Wednesday, June 25, 2025

విద్య

అంశం: విద్య


శీర్శిక: *విద్య సంస్కారవంతమైనదై ఉండాలి*

*విద్య లేని వాడు వింత పశువు* అన్నారు
పూర్వం మన పెద్దలు, నిజమే!

విద్యే మనిషికి జ్ఞానం విద్యే మనిషికి ప్రాణం
విద్యే మనిషికి విలువ విద్యే మనిషికి గౌరవం

విద్య తోనే గెలుపు విద్య తోనే మలుపు
విద్య తోనే సంపద విద్యతోనే తప్పును ఆపద
విద్య తోనే గుర్తింపు విద్య తోనే కీర్తి ప్రతిష్ట

విద్య వలన గత చరిత్రలను తెలుసుకోవచ్చు
రేపటి తరాల జ్ఞానాన్ని అందించ వచ్చు
గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయవచ్చు
చరిత్రను సృష్టించ వచ్చు తిరుగ వ్రాయవచ్చు!

విద్యే లేకపోతే, భారత రత్న డా. అంబేద్కర్
నాడు రాజ్యాంగాన్ని రచించక పోతే
నేడు పేదల బడుగు జీవుల బహుజనుల
పరిస్థితి ఏమిటి?

భారత రత్న డా అబ్దుల్ కలాం
చదువుకుని శాస్త్ర వేత్త కాకపోతే
భారత డిఫెన్స్ ఇంత పటిష్టంగా ఉండేదా?

విద్య డబ్బును సంపాదించ కలిగేది
అది జగతిలో దొంగిలించ బడనిది
ప్రపంచంలో ఎక్కడైనా జీవించ వీలైనది!

విద్య సంస్కారాన్ని నేర్పుతుంది
విద్య వలన వినయం అలవడుతుంది
విద్య సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తుంది
దానల్లో కెల్లా విద్యా దానం ఎంతో గొప్పనైనది!

దురదృష్టవశాత్తు విద్య
నేడు కొత్త పుంతలు తొక్కుతోంది
*విద్య లేని వాడు వింత పశువు నాడు*
*విద్య ఉన్న వాడు వింత కసువు నేడు*
*అతి తెలివి కొంపకు చేటు* అన్నట్లు
విద్య పెరిగిన కొలది సాంకేతిక విజ్ఞానం
నేర్చిన కొద్దీ మనిషి కసువై పోతున్నాడు!

అదే విద్యతో రేయింబవళ్ళు
ఎవరిని ఎలా  మోసం చేయాలి
ఎక్కడ మోసం చేయాలి ఎలా స్కాం చేయాలి
అంటూ తలామునకలవుతుండే!

మొదట నమ్మకాన్ని పెంచుకుంటూ
తర్వాత అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తుండే
ఇందులో ఎవరూ తీసి పోలేదు!

అతిగా విద్య నేర్చిన వారికి
అనుభవం పొందిన వారికి ఆయుధాలు
ఎదుటి వారి నమ్మకాలు బలహీనతలు!

విద్య వలన డబ్బు బాగా సంపాదిస్తూ
విలువైన ప్రేమలు ఆప్యాయతలు
రక్త సంబంధాలు పెద్దలను గౌరవించడం
వాయివరుసలు మరిచి పోతుండే
నీతి నిజాయితీ సత్యం ధర్మాన్ని
తుంగలో తొక్కి మోసం హింస యుద్ధాలకు పాల్పడుతుండే!


*విద్య సంస్కారవంతమైన విద్యై ఉండాలి*
*అది తనకు సమాజ హితానికి తోడ్పడాలి*!

No comments: