Thursday, July 3, 2025

మనిషిని నడిపించేవి కర్మలు

అంశం:దిశ దశ

శీర్శిక: *మనిషిని నడిపించేవి కర్మలు*

*దిశ వేరు దశ వేరు రెండింటి కుండు*
*అవినాభావ సంబంధం మెండు*

దిశలే దిక్కులు దిక్కులే దిశలు
తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దిశలు
ఈశాన్యం ఆగ్నేయం నైఋతి వాయువ్యం
*దిశలు* మార్గాలను దారులను చూపుతే!

*దశలు* కాలాన్ని చూపుతాయి
ఆరంభ దశ లేదా ప్రారంభ దశ
అంతిమ దశ లేదా చివరి దశ
మహార్దశ అంతర్దశ వృద్ధాప్య దశ
తొలి దశ మలి దశ బాల్య దశ
దశలు అనేవి సమయాన్ని సూచిస్తాయి!

ఇక  దిశ ముందా దశ ముందా
దిశకు దశ చుక్కానా
లేక దశకు దిశ చుక్కానా అంటే
*కోడి ముందా కోడి గుడ్డు ముందా*
అన్నట్లుగానే ఉంటుంది చెప్పడం కష్టం!

ఒక రాజకీయ నాయకుడితో సాన్నిహిత్యం
వలన దశ మారిపోయింది అంటారు
అప్పుడు దిశ ముందు ఉంటుంది
పలానా యాగం చేస్తే నీ దశ మారుతుంది
అన్నప్పుడు దశ ముందవుతుంది!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహ దశలు
అనుకూలంగా ఉన్నట్లయితే
ఆ వ్యక్తి ఆ దిశగా ప్రయత్నం చేస్తే
విజయం సుగమం కావచ్చు!

మనిషి పుట్టుకతోనే శని దశ కుజ దశ
రవి రాహువు కేతువు దశలు మొదలైన
వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు
ఆయా దశల కాలంలో అంతంత మాత్రమే!

అనుకూల గ్రహ దశలు వచ్చినప్పుడు
దిశను మార్చుకుని ప్రయత్నం చేయడం ఉత్తమం
కొన్ని పూర్వజన్మ సుకృతాలుంటాయి
బిల్ గేట్స్ ముఖేష్ అంబానీ నారాయణ మూర్తి
సంతానం పుట్టుకతోనే కుబేరులు
ఏది ఏమైనా సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలనుసారమే అన్నీ జరుగుతుంటాయి!




Wednesday, July 2, 2025

జీవిత సత్యాలు

అంశం: పదాలు కవిత

(అంత రంగం, హృదయం, కల్లోలం,
అంతం , వీడ్కోలు, తుది వాక్యం)

శీర్షిక : *జీవిత సత్యాలు*

ప్రియా! అందమైన రోజు ఇది
ఆహ్లాదకరమైన వాతావరణం
అద్భుతమైన సుముహూర్తం
ఆనందకర డోలికలలో మనం

పంచభూతాల సాక్షిగా
మనమదిలలో కలిగిన ఆలోచనలకు
మన ప్రేమకు చిహ్నంగా
అర్పిస్తున్నాను నా  *హృదయం*

నా *ఆంత రంగం* లోని ఆలోచన ఒకటే
నాకు నీవు తోడు నీడగా ఉండాలని
నీకు నేను తోడు నీడగా ఉండాలని
కలకాలం జీవితం హాయిగా సాగిపోవాలనీ
అష్ట దిక్పాలకులను వేడుకుందాం

కష్టాలను సుఖాలను బాధలను ఆనందాలను
కలిసి పంచుకుందాం కడదాకా
ఒకరంటే ఒకరికి ప్రేమతో  గౌరవంతో
రతీదేవి మన్మధుడిలా విహరిద్దాం

నామనసులోని అలజడి , *కల్లోలం*
ఇప్పుడే *అంతం* అయిందని భావిస్తున్నాను
ఇక మన మనసుల్లోని సంశయాలకు
*వీడ్కోలు* పలుకుదాం

భార్యా భర్తల "సుఖమయ" జీవితానికి
ఖర్చు లేని పెట్టుబడి "నమ్మకం"
క్షయం లేనిది "ఒకరినొకరు అర్ధం చేసుకోవడం"
ఉచితమైనది "దాపరికం" లేకుండా గడపడం
విలువైనది "సర్దుబాటు గుణం" కలిగి ఉండటం
 
ప్రియా! మన ఆనందమయ జీవితానికి
ఇవే నా *తుది వాక్యాలు*
ఇవే జీవిత సత్యాలు రాధా!

మాట మనసుకు సూచిక

*1*మొక్కై వంగనిది మానై వంగునా*

*2*మనిషికి మాటే అలంకారం*

శీర్షిక: *మాట మనసుకు సూచిక*

ప్రతి మనిషి జీవితంలో పెళ్ళి అనేది తప్పనిసరి
అది ప్రేమ వివాహమైనా పెద్దలు కుదిర్చినా
కళ్యాణం అయినాక కలిసి జీవించే టప్పుడు
భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటూనే!

ఒక సంవత్సర కాలం ఒకరినొకరు
అర్ధం చేసుకోవాలి గానీ
ఒకరికొకరు అలుసయి పోకూడదు
ఇది నూతన దంపతులు ప్రతోఒక్కరూ
గుర్తు పెట్టుకోవాల్సిన జీవిత సత్యం!

మొక్కగా ఉన్నప్పుడే నియంత్రణలో ఉండాలి
ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికే ప్రయత్నించాలి
అలాకాకుండా పాత సంఘటనలు నెమరువేసుకుంటూ
అలుసై పోకూడదు
స్థితప్రజ్ఞత లేకుండా అలా చేస్తే
ఎదుటి వారు ఏకుమేకై కూర్చుంటారు
ఒక్క సంవత్సరం అలుసిస్తే 
జీవిత కాలం నరకం అనుభవించాల్సి వస్తుంది 

అందుకే అంటారు *మొక్కై వంగనిది మానై వంగునా* అని

*పురుషుడు ఒక స్త్రీ ని అర్ధం చేసుకోవడానికి*
*నూరు సంవత్సరాలు పడితే*
*స్త్రీ పురుషుడిని అర్ధం చేసుకోడానికి*
*గట్టిగా ఒకే ఒక్క రోజు చాలు*
అందుకే పురుషులారా జాగ్రత్త!

బలాలు బలహీనతలు అనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి
కానీ ఎప్పుడూ బలహీనతలను  మరొకరితో పంచుకోకూడదు
దీని వలన ప్రయోజనం ఉంటే నష్టమే అధికం

మాట్లాడే టప్పుడు ప్రేమగా మాట్లాడు కోవాలి
భార్యా భర్తలు నవ్వుతూ మాట్లాడుకోవాలి
అందుకే  *మనిషికి మాటే అలంకారం*
అనే సామెత వాడుకలోకి వచ్చింది!

మాట మనసు లోని మాధుర్యాన్ని తెలియజేస్తుంది
అందం ఆహార్యం లాంటి భాహ్య సౌందర్యం కన్నా
ఆత్మ సౌందర్యం వెలకట్టలేనిది, గొప్ప నైనది
అది మాటల ద్వారానే తెలుస్తుంది.
మాటల ద్వారానే మనసులోని భావనలు, నీతి నిజాయితీ, అరిషడ్వర్గాలు 
కృష్ణుడి నోటిలో స్వర్గంలా స్పష్టంగా తెలుస్తాయి 
*మాట ముఖం మనసుకు సూచిక*

జై జావాన్ - జై కిసాన్

 అంశం: *ఎండి పోయిన భూమి - పొంగిపొర్లే ఆశలు*


శీర్శిక: *జై జవాన్ జై కిసాన్*

బంజరు భూములైనా బీడు భూములైనా
అవి నీరు లేక ఎండి పోయినా
రైతులలో ఆశలు పొంగి పొర్లుతూనే ఉంటాయి
ఆకాశం వైపు కళ్ళు చూస్తూనే ఉంటాయి!

ఆరుద్ర కార్తెలో వర్షాలు పడక పోయినా
మృగశిర కార్తెలో నైనా పడక పోతాయాఅని
కళ్ళళ్ళో వత్తులు పెట్టుకుని చూస్తుంటారు
ఎందుకంటే రైతులకు వ్యవసాయమే కదా
ప్రధాన మైన ఆదాయ వనరు !

వ్యవసాయ పంటలకు మూలాధారం నీరు
నీటికి ప్రధాన ఆధారం వర్షాలు
సకాలంలో వర్షాలు పడుతేనే హాలికుడు
హలాన్ని పట్టి పొలాన్ని దున్ని విత్తనాలు చల్లి
పంటలు పండించగలడు

వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు
భూములు ఎండుతున్నా నెర్రెలు బాస్తున్నా
పొంగి పొర్లుతున్న ఆశలతో
రేపైన మాపైనా వర్షం పడకపోతుందా అని
ఆకాశం వైపు ఎదురు చూస్తూనే ఉంటారు!

చెరువులలోని నీటి కొరకు
బావులు కాలువలలోని నీటి కొరకు
విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు
ఫలించే వరకు ఆశతోనే  జీవిస్తారు!

అతివృష్టి అనావృష్టి వలన
రేయింబవళ్ళు రైతుల కష్టాలు చెప్పలేనివి
రైతుల చేతిలోకి డబ్బు వచ్చే వరకు
సుమారుగా ఎనిమిది నెలలు
కోటి ఆశలతో ఎదిరిచూస్తూనే ఉంటారు!

భూమినే నమ్ముకున్న రైతుకు
భూమికి ఎంత సహనమో రైతుకు అంతే సహనం
అన్నదాతా సుఖీభవ
అందుకే అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి
*జై జవాన్ జై కిసాన్* అని 

మనిషి ఆశలు కోరికల పుట్ట

అంశం: *ఆశ- కోరిక *


శీర్శిక: *మనిషి ఆశలు కోరికల పుట్ట*

ప్రతి మనిషి ఆశా జీవి
ఆశ మనిషికి శ్వాస ఆశ మనిషికి ద్యాస
ఆశ లేకుండా జగతిలో అభివృద్ధి శూన్యం
ఆశలు పొర్లుతుండు నిరంతరం మనిషిలో!

ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా
ఎన్ని ఆభరణాలు ఎన్ని కార్లు బంగ్లాలు
ఎన్ని భూములు ధాన్య రాశులు ఉన్నా
ఇంకా కావాలి అనే కోరిక మిగిలే ఉంటుంది!

ఎండిన భూములు బీడు భూములే అయినా
అందులో పంటలు పండవనీ తెలిసినా
వాటిల్లో పుట్ల కొలది పంటలు పండించాలి
అనే ఆశ శ్వాస ఉన్నంత వరకూ ఉంటుంది!

ఎండిపోయిన భూమిలో పొంగి పొర్లే ఆశలంటే
ఎండిన మోడు చిగురించాలని ఆశ
కొక్కుకోడి గుడ్లు పెట్టాలన్ప ఆశ
ఎండిన బావిలో నీళ్ళు తోడాలన్న ఆశ
మోనోపాజ్ లో ఉన్న భార్య
పిల్లలు కనాలని ఆశ లాంటిదే!

మనిషి ఆశలు కోరికల పుట్ట
వాటిని సాధిండంలో మహా దిట్ట
కాటికి వెళ్ళే వరకు వేయడు అడ్డు కట్ట
వాటికి తోడు  అరిషడ్వర్గాలైన కామ క్రోధ
లోభ మోహ మద మాత్సర్యాలు స్వార్ధం
ఈర్ష్య అసూయ అహాలు వెన్నంటే ఉంటాయి!

Tuesday, July 1, 2025

ప్రజా క్షేమం

అంశం: ప్రజా హితం


శీర్శిక: *ప్రజా క్షేమం*

*దేశంలో ప్రతి పౌరుడు ప్రజాహిత కారుడే*

సృష్టి కర్త కర్మ బ్రహ్మ , కీటకాలను కప్పలకు
కప్పలను పాములకు, పాములను గ్రద్దలకు
ముంగీసలకు, నెమలులకు ఆహారంగా పెట్టాడు
కానీ మనుషులను మనుషులకు
ఆహారంగా పెట్టలేదు!

అందుకే ప్రతి మనిషి తోటి మనిషికి
మేలు చేసే వాడే
ప్రజా సేవకు ఉపయోగపడే వారందరూ
ప్రజా హితకారులే!

పసి పిల్లలు ముస్సలి వారిని మినహాయిస్తే
నాయకులు సంఘసంస్కర్తలు
సైనికులు శాస్త్ర వేత్తలు వైద్యులు
గురువులు కవులు కళాకారులు ప్రవచకులు
కార్మికులు అందరూ *ప్రజా క్షేమం* కోరే వారే!

చిత్తు కాగితాలు ఏరుకునే వారు
ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునే వారు
వీధులు ఊడ్చే వారు మోరీలు తీయువారు
పాములను పట్టే వారు అందరూ హితకారులే
వారు వారి జీవనోపాధి కొరకు చేసినను
అందులో సమాజ శ్రేయస్సు ఉంది

ఇంకా లోతుగా ఆలోచిస్తే
పశుపక్ష్యాదులు క్రిమి కీటకాలు
ప్రకృతి పంచభూతాలు అన్నీ ప్రజా హితకారులే!

యితే ఏ పని చేసినా ఏ సేవ చేసినా
తాము చేసే ప్రతి పనిలో  ప్రతి సేవలో
నీతి నిజాయితీ స్వచ్చత ఉండాలి
అది నిస్వార్థంతో కూడినదై ఉండాలి
మోసం పాపం నేరం దోషం ఉండకూడదు
సమాజ శ్రేయస్సుకై ప్రజా హితమై ఉండాలి!

అప్పుడే వారిపై నమ్మకం ఏర్పడుతుంది
ఎనలేని గుర్తింపు గొప్ప గౌరవం దక్కుతుంది
కీర్తి ప్రతిష్టలు అవార్డులు రివార్డులు వస్తాయి
చరిత్ర పుటల్లో వారికో పేజీని ఏర్పరుచుకొని
స్థిర స్థాయిగా  నిలిచిపోతారు!
 

తృప్తి ఆనందం సంతోషం

శీర్శిక: *తృప్తి ఆనందం సంతోషం*


తన కొరకా? పరుల కొరకా?
స్వార్ధమా? నిస్వార్థమా?
తనకు మాలిన ధర్మం చేయాలా వద్దా?
నిజంగానే పరుల కొరకే చేసుకుంటూ పోతే
చివరకు తనకు మిగిలేది ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలు కొందరిలో తొలుచక మానవు!

శిశువు జన్మిస్తూనే
తన తల్లి తండ్రులకు డాక్టర్లకు
మొక్క మొలకెత్తుతూనే
తన యజమానులకు తోట మాలీలకు
వాటికి తెలియకుండానే సంతోషాన్ని
ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి!

శిశువైతే తల్లిదండ్రులకు
మొక్కైతే యజమానులకు
మేము సృష్టి కర్తలం అనే భావనతో
తృప్తిని  సంతోషాన్ని కలిగిస్తే
డాక్టర్లకు ఆయాలకు తోటమాలీలకు
ఇప్పటి వరకు వారు పడిన శ్రమకు
ఫలితం దక్కిందన్న ఆనందం కలుగుతుంది!

తృప్తి ఆనందం సంతోషం అనేవి
అమూల్యమైనవి అవి వెలకట్టలేనివి
వేటితోనూ  తూచలేనివి కొలువ లేనివి
అంగట్లో కొందామన్నా ఎక్కడా దొరుకనివి!

అలానే మనిషిగా ఎదిగాక కూడాను
తాను చేసే ప్రతి పనిలో  ప్రతి సేవలో
నీతి నిజాయితీ స్వచ్చత ఉండాలి
అది నిస్వార్థంతో కూడినదై ఉండాలి
సమాజ శ్రేయస్సుకై ప్రజా హితమై ఉండాలి!

అప్పుడే మనిషి పై నమ్మకం ఏర్పడుతుంది
ఎనలేని గుర్తింపు గొప్ప గౌరవం దక్కుతుంది
కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి
చరిత్ర పుటల్లో వారికో పేజీని ఏర్పరుచుకొని
స్థిర స్థాయిగా నిలిచిపోతారు

 

సాఫ్ట్వేర్ ఉద్యోగాలు -2

అంశం: స్వేచ్ఛా కవిత


శీర్షిక: *సాఫ్ట్వేర్ ఉద్యోగాలు*

కాలం మారుతుంది మనం మారాలి
సోషల్ గా ఉండాలి పేర్లు పెట్టే పిలువాలి
వీకెండులు వాకెండులతో ప్రోగ్రాములు
ఇవే సాఫ్ట్వేర్ ఉద్యోగాల నియమాలు!

ఆవులించను సమయం కరువు
భార్యా పిల్లలతో ప్రేమానురాగాలు మృగ్యం
అమ్మా నాన్నలతో ఆప్యాయతలు శూన్యం
ఎందుకో నాలుగు గోడల మధ్య ఈ అరణ్య వాసం!

రోజుకు పదహారుగంటల రేడియేషన్ తో
*చిగురించని ఎండిన మోడు* లా
సంతాన లేమితో  బాధపడుతూ
నరకమనుభవిస్తున్న జీవితాలు ఎన్నో!

అమ్మాయిని  అమ్మానాన్నే చూస్తారనీ
సాఫ్ట్వేర్ ఉద్యోగులనీ అధిక ప్యాకేజీలనీ
నీడ పట్టున ఉంటారనీ పెళ్ళిళ్ళు
యేడాది తిరుగక ముందే విడాకులు
లక్షలు కోట్ల రూపాయిలకు కేసులు పెట్టి
బ్లాక్ మెయిల్ చేసే సంఘటనలు మరెన్నో!

భార్యా భర్తలను పిల్లలను విడదీసే
ప్రాజెక్ట్ వర్కులతో బందీలను చేసే
గట్టిగా తుమ్ముతే ఊడే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
ఇక అప్పులు కట్టలేక నానా ఇబ్బందులు
రోజుకు పదహారు గంటల పని దినాలతో
కృంగి కృశించి పోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు!

జీవితమంటే డబ్బు సంపాదించడమేనా
ఆరోగ్యం బంధాలు ప్రశాంతత ముఖ్యమే
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పని గంటలు తగ్గించాలి
రేడియేషన్ తగ్గించే టెక్నాలజీ ప్రవేశపెట్టాలి!