Monday, July 28, 2025

అరుదైన ఆరుద్ర ప్రాణులు

అంశం: చిత్ర కవిత

శీర్షిక: *అరుదైన ప్రాణులు ఆరుద్రలు*

తొలకరి వర్షాలకు 
పుడమి తల్లి పులకరించగ
కార్తెలలో ఒకటైన 'ఆరుద్ర కార్తె' లో 
తడిమట్టి పొరలలో కమ్మని పరిమళాలలో
ఎక్కడో అవనిలో దాగివున్న 
ఆరుద్ర ప్రాణులు తన్మయత్వంనొంది
దడిగట్టుకొని వచ్చు గుంపులు గుంపులుగా 
మహా రాజులు మహా రాణులవలె
ఎర్రని సుతి మెత్తని మఖమల్ 
పట్టు వస్త్రాలు ధరించి
"ఆరుద్ర కార్తె" లోనే కనిపించు! 

తడి దారులలో నిమ్మకు నీరెత్తిన విధంగా 
అత్తారింటికి దారేదన్నట్లుగా
ప్రయాణం సాగిస్తుంటే
ఆహా! ఆ ఆనందం వాటి అంద చందాలు
ప్రత్యక్షంగా కనులతో వీక్షించాలే గానీ
వర్ణించడం ఎవరి తరం!

బ్రహ్మ సృష్టించిన అపురూప జీవులు
వాటి సుతిమెత్తని కాళ్ళతో నడుస్తుంటే
పిల్లలు దోసిలి లో పట్టుకొని ఆడుతుంటే 
ఆ సంతోషం అమోఘం అపూర్వం!

ఆరుద్రలకు సంతానోత్పత్తి ఎక్కువ
కానీ ఆయుష్షు చాలా తక్కువ
కర్షకులకు ఆ ప్రాణులంటే మక్కువ 
ఎందుకంటే అవి రైతన్నలకు
వ్యవసాయ పనులు మొదలు పెట్టండంటూ 
గొప్ప సందేశాన్ని అందించు!

'ప్రకృతి' పెద్ద పాఠశాల అది ఎన్నియో నేర్పు 
"ఆరుద్ర కార్తె" లో ఆరుద్ర ప్రాణులు
రైతులను తట్టిలేపు 
సాగు పనుల కొరకు పురికొలుపు
అదను పోతే పదనుదొరకదని మేల్కొలుపు!

No comments: