Sunday, July 6, 2025

కులం కుల వృత్తులు / పద్యాలు


శీర్షిక: కులం - కుల వృత్తులు

సీ.మా:
కులము లేలనుబుట్టె గుణమేల బుట్టెను
వృత్తియేలను బుట్టె ముత్తెముగను
పనిని బట్టియెకద పని నిపుణత్వమున్
ఇంటి పేరులునన్ని యింటి జాడ
వర్గములు దెలిసె వారి నైపుణ్యాన
వంశమ్ములును వచ్చె వారసులతొ
ఎవరి రుధిర మెంచ యెర్రగానేయుండు
వేరు చేయకెపుడు గర్వమునను
మనుషులంత నొకటె మమతలు నొకటేను
జగతియందు జనుల బతుకు జూడు
కులవృత్తి యభివృద్ధి బలము దేశానికి
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

ఆ.వె:
కుమ్మరెపుడు మెండు కుండల జేసేను
గౌడునెక్కు చుండు తాడి చెట్టు
పద్మశాలి నేయు బట్టల నేర్పుతో
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

ఆ.వె:
మతములన్ని మనకు హితములే జగతిలో
హిందువులము మనము బంధువులము
భాష వేరు నైన భావమ్ము లొకటేను
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

ఆ.వె:
మనిషి సంఘ జీవి మనుగడ సాగించ
నలుగురున్న పనులు కలిసి జేయు
నెవరి వృత్తి నెపుడు నేవగించవలదు
కృష్ణ మాట వినుము తృష్ణ దీర!

No comments: