లేకుండానే అన్ని రకాల
అకౌంట్లను తెరువగలుగడం మార్చగల్గడం
మూయగల్గడం డబ్బు ట్రాన్స్ఫర్ గల్గడం
డబ్బు తీసుకో గల్గడం వలన
నేడు సైబర్ క్రైమ్ నేరగాళ్లకు సులువైంది

సైబర్ క్రైమ్ నేరస్తులకు కావాల్సినవి పుట్టిన తేదీ
పేరు ఆధార్ సంఖ్య, చరవాణి సంఖ్య
ఇవి ఇప్పుడు సులభంగా తేలికగా
లభ్యమగును నెచటనైనా
చరవాణి హాకింగ్ ద్వారా ఓటిపి
కృత్రిమ మేధస్సు ద్వారా పిన్ సంఖ్య
తెలుసుకో గలుగు తున్నారు
మధ్యం సేవించే వాడు ఎలాగైనా
దొరుకబడుతాడు బార్ షాప్ ఎక్కడో

ఇప్పుడు ప్రజలు చేయాల్సింది ఒక్కటే
ఎలాంటి లింక్ లను క్లిక్ చేయకూడదు
తెలియని చరవాణి సంఖ్యలను ఎత్తవద్దు
ఎవరికి ఓటిపి పిన్ ఆధార్ సంఖ్యలను
బ్యాంక్ వివరాలను ఎవరికి చెప్ప కూడదు
ఏ బ్యాంకు కె.వై.సీ కి గానీ మరి దేనికైననూ
ఫోన్ చేసి వివరాలు అడుగదు
తెలియని స్పామ్ సంఖ్యలను బ్లాక్ చేయాలి

ప్రతిరోజూ కొత్త కొత్త పద్దతులలో
మోసాలకు తెగబడుతున్నారు
చరవాణి సర్వీస్ అందించు వారు
ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి
మోసగాళ్ళను కఠినంగా శిక్షించాలి
పౌరులు ఇతర ప్రజలను బాధితులను
ప్రతినిత్యం అలెర్ట్ చేస్తూనే ఉండాలి
*ముక్కున్నంత కాలం పడిశం తప్పదు*