Saturday, July 26, 2025

వలసలు సుదూర తీరాలు

అంశం: వలసలు-సుదూరతీరాలు

శీర్షిక: *ఉనికి కోసం ఉన్నత జీవితం కోసం*

*నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు*
నీరు తనకు అనుకూలమైన పల్లపు
ప్రాంతాలకే ప్రవహిస్తుంది
అలానే మనిషి తన పొట్ట కూటి కొరకు
ఉన్నత జీవితం కోసం అవకాశాలున్నచోటికి
వలస వెళ్తుంటాడు!

గ్రామాలలో నివసించే యువతకు ప్రజలకు
ఉపాధి అవకాశాలు లేక
విద్య వైద్యం వంటి సదుపాయాలు లభించక
పట్టణాలకు సుదూర తీరాలకు
వలస బాట పడుతుంటారు
మెరుగైన జీవితాన్ని గడుపుతుంటారు!

ప్రపంచీకరణ కారణంగా
నేడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారగా
పల్లెలలో ఉపాధి దొరకని నిరుద్యోగులు
పట్టణాలలో చదివినవారు
ఉన్నత చదువుల కోసం అధిక సంపాదన
మంచి భవిష్యత్తు గొప్ప జీవనశైలి కొరకు
విదేశాలకు వలసలు వెళ్తుంటారు!

ఆడపిల్లలు ఉన్నత చదువుల కొరకో
ఉన్నత ఉద్యోగాల కోసమో
వివాహాల కొరకై విదేశాలకు వెళ్ళడం
నేడు పరిపాటి అయిపోయింది!

"పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి"
ఎక్కడి కష్టాలు అక్కడే ఉండటం సహజం
సంపాదనకు తగ్గట్లు ఖర్చులు
విదేశాల ప్రభుత్వ విధానాలతో
దినం దినం ప్రాణ గండాలే!

అభివృద్ధి వికేంద్రీకరణ జరిపించి
మౌళిక సదుపాయాలను కలిగించి
ఉన్నత విద్యకు ఉపాధికి భరోసా కల్పిస్తే
వలసలు తగ్గుముఖం పడుతుంది
దేశాభివృద్ధి జరుగుతుంది!

కన్న ఊరిలో పుట్టిన దేశంలో దొరికిన స్వేచ్ఛ
ప్రపంచంలో ఎక్కడైనా లభించునా? 

No comments: