Monday, July 14, 2025

చెరగని పాద ముద్రP

అంశం :-*అంతరంగ విహారం*

శీర్షిక: *చెరగని పాద ముద్ర*

నదీ తీరాన తడి ఆరని నీ అడుగు వెనుకాలే
నా అడుగుతో  తిరుగాడిన జాడలు
మది నిండా ఇప్పటికీ పదిలమే!

కడలి లోన ఎగిసి పడే కెరటాల్లా
తడిసిన పైటలోన నీ అందాలు ఇప్పటికీ జ్ఞాపకమే!

నిండు పున్నమి రోజున చందమామ వలె
వెదజల్లే చల్లని నీ సుందర కాంతులు
గులాబీ తోటలో సుగంధ పరిమళాలతో
గుభాలించే పువ్వుల వలె నీ సొగసులు
గలగలా పారే నిండు గౌదావరిలా
వినిపించే నీ ముసి ముసి నవ్వులు ఏమాయే!

నేడు నీ పిలుపే బంగార మాయెనా
ఊసులెన్నో చెప్పావు ఆశలన్నో పెంచావు
గిలిగింతలు పెట్టావు చెక్కిలి గింతలు చేశావు
సుడిగుండంలో నావలా ఉన్న నా మనసును
ఓ  దరికి చేర్చావు
నా మనసు పలికే వేళ కనుమరుగైనావు!

సఖీ! పసిఫిక్ మహాసముద్రంలోని
లోతును లెక్కించవచ్చునేమో గానీ
పడతి మనసు అంతరంగాలను పసిగట్టడం
ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదేమో
ఇంత కాలం నేను నీతో గడిపినది
కలల కాలంలోనేనా !

కుంభ వర్షం కురిసే వేళ ఆకాశంలోన
ఉరుములు మెరుపుల వలె
వర్షం తదుపరి ఏర్పడే సప్తవర్ణాల ఇంద్రధనుస్సు వలె
ఒక కాంతి పుంజంలా మెరిసావు నా మనసులో
*చెరగని పాద ముద్ర* ను వేశావు నా హృదయంలో
ఎదురు చూస్తూనే ఉంటాను నీ రాకకై చకోర పక్షిలా!

No comments: